సక్షమ్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు దయాకర్,
కార్యదర్శి విక్రమ్‌లు చాలా విశేషాలు తెలియచేశారు.
ప్ర: దయాకర్ గారు నమస్తే. ఈ సేవల పట్ల సమాజ స్పందన ఎలా ఉంది?
అది చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మొత్తం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. వాటన్నిటికీ వైద్యం అందిస్తున్నది సక్షమ్ అనే ఈ ఎన్‌జీవో మాత్రమే. మిగతా ఎన్‌జీవోలు ఒక్కొక్క వైకల్యం మీదనే దృష్టి పెడుతున్నాయి. సక్షమ్ అఖిల భారత సంస్థ. ఆ వైకల్యాలున్న వారికి నయం చేయడంతో పాటు విద్య, ఉపాధి గురించి కూడా పనిచేస్తున్నాం. కరోనా సమయంలోను సేవలు అందించాం. మొదటి వేవ్‌లో హైదరాబాద్ సిటీలో 14 డిజేబుల్ పిల్లల హాస్టల్స్ ఉంటే, ఒక హాస్టల్‌లోని మొత్తం 40 మందికీ సోకింది. వాళ్లకి పూర్తిగా వైద్యం చేయించి, మళ్లీ హాస్టల్‌లో వదిలేదాకా బాధ్యత మేమే తీసుకున్నాం. ఉచితంగా ఐసీయూ నిర్వహించాం. అన్ని హాస్టల్స్‌కి ప్రికాషనరీ మెడిసిన్స్, మాస్కులు, శానిటైజర్లు, ప్రోటీన్ ఫుడ్ ఇచ్చాం. ఆ పిల్లలకు ప్రభుత్వం అందించే సదుపాయాలు కాకుండా చదువు కోసం, ఉద్యోగ కల్పనలో అవసరమైన కోచింగ్ ఇవ్వడంలో సక్షమ్ పనిచేస్తోంది. వైఫై సౌకర్యం, పోటీ పరీక్షల కోసం పుస్తకాలు, కోచింగ్ ఇప్పించడం కూడా సక్షమ్ చూస్తున్నది. మొన్నే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీకి ప్రకటన వచ్చింది. తెలంగాణలో 22 మంది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్ల చేత ఆ పరీక్ష రాయించాం. 11 మందికి అవకాశం వచ్చింది.

‘ధీమహి’ కేంద్రంలో మూడు సంవత్సరాల నుంచి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యపేషన్ థెరపీ ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు 90 మందికి ఇచ్చారు. 35 మంది ఇంకా తీసుకుంటున్నారు. బయటికి వెళ్లిన 60 మందిలో కనీసం 54 మందికి పూర్తిగా నయమయింది. వాళ్ల పని వాళ్లు చేసుకునేటట్టుగా, వాళ్ల కాళ్ల మీద నడిచేటట్టుగా చేశాం. ఆ విధంగా చేసి వాళ్ల జీవితం వాళ్లు బతికే విధంగా తయారుచేసి సక్షమ్ పంపిస్తుంది. కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే అలాంటి పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చి ఉచితంగా శస్త్ర చికిత్స చేయించి, మళ్లీ తీసుకెళ్లి వాళ్ల ఇంటి దగ్గర వదిలి, నెల రోజుల పాటు ఫాలోఅప్ కూడా చేస్తాం.
తెలంగాణ మొత్తం మీద కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇంకా, శ్రీశైలం దగ్గరలోని అచ్చంపేట ప్రాంతంలో గిరిజన ఆవాసాలు ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లల్లో క్యాట్రాక్ట్ బ్లైండ్‌నెస్ ఉంది. వాళ్లు అది కంప్లీట్ బ్లైండ్‌నెస్ అనుకుంటున్నారు. క్యాటరాక్ట్ అంటే చిన్న పొర సర్జరీ చేసి తీస్తే కళ్లు కనపడతాయి. అది తెలియక వదిలేశారు. సర్వే చేసి, వాళ్లని తీసుకొచ్చి సర్జరీ చేయించి వదిలి పెట్టి వచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇందులో తొలి అడుగు సర్వే పూర్తయింది. త్వరలోనే శస్త్రచికిత్సలు మొదలవుతాయి. ఇదంతా సక్షమే చేస్తుంది. దివ్యాంగులు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఈ ధీమహి ఒక ఐడియల్ సెంటర్. కేవలం థెరపీస్ ఇవ్వడమే కాకుండా, ఈ సెంటర్‌తో వైద్య నిపుణులు కూడా లింక్ అయి ఉన్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్స్‌తో కూడా మేము టచ్‌లో ఉన్నాం. బెంగళూరు ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మా పిల్లల్ని వీడియోకాల్‌లో పరీక్షించి మందులు సూచిస్తారు. దానితోనూ చాలా మందికి మంచి ఫలితం వచ్చింది. ఈ విధంగా సక్షమ్ విద్య, వైద్యం, ఉపాధి విషయంలో ప్రయత్నం చేస్తుంది.
సక్షమ్ ధీమహిలో స్పీచ్ థెరపిస్ట్ అనుభవాలు
ప్ర: ఇక్కడ మీరు స్పీచ్ థెరపిస్ట్. ఈ సమస్య ఎట్లా పరిష్కరిస్తున్నారు?
ఇక్కడకు వచ్చే పిల్లలలో ఆటిజం, ఏహెచ్డి బాధితులు చాలామంది ఉన్నారు. మేం అవసరమైన థెరపీలు ఇస్తాం. స్పీచ్ థెరపీ గురించి చెప్పాలంటే, వాళ్లకు టంగ్ మూమెంట్స్ ఉండవు. ఆ కండరాలు బిగిసి ఉంటాయి. కొరకడం, చప్పళించడం రాదు. కాబట్టి స్పీచ్ థెరపీస్ ఇస్తాం. ప్రస్తుతం వచ్చిన పిల్లలలో 10,12 మందికి మంచి ఫలితాలు వచ్చి, స్కూల్స్‌కి వెళ్తున్నారు. కొందరు పేరెంట్స్ బయట వైద్యం చేయిస్తే రాని ఫలితాలు ఇక్కడ వచ్చాయంటున్నారు. అందుకు కారణం, మాకు మా డాక్టర్ల మద్దతు ఎంతో ఉంది. ప్రతి పేరెంట్‌కు ఇంటి దగ్గర ఏం చేయాలో చెబుతాం. ముందురోజు రాత్రికి వారు ఏం చేసిందీ మాకు వీడియో రావాలి. హోమ్‌వర్క్ కచ్చితంగా చేయాలి. లేదంటే వాళ్లకి క్లాస్ తీసుకుంటాం.

మా సార్ కూడా వాళ్లని ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టనివ్వరు. పేరెంట్స్‌కి బాగాలేదంటే ఓకే. మధ్యలో ఖాళీ వస్తే పిల్లలు మర్చి పోతారు. అందుకే నిత్యం వచ్చి తీరాలి. మరొక సమస్య. కొందరు పిల్లలకు ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వస్తే, మూడు మాసాలు చెప్పిందంతా పోతుంది. మళ్లీ మొదలుపెట్టాలి. మా లీవుల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ మంచి ఫలితాలు అంటే వీటన్నిటి వల్లనే. ఒకళ్లు ఆరుమాసాలకు మెరుగవ్వచ్చు. స్పీచ్‌లో ఒకళ్లకి సంవత్సరం, రెండేళ్లు కూడా పట్టొచ్చు. వాళ్ల ఐక్యూ లెవెల్‌ని బట్టి ఉంటుంది. దానిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మధ్యలో వీళ్లకి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తే, ఇక్కడే డాక్టర్లు చూసి, వాటికి కూడా మందులు తఉచితంగా ఇస్తారు.
ప్ర: ఇక్కడ వైద్య నిపుణులు ఎంతమంది?
నెలలో ఐదుగురు వస్తారు. లక్ష్మీ మేడం, నందిని మేడం వస్తారు, శ్రీనివాస్ సార్, వేదప్రకాశ్ సార్ వస్తారు. అదే కాకుండా ఈ ఆయుర్వేదం కూడా ఇస్తూ ఉంటాం. వీటన్నిటినితో మేము పిల్లల స్థితిని మెరుగుపరచగలిగాం. ఇలాంటి సేవ బయట జరగదు. పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు.
ఏమైనా మీరు సమాజానికి చేస్తున్న ఈ తరహా సేవ గొప్పది. అందరి తరపున మీకు ధన్యవాదాలు.
హైదరాబాద్, గోల్నాక, తులసీనగర్‌లోని చిన్న పార్క్ కేంద్రంగానే సక్షమ్ విశేష వైద్యసేవలు అందిస్తున్నది. ఇక్కడకే కొందరు తల్లులు బిడ్డలను ఆరోజు తీసుకొని వచ్చారు. వారి మనోభావాలను, బిడ్డలను ఒకసారి పరికిద్దాం.
ప్ర: ఎక్కడి నుంచి వచ్చారు?
నల్లకుంట, అచ్చయ్యనగర్ నుంచి వచ్చాను.
ప్ర: (చిన్నారికి) నీ పేరేమిటి? స్కూల్ వెళుతున్నావా?
దక్షిక. వెళ్తున్న. (కొంచెం ముద్దగానే)
ప్ర: స్కూల్‌పేరేమిటి?
సరస్వతీ విద్యామందిర్.
ప్ర: ఈ మార్పు ఇక్కడికి వచ్చాకా వచ్చిందా? మీరు తృప్తిగా ఉన్నారా?
అవును సర్. ఇదివరకు నిలబడేది కాదు, నిలుచున్నా కొన్ని సెకనులలోనే పడిపోయేది. ఇక్కడికి వచ్చాక ఫిజియోథెరపి వల్ల 11 రోజులలోనే నడవడం, నిల్చోవడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదివరకు చాలా భయపడే దాన్ని, పాప ఫ్యూచర్ ఏమిటి? అని. మావారి (వన్‌గ్రామ్ గోల్డ్ జువెలరీ బిజినెస్) కస్టమర్ ఇక్కడే ఉంటాడు. అలా తీసుకొచ్చాం. లక్కీగా స్లాట్ దొరికింది.
ప్ర: మీరేం చేస్తారు?
నేను పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను.
ప్ర: స్కూల్లో ఎలా ఉంటుంది?
స్కూల్లో చాలా ఆనందంగా ఉంటుంది. అన్నీ చెబుతుంది సర్.
ప్ర: ఎక్కడి నుంచి వచ్చారు? అబ్బాయికి ఎంత వయసు?
గోల్నాక నుంచి వచ్చాను. మూడున్నర సంవత్సరాలు.
ప్ర: ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది పురోగతి?
ఇపుడైతే మంచిగా ఉంది. నిలబడలేని, కూర్చోలేని స్థితిలో తీసుకొచ్చాం. ఇప్పుడు నడుస్తున్నాడు. మెట్లెక్కడం, దిగడం కూడా చేస్తున్నాడు.

ప్ర: అబ్బాయికి ఇంట్లో ఏమేమి చేయిస్తుంటారు?
ఫిజోథెరపి చేయిస్తుంటాం.
ప్ర: మాటలు పలికించడం ఇలాంటివి…?
స్పీచ్‌థెరపి కూడా చేయిస్తాను.
ప్ర: బాబు పేరేమిటి?
అద్విక్ సాయి.

మా బాబు పేరు రియాంశ్. మొదట సాధారణంగానే ఉండేవాడు. స్కూల్‌కు వెళ్లేవాడు. ఏ సమస్యా లేకుండే. కొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలా అయ్యాడు. ఓ ఆసుపత్రిలో అనిస్తిషియా ఓవర్ డోస్ ఇచ్చారు. బాబు కోమాలోకి వెళ్లిపోయి ఆపై బెడ్‌రిడన్ అయ్యాడు. లైఫ్‌టైమ్ బెడ్‌కేనని చెప్పేశారు డాక్టర్స్. కానీ సక్షమ్‌కు వచ్చాక దయాకర్ సర్ చూసి, ఫిజియోథెరపి ఇప్పిద్దాం, ప్రయత్నం చేద్దామన్నారు.
ఇంతకుముందు వేరేచోట్ల ఫిజియోథెరపి చేయించాము. ఖర్చు చాలా అయింది. రిజల్ట్ లేదు. ఇక్కడకు వచ్చేనాటికి కనీసం మెడ కూడా నిలపలేని స్థితిలో ఉన్న అబ్బాయి ఇప్పుడు నడుస్తున్నాడు. ఇంకా స్పీచ్ రావాలి. ఆ థెరపి ఇప్పిస్తున్నాం. ఇక్కడ ఆక్యుపేషన్ థెరపి, బిహేవియర్ థెరపి, స్పీచ్ థెరపి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పార్క్ మొత్తం నడుస్తున్నాడు.

ప్ర: అబ్బాయి పేరేమిటి?
సహర్ష్.
మా బాబుకు కొంచెం రైట్ లెగ్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడకు వచ్చాక 4 నెలలలోనే నయమయింది. మంచి ఫలితం కనిపించింది.
ప్ర: ఎవరు చెప్పారు, ఇక్కడికి వెళ్లమని?
ఫస్ట్‌టైమ్ ఆయుర్వేద హాస్పిటల్‌కు వెళ్లాం. అక్కడ ఒక మేడమ్ కేర్ కాలేజీలో అపాయింటమెంట్ ఇచ్చింది. అక్కడికెళ్తే ఇక్కడ ఓన్లీ కిడ్స్‌కే చేస్తారు, ఇక్కడ చాలా బెటర్‌గా ఉంటుందని మేడమ్ ఇక్కడకు రిఫర్ చేశారు. ఇక అప్పటి నుండి ఇక్కడే చూపిస్తున్నాను.
ప్ర: ఎలా ఉందండి?
చాలా బావుందండి. ఫాకల్టీగానీ, సర్‌గానీ మంచిగా చూస్తున్నారు.
ప్ర: మీరు ఆ లోపం ఉన్నట్టు ఎప్పుడు గుర్తించారు?
బాబు ఫస్ట్ బర్త్‌డే అయింది. అప్పటి నుంచి కొంచెం నడక తేడా వచ్చింది.
బెస్ట్ ఆఫ్ లక్! ఇంకా బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆశిస్తున్నాను.

ప్ర: ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నారి పేరు?
రామాంతపూర్‌లో ఉంటామండి. పాప అనన్య. ఐదేళ్లు.
ప్ర: ఏమిటి కంప్లయింట్
హైపర్ యాక్టివ్. ఇది ప్రీమెచూర్ బేబి. ఏడో నెలలో పుట్టింది. పాపాయి బరువు పెరిగే వరకు అని 46 రోజులు నీలోఫర్‌లో ఉన్నాను. ఏ సమస్యా లేదు. కానీ మాటలు చాలా ఆలస్యంగా వచ్చాయి. మొదట బయట చూపించాం. నెలకి రూ 45 వేలు చెల్లించేవాళ్లం. ఫలితం లేదు. చాలా తిరిగాం. ఇంట్లోనే ఫిజోథెరపీ చేయించాము. నడకొచ్చింది కానీ, మాటలు రావటం లేదు. ఒక దగ్గర కూర్చోదు. అన్నీ సర్దుతుంది. అమ్మ అనదు,మాట్టాడినా ఐ కాంటక్ట్ లేకుండే. అనన్య అంటే స్పందించేది కాదు. ఇక్కడకి నవంబర్‌లో (2024) వచ్చాను. అంటే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు పాప అమ్మ, బాబా అంటుంది. స్థిమితంగా కూచుంటుంది, పని చెబితే చేస్తుంది. తరువాత చెప్పకుండా తానే చేస్తోంది. అందరితో కలసి అడుకుంటుంది.
ప్ర: ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరున్నారు?
అత్తా, మామ అందరం కలిసి ఉంటాం. జాయింట్ ఫ్యామిలి. నా పాపనే ఫస్ట్. జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమీ లేదు, ఇలా తనకే వచ్చింది.
దృష్టి, శ్రవణ లోపం, శారీరక లేదా మానసిక పరిమితులు ఉన్న ఎక్కువ మంది వెబ్, మొబైల్ యాప్‌లను ఎక్కువమంది ఉపయోగించగలిగేలా యాక్సెసిబిలిటీ టెస్టింగ్ శిక్షణను సక్షమ్ అందిస్తున్నది.
థలసీమియా బాధితుల జీవితాలను కాపాడేం దుకు సక్షమ్ రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది. వారికి జీవితాంతం రక్త మార్పిడి అవసరం. ప్రతి యూనిట్ రక్తం వారి జీవనానికి ఆశను కల్పిస్తుంది.
వినికిడి లోపం, చలన పరిమితులు లేదా శారీరక అవసరాలు ఉన్న వ్యక్తులకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారు స్వతంత్రంగా జీవించేందుకు సక్షమ్ హియరింగ్ ఎయిడ్ పరిక రాలు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, స్ప్లింట్స్, ఇతర అవసర మైన సహాయక ఉపకరణాలను అర్హులైన వారికి అందిస్తున్నది. సరైన పరికరం ఒక వ్యక్తి జీవితాన్నే మార్చగలదు. వనపర్తి జిల్లా అమరచింతలో సక్షమ్ ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్వహిస్తోంది. దివ్యాంగ మహిళలకు టైలరింగ్ (కుట్టు) శిక్షణ అందించి, స్వతంత్ర జీవనం, ఆర్థిక స్వావలంబన దిశగా మార్గనిర్దేశం చేస్తోంది.
గ్రామీణ, సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిల్లలలో కనిపించే పిడియాట్రిక్ కాటరాక్ట్, స్క్వింట్ (మెల్ల కన్ను) ఇతర కంటి సమస్యలను తొలిదశలో గుర్తించేందుకు కంటి ఆరోగ్య పరీక్షా శిబిరాలను నిర్వహిస్తోంది. సమస్యలున్న పిల్లలకు, •=× శీజూఱ••శ్రీ, హైదరాబాద్ సహకారంతో ఉచిత శస్త్రచికి త్సలు, చికిత్సలు అందిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందించి పిల్లల దృష్టిని కాపాడి, వారి భవిష్యత్ అవకాశాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం.