సెప్టెంబర్‌ 22 ‌నుంచి శరన్నవరాత్రులు,  తిరుమల  బ్రహ్మోత్సవాలు

భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. ఆ ఆదిశక్తే దుర్గాదేవి. ఆ తల్లిని తొమ్మిది రూపాలలో అర్చించడమే దేవీ నవరాత్రుల పరమార్థంగా చెబుతారు. లక్ష్మీ స్వరూపిణీగా సంపదను, సరస్వతిగా జ్ఞానాన్ని, పార్వతిగా శక్తిని ప్రసాదించే దుర్గమ్మను ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ….’ అని పోతనామాత్యుడు శ్లాఘించారు.

దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు ప్రతీకలు. ప్రకృతిలోని, మానవ ప్రవృత్తిలోని చెడులను దూరం చేయడానికి శక్తిని ఉపాసించవలసిన ఆవశ్యకతను ఈ పండుగ గుర్తు చేస్తుంది. లోకానికి దానవ బాధ ప్రబలినప్పుడల్లా వారి సంహారానికి  అవతారాలు దాలుస్తుంటాను’ (ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి/తదాతదా వతార్యాహం కరిష్యామి సంక్షయమ్‌) అని భగవతి చెప్పినట్లు ‘దుర్గా సప్తశతి’ పేర్కొంటోంది

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి తొమ్మిది నాళ్లు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి అర్చిస్తారు. ‘దేవీకవచం’… ‘ప్రథమం శైలపుత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ/తృతీయా చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ/పంచమా స్కంద మాతేతీ షష్ఠ్యా కాత్యాయనీతచ/సప్తమా కాలరాత్రీతి మహాగౌరీ చాష్టమీ/నవమా సిద్ధిధాత్రీతి నవదుర్గాః ప్రకీర్తతాః’ (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి)అని నవదుర్గలను వివరించింది. దుర్గాదేవి, బాలాత్రిపురసుందరి, మహాలక్ష్మి, గాయత్రీ మాత, అన్నపూర్ణేశ్వరి, మహాకాళి, లలితాంబ, సరస్వతి, మహిషాసురమర్ధని, రాజరాజే శ్వరీదేవి రూపాల లోనూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆశ్వయుజ మాసంలో సకలలోక జనని ఆదిశక్తిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు స్వల్ప తేడాలతో పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిధాత్రి అని ‘దేవీకవచం’ జగజ్జనని నవ రూపాలను పేర్కొంటోంది.

పాడ్యమినాడు జన్మించిన మహామాయ మహాకాళియై మధుకైటభులను సంహరించింది. విదియనాడు మహాలక్ష్మియై మహిషాసురమర్దిఅయిచ తదియనాడు మహాసరస్వతిగా అవతరించి శుంభనిశుంభులను సంహరించింది, చవితినాడు యోగమా యగా నందుని ఇంట పుట్టి నందగా కంసుడిని భయ పెట్టింది. పంచమినాడు విజృంభించి దమనుడు అనే రాక్షసుడిని చీల్చి రక్తదంతిగా పేరు పొందింది. షష్ఠినాడు శాకంబరి అయి కరవు కాటకాలను దూరం చేసింది. సప్తమి నాడు ఆవిర్భవించి దుర్గముడనే రాక్షసుడిని దునిమి దుర్గగా పేరుపొందింది. అష్టమినాడు మాతంగుని ఇంట్న మాతంగినిగా జన్మించి అస్పృశ్యతను దూరం చేసింది. నవమి నాడు భ్రమరిగా అవతరించి భ్రమరాల సహాయంతో అరుణుడనే రాక్షసుడిని అంతమొందిం చింది. ఇలా విజయ దుర్గగా లోకమాతగా నిలిచారు.

నవరాత్రుల వ్రతం గురించి దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో వివరంగా ఉంది. దీక్షాకంకణ ధారులై తొమ్మిది రోజులూ కలశస్థాపన చేసి పొలి మేరలు దాటకుండా ఈ వ్రతం చేయాలి. నవ రాత్రు లను శాస్త్రోక్తం నిర్వహించాలనుకునేవారు పాడ్యమి నాడు కలశస్థాపనతో ఉపక్రమిస్తారు.ఆయా తిథులలో అమ్మవారి అవతారాలకు సంబంధించిన అష్టోత్తర, సహస్రనామాలు, పూజాద్రవ్యాలతో అర్చించి, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పిస్తారుగణపతి నవరాత్రుల మాదిరిగానే దేవీ నవరాత్రులను పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి చివరిరోజున నిమజ్జనం చేస్తారు.

శరన్నవరాత్రులలో అతి ముఖ్యమైనది సప్తమి తిథి, మూలా నక్షత్రం. జగన్మాతను సరస్వతీ అలం కారంలో అర్చిస్తారు. అమ్మవారిది మూలా నక్షత్రం కనుక ఆనాడు ఆదిశక్తిని విద్యల దేవత ‘సరస్వతీదేవి’గా అలంకరిస్తారు.. ‘దైవం మంత్రా ధీనం’అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు అధిదేవత, ఆరాధ్యదేవత సరస్వతీ మాత. మాఘ మాసంలో వసంత పంచమి నాడు చేసే సరస్వతీ పూజ దుర్గాదేవీ నవరాత్రులలోనూ ఒక రోజు చోటు చేసుకోవడం విశేషం. వ్యాసభగవానుడు ప్రతిష్ఠించి నట్లు చెప్పే బాసరలోని జ్ఞానసరస్వతి క్షేత్రంలో నవరాత్రులు నిర్వహిస్తారు. మూలానక్షత్రం సందర్భంగా పిల్లలతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. నవరాత్రుల సందర్భంగా కన్యకాపూజ, సుమంగళి, పూజ, మహాచండీయాగం మున్నగునవి నిర్వహిస్తారు. 2-10 సంవత్సరాల మధ్య వయస్సు గల వారితో చేయించే పూజను ‘కుమారీ/కన్యకా పూజ’ అంటారు.

ఈ నవరాత్రులు వచ్చే మహాలయ పక్షానికి ‘యుద్ధపక్షం’ అని మరోపేరు.అసురులతో యుద్ధంలో పరాజితులైన సురలు శరన్నవరాత్రులలో తమ ఇష్టదేవతలను అర్చించి దశమి నాడు విజయం సాధించారని పురాణకథనం.ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని నివేదిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని ఈ మాసమంతా ఆరగింపుగా సమర్పిస్తారు. రామాయణ కాలం వరకు దేవీనవరా త్రులను వసంత రుతువులో (చైత్రమాసం)లో నిర్వహించేవారట. రావణుడితో యద్ధం సమయంలో శ్రీరామచంద్రుడు ఆశ్వయుజ మాసంలో చండీ హోమం నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రు డయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరన్నవ రాత్రులుగా వ్యహరిస్తున్నారని ప్రతీతి. తొలినాళ్లలో ఆలయాలు, రాజప్రసాదాలకే పరిమితమైన నవరాత్రి వేడుకలు కాలక్రమంలో సామాన్యుల ఊరూరా జరుపుకోవడం మొదలు పెట్టారు. స్వాతంత్య్ర సముపార్జనకు దుర్గాపూజ ఎంతగానో ఉపకరించింది. ప్రజలను సంఘటితపరచి చైతన్యవంతం చేసేందుకు జాతీయ నాయకులు దుర్గాపూజను వేదికగా చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో అమ్మవారి విగ్రహాలు నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహించారు.

విదేశాలలోనూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను నేపాల్‌లో ‘దసైన్‌’‌గా పిలుచుకుంటారు.బాంగ్లాదేశ్‌ ‌రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి ఆలయంతో పాటు ఇతర ఆలయాలలోనూ, సింగపూర్‌, ‌మలేసియా, బ్రిటన్‌,అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ‌శ్రీలంకలో స్థిరపడిన భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. చైనాలోని భారతీయులు 2004లో షాంగైలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు. గుజరాత్‌లో నవరాత్రుల సందర్భంగా దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.


‌దేవదేవుడి  బ్రహోత్సవ శోభ

‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ అని పురాణవాక్కు. శ్రీ వేంకటేశ్వరుడు అర్చామూర్తియై స్వయంభువుగా వెలసిన వేంకటాద్రితో సమానమైన స్థానం ఈ బ్రహ్మాండంలోనే లేదని, వేంకటేశ్వరు నితో సమానమైన దైవం ఇప్పటి వరకు లేడు, ఇక ఉండబోడని బ్రహ్మాండ, ఆదిత్యాది పురాణాలు పేర్కొన్నాయి. వేంకటేశ్వరుడు ఆశ్వయుజంలో శ్రవణ నక్షత్రంలో ఆర్చామూర్తిగా ఆవిర్భవించి నందున అప్పటికి ముగిసేలా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అధికమాసం వస్తే భాద్రపదంలో (వార్షిక బ్రహ్మోత్సవం), ఆశ్వయుజంలో (నవరాత్రి బ్రహ్మోత్సవం) రెండుసార్లు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏటా 450కి పైగా రకాల ఉత్సవ కైంకర్యాలు నిర్వహిస్తున్నా, బ్రహ్మోత్సవం విశిష్టం, విలక్షణం, వైభవోపేతమైనది. జగత్కల్యాణ కోసం ఈ ఉత్సవాలు జరిపించాలని శ్రీనివాసుడు విధాతను ఆదేశించారట. ఆ ప్రకారం బ్రహ్మ దేవుడు శ్రీనివాసుడి జన్మనక్షత్రం శ్రవణం నాటికి ముగిసేలా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారట. లోకహితంతో పాటు భగవంతుని మూలబింబం (ధ్రువ బేరం)లోని శక్తి అభివృద్ధికి కూడా బ్రహ్మోత్సవం నిర్వహిస్తారట. దీనినే మహో త్సవం, తిరునాళ్లు, కల్యాణోత్సవం అంటారు.

బ్రహ్మోత్సవ సన్నద్ధతలో భాగంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమం (కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం) నిర్వహిస్తారు. ఉత్సవాలకు ముందు రోజు, శ్రీహరి సేనాధిపతి విష్వక్సేనుడి ఆధ్యర్యంలో మృత్సం గ్రహణం, అంకురారోర్ఫణ జరుగుతాయి. ధ్వజారోహణ సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని తిరుమలరాయ మండపంలోని వేదికపై వేంచేసి నివేదనలు, హారతులు అందుకుంటారు.

ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీవారి వాహనం ముందు విగ్రహం లేని బ్రహ్మరథం కదులుతుంది. దాని తరువాత వృషభాలు, అశ్వాలు,గజాలు స్వామి వారికి స్వాగతం పలుకుతూ మందగమనంతో సాగుతాయి.

ఎక్కడెక్కడో ఉన్నవారంతా బ్రహ్మోత్సవాలు చూసేందుకు వానలను కూడా లెక్క చేయక ఉరుకులు పెడతారు (నానా దిక్కుల నరులెల్లా వానలలో ననె వత్తురు గడలి’) అని పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనలో కీర్తించారు. కనువిందు చేసే వాహనోత్సవాల గురించి ‘తిరువీథుల మెరసే దేవదేవుడు… గరిమల మించిన సింగార ములతోడను…’ అనీ కీర్తించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో ఆళ్వారుల రాసిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని అఖండంగా గానం చేస్తారు. క్షేత్రవైశిష్ట్యం, అక్కడి అర్చామూర్తులు, వారికి జరుగుతున్న ఉత్సవ విశేషాలు, ప్రకృతి సంపదను వారు తమ కవిత్వం (పాశురాలు)లో పొందు పరిచారు. వీటికే ప్రబంధాలు అని పేరు.

ఈ ఉత్సవాలు ముగిసేంత వరకు సర్వాలంకరణ భూషితులైన స్వామివారు ఉభయ దేవేరులతో వివిధ వాహనాలపై నిత్యం రెండు పూటలూ ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఉత్సవాలు ముగిసేంత వరకు నిత్యం రెండు పూటలు వివిధ వాహనాలపై దర్శనమిస్తారు. వాహన సేవల దర్శనం ముక్తి ప్రదాయకమని, ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే’ (రథంపై గల పరమాత్మ దర్శనంతో పునర్జన్మ ఉండదు) అని పురాణ వచనం. ఒక్కొక్క వాహన సేవ వల్ల ఒక్కొక్క ఫలితం సిద్ధిస్తుందంటారు. శేష వాహనం (కుటుంబశ్రేయస్సు), హంస వాహనం (బ్రహ్మపద ప్రాప్తి), సింహ వాహనం (ధైర్యసిద్ధి), ముత్యపు పందిరి వాహనం (సకల సౌభాగ్యసిద్ధి) కల్పవృక్ష వాహనం (ఐహిక ఆముష్మిక ఫలప్రాప్తి), సర్వభూపాల వాహనం (యశోప్రాప్తి), మోహినీ అవతారం (మాయామోహనాశనం), గరుడ వాహనం (సర్వపాప ప్రాయశ్చిత్తం) హనుమంత వాహనం (భగద్బక్తి ప్రాప్తి), గజవాహనం (కర్మవిముక్తి), సూర్యవాహనం (ఆరోగ్యప్రాప్తి), చందప్రభ వాహ నం (మానసికశాంతి), రథోత్సవం (మనో వాంఛా ఫలసిద్ధి), అశ్వవాహనం (కలికల్మష నాశనం), చక్రస్నానం (సకల పాపవిమోచనం)కలుగుతాయని పురాణ వాక్కు.

 తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన వైభవం ఒక ఎత్తయితే, మహాప్రదక్షిణ మార్గంలో బారులుగా భక్తజనులు మైమరచి చేసే భజనాలు, నృత్యాలు, ధరించే వేషాలు, సంకీర్తలను, వేద పారాయణం, ఆధ్యాత్మిక ప్రసం గాలు.. ఇలా ఎన్నెన్నో పులకింపచేస్తాయి. ప్రతిపూట వాహన ఆనందోత్సాహా లను కలిగించినా, ఐదవనాటి రాత్రి శ్రీవారి గరుడసేవ అతి విశిష్టమైనది. మూలవిరాట్టే ఈ వాహనాన్ని ఆవహించి భక్తకోటిని అనుగ్రహిస్తారని ఐతిహ్యం.

 సుమారు వెయ్యేళ్లకు పూర్వం తిరుమల గిరులు అరణ్యంతో నిండి, ఎలాంటి వసతులు లేనందున శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేవి. ధ్వజారోహణ, ధ్వజావరోహణ మాత్రం తిరుమలలో చేసి, వాహన సేవలను తిరుచానూరులో నిర్వహించే వారని చరిత్ర. అయితే తిరుమల సందర్శించిన భగవద్రామానుజాచార్యులు బ్రహ్మోత్సవాలను తిరుమలలోనే నిర్వహించాలని విధివిధానలు కట్టుదిట్టం చేశారు. అప్పట్లో నెలనెల…ఏడాదికి పన్నెండుసార్లు ఈ ఉత్సవాలు జరిగేవి.

‘వేదములే శిలలై వెలసిన దీ కొండ

యేదెన బుణ్యరాసులే యేరులైనది కొండ

గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ

శ్రీదేవుడుండేడి శేషాద్రి యీ కొండ’

అని తిరుమల క్షేత్ర ప్రాశస్థ్యాన్ని అన్నమయ్య ఆవిష్క రించాడు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE