‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
అనంతరం చింతనా శిబిరానికి ముగింపు ఉపన్యాసం చేశాడు గణపతిదేవుడు.
‘‘రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః
పాపే పాపః సమే సమః
లోకాస్తా మనువర్తనీతే
యథా రాజా తథా ప్రజాః
ఇది మహాపురుషులు శ్రీ తిక్కనామాత్యులు శిబిరం మొదటి రోజు చెప్పిన ధర్మశాస్త్రాలలోని సుభాషితం. నేను ఈ శిబిరం అనంతరం నా అవగాహన ఏమిటంటే యథా రాజాః.. తథా ప్రజాః కాదు. యథాప్రజాః.. తథా రాజాః అని. ఇకపై తదనుగుణంగా పాలిస్తానని, తెలుగు ప్రజలందరినీ ఏకం చేస్తానని దృఢనీగా నమ్ముతున్నాను..’’
శిబిరానికి హాజరయిన మేధావులు, శాస్త్రవేత్తలు, నిపుణలు, ప్రవీణులు, వణిజులు.. సమస్త కాకతీయ నియోగాధికారులు, సైన్యాధ్యక్షులు.. ఉద్వేగంతో నిలబడి చేతులెత్తి నమస్కరిస్తూండగా గణపతిదేవుడు నిలబడి వినమ్రంగా తలవాల్చి నమస్కరించాడు.
* * * *
రెండు మాసాలపాటు సాగిన మేధోమధన చింతనాశిబిరం ముగింపునకు వచ్చింది. రాజ్య పాలనకు, ప్రజాశ్రేయస్సుకు, రాజ్యంలోని భౌగోళిక అంశాలు ముఖ్యంగా ఏయే ప్రాంతాలలో ఏయే సహజ వనరులున్నాయి. ఏయే ప్రాంతాలలో ప్రజలు అత్యంత సుఖవంతులుగా వైభోగాలను అనుభవిస్తున్నారు అదే సమయంలో ఏయే రాజ్యాలలో ప్రజలు అత్యంత పేదరికాన్ని అను భవిస్తున్నారు.. వంటి సమస్త అంశాలను కూలంకషంగా చర్చించారు.
ఇకపై తెలుగురాజ్యాలన్నింటిని ఏకం చేయడం ఎలా? తెలుగు ప్రజలంతా ఏకత్వభావంతో అన్ని ప్రాంతాలవారు ఒకే స్థాయి సాంఘిక ప్రమాణాలతో జీవించాలంటే.. ఒకే స్థాయి ఆర్థిక ఫలాలు పొందా లంటే ఏం చెయ్యాలి? అని ముగింపునాడు చర్చించారు.
‘‘అద్భుతమైన చర్చలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఇక్కడ చర్చించి వాటిని ఒక్కొక్కటిగా మననం చేసుకుంటూ పరిపాలన సాగిస్తాను. మరిప్పుడు తక్షణ కర్తవ్యం?’’ అని గణపతిదేవుడు ప్రశ్నించాడు.
జవాబుగా తిక్కన ఏదో చెప్పబోతుండగా గంగాధరమంత్రి లేచి…‘‘శిబిరం అత్యద్భుతంగా నిర్వహించిన అధ్యక్షులు, మహాకవులు తిక్కనామాత్యులకు వందనాలు. నిజానికి యుద్ధ వీరులం.. మా మండలంలోని ప్రజలకు ఉన్నంతలో సుఖశాంతులు కల్పించాలని మాత్రమే మా ఆలోచనగా ఉంటోంది. వారికి కావాల్సిన వస్తువులను వణిజులు, వృత్తికారుల అందుతున్నాయా? లేదా? అనేదే ఇప్పటివరకు నాబోటి మండలేశ్వరుల ఆలోచనా పరిధి. కాని ఈ శిబిరంలో శాస్త్రజ్ఞులు, విషయ ప్రవీణులు, న్యాయకో విదులు, ధర్మశాస్త్రవేత్తలు చెప్పినవి విన్నప్పుడు నాకే మతిపోయింది. ‘ఓహో.. ప్రజలకు ఇవన్నీ కావాలి.. వీటిని పాలకులు అందించాలి. అంతా శాంతి సౌఖ్యాలతో, వస్తు వైభోగంతో జీవించాలంటే తొలుత మహారాజులు ఏమిచేయాలి’ అని ఆలోచించినప్పుడు అంతిమంగా నాకు తోచిన ఆలోచన ఒక్కటే.. తెలుగు సామ్రాజ్యం స్థాపించాలి. అందుకు భాష ప్రధాన అంశం కావాలి. అంటే తెలుగు మాట్లాడే ప్రజల రాజ్యం.. సామ్రాజ్యం ఏర్పడాలి. అప్పుడు తెలుగు ప్రజలంతా సమస్త సహజ వనరుల ఆలంబనతో అద్భుతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఆలోచనలు, మన జీవితాలు ఆఖరికి మన ప్రాణాలు దాని కోసమే ధారపోయాలి. అందుకు ముందుగా చిన్న చిన్న తెలుగుభాషా రాజ్యాలను జయించి. ఏక రాజ్యంగా ఏర్పరచాలి. అదే తెలుగు సామ్రాజ్యం!!’’
శిబిరం మొత్తం చప్పట్లతో మార్మోగింది.
‘‘అందుకు యుద్ధమే శరణ్యం..’’ అని ఎవరో అరిచారు.
యుద్ధ్దవీరులంతా కత్తులెత్తి వీరావేశాలతో వికటాట్టహాసాలు చేస్తుండగా ఆనందంతో నవ్వు మోముతో వారికి సంఫీుభావంతో తిలకిస్తున్న సమస్త మేధావి వర్గాన్ని పరికించిన గణపతిదేవుడు అందరితోపాటు ఉద్వేగంతో ఊగిపోతున్న తిక్క నార్యుని చూస్తూ మాట్లాడవలసినదిగా సైగ చేశాడు.
ఆయన మాట్లాడబోతుండగా ద్వారం వద్దనున్న కాపలాభటుడు గణపతిదేవుని సవిూపించి ఆయనకు ఏదో చెప్పడం. ఆయన ఆదుర్దాగా ద్వారం వైపు కదలడం కనిపించి అంతా నిశ్శబ్దమయ్యారు.
ఓ జంట లోపలికి వచ్చింది..
వారు నతవాడి పాలకులు.. గణపతిదేవుని బావ ఒక్కమల్ల రుద్రయ, అక్క మైలమ, గణపతిదేవుడే కాదు మహాప్రధాని గంగాధరుడు, రేచర్ల రుద్రసేనాని కూడా వేగంగా వారి వద్దకు వెళ్లారు.
గణపతిదేవుడు ఆదుర్దాగా అడిగాడు, ‘‘బావగారు! అంతఃపురంలో ఉండకుండా సరాసరి సమావేశ మందిరానికే వచ్చేశారు? ఏమిటి.. దిగులుగా ఉన్నారు.. చెప్పండి ఏమైంది..??’’
‘‘మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి మహారాజా! విూ మాటకు కట్టుబడి కోటరాజ్య పాలకుడు..
సోదరుడు కోటబేతయ మాకు ధాన్యం పంపుతూ.. మా ప్రజలు ఇంత గంజి తాగడానికి సహకరిస్తూ పుణ్యం కట్టుకుంటున్నాడు. కానీ గతమాసం నుండి ధాన్యపుబళ్లు రాక ఆగిపోయింది.’’
‘‘ఏమైందమ్మా.. ఎవరైనా అడ్డుకున్నారా?’’ రేచర్ల రుద్రయ అడిగాడు పెద్ద గొంతుకతో..
‘‘అవును పెదనాన్నగారు. అడ్డుకున్నారు..’’
‘‘ఎవరు??’’ నాలుగైదు గొంతుకలు ఉచ్చస్వరంతో గర్జించాయి.
‘‘వెలనాడు మండలేశ్వరుడు పృధ్వీశ్వరుడు..’’
రెండే రెండు లిప్తల కాలం శిబిరం మాటరాక స్తంభించింది.
‘‘మహాసేనాని.. సామ్రాజ్యస్థాపనలో మన తొలి యుద్ధం వెలనాడుపై.. సైన్యాన్ని సమాయత్తపరచండి. ఇదే నా ఆజ్ఞ!!’’ గణపతిదేవుడు గర్జించాడు.
శిబిరానికి అద్భుతమైన ముగింపు లభించింది.
తిక్కనామాత్యుని సమున్నత ఆలోచనకు తొలి బీజం పడిరది.
* * * *
సప్తాశ్వాలు పూన్చిన మహారథóంపై కాకతీయ మండలేశ్వరుడు గణపతిదేవచక్రవర్తి!!
తెలతెలవారుతున్నవేళ.. లేలేత భానుకిరణాల వెలుగు జిలుగుల మధ్య అనుమకొండ రాచవీధిలో మునుముందుకు వెళుతోంది మహారథం. అధికారిక పరివారం పరివేష్టించి కదలుతున్నారు. అందరికంటే ముందు రక్షకభట బృందం.. కాకతీయ కేతనం చేతబట్టి యవనాశ్వనీపై రాజప్రతినిధి కదలుతున్నాడు. అతని వెనుక మరో రథంపై పంచశబ్దాల వాద్యకారులు కూర్చుని రాచరిక వాద్య సంగీతాన్ని వినిపిస్తున్నారు.
మహామండలేశ్వరుడి రథóంలో ఆయన వెనుక అంగరక్షకులైన లెంకలు నిలబడగా వారికి అటూ ఇటూగా కాకతీయ చిహ్నాలతో వింజామరలు, ఛత్రచామరాలు పట్టుకున్న పరిచారికలు..
కాకతీయ రాజ్యపాలకుని ప్రయాణం పూర్తి రాచరిక హోదాలతో పురవీధులలో సాగుతుంటే అప్పటివరకూ బద్ధకంగా కదలాడుతున్న పౌరులు.. ఆ దేవదేవుడే రథంపై ఊరేగుతున్నట్టుగా కళ్లింత చేసుకొని చూడసాగారు. ముకుళిత హస్తాలతో కైవారాలు చేయసాగారు.
ఆ మహారాజ పటాలం పోయిపోయి స్వయం భూ దేవాలయం ముంగిట ఆగింది. పురోహితులు పూర్ణకుంభ స్వాగతంతో ఆయనను లోపలికి తీసుకు వెళ్లారు. ఆయన ముకుళిత హస్తాలతో ఆ దేవదేవుని ముందు నిలబడ్డాడు.
ఆయన ఆలోచనామయ దృక్కోణాన్ని పూర్తిగా సంస్కరించి ఆయన నిర్వహించవలసిన మహోన్నత కర్తవ్యాన్ని సుబోధకం చేసి కార్యోన్ముఖుడ్ని చేసింది శిబిరం. ఆ ఇరవై ఏళ్ల యువ మహాపాలకునిలో స్థిరపడిన మహా సంకల్పం ఏదో గోచరిస్తొంది. అది గుర్తించిన ఆ దేవదేవుడే గణపతిదేవుని వంక రెప్పవేయకుండా చూస్తున్నాడా! అన్నట్లు.. నూనె దీపాల వెలుగులో గోరువెచ్చగా ఉంది ఆ అంతరాళ ప్రాంగణం.
జీవితమంతా వెచ్చించి సాధించవలసిన కర్తవ్యం నిర్దిష్టమయ్యింది. ఆ శిబిరం ఆశయ సాధనకై ఇకపై ఏమిచేయాలో మదిలో పూర్తి ప్రణాళిక సిద్ధమయ్యింది. అందుకు కావాల్సింది తనపై తన నమ్మికకు ఆ దేవదేవుని తోడ్పాటు.. ఆశీర్వచనం..
‘‘మాకు.. మా కర్తవ్యనిష్ఠకు పూర్తి ఆశీర్వాదం కావాలి దేవరా! ఆశీర్వదించండి’’
పూజాదికాలు ముగిశాక.. మంది మార్బలాన్ని అక్కడే ఉండమంటూ ఒంటరిగా దేవళం లోపల విశాల ప్రాంగణంలో ఉపాలయాల వద్ద మహావృక్షాల కింద తిరుగాడాడు మౌనంగా. ఏవేవో ఆలోచనలు.. లోలోన కళపెళ ల.ాడుతున్నాయి.
ఓ మహాసముద్రపు నడిమధ్య నుంచి ఓ మహాతిమింగలం మెల్లగా పైకి కదలుతున్నట్లు భావన.
అనంతరం తిరిగి కోటకు చేరాడు. ఊహా తీతంగా రెండు దుర్వార్తలు చెవిన పడ్డాయి.
మామగారు దేవగిరి పాలకుడు జైత్రపాల మహారాజు నిర్యాణం చెందారు.
గర్భవతి సోమల గర్భవిచ్ఛితి!!
* * * *
శోకసందమైన దేవగిరి..
మామగారి అంతిమయాత్రలో పాల్గొన్నాడు గణపతిదేవుడు. అందరి శోకానికి ఒక్క కారణమైతే గణపతిదేవుని శోకానికి కారణాలు రెండు. లేత వయస్సులో తల్లి కాబోతూ ఆనందపారవశ్య గీతికల్లో తేలిపోతున్న సోమలను తండ్రి మరణం తీవ్రంగా బాధించింది కాబోలు గర్భం నిలువలేదు.
ఆలుమగల మధ్య ఆనందక్షణాలే కాదు శోక సందర్భాలు కూడా అను బంధాన్ని దృఢతరం చేస్తాయి.
తెలిసిన వెంటనే ఉన్నపళాన వచ్చి హత్తుకున్న భర్తను గాఢంగా పెనవేసుకుని కట్టలు తెంచుకున్న దుఃఖంతో కంపించిపోయింది సోమలదేవి.
‘‘నన్ను క్షమించాలి. విూకొక వారసుడిని ఇద్దామని కలులు కన్నాను.. కాని కాని..’’
ఆ పై ఆమె గొంతు పూడుకుపోయింది. ఆర్తిగా ఆమెను మరింతగా అదుముకున్నాడు. మనసు అగాధాలలో ఇద్దరి మధ్య ఉన్న కాస్త దూరం లాంటిదేదో ఈ విషాద దుఃఖంతో పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది.
‘‘ప్చ్.. ఇప్పుడేమైంది..మళ్లీ తమరు నెల తప్పే వరకూ ఇక్కడే ఉంటాను.. సరేనా..’’ అన్నాడు కొంటెగా. అది ఆమె పాలిటి మన్మధబాణమని అతనికి సంపూర్ణంగా తెలుసు. బాణం నిజంగానే అనుకున్నచోట అనుకున్నట్టే గట్టిగానే గుచ్చుకుంది. సోమల గుక్కపట్టి ఏడ్చింది సంతోషంగా. అందులో కాస్త ఊరడిరపు ధ్వని..
జైత్రపాలుని దశదినకర్మలతోనే ఆ విషాదం ముగిసింది.
ఇక సింఘణ దేవుని పట్టాభిషేకం..ఆ మహాసంబరాలతో దేవగిరి, యాదవరాజ్యం సంతోష డోలికల్లో పులకించిపోతోంది.
‘‘బావగారూ!విూ అమృతహస్తాలతో నన్ను దేవగిరి సింహాసనంపై కూర్చుండబెట్టాలి..’’ అన్నాడు సింఘణ.
అవతల వెలనాడుపై యుద్ధానికి కాకతీయ సైన్యం సిద్ధ్దమౌతుండగా తను ఇక్కడ ఉండటం.. అయినా ఆలోచించి, ‘తప్పకుండా సింఘణ దేవా!నాకు మాత్రం అంతకంటే ఆనందం ఏముంటుంది..!?’’ అన్నాడు నవ్వుతూ.
అనుమకొండలో మహాసైనిక తంత్రజ్ఞులకు కొదువలేదు. తను లేకున్నా సైనిక సంసిద్ధత ఆగదు. కాని ఇక్కడ సింఘణదేవుడు తనకు కాబోయే శత్రువా? మిత్రుడా? తేల్చుకోవాలి. ఆయన మిత్రత్వాన్ని ఆహ్వానిస్తుంటే తానెందుకు దూరంగా ఉండాలి! తను స్వయంగా సోదరి భర్త మాత్రమే కాదు. గతంలో కారాగారవాసిగా ఉండగా తన శక్తియుక్తులు కూడా చూసినవాడు కాబట్టి తనను గౌరవంగానే కాదు ఆత్మీయంగా కూడా చూస్తున్నాడని గణపతి నిర్ధ్దారణకు వచ్చాడు.
అందుచేత అతని పట్టాభిషేకం వరకూ ఉండటం సబబే..
అంతేకాదు ఇద్దరి మధ్య మరొక ముఖ్య అంశం ఉంది. అది కవ్వల!
కవ్వలను సింఘణ వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు కేయూర చెప్పినమాట ఇప్పటికీ మరుపురాదు. ఆ ఆఖరి రోజు కవ్వల కూడా చాలా ఆందోళనగా, గందరగోళంగా ఉండటానికి ఈ అంశమే కారణమని గణపతి భావన. ఆమె మరణానికి సింఘణ కారణం అవునా?కాదా? అనే సందేహం గణపతిని అప్పటి నుంచీ పట్టి పీడిస్తోంది. కానీ సింఘణ ప్రవర్తనలో ఆ అంశం ఏనాడూ గణపతికి కనిపించలేదు. అదే మరీ గందరగోళ పరుస్తోంది. ఏది ఏమైనా కవ్వల తనతో అన్యోన్యంగా ఉండటం సింఘణకు తెలిసిన సంగతేనని గణపతి నమ్మకం.
సింఘణ అభిమానంగా ఉండటం.. కవ్వల అంశం.. భవిష్యత్ రాజకీయ సంబంధాలు.. ఈ మూడు భావనలు.. సింఘణ పట్టాభిషేకం వరకు గణపతిని అక్కడే ఉండేలా చేశాయి. మరోపక్క సోమలతో అన్యోన్యత. తను అక్కడే మరికొన్ని రోజులు ఉంటే ఆమె ఎంతో సంతోషిస్తుంది.
ఇంకొకవైపు మదినిండా నాగతిస్య, కేయూర, కవ్వల.
ఈముగ్గురి గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోననే ఆశ. వారి గురించి ఎవ్వరిని అడగలేడు. ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తారేమోననే ఆశతో దిక్కులు చూడటమే చేయగలిగింది.. చేస్తోంది..
గణపతిదేవునికి విదూషకునిగా గుణకారుడు అనే యువకుడ్ని నియమించారు. సాధారణంగా రాజభవంతుల్లో అతిథులైన మహారాజ స్థాయి బంధువులకు కాలక్షేపంగా విదూషకులను నియమిస్తారు. ఆయనకు కాస్త హాస్యకథలు, చతుర సంభాషణలతో ఆహ్లాదం కలిగించడం ఈ విదూషకుల పని.
గణపతి కంటే కాస్త పెద్దవాడయిన గుణకారుడు కూడా సింఘణ బంధు వర్గంలోని వాడేనట. అతనే చెప్పాడు.
కవ్వల సింఘణ మేనత్త కుమార్తె అని గణపతికి తెలుసు. ఈ గుణకారుని ద్వారా ముచ్చట్ల సమయంలో వాళ్ల గురించి కొంత సమాచారం సేకరించాడు.
నిజమే. జైత్రపాలునికి ఇద్దరు చెలెళ్లు. అంటే సింఘణకు ఇద్దరు మేనత్తలు. వాళ్లంతా రాజనగరిలోనే నివాసం. పెద్దామెకు కవలలైన ఆడపిల్లలున్నారు.
పట్టాభిషేక మహోత్సవ సందడిలో ఓ రోజు గుణకారుడిని కూడా వదిలేసి మెల్లగా రాజనగరిలోకి ప్రవేశించాడు ఒంటరిగా. ఉత్సవాల సందడిలో రాజనగరి కూడా హడావిడిగా ఉండటంతో ఎవ్వరూ గుర్తించడం లేదని ధైర్యం చేసి తలవంచుకుని ముందుకుపోతున్నాడు. పోయిపోయి ఆ సదరు పెద్ద మేనత్త ఇంటివద్దకు చేరాడు.
ఇక ఇంటి తలుపు తట్టడమే తరువాయి. వెనక ఎవ్వరో పిలిచారు.
‘‘గణపతిదేవ మహారాజా.. తమరేనా??’’
ఒళ్లు చల్లబడిరది గణపతికి. మెల్లగా వెనక్కు తిరిగి చూశాడు.
గుణకారుడు!!
ఇదేవిటి వీడిని వదిలించుకుని వస్తే ఇక్కడికెలా దాపురించాడు?!
‘‘అరెరే.. తమరే!.. తమరు రాచనగరిలో??’’ వాడు విస్తుపోయి చూస్తున్నాడు.
గణపతికి కూడా అదే ఆలోచన వచ్చింది. ‘తన విదూషకుడు.. వీడు ఇక్కడ ఉండడం ఏమిటి?!’
అప్పుడే ఓ ఉపాయం కూడా మెరుపులా తట్టింది.
‘‘నీ కోసమే మిత్రమా! నీ నివాసం ఇక్కడే అని తెలిసి అలా వ్యాహ్యాళికి వచ్చినట్లుగా ఉంటుంది..విూ ఇల్లూ చూసినట్లుగానూ ఉంటుందని వచ్చానన్నమాట. అదన్నమాట..’’ అన్నాడు నవ్వలేక నవ్వుతూ.
‘‘ఆహా! సాక్షాత్తూ కాకతీయ మహారాజులుం గారు మా ఇంటికి అతిథిగా వేంచేయడం ఏమి నా అదృష్టం.
‘ప్రభూ!’ అని అడగడానికి కూడా అర్హతలేని వాడిని. అలాంటిది మా ఇల్లు వెదుకుతూ తమరు రావడం అంటే.. ఆహా పరంధామా.. కృష్ణ కృష్ణా..’’ పులకించిపోతున్నాడు గుణకారుడు.
సమస్య కాస్త తప్పింది. సరే.. కవ్వల సంగతి తెలియాలి. ఎలా? చేతిలో ముద్ద అయితే పెట్టుకున్నాడు.. కాని అది నోట్లోకి వెళుతుందో లేదో అన్నట్లుంది పరిస్థితి.
‘‘మహారాజా.. అదిగో ఆ రెండో వీధిలోనే మా గృహం తమరు పావనం చేయాలి.’’
‘‘వెళదాం. ఈ ఇల్లు ఎవరిదీ.. ఎవరున్నారు లోపల??’’ తెగించి ద్వారం వైపుగా కదిలాడు.
గబుక్కున ముందుకొచ్చి ఆపాడు గుణకారుడు. ‘‘అయ్యా అది.. అదొక పిచ్చివాళ్ల ఇల్లు. మన సింఘణదేవుల వారి మేనత్తగారు, వారి భర్తగారు. ఇద్దరూ పిచ్చివాళ్లు. ఈ ఇంట్లోనే వైద్యుల రక్షణలో ఉన్నారు. అందుకని మనం అటు వెళ్లకూడదు. వేగులవాళ్లు చూస్తే.. అమ్మో..’’
గణపతిదేవుడిని దాదాపు చెయ్యి పట్టి లాక్కూపోసాగాడు గుణకారుడు.
అతని మాటలకు కంగుతిన్న గణపతిదేవుడు చేసేది లేక అతని వెంట నడుస్తూ అడిగాడు.
‘‘వాళ్లు పిచ్చివాళ్లా..? ఎలా…??’’
‘‘వాళ్ల అమ్మాయిని ఎవరో ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారట. దాంతో వాళ్లు పిచ్చి వాళ్లయ్యా రట.’’
‘‘మరి వాళ్లకు మరో అమ్మాయి ఉందని విన్నాను. ఆమె సంగతి?’’
‘‘వాళ్లకు ఇంకో అమ్మాయి ఉందా..!? అరె. నాకు తెలియదే?!!’’
మ్రాన్పడిపోయాడు గణపతిదేవుడు.
కవ్వల తన కళ్ల ముందే చనిపోయింది. బాల కవ్వల ఏమైందో తెలియదు. చనిపోయిన కవ్వలకు చెల్లెలు ఉన్నట్లు వీడికి తెలియదు. మరి ఎవ్వరికి తెలుసు.. బాలకవ్వల ఏమైంది!? ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారు!? ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నట్లు?! ప్చ్.. అన్ని ప్రశ్నలే..
‘‘అయ్యా.. మహానుభావా. ఇదే మా ఇల్లు. దయచేయండి..’’ గుణకారుని మాటలు గణపతికి వినిపిస్తున్నాయో లేదో గణపతికే తెలియడంలేదు. అతని కుటుంబంతో ఏదో గడిపినట్లు గడిపి రాజప్రాసాదానికి తిరిగి వచ్చేశాడు.
నిరాశగా అనుమకొండకు తిరిగి చేరుకున్నాడు.
రాజప్రాసాదంలో ఆంతరంగిక కార్యదర్శి మయభట్టు ఓ లేఖ ఆయన చేతికి అందిస్తూ… ‘‘మన ప్రత్యేక అతిథి డిరడిమ గారు రాసినది. తమరికి అందజేయమన్నారు.’’
భృకుటి ముడివడిరది. శిబిరం అయ్యాక కూడా డిరడిమను వివిధ మంత్రిత్వ నియోగులకు తగిన సూచనలు ఇవ్వవలసినదిగా కోరి రాజప్రాసాదంలోనే అతిథిóగా ఉంచుకున్నాడు.
‘‘క్షమించాలి మండలేశ్వరా. తమరి ఆతిథ్యాన్ని స్వీకరించలేకపోతున్నాను. రాచమర్యాదలతో తిని కూర్చోవడం నాకు సరిపడని సంగతి. ప్రజల్లో.. అదీ బీదా బిక్కి మధ్య తిరగడం నాకు ఆనందం. వెళ్లిపోతున్నాను. దయచేసి నా కోసం వెదకకండి. మనం చర్చించుకుని నిర్దేశించుకున్న విధివిధానాలతో విూరు పాలిస్తున్నారని నేను నమ్మినప్పుడు.. తమరు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించి చక్రవర్తిగా గుర్తింపు పొందినప్పుడు.. తప్పక కలుస్తాను. శలవు. అనేకానేక వందనాలతో.. డిరడిమ..’’
* * * *
మూడవ మెట్టు: తొలి యుద్ధ విజయాలు
‘మానవ జీవన వికాసంలో భాషల పరిణామం ఓ అద్భుతం. ఇప్పుడు భాషలు ఎంతో స్పష్టమై.. వాటికి ఆయా రాజ్యాలలో వ్యాకరణాలు కూడా లిఖిస్తున్నారు. నిన్నటివరకు తెలుగన్నడ మాట్లాడే రాజ్యాలు.. తమిళ తెలుగు మాట్లాడే రాజ్యాలు, మరాఠ తెలుగు మాట్లాడే రాజ్యాలు ఉన్నాయి. అలాగే మొత్తంగా తెలుగు మాట్లాడే రాజ్యాలలో పీఠభూమి రాజ్యాలు, మధ్య తీరస్త రాజ్యాలు, దిగువ దక్షిణాది రాజ్యాలు అనే విభజన చేసుకుంటే పీఠభూమి ప్రాంతంలో చిన్న రాజ్యాలు నలభైమూడు, మధ్య తీరాస్త ప్రాంతంలో చిన్నరాజ్యాలు యాభై ఆరు, దిగువ దక్షిణాది ప్రాంతంలో చిన్న రాజ్యాలు నలభై రెండు… మొత్తంగా తెలుగుభాష మాట్లాడే చిన్న రాజ్యాలు నూట నలభై వొక్కటి ఉన్నాయి మహారాజా.
ఇక దక్షిణ సరిహద్దులో తమిళరాజ్యాలలో తెలుగు మాట్లాడే గ్రామాలు వంద, ఆగ్నేయంగా మరో పాతిక, నైరుతి మూలగా తెలుగు, తమిళ, కన్నడ మాట్లాడే రాజ్యాలు పాతిక ఉండగా గ్రామాలు రెండు వందలు ఉన్నాయి.
ఇక పడమటి సరిహద్దు వెంట కింద నైరుతి నుంచి పైన వాయవ్యంగా ఇరవై రెండు రాజ్య లుండగా, మరో మూడు వందల గ్రామాలుంటాయి. ఉత్తరాదిన పద్దెనిమిది రాజ్యాలుండగా రెండువందల పైచిలుకు గ్రామాలుంటాయి. వీటినన్నింటిని కలిపి ఒకే రాజ్యం చేస్తే అదే తెలుగుభాషా రాజ్యం.. ఆంధ్ర సామ్రాజ్యం అవుతుంది. తమరు సాధించవలసినది అదే..’’
బుద్దయరెడ్డి, భౌగోళరాజ్య సంబంధాల నిపుణుడు.
చింతనా శిబిరంలో.
‘‘చిన్న రాజ్యాల పాలన భయంకరం మహారాజా.. ఈ ఆధునికయుగంలో కూడా సామాన్య ప్రజల కష్టాలు తీరక పోవటం అటుంచి ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అసలు ఈ చిన్నచిన్న రాజ్యాలు ఎలా ఏర్పడుతున్నాయో అనూహ్యం. అవి ఎలా ఏర్పడుతున్నాయో చెప్పుకోవడం ఈ చింతనా శిబిరం ఉద్దేశంకాదు. ఆయా రాజ్యాలలో ప్రజల కడగళ్లను గుర్తించి, అందుకు కారణాలు, నివారణో పాయాలు చర్చించుకోవాలి. చాలా రాజ్యాలలో కనీస సహజ వనరులు ఉండవు. ఏవో అడవులు కొట్టి చిన్న చిన్న గ్రామాలను బెదిరించి కొన్ని ప్రాంతాలను కలుపుకొని రాజ్యంగా ప్రకటించుకుని.. పాలన అనే దౌర్జన్యం చేస్తున్న రాజులు ఎందరో రాచరిక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఓ బలిష్టమైన కోట కట్టుకుంటారు. అందులో రాజప్రాసాదం అనే స్వర్గతుల్యమైన నివాసం.. ఓ పాతికమంది స్త్రీలను చెరపట్టి ఓ అంతఃపురం.. పరిచారికలు, భటులు.. ఆర్భాటాలకు తక్కువ ఉండదు. ఇదంతా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకున్న సొమ్ముతో మాత్రమే. పైగా ఎప్పుడూ పక్క రాజ్యాలను, సరిహద్దు గ్రామాలను కలుపుకొని పెద్దరాజ్యం చేసుకుందామని.. మరిన్ని పన్నులు వసూలుకు అవకాశం ఉంటుందనే ఆలోచన. ఒక రాజ్యానికి పక్క రాజ్యం ఎప్పటికి శత్రు రాజ్యమే. పక్కరాజ్యం సహాయం తీసుకుందామనే ఆలోచనే లేదు.. రాదు. ఎందుకంటే దానిని ఎప్పుడు కబళిద్దామనే ఆలోచనే కాని కలిసి పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకుందాం అనే ఆలోచనే లేదు. ఆయా పేద చిన్నరాజ్య ప్రజల సమస్యలు తీరాలంటే అన్నింటిని కలిపి పెద్ద రాజ్యం.. సామ్రాజ్యం చేయడమే పరిష్కారం.
చిన్నరాజ్యాల సమస్యల నిపుణుడు శాంభవ రాయడు చింతనా శిబిరంలో.
* * * *
అంతఃపురం, అనుమకొండ రాజప్రాసాదం ఆనందంతో గంతులు వేస్తున్నాడు గణపతిదేవుడు.
మందిరం పైకప్పు లేచిపోయేలా అరుస్తున్నాడు. తల్లులిద్దరూ దగ్గరగా కూర్చుని కొడుకు ఆనందాన్ని యుద్ధ విజయాన్ని చూస్తూ వాళ్లు కూడా ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ పగలబడి నవ్వుతున్నారు. అప్పుడే మరో యుద్ధ వార్తాహరుడు వచ్చాడు. అర్ధరాత్రి నుండి ఇప్పటికి వీడు ఇరవై ఐదవ వాడు.
– మత్తిభానుమూర్తి