కాలం చాలా కఠోరమైనది. ఎంతటి వారినైనా తన పొట్టలో పెట్టుకుంటుంది. అదృష్టవంతుల పేర్లుపైకి వస్తాయి. దురదృష్టవంతుల పేర్లు అట్టడుగున పడిపోతాయి. మనదేశంలో ఎందరో పండితులు, కవులు, వీరులు ఉదయించారు. వారిలో అజ్ఞాతంగా కాలగర్భంలో మరుగైపోయినవారు పెక్కుమంది. పేరు ప్రఖ్యాతులు పొందినవారు వేళ్లపై లెక్కించదగినవారు మాత్రమే. ఇలాంటి వారినైనా చరిత్రకారులు గుర్తిస్తారో వారి పేర్లు లోకం నాలుకపై ఉన్నవి. కేవలం వదంతులు అప్రమాణికాలు, రాయో, రప్పో ప్రమాణం కావాలి. ఊరూరా కనిపించే వీరగల్లులు కొండగుర్తులు మాత్రమే. కవుల పుణ్యమా అని ఏ కట్టు కథో ప్రచారం ఉంది కాబట్టి అలాంటి వారిని ఇంతమాత్రమైనా స్మరిస్తున్నాము. అలాంటి అజ్ఞాత వీరులలో ఒకడు ‘గొడుగు పాలుడు’ (హంపీ నుంచి హరప్పా దాకా/ తిరుమల రామచంద్ర, పేజి.77).
‘రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా/ పాపే పాపః సుమే సమాః/ లోకాస్త మనువర్తంతే/ యథా రాజా తథా ప్రజాః’ (రాజు ధర్మాత్ముడైతే, ప్రజలు ధర్మిష్టులవు తారు. రాజు పాపి అయితే ప్రజలు పాపిష్టులవుతారు. రాజు రెండింట సమానుడుగా ఉంటే, ప్రజలు సమానులుగా ఉంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారు. రాజు అంటే ప్రస్తుత పాలకులు.) గొడుగుపాలుడి గాథ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. కైఫియత్‌ల ప్రకారం చూస్తే ఆయన పేరు ‘భూమానాయుడు’. కథలో కొంత అతిశయోక్తి ఉన్నా చాలా వరకు నిజం. దీనికి నిదర్శనంగా బళ్లారి, అనంతపురం జిల్లాల్లో పెక్కు పొలాల్లో గొడుగు పట్టుకుని నిలుచున్న వ్యక్తి బొమ్మ ఉన్న బండరాళ్లను నేటికీ చూస్తాం. ఈ భూములకు గొడుగు పాలుడి భూములన్న పేరు కూడా ఉంది.
రాయలు గొప్ప వైష్ణవభక్తుడు. కానీ పరమత సహిష్ణుడు. పాశ్చాత్యుల పట్ల ఇతడు చూపిన ఆదరణను గురించి విదేశీయ యాత్రికులు న్యూనిజ్, పేస్‌ల రాతలు చెబుతాయి. ఉదయాన్నే వ్యాయామం, తరువాత స్నానం ఆపై పూజాదికాలు పూర్తయ్యాక రాజప్రాసాదంలోని దేవాలయాలను విధిగా సంద ర్శించటమూ రాయల దినచర్యలో భాగం. ఆయన పంచమఠ భంజన తాతాచార్యుల వద్ద వైష్ణవ సంప్ర దాయాన్ని స్వీకరించాడు. తన కుల గురువు వ్యాస రాయల్ని, వైష్ణవ పండితుడు అప్పయ దీక్షితు లను భక్తితో గౌరవించేవారు. తిరుమల తిరుపతి, కాళహస్తి, శ్రీరంగం, శ్రీశైలం, అహోబిలం, సింహా చలం, కంచి, వేలూరు లాంటి క్షేత్రాలలో గోపురాలను నిర్మించి పరమత సహనాన్ని చాటుకున్నాడు.
హంపి విరూపాక్షాలయం (శివాలయం) విజయ నగర సామ్రాజ్య స్థాపనకు ముందే ఉంది. ఈ సము దాయంలోని కొన్ని కట్టడాలను మొదటి హరిహర రాయలు, కృష్ణదేవరాయలు నిర్మించారు. తన పట్టాభిషేకోత్సవ గుర్తుగా ఆ ఆలయంలో రంగమండ పాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. విరూపాక్ష స్వామికి నవరత్నాలు పొదిగిన బంగారు తామర పుష్పాన్ని, ఒక సర్పహారాన్ని కూడా బహుకరించి, క్రమం తప్పక ప్రతీ త్రయోదశికి ప్రదోషకాలంలో నియమంగా విరూపాక్ష దర్శనానికి వెడుతూ ఉండేవాడు.
ఇష్టదైవం ఏడుకొండలస్వామిని రాయల వారు ఏడుమార్లు సందర్శించినట్లు శాసనాధారాలున్నాయి. మొదటి దర్శనం కళింగ (ఒరిస్సా) ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ‘అంగీరస నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి తిధికి సరైన శక సంవత్సరం 1434 (అంటే 1513 ఫిబ్రవరి 10వ తేదీన) తన భార్యలతో కలిసి స్వామివారిని దర్శించారు. ద్వితీయ దర్శనానికి దేవేరులు లేకుండా రాయలు ఒక్కరే వెళ్లాడు. అది శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ కృష్ణపక్షం ద్వాదశి సోమవారం శక 1435 అంటే కీ।।శ 1513 మే నెల 12వ తేదీ. మూడవసారి శ్రీముఖ నామ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి సోమవారం శక 1435 అంటే 1513 జూన్ 13వ తేదీ. నాల్గవసారి భావనామ సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి గురువారం శక 1436 అంటే 1514 జూలై 7వ తేదీ. అయిదవసారి ధాతనామ సంవత్సరం పుష్య మాసం దశమి శుక్రవారానికి సరియైన శక 1438, అంటే 1517 జనవరి 2వ తేదీ, ఆరవసారి బహు ధాన్య నామ సంవత్సరం శక 1440 అంటే 1518 అక్టోబరు 16వ తేదీన. చివరిసారిగా విక్రమ నామ సంవత్సరం పాల్గుణమాసం శుక్లపక్ష ద్వాదశి ఆదివారం శక 1442 అంటే 1521 ఫిబ్రవరి 17వ తేదీన స్వామి వారిని దర్శించుకుని అనేక కానుకలను సమర్పించాడు.
రాజాస్థానానికి ఏడు అంగాలు ఉంటాయి. అవి విద్వాంసులు, కవులు, భట్టరాజులు, గాయకులు, పరిహాసకులు, ఇతిహాసవేత్తలు, పురాణజ్ఞులు. వీరు రాజుకు అతి సన్నిహితంగా ఉండేవారు, నమ్మ కస్థులు. వీరిలో రాజుకు గొడుగు పట్టే వ్యక్తి మరీ సన్నిహితంగా ఉంటాడు. అలాగే ‘ఆపడం’ (తాంబూలం అందించే వారు) వింజామరలు వీచేవారు, కావలివాళ్లు, అంగరక్షకులు విశ్వాసపాత్రు లైన వారే ఉంటారు. రాయలవారి గొడుగుపాలుడు కడు పేదవాడు. కానీ అతని మనసు సంపన్నం. అందుకే తనకు డబ్బు వస్తే చక్రవర్తిలాగే చేతికి ఎముక లేని తీరులో దానాలు చేయాలని అతడి కల. ఈయనకు ఇద్దరు భార్యలు.
శ్రీకృష్ణదేవరాయల వేసవి విడిది పెనుకొండ (నేటి అనంతపురం జిల్లా). అక్కడకు వచ్చాడాయన. విజయనగరం నుండి పెనుకొండ 120 మైళ్లు. హంపి నుండి పెనుకొండకు ఓ సొరంగమార్గం ఉండేది. దానిగుండా పయనిస్తే 80 మైళ్లు మించదు. ఆ మార్గం గజశాల నుండి ఉండేదట, పూడి పోయింది. రాయలు ప్రతీ త్రయోదశి ప్రదోష కాలంలో విరూపాక్షుని దర్శించుకొనేవాడని ముందే చెప్పుకున్నాం. కానీ ఆ తిథికి రాయలు అప్పుడు పెనుకొండలో ఉన్నాడు. రాచకార్యాల ఒత్తిడిలో ఆ సంగతి మరిచాడు. అయితే హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. కాలం చూస్తే ఎనిమిది గడియలు మిగిలి ఉంది. అంటే ఇప్పటి ప్రకారం లెక్కగడితే సరిగ్గా మూడు గంటల పదిహేను నిమిషాలు. రాయలు హంపీ వైపు ముఖం పెట్టి ఆలోచించేలోపు గొడుగు పాలుడుకి ఆయన మనసు అవగతమైపోయింది. పంచకల్యాణి వంటి గుర్రాన్ని సిద్ధం చేశాడు. రాజు గుర్రాన్ని దౌడు తీయించాడు. గొడుగు పాలుడు గుర్రాని కన్నా ఒక అడుగు ముందే, అదే వేగంలో సాగాడు. ప్రదోషకాలానికి విజయనగరం దరి చేరుకున్నాడు.
హంపీ కనిపిస్తున్నది. విరూపాక్ష దేవాలయంలో గంటలు మోగిపోతున్నాయి. హేమకూటం చేరేసరికి గుర్రం ఇక నిలువలేకపోయింది. రాజు గుర్రం మీది నుండి దూకి హేమకూటం ప్రక్క నుంచి దేవాలయం వైపు నడిచాడు. గొడుగు పాలుడు గుర్రాన్ని అక్కడి భటులకు అప్పగించాడు. అది ఎన్నిసార్లు పొర్లి అలసట తీర్చుకున్నదో చెప్పలేం.
చెమటలు కక్కుతూ, ఛత్రం పట్టి గొడుగుపాలుడు దేవాలయంలో ప్రవేశించాడు. గొడుగు పట్టిన పిడికిలి వజ్రబంధంగా ఉంది. రాయలు కూడా అలసి పోయాడు. దైవదర్శనం చేసుకొని గొడుగుపాలునికి సెలవు ఇచ్చాడు. మరుసటి రోజు వరకు కొలువు ఉండదు. అప్పటి దాకా పంటి బిగువున కర్తవ్యనిష్ఠతో ఉన్నాడే కాని, విరూపాక్ష దర్శనం తరువాత గొడుగు పాలుడి శరీరం కూడా వశం తప్పింది. తాగిన వాడిలా తూలిపోతూ మైలున్నర నడిచి బడివే లింగ ఆలయంలో దూరాడు. ఆకలి, అలసటలో అక్కడ పంచిన ప్రసాదం వడపప్పు తిని, పానకం తాగి పడిపోయాడు. తల లింగానికి తగిలి రక్తం వరద కట్టింది. స్పృహ తప్పింది.
అలసిసొలసి నిద్రించిన రాయలవారికి అర్థరాత్రి గడిచిన తరువాత మెలుకువ వచ్చింది. గొడుగు పాలుని సంగతి గుర్తుకు వచ్చింది. ‘ఏమయ్యాడో పాపం! గుర్రం మీద వచ్చిన తనకే ఇంత అలసట ఉంటే, గుర్రం కంటే చురుకుగా పరుగెత్తిన ఆ బోయ బంటుకు ఎలా ఉందో’ అనుకున్నాడు. వెంటనే గొడుగుపాలుని వెదకటం ప్రారంభించాడు. వెతగ్గా వెతగ్గా బడివేలు లింగ గుడిలో రక్తపు మడుగులో స్పృహ తప్పి పడి ఉన్నాడు. రాజవైద్యుని రప్పించారు. అతడు నాడి చూసి అరఘడియలో స్పృహ వస్తుందని చెప్పాడు. అలాగే స్పృహలోనికి వచ్చాడు. వెంటనే తన గొడుగు పట్టుకున్నాడు. రెండు దినాలలో పూర్తిగా కోలుకొని కొలువుకు సిద్ధమయ్యాడు.
రెండునాళ్లు గడిచాక రాయలు నిండు కొలువులో కర్పూర తాంబూలం, ఉడుగరలు ఇచ్చి గౌరవించి, ‘గొడుగుపాలా! నీ ఇష్టం వచ్చింది కోరుకో’ అన్నాడు. గొడుగుపాలునికి చేతినిండా దానాలు చేయాలన్న వాంఛ గుర్తుకొచ్చింది. అవకాశం జారవిడవడం ఎందుకు? ‘ఏలిన దొరా! ఒక్కరోజు రాజ్యం ఇప్పించండి’ అని మనవి చేశాడు. సభవారంతా వెలవెల పోయారు. ‘ఇదేమి కోరిక? రాయల వారికే ఎసరా?’ అనుకున్నారు. ‘ఒకరోజు రాజ్యంతో ఏమిచేస్తావు’ అని ప్రశ్నించాడు రాయలు నవ్వుతూ. ‘చేతి నిండా దానాలు చేస్తాను. నా పేరు శాశ్వతం చేసుకుంటాను, మీ గొడుగు నీడన’ అన్నాడు వినయంతో గొడుగు పాలుడు. ‘సరే ఇచ్చాను రేపే తీసుకో!’ అన్నాడు రాయలు. మంచి ముహూర్తంలో రాయలు గొడుగుపాలునికి రాజ్యం ధారాదత్తం చేశాడు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు గొడుగుపాలుని ఇష్టం. ఆప్పుడే అతని భార్యలు ఏడుకొప్పరుల కరక్కాయ, లక్క (సిరా) మసి సిద్ధం చేశారు.
భార్యలు సహా, గొడుగుపాలుడు సింహాసనానికి నమస్కారంచేసి అధిష్టించాడు. నగరంలోని బీద బిక్కీ రాజనగరు మహాద్వారం వద్ద బారులు తీరారు. దానపత్రాలపై సిరా అద్ది మొహర్లు వేయడం ప్రారంభించాడు. ఇంతలో వేగుచుక్క పొడిచింది, తొలికోడి కూసింది. ఏడు కొప్పెరల సిరా అయిపో యింది, కొత్తగా సిరా తయారు చేసే వ్యవధి లేదు. అరుణోదయమయింది. గొడుగు పాలుడు తన భార్యలిద్దరిని నోరు తెరచి నిలబడమన్నాడు. వారి వక్కాకు తమ్ములపై మొహరు అద్ది దానపత్రాలపై ముద్రలు వేయసాగాడు. వక్కాకు తమ్మా అయి పోయాయి. ఇంతలో సూర్యోదయం కూడా అయిపోయింది. గొడుగు పాలుడు జన్మ తరించిందని సంతోషించాడు. సింహాసనం దిగి భార్యలతో పాటు దానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తన గొడుగు పట్టుకొని కొలువుకు సిద్ధమయ్యాడు.
గొడుగుపాలుడు దానం చేసిన భూములు నేటికి అనంతపురం, బళ్లారి జిల్లాలలో ఉన్నాయి. రాయలు వారు గొడుగుపాలుని రాజభక్తికి మెచ్చి ‘గొడుగు పాలపురం’ (హంపీ దగ్గర) దానంగా ఇచ్చాడు. అదే నేటి ‘గోపాలపురం’. ఈ భూముల కవిలె కట్టలలో ‘గొడుగుపాలుని భూముల పత్రాలు’ ఉండేవి. (పేజీ-3). దుణ్ణే అంటే బాణాకర్ర, బాణాకర్ర ఎప్పుడూ ధరించి రాయలకు అంగరక్షకుడుగా ఉన్న అతని పేర నేటికి ఒక ఊరు ఉంది. దుణ్ణే నాయక పురం. అదే కాలక్రమంలో దణాపురంగా మారింది. భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటనలు మరేవైనా ఉన్నాయని చూస్తే మొగలుల కాలంలో మరొకటి జరిగింది. హుమయూన్ పేర్షాతో 1539లో చౌసా యుద్ధం చేసి ఓడిపోయాడు. హుమయూన్ పారిపోతూ గంగానదిని దాటడానికి ప్రయత్నించాడు. వెనుక పేర్షా సైన్యం వెంబడిం చింది. గంగలో దిగాడు. వరద ఉధృత మవ్వడంతో కొట్టుకు పోతున్నాడు. దూరంగా బిస్త్ అనే నీటి కావడివాడు గంగలో నీళ్లు ముంచుతున్నాడు. వెంటనే అతడు తన మేక చర్మం సంచిని (మషాక్)ని గాలితో నింపి వదిలి నదిలో కొట్టుకుపోతున్న హుమ యూన్‌ను రక్షించాడు. ఆ కృతజ్ఞతతో బిస్త్‌ను ఒకరోజు ఆగ్రా సింహాసంపై కూర్చుండ బెట్టాడు. అతడు తన సమాజానికి ఉపకారం చేయడానికి తోలు పరిశ్రమకు ఉపయోగపడాలని తోలు నాణేలు ముద్రించాడు.
మూలం:
1. ‘‘హంపీ నుంచి హరప్పా దాకా’’ తిరుమల రామచంద్ర ఆత్మ కథ.
2. శ్రీకృష్ణ దేవరాయల కీర్తి చంద్రిక (కూర్పు) వడ్డి విజయసారధి. పేజీ 106, 107
3. Times of India 23rd Jan 2025
4. Vol. III Nos. 32 to 39, 40 to 49, 50 to 59 EpI Report P.151
5. N Nos. 95 to 96 TT.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు