ఆయన కృష్ణమూర్తి. ఆమె లక్ష్మి (అంజలక్ష్మి)

వారి తనయ- కృష్ణభారతి.

కుటుంబంలోని ఆ ముగ్గురిదీ స్వాతంత్య్ర ఉద్యమ సుదీర్ఘ చరిత్ర.

అన్ని వివరాలూ తెలియాలంటే… అది 1904. అంటే 121 ఏళ్ల క్రితం. ఆ ఊరు అత్తిలికి దగ్గర్లో ఉంది. పేరు – దాసుళ్ల కుముదవల్లి. గోదావరి ప్రాంతం. కుముదవల్లి అనగానే ఇప్పటికీ గుర్తొచ్చేది అంజలక్ష్మీ!

ఆ సంవత్సరం 1932. అది తమిళనాట వెల్లూరు కారాగారం. అక్కడి గదిలో అంజలక్ష్మికి ప్రసవం! శ్రీకృష్ణ జన్మస్థానం మాదిరిగా అలా జరగడంతో, భారత స్వతంత్ర పోరాట సందర్భం కావడంతో, ఆ ఆడపిల్లకు కృష్ణభారతి అని పేరు పెట్టుకున్నారామె.

మరి కొంతకాలం గడిచింది. నెలల తన పసికందుతో జైలు నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చారు అంజలక్ష్మి. అప్పటికే ఆమెను వెల్లూరు నుంచి కన్ననూరు కారాగారానికి మార్చారు ఆంగ్లేయ పోలీసు అధికారులు.

అటు తర్వాత ఎన్నెన్నో పరిణామాలు!

ఇప్పుడు మన ప్రత్యేక ప్రస్తావన ఆ తల్లి, తనయల గురించే!

ప్రధానంగా మాతృమూర్తి లక్ష్మి. డిసెంబరు మూడున తన స్మృతి.

ఆస్తిపరుల కుటుంబంలో పుట్టిన అంజలక్ష్మికి సమాజసేవ మీదనే మక్కువ ఎక్కువ. ఇతరులకు ఇవ్వడంలోనే ఆమెకు ఆనందం! తల్లిదండ్రుల నుంచి చిన్ననాటనే దేశభక్తి అలవడింది.

చదువు మాత్రం అంతగా ఒంటపట్టలేదు. బడిలో పెద్దగా చదువుకోలేదు కానీ, చుట్టూ ఉన్న సంఘాన్ని ఆసాంతం చదివింది. మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, వాటికి పరిష్కారాలు – ఎన్నింటినో. ఇల్లే ఆమెకు పాఠశాల!

ఆ రోజుల్లో ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది.

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం

పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం

సుహాసినీం, సుమధుర భాషిణీం

సుఖదాం వరదాం మాతరం… వందేమాతరం!

(మనసును అలరించే తెల్లని వెన్నెల రాత్రిలా, వికసిత సుమంలా, పచ్చని వృక్ష సముదాయంలా విరాజిల్లే భరతమాతా! మధురాతి మధుర చిరునవ్వు నీది. అదేవిధమైన పలుకూ నీదే. ఆనందపుదాయినివి. వరప్రసాదినివి నీవే. నీకు నమస్సులమ్మా!)

జనగణమంగళ దాయక జయహే

భారత భాగ్యవిధాతా! జయహే, జయహే, జయహే.

జయజయజయ జయహే

(నీ పవిత్ర పేరునే స్మరిస్తూ, హృదయ జాగృతమవుతూ, మంగళప్రద ఆశీస్సుమాలను కోరుతూ, నీ విజయ చరితలనే పాడుతాం తల్లీ! అందరికీ శుభాలను అందించే భరతమాతా! నీకు జయం జయం).

ఇటువంటి గీతాల ప్రభావంతో ఉద్యమవాహినే అంతటా. సహాయ నిరాకణ, విదేశీ వస్తు బహిష్కరణ, అదేవిధంగా విదేశీ వస్త్రదహనం, మరోవైపు ఊరూరా వాడవాడలా ఖద్దరు ప్రచారభేరి. వీటన్నింటితో కొనసాగుతోంది పోరు ప్రభంజనం.

అది 1929వ సంవత్సరం. అప్పటికి లక్ష్మికి సరిగ్గా పాతికేళ్లు, సరిగ్గా ఆ రోజుల్లోనే చాగల్లు ప్రాంతం ఆనంద నికేతన ఆశ్రమంలో సమావేశ మయ్యారు వీరులంతా.

ఉద్యమ నిర్వహణకు సహాయం అవసరమన్న పిలుపు వినిపించింది అప్పుడు. ఒక్క క్షణమైనా ఆలోచన చేయలేదు తను. తన ఒంటిమీది ఆభరణాలన్నింటినీ నిధికి అర్పించింది.

అంతేకాదు- ఇక ముందు ఎన్నడూ, ఎప్పుడూ బంగారు నగల్ని వేసుకోనని శపథంచేసిన మహిళా మణీ ఆమే.

నాడు ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో జరుగుతోంది పోరాటం.

అంజలక్ష్మి కదన కుతూహలం చెప్పనలవి కాదు. ఆ జోరే వేరు.

ఉప్పు సత్యాగ్రహ రంగంలోకి దూకింది.

అనంతర కాలంలో దుకాణాల దగ్గరి విదేశీ వస్త్రాలను దహనం చేయడం ముందుగా కార్య కర్తలతో కలిసి ఆయా వ్యాపారశాలల వద్ద పికెటింగ్‌.

‌సకల పురాణేతిహాస సారభరితవు

సారభరితవు… ఓంకార మహితవు.

స్వరాజ్యదీక్షగొనిన సత్యమూర్తివి

సత్యమూర్తివి… అసహాయవర్తివీ!

వందనమిదె గైకొనుమీ భారతజననీ!

అనేలా మున్ముందుకు పయనిస్తోంది సమరసేన!

భీమవరంలోనూ విస్తరిస్తోంది ఆ అగ్ని. విస్తరించి విస్తరించి ఒక్కసారిగా ఎగసింది. దమన పాలకులు రాక్షసబలాన్ని ప్రయోగించారు. ఫలితంగా అంజలక్ష్మి- పోలీసుల నిర్బంధంలోకి.

ఆమెను మద్రాసు కారాగారానికి తరలించారు. మరికొన్ని కారాగారాలకీ తిప్పుతూ వచ్చారు.

నెలల తరబడి కారాగారవాస దండన! ఇరుకిరుకు గదుల్లో, గాలీ, వెలుతురూ మచ్చుకైనా లేని చోట్లలో నిర్బంధం.

నానారకాల బాధలుపెట్టినా, పంటి బిగువున భరించింది ఆ యోధ. దేశానికి స్వేచ్ఛ కావాలన్న సంకల్పదీక్ష పెరిగిందేకానీ, ఎక్కడా తగ్గలేదు. బాధల్లోని వేటినీ లెక్కచేయలేదు.

అటు తర్వాత విడుదల. మళ్లీ కొన్నాళ్లకే- అదే భీమవరంలో ఒకరోజున ఉద్యమకారుల సమావేశం. పసిగట్టిన పరపాలక పోలీసులు మోహరించారు. సభాస్థలికి ఏ ఒక్కరూ ఎక్కడి నుంచీ రాకుండా దారుల్ని మూసివేశారు.

అయినా, ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు?

ఉద్యమ మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమ వేదికను మార్చేశారు. సభ జరగాల్సింది ఒక భవనంలో అయితే, దూరంగా ఉన్న పొలం గట్టును ఎంచుకున్నారు. నిర్ణయాలు తీసుకున్నారు. కూలంకష ఆలోచనలయ్యాక, తిరుగుముఖం పట్టారు. నేరుగా పాత భవంతి (మొదటి సభాస్థలి)కి చేరుకుని, అక్కడే ఉద్యమ పతాకను ఎగురవేశారు.

వినువీధిన సగర్వంగా జెండా!

పతాకోత్సవము చేయండీ.

స్వతంత్ర భారత జాతి చిహ్న ఉత్సవం చేయండీ!

కొత్త వన్నెలూ, కొత్త చిన్నెలూ, కొత్త జీవం

కొమరప్పంగా… నూతన భారత జాతికి భువిలో

ఖ్యాతీ విజయమూ జరగాలంటూ –

పతాకోత్సవం చేయండీ!

అన్నట్లు రెపరెపలాడించారు ఆ జెండాను. అంతకుముందు ఆ భవనం మీద అక్కడ ఉన్న ఆంగ్లేయ పతాకను తొలగించారు ఉద్యమ కార్యకర్తలు. వారిలో అనేకమంది వనితలు.

అలా పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భం అప్పట్లో తెలుగునాట అదే. చరిత్రాత్మక సన్నివేశం.

రెచ్చిపోయిన బ్రిటిష్‌ ‌పోలీసులు పాశవిక బలాన్ని ప్రయోగించారు. ఉద్యమ వనితలను నిర్బంధించి, వాహనాల్లో తరలించి, దమన నీతిని కనబరిచారు. ప్రతిఘటించిన వారి మీద లాఠీలు ఝుళిపించారు. తీవ్రగాయాలతో అల్లాడుతున్నా ఉద్యమ నినాదాన్ని ఆపలేదు అంజలక్ష్మి. ఎలుగెత్తి నినదిస్తున్న ఆమెను పశుబలంతో అణచివేయాలని చూశారు పోలీసులు. పదినెలల కారాగార వాస శిక్ష పడేలా చేశారు.

అప్పటికీ ఆ సాహసపడతికి చిన్నవయసు కుమారుడున్నాడు. ఆ పిల్లవాడినీ నిర్బంధించారు ముష్కరపాలకులు. నిర్బంధంలో మగ్గిన ఆమె అప్పటికి గర్భవతి! కారాగారంలోనే పుత్రికా జననం. ఆమె కృష్ణభారతి! ఆ పేరు అలా పెట్టడంలోనే తల్లి దేశభక్తి ప్రస్ఫుటమవుతుంది.

తల్లీ బిడ్డలు జైల్లోనే! నరకయాతన తప్పలేదు పిల్లలకి కూడా. ఎంతగా తల్లడిల్లాలో పైనున్న ఆ భగవంతుడికే తెలుసు!

ఇంకొన్ని నెలలు గడిచిపోయాక, విడుదల చేశారు ఆమెని. పసివాళ్లతో సహా బయటికి వచ్చిన అంజలక్ష్మికి ఊరూరా ప్రజలంతా ఘనస్వాగతాలు పలికారు. అపార గౌరవం, ఆదరభావాలతో అంతటా నీరాజనాలు అర్పించారు. ఆ రోజుల్లో ఆమెకు లభించిన స్వాగత సత్కారాలు ఎనలేనివి. వందల మంది జేజేలు అందించారు.

కాలం ఆగలేదు సరికదా వేగంగా సాగింది. తల్లి ఆశయాలనే శ్వాసగా స్వీకరించారు కృష్ణభారతి. జీవితమంతటినీ సమాజసేవకు కేటాయించారు. తనకు ఉన్న ప్రతీరూపాయినీ సామాన్యుల కోసమే ఖర్చుపెట్టారు. తనది 92 వత్సరాల జీవితకాలం. సమయమంతటినీ జనసేవకే వినియోగించారు. దానాలూ, ధర్మాలూ అనంతంగా చేస్తూ వచ్చారు. స్వాతంత్య్రం ముందు, స్వతంత్ర సమయం, అనతరకాలంలోనూ స్థితిగతులను చూశారామె.

మల్లాదివారు అన్నట్లు :

జయ జయజయ భారత జనయిత్రీ, దివ్యజ్ఞాన ప్రదాత్రీ!

నిరుపమ మహిమోపేతా, చిరయశస్సమేతా

అతులిత దివ్యావేశ సంజనిత

విశ్వశాంతి కాంక్షిత వచస్వినీ!

చతురాశ్రమ జీవిన విధాన ని

ర్దేశిత పథదర్శినీ తపస్వినీ!

అంటూ భారతమాతను నేత్రపర్వంగా దర్శించారు. మనస్వినిగా సంభావించారు. స్వతంత్ర భారతంలోనూ కృష్ణభారతి ఎప్పుడూ, ఎన్నడూ, ఎవరి నుంచీ ఏమీ ఆశించలేదు. పోరాట కాలంలో కారాగారంలో జన్మించిన కారణంగా స్వతంత్ర యోధగా గుర్తిస్తామన్న అధికారుల వినతినీ సున్నితంగా తిరస్కరించారు. ‘మాకు ఇవ్వడమే తెలుసు. తీసుకోవడం తెలియదు. కుటుంబంలో అందరం స్వతంత్రతా సాధనే లక్ష్యంగా పనిచేశాం. అంతేకానీ, ఏ ప్రతిఫలాన్నో ఆశించికాదు’ అని ప్రకటించడం కృష్ణభారతికే చెల్లింది. పరమ స్వచ్ఛంద సేవకు నిదర్శనరూపాలు తల్లి అంజలక్ష్మి. కూతురు కృష్ణభారతి!

భరతమాత ముద్దుబిడ్డ కృష్ణభారతి. అందుకే మూడేళ్లనాడు భీమవరంలో ఒక కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆమెను సత్కరించారు. వేదిక మీద ప్రణామం అర్పించారంటే… అంతా తల్లి అంజలక్ష్మి, కూతురు కృష్ణభారతి నిబద్ధతా పూరిత జీవిత విశేషమే. ఆ తల్లీ తనయా ఆదర్శ చరితులు!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE