సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి  – 6 అక్టోబర్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మాతృభూమికే అగ్రతాంబూలం అన్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మహదాశయాన్ని మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ జాతి దృష్టికి తెచ్చారు. ఈ విజయదశమికి ఉన్న వైశిష్ట్యాన్ని కూడా సాటి భారతీయులకు గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 28న ప్రసారమైన ‘మన్‌ కీి బాత్‌’ 126వ సంచికలో ప్రధాని తన మాతృసంస్థ మహత్వం గురించి, అనిర్వచనీయమైన సిద్ధాంత బలం గురించి, సాధించిన విజయాల గురించి మరొకసారి సవినయంగా స్మరించుకున్నారు. సంఘ శతాబ్ది చారిత్రక సందర్భంగా ఆయన అక్టోబర్‌ 1న ప్రత్యేక తపాలా బిళ్ల కూడా విడుదల చేస్తున్నట్టు ఆ మాటామంతీలోనే చెప్పారు. ఇది కేంద్రం తరఫున సంఘానికి అందిన సముచిత గౌరవం. నిస్వార్ధ సేవకు ఎల్లవేళలా ముందు వరసలో ఉండే సంస్థ అంటూ ప్రధాని మోదీ శ్లాఘించడం చంద్రునికో నూలుపోగు వంటిదే. దేశం పట్ల స్వయంసేవకులు ప్రదర్శించే జవాబుదారీతనం, ఈ దేశం నాది అన్న బాధ్యతాయుతమైన భావనల గురించి నిజానికి యావత్‌ ప్రపంచానికి తెలుసు. దేశభక్తినీ, ఆపన్నుల సేవనూ ఆర్‌ఎస్‌ఎస్‌ పవిత్రకార్యంగానే స్వీకరిస్తుంది. ఈ విషయాలను ప్రధాని స్మరించుకోకుండా ఉండడం సాధ్యం కాదు.

తాను దీపావళి శుభాకాంక్షలు దేశప్రజలకు తెలియచేస్తున్నాననీ, అదే సమయంలో మనం స్వయం సమృద్ధం కావడానికి దృఢదీక్ష వహించాలనీ కూడా ప్రధాని కోరారు. అందుకు ఉన్న ఏకైక మార్గం స్వదేశీ అని మోదీ తొలి నుంచి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో స్వదేశీ ప్రాధాన్యం గురించి మోదీ మరింత గట్టిగా వక్కాణిస్తున్న సంగతి తెలిసిందే. మనమంతా తిరిగి స్వదేశీ పథంలోకి ఎంత వేగంగా మళ్లితే అంత మంచిది. కారణం`ప్రపంచ పరిస్థితులు. పురోగామి భారత్‌ పట్ల కొన్ని దేశాలు ప్రదర్శిస్తున్న అసూయ, ద్వేషం, ఆధిపత్య ధోరణి రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్థానిక ఉత్పత్తుల కొనుగోలు పెంచి, దేశాన్ని స్వయంసమృద్ధం చేయాలన్న పిలుపు ఎప్పటికీ ఆహ్వానించదగినదే. ఆచరణలో ఉండవలసినదే. ఈ పండుగలలో స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి, ఖాదీ ధారణకు ప్రాధాన్యం ఇవ్వడం ఒక వ్రతంగా భావించాలని మోదీ పిలుపునిచ్చారు. ఇటీవలి దశాబ్దంలో ఖాదీ కొనుగోళ్లు పెరిగినా, స్వాతంత్య్రోద్యమంతో అనుబంధం ఉన్న ఆ వస్త్రాలను ఈ పండుగ నుంచి మరింతగా వినియోగంలోకి తేవాలని ఆయన భారతీయులను కోరారు. అక్టోబర్‌ 2, అంటే గాంధీ జయంతికి జాతి జనులంతా ఖాదీ వస్త్రాలు ధరించడం మరచిపోరాదని  మనవి చేశారు.

అక్టోబర్‌ 16, 1905న జరిగిన బెంగాల్‌ విభజన, విభజన వ్యతిరేకోద్యమం రెండూ చరిత్రను మలుపు తిప్పినవే. ఈ ఆగ్రహం నుంచి వెల్లువెత్తినదే స్వదేశీ ఉద్యమం. స్వరాజ్య సమరానికి వంగదేశమే నాడు వేగుచుక్క. 120 ఏళ్ల నాటి ఈ చారిత్రక ఘట్టాన్ని భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ గుర్తు చేయడంలోని ఆంతర్యం అదే. స్వరాజ్య భావనను పెకలించి, మైనారిటీ ఉగ్రవాదానికి నారు పోసిన దురదృష్టకర సందర్భం అదే. బంకించంద్ర, వివేకానందుడు, రవీంద్రుడు, అరవిందుడు, సురేంద్రనాథ్‌ బెనర్జీ, బిపిన్‌చంద్ర పాల్‌, చిత్తరంజన్‌దాస్‌.. స్వరాజ్య భావనకు ఉద్యమ రూపం ఇచ్చిన అలాంటి ఎందరో మహానుభావులను కన్న నేల అదే. వీరికి మహారాష్ట్ర నుంచి లోకమాన్య తిలక్‌, పంజాబ్‌ నుంచి లాలా లాజ్‌పతిరాయ్‌ తోడుగా వెళ్లారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు స్వదేశీ భావనకు ముష్టిఘాతం, ముస్లిం వేర్పాటువాదానికి ఊతం ఏకకాలంలో ఇవ్వాలన్నదే విభజన వెనుక ఉన్న వైస్రాయ్‌ కర్జన్‌ యోచన. కానీ ఇది మరొక కోణం నుంచి ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయభావాలను అణచివేయాలన్న కర్జన్‌ పన్నాగం పటాపంచలయింది. దేశమంతటా జాతీయతా భావన జ్వలించింది.

అందులో ఒక అగ్నిశిఖ స్వదేశీ ఉద్యమం. 1903లోనే విభజన నిర్ణయాన్ని ప్రకటించినా, 1905లో అమలు చేశారు. ఈ విరామమే భారతీయులను బాగా ఆలోచింపచేసింది. విభజన వ్యతిరేకోద్యమానికి నాటి నాయకులు సృష్టించు కున్న బలమైన ఆయుధమే స్వదేశీ. జూలై 3,1905న కృష్ణకుమార్‌ మిత్రా నడుపుతున్న ‘సంజీవని’ పత్రిక ఈ వినూత్న ఉద్యమం గురించి జాతి ముందు ఉంచింది. ఆఖరికి 1905లో విదేశీ వస్తు బహిష్కరణగా రూపుదాల్చింది.

ఆగస్ట్‌ 7, 1905న కలకత్తా టౌన్‌ హాలులో జరిగిన సమావేశం స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి భేరీ మోగించింది.  మెకాలే విద్యకు సమాధి కట్టవలసిన అవసరాన్ని నాటి నాయకులు గుర్తించారు. జాతీయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. జౌళి, రసాయనాల తయారీ మొదలు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల తయారీ వరకు నాటి భారతీయులు చేపట్టారు. ఆఖరికి పెళ్లి వేడుకలలో విదేశీ వాద్య పరికరాలు ఉండే బ్యాండ్‌ మేళాలను సైతం నిరాక రించారు. కొందరైతే దిగుమతి చేసుకున్న ఏ వస్తువు కనిపించినా శుభకార్యాలను కూడా బహిష్కరించారు. అదొక అపూర్వ చైతన్యం. చరిత్ర పునరావృత్తమవు తుందంటారు, చరిత్ర తత్త్వవేత్తలు. 21వ శతాబ్దం తొలి పాదంలో స్వదేశీ అలాగే విదేశీ వస్తు బహిష్కరణ అవసరం సుస్పష్టంగా కనిపిస్తున్నది.

శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్‌ సాధించిన ఘనత ఎంతటిదో ఇటీవలి పరిణామాలు తిరుగులేకుండా రుజువు చేశాయి. ఇందుకే అగ్రరాజ్యాలు సైతం ఆసూయతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. మన ప్రగతికి భారీ సుంకాలను అడ్డం వేసే యత్నం చేస్తున్నాయి. ఈ దాష్టీకం ఇంకానా అని నేటి భారత్‌ తరఫున మోదీ గర్జిస్తున్నారు. అందులో భాగమే కొత్త స్వదేశీ పిలుపు. ఆ స్ఫూర్తితో, ఆ ఆచరణతో, జాతి ఐక్యంగా విదేశీ ఒత్తిడులను ప్రతిఘటించవలసిన సమయమిది. మన దేశాన్ని స్వయంసమృద్ధం చేసుకోవడానికి ఇప్పుడు మనం సర్వ శక్తిమంతులమే కూడా. ఇది గమనించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE