‘‘అన్నం న నింద్యాత్‌! అన్నం న పరిచక్షీత’’ తైత్తరీయోపనిషత్‌ ‌లోని ఈ శ్లోక పాదాల భావం- అన్నాన్ని ఎప్పుడు నిందించ కూడదు, అవమానించ కూడదు. నిరసన భావంతో నిరాకరించకూడదు. మన పెద్దల దృష్టిలో నోట్లోకి వెళ్లే ప్రతి ఆహార పదార్ధం అన్నమే. ఇక్కడ నిందించకూడదంటే పారవేయకూడదు. ‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌’, అం‌టే సృష్టి అంతటికి మూలాధారమైనది అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి తీర్చి శక్తినిచ్చే ఆ అన్నమే దైవమని భావం.

వ్యవసాయం చేసి అన్నాన్ని పండించగలం. దానికి వర్షం అవసరం. వ్యవసాయం అతి ప్రాచీన మైన వృత్తి. మిగిలిన వృత్తులన్నింటికి మూలమైనది. లోకాను భూతమైన వ్యవసాయ వృత్తి ప్రాధాన్యాన్ని వేరే చెప్పాలా? ‘ధాన్యలక్ష్మితో ధనలక్ష్మి ఓపదు’ అన్న సామెత ఇక్కడ సేద్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని పట్టిస్తున్నది.‘తల్లి పెంచంగవలయు, ధరణి పెంచంగ వలయు/ తల్లి యిచ్చిన పాలకన్న ధరణి యిచ్చిన పాలు మిన్న’ వంటి సూక్తులు కూడా ‘కృషి’ ఎంత ముఖ్యమైనదిగా చెబుతాయి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకమ్‌’ అన్న సంస్కృత లోకోక్తి అర్ధం కూడా ఇదే. రెట్టడి మతశాస్త్రం చదివిన తరువాత ఇలాంటి అభిప్రాయాలే ముందు గుండెను తాకుతాయి.

అయ్యాలాఖ్య, భాస్కరరాఖ్య కవిద్వయం రెట్ట మతశాస్త్రాన్ని పరిష్కరించింది. మద్రాసులో ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో, శిథిలావస్థలో దీని వ్రాతప్రతులు లభించాయి. వీటిని 1921లో పమ్మి త్యాగరాయ శ్రేష్టి మొదట అచ్చు వేయించారు. ఇది తాత్పర్య సహితంగా కావాలని చాలామంది పాఠకులు కోరారు. కానీ అది కన్నడ ప్రతి. ఆ కవిద్వయం దీనిని తెలుగు పద్యకావ్యంగా రచించారు. పురాణం సూర్యనారాయణ తీర్ధులు మూలప్రతిలోని తప్పులను సవరించారు. కృతిపతి కోసం ప్రయత్నించగా వేంకటపతిరాజు లభించారు.

గాఢ సుజ్ఞాన ‘‘రెట్ట’’ ఘనుడు మున్ను

చెలిగి కన్నడ భాషను జెప్పినట్టి

శాస్త్రమంతయు నేను సజ్జనులు వొగడ

దెనుగు బాస నొనర్పంగ దివురునపుడు

రెట్టడు అనే జ్ఞానసంపన్నుడైన పండితుడు పూర్వం కన్నడ భాషలో రాసి పెట్టిన శాస్త్రాన్నే అభిరుచి కలిగిన వారంతా ప్రశంసించే విధంగా తాను తెలుగు భాషలో రాయడానికి ఉపక్రమిస్తున్నట్టు సూర్య నారాయణ తీర్థులు చెప్పుకున్నారు. ఈ గ్రంథం జ్యోతిష్య, వ్యవసాయ ప్రకృతి, శకున శాస్త్రాల పరిజ్ఞానాన్ని అందిస్తుంది. భారతావనే వ్యసాయ సంస్కృతి కలిగిన దేశం. వ్యవసాయం గురించి ఇక్కడ ఎంతో జ్ఞానం పరిఢవిల్లింది. కొన్ని అద్భుత గ్రంథాలు వెలువడినాయి. వాటిలో ఒకటి రెట్టడి శాస్త్రం. ఇందులో ఆయన వర్షం రావడానికి ముందు ప్రకృతిలో వచ్చే మార్పులను అద్భుతంగా నమోదు చేశాడు. మేఘాల ఆకృతి, రంగులను బట్టి అవి ఇచ్చే వానను అంచనా వేయవచ్చునంటాడు. విత్త డానికి ఎలాంటి సమయం మంచిదో సూచించాడు. ఇవన్నీ ప్రకృతితో మమేకమై ఉన్నవే.

ప్రకృతి సమతూకం దెబ్బతినకుండా తెలుగు రైతులు సాగు చేశారు. ఆ అనుభవ జ్ఞానసారమే వ్యవసాయ విజ్ఞానంగా ఆవిష్కుృతమైంది. మరొక వంక జీవితానికీ, సేద్యానికీ ఉన్న బంధం వలెనే భాషకూ సామెతకీ ఉన్న బంధం వల్ల సామెతలూ నానుడుల రూపంలో కూడా ఆ అనుభవానికి కావ్య గౌరవం కల్పించారు. జ్యోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు రూపొంది స్తారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తులు. తెలుగువారు చంద్రమానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌరమానాన్ని పాటిస్తున్నారు. తెలుగు కర్షకులు ఆయా కార్తెల నెలలు రాశుల వారీగా పైరుదీ, వాతావరణానిదీ ఎలాంటి బంధమో సామెతల రూపంలో చెప్పుకున్నారు. ఇలా: ‘అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం’. ‘భరణి కురిస్తే ధరణి పండుతుంది’. ‘కృత్తిక పునర్వసులు సత్తువ పంట’. ‘రోహిణిలో (ఎండకి) రోళ్లు పగులు తాయి’. ‘మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది’. ‘ఆరుద్ర వాన ఆదాయాల బాన’. ‘ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం’. ‘పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే’. ‘ఉత్తర చూసి ఎత్తరగంప- విశాఖ చూసి విడవరా కొంప’. ‘హస్తలో చల్లితే హస్తంలోకి రావు’. ‘చిత్త కురిస్తే చింతకాయలు కాస్తాయి’. ‘స్వాతి వానకు సముద్రాలు నిండుతాయి’.

ఐదు ఆశ్వాసాల ఈ శాస్తగ్రంథంలో విషయాల గురించి అసలు రచయిత రెట్టడు చెప్పాడు. దీనిని ఆయన ప్రబంధంగా చెప్పుకున్నాడు. పళ్లూ పూలూ ఇచ్చే చెట్లకు జన్మనిచ్చే వర్షం లక్షణాలు, మేఘగర్జనల వివరాలు, ఇంధ్రధనుస్సు మర్మం, సూర్యతాపం, గాలి లక్షణాలు, గ్రహచారం, ఉషోదయం, ఆస్తమయం, సంవత్సరాది ఫలాలు తన గ్రంథంలో ఇచ్చినట్టు చెప్పుకున్నాడాయన. వర్షపాతం గురించి రాస్తూ, మోదుగకాయలో మూడు గింజలుంటే ఆర్ద్ర కార్తె మొదలుకొని అనగా ఆరుద్ర, పునర్వసు పుష్యమి, అశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాడ అనే కార్తెలలో చక్కని వర్షం పడుతుందని చెప్పాడాయన. మరొకచోట, హెచ్చుగా మంచుకురిసినా, చింత, మామిడి, నేరేడు బాగా పూసినా, కాసినా, క్రిమికీటకా దులు అభివృద్ధి అయినా, నెమలి పురివిప్పి ఆడినా వర్ష సూచనగా భావించవచ్చునన్నాడు.

గోశకునం, అంటే గోవు ద్వారా వెల్లడయ్యే సూచననను బట్టి వర్షం రాకను పసిగట్టవచ్చునంటాడు రెట్టడు. ఆవులమందకు పూజ చేసిన తరువాత ఆ మంద నుండి ఎర్రని కాంతి గలది గానీ, కుంటిది, గుడ్డిది, బక్కచిక్కినది గాని, నడువలేని ఎద్దుగాని, మనో దుఃఖంచేత మంద నుంచి బయటకు వస్తే ఆ ప్రాంత ప్రజలు రోగాలతో చనిపోతారని తేల్చాడు రెట్టడు. ఇంకా, వానలు కురియవు, ఆ దేశ పాలకుడికి హాని జరుగుతుందని చెప్పాడు. రూపురేఖలను బట్టి, ఇతర లక్షణాలను బట్టి మేఘాలన• కూడా కులాల పేర్లతో వర్ణించాడాయన. వర్షపాతాన్ని ద్రోణం అనే ప్రమాణంతో చెప్పాడు. తీవ్రంగా ఎండలు కాయడం, నేల పగలడం, సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడడం, బండి నడిచినట్లు గర్జించడం, విస్తారంగా ఉరుములు, మంచు, గాలి వీచటం, ఉక్క పెట్టటం, చిన్న చిన్న చినుకులు, చలి ఈ పది వర్షధాతువులు. చాలా వేడిమి, చంద్రుడి చుట్టూ వలయం, మేఘాలు గర్జించడం వంటి అయిదు పంచధాతువులు. ఈ ధాతువులు సరిగా ఉంటే వాన సకాలంలో పడు తుంది. సస్యములు ఫలిస్తాయి అంటాడు రెట్టడు. ఛాయాదేవి కుమారుడు శని మేషంలో సంచరిస్తే, వృషభంలో గురుడుంటే ధనుర్మాసం మొదలు మాఘ మాస పర్యంతం స్వాతి మూలానురాధలలో, మకరి మత్స్యకర్కట రాశిలోను విత్తితే జొన్న విశేషంగా ఫలిస్తుందని సూచించాడు రెట్టడు.

ఇళ్ల మీదకెక్కి, నదులు, చెరువుల మధ్యన నిలబడి కుక్కలు మొరిగినా, నక్కలు పశువులను తరుముకొచ్చి కరిచినా, పిచ్చుకలు మొదలైన పక్షులు పచ్చికల మీద విచ్చల విడిగా మేసినా, పొడిమట్టిలో జంట గూడి పొరలినా, చిలకల వంటివి సుఖప్రదమైన తమ తమ గూళ్లు విడిచి ఆకాశంలోకి వెళ్లినా, అలాగే కాకులు కూడా ఆకాశానికి ఎగసినా, రెక్కలార్చినా, పిల్లులు తల నేలకు ఆన్చి బుస్సు బుస్సుమన్నా, నల్లని ఈగలు మోతతో గుంపులుగా నీటిపై మూగినా, నేల మీద అడుసు బుసబుస పొంగినా కూడా వర్షసూచనగానే భావించాడు రెట్టడు.

ఈ లక్షణాలు కనిపించినా కూడా వర్షం వస్తుందని భావించవచ్చునని ఆయన అన్నాడు.నీళ్లలో నుంచి చేపలు ఎగిరి పడడం,అలా పడిన జలచరాలు చని పోవడం, పెద్ద జంతువులు తలలు దించి అరిచినా, శరీరం దులపరించినా కూడా వర్షం రావచ్చునని అంటాడు.

మేఘాలు ఎలా ఉంటే వర్షాలు వస్తాయి? మెరుపులు, తళుక్కు తళుక్కుమని మెరుస్తూ ఉంటే ఆకాశంలో గట్టిగా కమ్మి ఉన్న తెల్లని మేఘం భూమి కరిగిపోయేటట్టు కురుస్తుందట. నీలం వలె వెలుగు లీనుతూ ఉండే మేఘం లోప మెరపులు రాగి రంగుగాను, మంకెన పువ్వు చందంగా ప్రకాశించి నట్లయితే వాటిని రాజ మేఘాలని అంటారు. అవి గంగానది, వింధ్య పర్వతాలలో విస్తారంగా వర్షిస్తాయి. మేఘాలలో నిప్పుల వంటి కాంతి గల గొప్ప మెరుపులు మెరిసిన పక్షంలో, వింధ్యకు గోదావరి నదికి మధ్య మిక్కిలి సంవృద్ధ్దిగా వానలు కురుస్తాయి.

కొన్ని రంగులను బట్టి వాటిని కులాల పేరు మీదుగా రెట్టడు పిలిచాడు. ఆకృతిని బట్టి కూడా అవి ఇచ్చే వర్షం ఆధారపడి ఉందంటాడు. వింజా మరల మాదిరిగా, కొలనుల వలె, చెరువుల వలె, మొసళ్ల వలె, వెండికొండల రూపంలో, సింహ రూపంలో, గోపురాల ఆకృతిలో, శృంగారవనాల రూపంలో, దేవతల విమానాల వలె, ఎడ్లను తలపించే, గొడుగును గుర్తు చేసే, కత్తుల వలె, ఏనుగుల వలె, శంఖంలా ప్రకాశించే మేఘాలు చక్కగా వర్షిస్తాయి. అలా కాక; కాకి, కోతి, కాటుక కొండ, చెవులపిల్లి, మోడువారిన వృక్షం, శూలం, పాడుబడిన ఇల్లు వంటి వాటిని మరిపించే మేఘాలు కొంచెంగానే కురుస్తాయని పెద్దలు చెబుతారు.

గోరోజనం (ఆవు కడుపులో నుంచి వస్తుంది) వలె, ఆరుద్ర పురుగు వలె, నరకగా వచ్చిన రక్తంలా మేఘం ప్రకాశిస్తే వాన కురియదని రెట్టడు చెబుతున్నాడు. సూర్యుడు తూర్పున నుండగా పడమర దిక్కున మెరుపులు మెరసినా, బంగారు రంగు మేఘాలు కనపడినా సమృద్ధిగా వాన కురుస్తుంది. పెద్ద మర్రిచెట్టుపై బంగారు రంగు మేఘం కనిపించినా సంవృద్ధిగా వర్షం ఇస్తుంది. రోహిణి నక్షత్రంలో పదిద్రోణములు వాన కురిస్తే చెరుకు తోటలు ఏపుగా పెరుగుతాయి. ఆరుద్రలో వాన కురిస్తే కూరగాయలు సమృద్ధిగా పండుతాయి. మెరుపులు పొగవలె, బూడిద రంగులోనూ కనపడితే వానలు ఆలస్యమవుతాయి. ఇంద్రధనుస్సు పసుపు వన్నె గలది కనిపిస్తే ప్రజలకు బాధలు తప్పవు. అది తెల్లటి వర్ణంలో కనిపిస్తే అన్ని ప్రాంతాలకు చేటు కలుగుతుంది. దుక్కి దున్నడానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో నాగళ్లు ఉంటాయి. నేలను బట్టి వాటి ఆకృతి ఉంటుంది. ఆ దున్నడు యంత్రానికి, పొలమున్న నేలకి గంధం, అక్షితలు, ధూపం వేసి, నైవేద్యం పెట్టి ఆపై జొన్నలు మొదలైన విత్తనాలు చల్లితే మంచి ఫలితాలు కలుగుతాయం టాడు రెట్టడు. విత్తనాలు చల్లేందుకు వెళ్లే సమయంలో కొన్ని ధ్వనులు, కొన్ని పక్షుల కూతలు వినిపిస్తే మంచి దంటాడాయన. పైడికంటి పక్షి కూసిన సమయంలో పెసలు చల్లితే, బ్రాహ్మణులు సంతోషంగా చేస్తున్న వేద పఠనం వినిపించిన సమయంలో వేసిన విత్తనాలతో పైరు హెచ్చుగా, చక్కగా పండుతుంద న్నాడు రెట్టడు. ధాన్యం హెచ్చుగా పండుతుంది. కాబట్టి సేద్యగాడు సంతోషంగా ఉంటాడంటాడు.

కొన్ని వస్తువులను కొన్ని సమయాలలో నిలవ చేస్తే లాభం విశేషంగా ఉందని చెప్పాడు రెట్టడు. అందులో ఆషాఢ బహుళ అమావాస్య ఒకటి. ఆనాడు నేయి, తేనె, నూనె, మంచి గంధం నిలువ చేస్తే, రెండు నెలల నాటికి రెండు రెట్లు లాభం వస్తుందని చెప్పాడు. అలాగే మదపుటేనుగులు, గుర్రాలు, బంగారం, వెండి, మరకతములు, రత్నాలు కొన్నట్టయితే రెండు నెలల నాటికి రెండింతలు లాభం కలుగుతుందని సూచించాడు.

శుక్రుడు నల్లనివాడైతే యుద్ధాలు అధికమవుతా యన్నాడు. ఆయనే ఎర్రని రంగు గలవాడైతే ఆయు ధాల వలన బాధలు కలుగుతాయి. ఆ శుక్రుడే ఆకుపచ్చ రంగ గలవాడైతే దొంగల వలన బాధలు కలుగుతాయి. బూడిద రంగు గల వాడైతే మనిషికి దేహ సంబంధ బాధలు తప్పవు. అదే తెల్లనికాంతితో ఉంటే భూమి అంతా సుభిక్షంగా ఉంటుంది.

గురుడు వృషభరాశిలో ఉంటే పాపాలు సంభవిస్తాయి. శిశువులకు, ఆవులకు మిక్కిలి చేటు జరుగుతుంది. మనుషులు రోగాల పాలవుతారు. పంటలు లేక బాధలు కలుతాయని రెట్టడు అన్నాడు.

మూలం:

  1. రెట్ట మతశాస్త్రము : అయ్యలు, భాస్కరుడు, పురాణం సూర్యనారాయణ తీర్ధ (సంకలనం) పేజీ-5, 13
  2. వ్యవసాయ సామెతలు : నేదునూరి గంగాధరం.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE