ఇటీవల తెలంగాణలో ఒక తుపాను కొద్దిపాటి కలవరం రేపింది. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంతో బయలుదేరారు. కొందరు యువకులు, యూనివర్సిటీ విద్యార్థులు దీనిని అందుకున్నారు. తెలిసో తెలియకో కొందరు సాహితీవేత్తలు కూడా తొందరపడి దీనికి వత్తాసు పలికారు. వాస్తవానికి ఈ అంశం మీద తెలంగాణ సమాజంలో ఏకాభిప్రాయం లేనేలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రెండు వర్గాల ఘర్షణగా చిత్రించడానికి జరిగిన ప్రయత్నం ఒక తాటాకు మంటలా ఎగసి వెంటనే చల్లారిపోయింది. ఇక్కడే దీని బలహీనత బయటపడింది. కానీ ఒక వర్గం సామాజిక మాధ్యమాలు యథాప్రకారం తెలంగాణలో ‘నానాటికీ విస్తరిస్తున్న మరో ఉద్యమం’ అంటూ కథనాలు ఇచ్చేశాయి.
హైదరాబాద్‌లో మార్వాడీలకు చెందిన ఒక దుకాణం ఎదుట ఒక వ్యక్తి కారు పార్కింగ్ చేయడం దగ్గర మొదలయిన ఈ వివాదం నిజంగానే కొన్ని రోజుల పాటు కలవరం రేపింది. కొందరి అభిప్రాయం ప్రకారం మార్వాడీల దుకాణం దగ్గర జరిగిన రగడలో దెబ్బలు తిన్న వ్యక్తి దళితుడు కావడంతో వివాదం తీవ్రంగా కనిపించింది. ప్రచారం కూడా ఎక్కువగా వచ్చింది. కానీ మార్వా డీలకీ, ఎస్‌సీలకీ మధ్య ఘర్షణ చరిత్ర ఏమీ లేదు. ఇది గతంలో తెలంగాణ నుంచి ఇచ్చిన గోబ్యాక్ నినాదం వంటిది కూడా కాదు. కాలేదు కూడా. దీనిని మొదలుపెట్టిన వ్యక్తి అసలు తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి కాదన్న దానితోనే వేడి కాస్త చల్లారింది. అలాగే ఒక ప్రాంతం నుంచి ఒక వర్గాన్ని వెళ్లిపోవలసిందని ఆదేశించడం, లేదా అందుకు దారి తీసే పరిస్థితులు కల్పించాలని చూడడం రాజ్యాంగ విరుద్ధం. అది కూడా ఈ పిలుపునకు ఊపురాక పోవడానికి కారణం కావచ్చు.
మార్వాడీలు దళితుడి మీద దాడికి దిగిన తరువాత గోబ్యాక్ నినాదం వచ్చింది. మార్వాడీలను వెళ్లి పోవలసిందేనంటూ వీధులకెక్కిన వారికి వెంటనే కొన్ని ప్రశ్నలు సిద్ధమయినాయి. తెలంగాణ నుంచి రొహింగ్యాలను మీరు ఎందుకు పొమ్మనడం లేదు? పైగా వాళ్లు విదేశీయులు. సమస్యలు సృష్టిస్తున్నవారు. అలాగే మైనారిటీల చేతిలో దళితులు హత్యకు, దాడులకు గురి కావడం గతంలో జరిగాయి. ముస్లింలు వెళ్లిపోవాలని అనే ధైర్యం మీకు ఎందుకు లోపించిందన్నది మరొక ప్రశ్న. వికారాబాద్ కేంద్రంగా జరిగిన ఉదంతాలు నిజంగానే బాధ కలిగిస్తాయి. ఒక ముస్లిం యువతిని ప్రేమించినందుకు ఆ వర్గం ఒక దళిత యువకుడిని చంపింది. ముస్లింలు వెళ్లిపోవాలని అన్న నినాదం కాదు కదా, కనీసం బాధితుడి తరఫున ఒక ఖండన ఇచ్చే నాయకులు కూడా ఆ రోజు ఎందుకు కరవయ్యారన్న ప్రశ్న నిజంగా తీవ్రమైనదే. ఆలోచింప చేసేదే కూడా. వికారాబాద్‌లోనే మరొక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడి నాయీ బ్రాహ్మణులు, విదేశీ ముస్లింల మధ్య వివాదమిది. బార్బర్ దుకాణాల ఏర్పాటు దగ్గర గొడవ వచ్చింది. మా ఉపాధిని వారు దోచుకుంటున్నారని నాయీ బ్రాహ్మణుల ఆరోపణ. ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడిన ఈ వర్గం నాయకునిపై ముస్లింలు దాడికి దిగారు. ఆయన తరఫున కూడా ఆరోజు బీసీ నాయకులు, ఎస్‌సీ నాయకులు కూడా నోరెత్త లేదు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలన్న ప్రశ్న సహజంగానే వినిపించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఒక దళిత యువకుడు అంబులెన్స్ నడుపుతాడు. అతని మీద దాడి జరిగింది. ఎందుకు? అతడు పేద వర్గాలకు ఉచిత సేవలు అందించాడు. ఇదే అతడు చేసిన తప్పిదం. అందువల్ల తమ ఉపాధికి భంగం వాటిల్లిందని మైనారిటీలు అతడి మీద దాడికి దిగారు. దీనిని కూడా ఖండించేవారు లేకపోయారు.
భారతీయ సమాజాన్ని చీల్చడానికి ఒక నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉంది. ద్రవిడ రాజకీయ సంస్కృతికి అలవాటు పడిన వ్యక్తి ఈ నినాదం ఇచ్చాడంటేనే చాలామందికి ఆ అనుమానం వచ్చింది. ఇక అర్బన్ నక్సల్స్ ఇలాంటి వాటిలో ఆజ్యం పోయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఉదాహరణకి హరగోపాల్. ఈయన ఏనాడో తన విశ్వసనీయతను కోల్పోయారు. ఈ మాట అనడానికి పెద్ద సంకోచం ఏమీ అక్కర్లేదు. అశాంతిని తగ్గించడానికి వాతా వరణం మార్చేవాడు సమాజహితుడు. పెట్రోల్ పోసి మరింత మంట పెట్టేవాడు ఇవాళ్టి లెఫ్ట్ మేధావి.
మనమూ వలస పోతున్నాం, వాడూ వలస వస్తున్నాడు. కడుపు కోసం. అంతేతప్ప, వనరుల దోపిడీ కోసం కాదు, అధికారం కోసం కాదు వాడి మీద ద్వేషం పెంచడం ఏమిటి? హరగోపాల్‌కు సూటిగా ఓ ప్రశ్న. మార్వాడీల నోట్ల కోసం కక్కుర్తి పడుతున్నవాళ్లెవరు? ప్రజల వోట్లను పణంగా పెడుతున్నది ఎవరు? మార్వాడీలు ఇప్పుడే కాదు, ఏనాటి నుంచో ఈ గడ్డకు తమ కడుపు నింపుకోవడం కోసం వస్తున్నారు. ఒక నిజాన్ని అంగీకరిద్దాం. స్థానిక వ్యాపారుల పొట్టగొట్టేలా వారు విస్తరిస్తుంటే వ్యతిరేకిద్దాం. సర్దుబాట్లు చేద్దాం. ఆమనగల్లులో జరిగింది అదే.
కొన్నేళ్ల క్రితం ఓ ఒప్పందం కుదిరిందక్కడ. మా పొట్టగొట్టేలా మీ దుకాణాలను విస్తరించొద్దు అని వర్తకసంఘాలు అడిగాయి. వాళ్లు అంగీకరించారు. కానీ ఉల్లంఘించారు. అదీ తాజా మార్వాడీ గోబ్యాక్ నినాదం వెనుక అసలు కారణం.
ఇంకేముంది? ఎవరెవరో రంగప్రవేశం చేశారు. ఉసిగొల్పారు. అశాంతిని సృష్టించడానికి మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రయత్నాలు చేశారు. బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ చెబుతున్నట్టు వాళ్లు రొహింగ్యాలు కాదు. బాంగ్లా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు కాదు. అశాంతి, అలజడులు రేపేవాళ్లు అసలే కాదు. అది వాళ్ల నైజం కూడా కాదు.
ఈరోజు ఏ కులవృత్తి చూసినా ఆ కులేతరులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఆమనగల్లు వర్తకసమాజం ఓ ఒప్పందం కుదుర్చుకుంది, సరైన దిశ. కానీ మార్వాడీలు ఉల్లంఘించారు, అది తప్పు, తప్పున్నర. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినవాడు మన పొట్ట కొడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? ఆగ్రహం సహజం. ఇదుగో ఇక్కడే మార్వాడీ సమాజం (రాజస్థాన్, గుజరాత్ ఏ రాష్ట్రమైనా సరే) తన తప్పు తెలుసు కోవాలి. స్థానిక వ్యాపారులు, స్వర్ణకారులతో కలిసి బతకాలనే సోయి అవసరం. అసలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు వచ్చాక సగటు గ్రామీణ వర్తకుడే కాదు, పట్టణాల్లోని వర్తకుడే కిందా మీదా పడుతున్నాడు.
తన కడుపు నింపుకోవడానికే కష్టమవుతోంది. ఈ స్థితిలో మార్వాడీలు కూడా పొట్టగొడితే అది అన్యాయం, దుర్మార్గమే. జీఎస్టీ ఎగవేస్తారు, నాసిరకం అంటగడతారు అనే ప్రచారాల్ని పట్టించుకోకపోతే మార్వాడీలు అధికారం కోసమో, పెత్తనాల కోసమో అంగలార్చడం లేదు.
మేమిక్కడికి బతకడం కోసం వచ్చాం అనే సోయిని కలిగి ఉంటే పర్లేదు. భిన్నంగా వెళ్తే ఇదుగో ఇలాగే మంటలు పెట్టేవాళ్లు ఉంటారు. ఆమనగల్లులో ఏం జరిగింది? బంద్ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది.
ఈ ఆమనగల్లు బంద్ తెలంగాణ వ్యాప్తంగా అవాంఛనీయ పరిస్థితులు తెస్తుందనే భావనతో ప్రభుత్వం పోలీసులను పంపించింది. కానీ సయోధ్య కుదిరింది, బంద్ లేదు. అంతా ప్రశాంతం. మంటలు పెచ్చరిల్లాలని చూసిన అసాంఘిక శక్తులకు చుక్కెదురు.
ఇక్కడ ప్రధానంగా వైశ్య సంఘాలు (వర్తక సంఘాల్లో ఎక్కువ వాళ్లే కాబట్టి) సంయమనం పాటించాలి. అసాంఘిక శక్తులకు ఊతమిచ్చేలా వ్యవహరించ కూడదు. ఈరోజు మార్వాడీ గోబ్యాక్ అని మీరంటే, రేప్పొద్దున మీరు ప్రోత్సహించే శక్తులే కోమటీ గోబ్యాక్ అనే ప్రమాదమూ ఉంటుంది. బహుపరాక్. కొద్దికాలం క్రితమే‘ కోమటోళ్లు దొంగలు’ అంటూ పచ్చిగా వాగిన ఒక ప్రొఫెసర్ గురించి గుర్తు చేసుకోండి. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు పొంచి ఉంటాయి. ఇది భారతీయ సమాజానికి శాశ్వత ప్రమాదమే కూడా.
ఇప్పడు భారతదేశంలో సంక్షోభం సృష్టించడానికి అనేక మార్గాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. గుజరాతీ గులాములు అంటూ ఒక పార్టీ నాయకులను విమర్శించడం అందులో భాగమే. కాబట్టి ఇలాంటి ఘర్షణల వెనుక పెద్ద కుట్రలే ఉన్నాయి. ఇది పరోక్షంగా నరేంద్ర మోదీపై దాడి కూడా. రాజ్యాం గాన్ని రక్షిస్తున్నామంటూనే ఇలాంటి చర్యలు దిగుతున్న వర్గాలు ఉన్నాయి. క్రైస్తవం కూడా ఇందుకు దోహదం చేస్తున్నది. ఇవన్నీ చేదు వాస్తవాలు. తెలంగాణ సోదరులు కూడా పొరుగు రాష్ట్రాలలో జీవిస్తున్నారు. ఆంధప్రదేశ్ వారు కూడా అంతే. బిహారీలు ఇక్కడ విరివిగా కనిపిస్తున్నారు. ఈ వాస్తవాలు ఇలా ఉండగా ఒక ప్రాంతం వారు వేరే ప్రాంతం నుంచి వచ్చి బతుకుతున్న వారిని గోబ్యాక్ అని వెంటాడడం దేశానికి ప్రమాదం. పైగా ఇలాంటి ఉద్యమాలు ఏవీ నిలబడలేదు. నాయకులు బాగుపడ్డారు. అంతవరకే. ఇప్పుడూ అదే జరుగుతుంది. భారతీయ ఓటర్ల జాబితాల నుంచి రొహింగ్యాలను, బాంగ్లా దేశీయులను, పాకిస్తానీలను ఏరివేస్తున్న తరుణంలో ఇలాంటి ఒక అలజడి దక్షిణ భారతంలో రావడం కూడా ప్రశ్నలు రేకెత్తించేదే. మార్వాడీలు గుజరాత్, రాజస్తాన్‌లకు వెళ్లాలని ఇక్కడ స్వయం ప్రకటిత ఉద్యమకారులు నినాదం. అందులో ఉత్తర భారతం, దక్షిణ భారతం వంటి ఆత్మహత్యా సదృశమైన జాడ కూడా ఉంది. కాబట్టి దీనిని సాధారణ అంశంగా చూడవద్దు.
సమాజాన్ని చీల్చే కుట్రలు ఇవన్నీ. ఇప్పటిదాకా ఉన్న గొడవలు చాలవని, ఇంకా ఇంకా చాలామంది కొత్త సమస్యలు, పరిస్థితులు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బహుపరాక్..!! ఈ మార్వాడీ అంశాన్ని తెలంగాణ సొసైటీలో మరింత అశాంతి రేపడానికి ప్రయత్నించిన రాజకీయ, అసాంఘిక శక్తులకు తాత్కా లిక సెట్‌బ్యాక్. కానీ అవి ఊరుకోవు!! జాగరూకతతో ఉండాల్సింది తెలంగాణ సమాజమే..!!
– జాగృతి డెస్క్