ఆంధ్ర నాటక కళాపరిషత్తు. పేరు నమోదై ఇప్పటికి 96 ఏళ్లు.
అదీ మద్రాసులో.
పుష్కరంలోగా మొట్టమొదటి నాటకపోటీలు నిర్వహించింది ఆ సంస్థ.
అవే పోటీల్లో ఉత్తమ నటి బహుమతి పూర్ణిమకి! ఇంటిపేరు ఆవేటి.
అంతకుముందే, 1936లో ఓ నాటక సంస్థను స్థాపించారామె.
పేరు ‘శారదా మనోవినోదిని’.
అటు తర్వాత, ఎనిమిదేళ్లకే ‘ఆర్ట్ థియేటర్’ ఏర్పాటు చేశారు. ఇదంతా, మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు సంగతి!
నటరత్నంగా కీర్తికిరీటం అందుకున్న పూర్ణిమ… రంగస్థలం మీద నటించినవన్నీ నాయిక పాత్రలే!
కళారంగ ప్రయాణంలో ఇలా ఎన్నెన్నో మైలురాళ్లు.
నవంబరు 26 స్మృతి సందర్భం
జననం అత్తిలిలో. అస్తమయం ఏలూరులో.
అత్తిలి అనగానే వెంటనే గుర్తుకొస్తుంది సమరస నటనానందం!
తపోభూమి అత్తిలి. పలు ఆలయాలకు కూడలి.
ఇక ఏలూరు ప్రాంతం ‘ఆంధ్ర జాతీయ మహా విద్యాలయం’ నిలయం. కళలు, విభిన్న ప్రదర్శన రూపాలకు ఆలవాలం.
ఈ అన్నీ నటి పూర్ణిమ నటనా నేపథ్య కీలక అంశాలు.
మరింత విశేషం: ఈమె తల్లి సురభి లక్ష్మమ్మ. సురభి అనడంతో, నాటక సమాజం తలపులోనికి వస్తుంది. తండ్రి వనారస గోవింద రావు. గోవిందప్పగా ప్రసిద్ధి. తాను నిర్మించి పరిపోషించిందే తదుపరి కాలంలోని ‘సురభి’. ఇంతటి వారసత్వం ఉన్నందునే, పూర్ణిమ తెలుగు వెలుగు అనిపించుకున్నారు. 77 సంవత్సరాల జీవితకాలం.
కళారంగాన ఎంతటి వైవిధ్యం అందుకున్నారంటే…
ధరణికోట అనేది ఒక నాటకం. ఓ పాత్రధారిణి పూర్ణిమ.
చిరునవ్వు వెన్నెలల్ చిందులాడెడు ముఖేందు
మండలమ్మును గల్గు మందగమన
యువజనంబుల గుండెలవియజేసెడు, క్రూర
నిశితాంబకమ్ముల బినరు హాక్షి
ప్రణయ ప్రశంసచే, నణుమాత్రమరుణమౌ
చెక్కుటద్దమ్ముల చిన్నెలాడి
బాల్యంబు దొలగిపోబరువంపు మిసమిస
లారంభుమగుచున్న యలరుబోడి
పదియునైదేండ్లు పైబడ్డ పద్మగంధి
సకల విషయ విజ్ఞాన ప్రశస్త శీల…
ఈ విశేషణాల వేళ, నాయిక పాత్రధారిణిగా పూర్ణిమ నటన నిజంగా అద్భుతమే! చారిత్రక, పౌరాణిక, జానపద నాటకాలకు ఆమే సుప్రసిద్ధ.
నాటక సమాజం అనే తోటలో సుందర రీతిన విరబూసిన పువ్వులా ఉండేవారు. సంప్రదాయ సంగీతాన్ని భక్తి శ్రద్ధలతో అభ్యసించారు చిన్నప్పటి నుంచీ. బాలనటిగా రంగప్రవేశం చేసింది మొదలు ఎన్నెన్నో పాత్రలను సహజసిద్ధంగా అభినయించారు.
బాల్యంలో – బాలకృష్ణ, లవకుశ పాత్రలు.
యౌవనంలో- సత్యభామ, చంద్రమతి, మల్లమాంబ, చిత్రాంగి, ప్రమీల, సక్కుబాయి, మరెన్నో పాత్రపోషణలు.
ఎందులోనైనా ఇట్టే ఒదిగిపోయే నటచతురత.
తులాభారం, కృష్ణలీల, విప్రనారాయణ, పాదుకా పట్టాభిషేకం, భక్త ప్రహ్లాద, మండోదరి, చిత్రనళీయం, సారంగధర, హరిశ్చంద్ర, చింతామణి
ఇలా అనేకానేక నాటకాల్లో / నాటకాలతో ప్రతిభను నిరూపించుకున్నారు. ఏ వేషం వేసినా భాష, భావం చక్కగా పలికించేవారు. శైలి, అభివ్యక్తిలో మిన్నగా ఉండేవారు ఎప్పుడూ.
స్త్రీ పాత్రల పోషణలో తనదైన దక్షత వ్యక్తమయ్యేది.
అప్పట్లో మొదట్లో రంగస్థలం మీద స్త్రీ పాత్ర పోషణం కష్టతరంగా ఉండేది. ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. ఆసక్తి ఉన్నప్పటికీ, రాలేని పరిస్థితి ఉంటుండేది.
వీటన్నింటినీ అధిగమించారామె. ఎందరో నటులతో దీటుగా నటించి శభాష్ అనిపించుకున్నారు ఎన్నోమార్లు.
మండోదరి. రావణ సతీమణి. మానవతకు ప్రాధాన్యమిచ్చిన లలన. భర్త వ్యసనానికి బానిసైతే, ఎంత చెప్పినా పెడచెవిన పెడితే, ఏం చేయగలదు భార్య? ఇదే మండోదరి పరిస్థితి కూడా. లంకా రాజ్యానికి మహారాణి అయినా, కలతలెన్నింటికో గురయింది. పరస్త్రీ వ్యామోహానికి అలవాటు పడిన దానవపతికి ఎంతగానో మంచిని చెప్పి చూసింది. ఫలితం లేని దశలో మండోదరి ఆందోళన తీవ్రత ఇంతా అంతా కాదు.
ఇదంతా అభినయించడంలో అగ్రగణ్య పూర్ణిమ. మనోక్లేశాన్ని, నిస్సహాయతని రంగస్థలంమీద కనబరుస్తుంటే – కళ్లార్పకుండా చూస్తుండేవారు ప్రేక్షకులందరూ. మౌన గంభీర శోకమూర్తిగా నటించిన వైనం చూసి విచలితులయ్యేవారు ప్రతీ ఒక్కరూ.
సత్యహరిశ్చంద్రలో చంద్రమతి పాత్ర. ఒక సన్నివేశంలో – ‘ఎంత మంద భాగ్యురాలను! నిరంత మనంత పరిచారికా శతంబుల యూడిగంబు లందుకొను పట్టంపు రాజ్ఞీపదం బనుభవింపజేసి; దైవమా! తుదకీ నీచగతికేల పాల్పరచితివి? తొలుతనే నన్నీలాటి దాసిగ సృజయించిన నీవు నాకెంత యుపకారమొనరించిన వాడగుదువు? ఈ దాసికావృత్తియందైనను నా యజమానురాలిని మెప్పించలేకుంటినే! హా… ప్రాణపతీ! హరిశ్చంద్రా!’ అంటున్నప్పుడు ఆ నటపటిమను చూడాల్సిందే.
‘హా విధీ! హా కుమారా! లోహితా’ అంటున్నపుడు ఆ మనోవేదనను చూసి కళ్లనీళ్లపర్యంతమయ్యేవారు వీక్షకులు.
ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడమన్నది నటి పూర్ణిమకి మాత్రమే సుసాధ్యమైంది. వాచకంలో, నటకౌశలంలో ఆమెది తిరుగులేని ప్రతిభ.
ఒక పాత్రను అభినయిస్తున్న తరుణంలో ప్రేక్షకులు నేరుగా రంగస్థలం మీదకు చేరుకుని, ఆమెకు పాదాభివందనం చేసిన సందర్భమూ ఉంది.
మరపురాని ఘట్టాలు తన జీవితంలో ఎన్నెన్నో. ప్రతీ పాత్రనీ సవాలుగా స్వీకరించి, నటనలో జీవించేవారు.
‘శ్రీ కృష్ణతులాభారం’లో సత్యభామ పాత్ర. అందం, దర్పం, స్వాతిశయం కలగలసిన తత్త్వం. ‘స్వామి నా వాడు’ అనే తిరుగులేని భావనం. లాలిత్యం, గాంభీర్యం, నిపుణత్వం కలగలిపిన స్వభావాన్ని పూర్ణిమ వ్యక్తీకరించిన తీరు హృద్యంగా ఉండేది అప్పట్లో.
ఇదే తరుణంలో ‘సత్యభామా సాంత్వనము’ గురించి ప్రస్తావించుకోవాలి. కావ్యకర్త కామేశ్వరకవి. అంతా ప్రౌఢ కవిత. అచ్చతెనుగు, దేశ్యాలు, ఇతర విశేషాలమయం. ఇందులో నాలుగు ఆశ్వాసా లున్నాయి. ప్రపంచ నాటక సుత్రధారిగా శ్రీకృష్ణుడు, పలు భావ రసనాయికగా సత్యభామాదేవి. రసపోషణలో అందె వేసిన చేయిగా నిలిచారు పూర్ణిమ.
కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాలు, బాలనాగమ్మతోపాటు కన్యాశుల్కం, మరికొన్ని సాంఘిక నాటకాల్లో నటించి మెప్పించారు. సరసన నటించిన మేటి నటుల్లో…
గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్‌ఆర్ ఆంజనేయులు, బళ్లారి రాఘవాచార్యులు, సూరిబాబు, అబ్బూరి వరప్రసాదరావు, పీసపాటి, బందా కనకలింగేశ్వరరావు వంటి వారున్నారు.
ఆనాడు తెలుగునాట అనేకానేక పట్టణాల్లో నాటక ప్రదర్శనలిచ్చారు ఆ నటీమణి. అంతేకాదు ఢిల్లీ, చెన్నై, ఇతర నగరాలలోనూ సాంస్కృతిక పర్యటనలు జరిపారు.
ఒడిశా, బిహార్, మరెన్నో రాష్ట్రాలకు సైతం వెళ్లివచ్చారు. నటరంగానికి తోడు ఆమె కళావైదుష్యం చలన చిత్రాల్లో, ఆకాశవాణిలో, గ్రామ్‌ఫోన్ రికార్డుల్లో ప్రాచుర్యం అందుకుంది.
పూర్ణిమ నటదక్షతను సత్కారాల ద్వారా గుర్తించాయి చెన్నై తెలుగు అకాడమీ వంటి సంస్థలు. ఆమె అప్పట్లో ఆంధ్రా గవర్నర్ చేతులమీదుగా సువర్ణ ఘంటా కంకణం స్వీకరించారు.ఉత్తమ నట ప్రతిభకు, సామర్థ్యానికి అందుకున్న గుర్తింపు, గౌరవం అది.
‘సంగీత సరస్వతీ’ గా సత్కరించాయి మరికొన్ని సంస్థలు. కళ కేవలం వినోదం కోసమేనా? కాదు. సమాజంకోసం.
ఈ సూత్రాన్ని మనసా, వాచా, కర్మణా నమ్మిన పూర్ణిమ సంఘసేవకు కంకణం కట్టుకున్నారు.
ఆ రోజుల్లో వరద బాధితులకు అండదండగా ఉన్నారు. తెలుగుప్రాంతాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి, వచ్చిన సొమ్మును ఆర్తులకు వెచ్చించారు. అభివృద్ధి పనులకు విరివిగా వినియోగించారు.
రోజులన్నీ ఒకేలా ఉండవు. పరిస్థితులు విభిన్నంగా మారుతుంటాయి. ఏడున్నర పదుల వయసులో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వ్యాధి, బాధ చుట్టుముట్టాయి. అయినా, జడవని తత్త్వం ఆమెది. తనకు ఎంత మాత్రం ఓపికలేకపోయినా, లేని శక్తిని ఎలాగో కూడదీసుకుని; ఏలూరులో జరిగిన గ్రంథాలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వారోత్సవాలు వచ్చిన, ముగిసిన ప్రతీ పర్యాయమూ ఆవేటి పూర్ణిమను గుర్తుచేసుకుంటారు అందరూ.
ఆ కాలంలో, ఆ స్థితిగతుల్లో, అక్కడి గ్రంథాయం ఆవరణలో ఏర్పాటైన బళ్లారి రాఘవ శతజయంతి ఉత్సవాలకు అతికష్టంమీద హాజ రయ్యారు ఆ నటీమణి. కళా ప్రదర్శనల్లో పాల్గొని, సహ నటీనటులను ఆదరంగా పలకరించి, ఆత్మీయ వాతావరణాన్ని కలిగించారక్కడ.
ఆ ఊళ్లోనే, ఏలూరులోనే ఉన్నట్లుండి ఆ కళ్లు మూతపడ్డాయి. గొంతు శాశ్వతంగా మూగవోయింది. ఆమె ఇక లేరన్న నిజాన్ని భరించలేక ఎంతగానో రోదించాయి కళాప్రియ హృదయాలు.
ఈ లోకంలోకి కళాకారులు రావడం, వెళ్లిపోవడం ఎన్నో పరిణామాలకు కారణమవు తుంటుంది. ఆమె జనన అస్తమయాలు చరిత్రలో నిలిచి ఉన్న తేదీలు మార్చి ఒకటి. నవంబర్ 26.
ఆమెది అపూర్వ నటచాతురి. అపురూప సేవాలహరి. అందుకనే ఇప్పటికీ చిరస్మరణీయ!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్