ప్రధానమంత్రి సహా మంత్రులు ఎవరికైనా ఐదేళ్లకు మించి శిక్షపడే కేసులో 30 రోజులు జైల్లో ఉండాల్సివస్తే వారు పదవి కోల్పోయే విధంగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావా ల్సిన అవసరమేంటన్న ప్రశ్న సహజం. కానీ ఇటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఎప్పుడు ప్రయత్నించినా ఇదే ప్రశ్నను సంధించే వారు కచ్చితంగా ఉండితీరతారు. ఏ ప్రభుత్వ మైనా ఒక చట్టం తీసుకురావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు లేదా ఇందుకు ప్రేరణ కల్పించే కొన్ని పరిస్థితులు నెలకొనడం సహజం. ఏ ప్రభుత్వం ఎటువంటి చట్టాన్ని అమల్లోకి తెచ్చినా అది అందరికీ వర్తిస్తుందనేది నిష్టుర సత్యం. చట్టాన్ని అమల్లోకి తెచ్చిన పార్టీ రేపు విపక్షంలో కూర్చోవచ్చు. అందువల్ల ఈ చట్టం రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎల్లకాలం పదవిలో కొనసాగడం సాధ్యంకాదు. ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, అధికారంలో ఉన్న ఎన్డీఏ ఈ చట్టాన్ని కేవలం ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి మాత్రమే ఒక అస్త్రంగా ఉపయోగిస్తుందని విపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలో ఉండి ఇదే చట్టాన్ని అమల్లోకి తేవడానికి యత్నించినప్పుడు ఎన్డీఏ కూటమి వ్యతిరేకించకుండా ఉండడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టం వల్ల ఒనగూడే లాభనష్టాలను బేరీజు వేసుకోవడం అవసరం.
కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు`2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు`2025, జమ్ము`కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు`2025 అనే మూడు బిల్లులను ఆగస్టు 20న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మిగిలిన రెండు బిల్లులతో పోలిస్తే 130వ రాజ్యాంగ సవరణగా పేర్కొంటున్న ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం అంత సులభం కాదు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 75, 164 అధికరణాలను సవరించాల్సి ఉండటంతో పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3వంతు మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. అంటే ఓటింగ్ రోజు కనీసం 50 శాతం మంది సభ్యుల హాజరు తప్పనిసరి. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి. జమ్ము కశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులు సాధారణ సవరణకు సంబంధించినవి కాబట్టి ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు సభల్లో 2/3 వంతు మెజారిటీ లేదు. అందువల్ల 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే విపక్షాలకు చెందిన చాలామంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన కుండాఉండాలి. ఎన్డీఏ భాగస్వాములైన తెలుగు దేశం, జనతాదళ్ (యునైటెడ్) వంటి చిన్న పార్టీలు ఈ సవరణ బిల్లును వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం పొందినా సుప్రీంకోర్టు రూపొందించిన ‘‘ప్రాథమిక సూత్ర సిద్ధాంతానికి’’ ఈ బిల్లులు విరుద్ధమని కొందరు లాయర్లు చెబుతున్న మాట. పార్లమెంట్ ఆధిపత్యం నుంచి సమాఖ్య వ్యవస్థ, అధికార విభజన సూత్రాన్ని సుప్రీంకోర్టు సిద్ధాంతం పరిరక్షిస్తోంది. ఒకవేళ బీజేపీ తాను నిబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పుకున్నా, మరే ఇతర పార్టీనో అధికారంలోకి వస్తే, అప్పుడు పరిస్థితేంటనేది ప్రశ్నార్థకమే.
రాజ్యాంగ సవరణకే ‘‘జైలు బిల్లు’’
130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధానంగా రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణా లను సవరించడానికి ఉద్దేశించింది. దీని ప్రకారం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్టయిన ప్రధానమంత్రి సహా ఎవరైనా మంత్రులు 30 రోజులు జైల్లో ఉన్నట్లయితే వారు తమ పదవు లను కోల్పోతారు. ఇక్కడ పదవులు కోల్పోవడానికి నేరం రుజువు కావాల్సిన అవసరం లేదు. కేవలం ఆరోపణ సరిపోతుంది. బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు తమ పదవులను తిరిగి పొందవచ్చు. 75వ అధికరణం ప్రకారం ఐదేళ్లు శిక్షపడే కేసులో ఒక కేంద్రమంత్రి అరెస్టయి 30 రోజులపాటు జైల్లో ఉన్నట్లయితే ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి ఆయన్ను పదవి నుంచి తొలగించవచ్చు. ఇక 31వ రోజు కూడా జైల్లో ఉన్నట్లయితే ఇక ప్రధానమంత్రి సలహా అవసరం లేకుండానే సదరు మంత్రి పదవిని కోల్పోతారు. పోలీసు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ఆయన తిరిగి మంత్రిపదవిలో చేరవచ్చు. 164వ అధికరణం ప్రకారం ఇవే నిబంధనలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులకు వర్తిస్తాయి. ఇక్కడ గవర్నర్‌కు వీరిని తొలగించే అధికారం ఉంటుంది. ఇక 299ఎఎ అధికరణం ఢల్లీి ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారాన్ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు కట్టబెడుతోంది. కేంద్రపాలిత ప్రభుత్వాల చట్టం`1963 ఇదే నిబంధన కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులు, మంత్రులను తొలగించడానికి అక్కడి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు దఖలు పడతాయి. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లును గతంలో ఇందిరా గాంధీ 39వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో అమల్లోకి తెచ్చారు. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, స్పీకర్‌లను న్యాయ సమీక్ష నుంచి మినహా యించడం గమనార్హం. అయితే ఈసారి ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లులో ప్రధానిని కూడా చేర్చడం ఒక్కటే ప్రస్తుత బిల్లుకు దానికీ తేడా! మరి విపక్షాలు ఎందుకు నానా యాగీ చేస్తున్నాయో అర్థంకాదు!
పాలనపై ప్రభావం
రాజ్యాంగపరమైన నైతిక నిష్ట: నైతిక పాలనను మరింత బలోపేతం చేసేందుకు ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లు దోహదం చేస్తుంది. ముఖ్యంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు, మంత్రులు పదవుల్లో కొనసాగకుండా నిరోధిస్తుంది. ఉదాహరణకు ఢల్లీి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ వ్యవహారంలో ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైల్లో ఉండగా, సుప్రీంకోర్టు ఆయనపై కొన్ని పరిమితులు విధించింది. అయితే పదవిలో ఉండాలా వద్దా అనే విచక్షణను ఆయనకే వదిలేసింది.
ప్రజల విశ్వాసానికి రక్షణ: అవినీతికి, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా తీసుకునే మరింత గట్టి చర్యగా ఈ బిల్లును ప్రజలు పరిగణించవచ్చు. తద్వారా వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఏర్పడు తుంది.
ఉత్తమ పాలన: అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘‘జైలు నుంచి పాలన’’ అనే కొత్త విధానాన్ని ఇది పూర్తిగా నిరోధిస్తుంది. రాజ్యాంగ పరంగా జవాబు దారీతనాన్ని ప్రోత్సహిస్తుంది.
చట్టపరంగా ఉన్న అంతరాన్ని తొలగిస్తుంది: ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేవలం నేరం రుజువైన తర్వాత మాత్రమే ప్రజాప్రతినిధులు అనర్హులవుతారు. అయితే అరెస్ట్, చట్టపరమైన శిక్ష విధింపునకు మధ్య వుండే అంతరానికి ఈ చట్టం ఒక వారథిగా ఉపయోగ పడుతుంది.
సుప్రీంకోర్టు తీర్పులు: మనోజ్ నారులా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా`2014 కేసులో, నేరచరితులైన నాయకులను మంత్రులుగా నియ మించకూడదన్న నిబంధన రాజ్యాంగంలో లేదని చెబుతూనే తీవ్రస్థాయి నేర ఆరోపణలు ఎదు ర్కొంటున్న వ్యక్తులు కార్యనిర్వాహక పదవిలో కొనసాగడానికి అనర్హులని తేల్చిచెప్పింది. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో కూడా కోర్టు రాజ్యాంగ పరమైన నైతిక నిష్ట, చట్టపరమైన సక్రమత ప్రాధాన్యతను స్పష్టం చేసింది. అదేవిధంగా 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన మరొక తీర్పులో, ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన కఠినమైన నిబంధనల రూపకల్పన, అమల్లోకి తెచ్చే విషయంలో పార్లమెంట్‌కు ప్రత్యేకాధికారాలున్నాయని స్పష్టం చేసింది.
లా కమిషన్: మోపిన ఆరోపణల వివరాలను నిందితుడికి కోర్డు వివరించే విధానం (ఫ్రేమింగ్ చార్జెస్) పూర్తయిన తర్వాతనే ఒక ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొంది. కేవలం ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా అనర్హతను నిర్ణయించడం సబబుకాదని స్పష్టం చేసింది.
సమస్యలు, విమర్శలు: 21వ అధికరణంలో పేర్కొన్న అమాయకత్వం లేదా నిర్దోషిత్వం అనే సూత్రాలను ఈ బిల్లు అతిక్రమిస్తోందన్న విమర్శ ఉంది. నిజానికి ఈ రెండు పదాలు స్వేచ్ఛగా జీవించే హక్కుగా ఈ అధికరణంలో అంతర్గత భావనతో ఇమిడి ఉన్నాయి. కేవలం కార్యనిర్వాక సలహాపైనే ఒక మంత్రిని తొలగించడమంటే ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. ఈ బిల్లు శాసనసభ్యులు/ఎంపీలకు, మంత్రులకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా పేర్కొనడం వల్ల, సమర్థులైన వారు ఎవరూ మంత్రిపదవిని చేపట్టడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడవచ్చు. కస్టడీనుంచి విడుదలైన తర్వాత తిరిగి మంత్రిపదవి చేపట్టవచ్చునని బిల్లు పేర్కొంటు న్నది. దీనివల్ల రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదముంది.
కేంద్రానికి మరిన్ని అధికారాలు
ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. అటువంటి నాయకులపై ఏ విధమైన ఆరోపణల ‘మచ్చలు’ ఉండటానికి వీల్లేదు. తీవ్ర క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండే నాయకుడు, రాజ్యాంగ నైతిక నిష్టకు, ఉత్తమ పాలనా సూత్రాలకు న్యాయం చేయలేడు. ఆవిధంగా రాజ్యాంగపరంగా తనపై ప్రజలు వుంచిన విశ్వాసం క్రమంగా సన్నగిల్లి పోతుంది. తీవ్రమైన క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ అరెస్టయి, జైలుకు వెళ్లిన మంత్రులను ఆ పదవి నుంచి తొలగించేందుకు వీలుకల్పించే అధికరణమేదీ మన రాజ్యాంగంలో పొందుపరచ లేదని ఈ బిల్లు పేర్కొంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు రావడం ఖాయం. అవినీతి ఆరోపణలపై ఏ ముఖ్య మంత్రి లేదా మంత్రినైనా కేంద్రం తొలగించ గలదు. జమ్ము`కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కలిగిస్తానని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే, కేంద్రానికి మరిన్ని అధికారాలు దఖలు పడటంతో జమ్ము`కశ్మీర్ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంపై తన పట్టును మరింత దృఢంగా కొనసాగించగలదు.
విపక్షాల వ్యతిరేకత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ‘జైలు బిల్లు’ను పార్ల మెంట్‌లో ప్రవేశ పెట్టి నప్పుడు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆగ్రహంతో ఊగి పోయిన ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి అమిత్‌షాపై విసిరేసి నట్టు వీడియోల్లో కనిపించింది. విపక్షాల ఆగ్రహానికి తట్టుకోలేక అమిత్ షా ఒక దశలో వెనుక బెంచ్‌లో కూర్చోవాల్సి వచ్చింది కూడా! ఇంత జరిగినా అవినీతి, నేరస్తులైన
రాజకీయ నాయకులను కట్టడి చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేస్తోంది. మోదీ ప్రభుత్వం ‘‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు`2025’ పేరుతో ఈ జైలు బిల్లును ఆగస్టు 20న ప్రవేశ పెట్టింది. తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న వారు రాజ్యాంగ బద్ధమైన పార్లమెంట్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. విపక్షాల తీవ్ర నిరనసనలు, గందరగోళం మధ్య ఈ బిల్లును ఎట్టకేలకు జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనకు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ మాట్లాడుతూ నేరం రుజువయ్యే వరకు నిందితుడు అమాయకుడే అన్న సూత్రాన్ని ఈ బిల్లు దెబ్బతీసేదిగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లా డుతూ ఇది కేవలం ప్రజల కన్నీళ్లు తుడవడానికి తప్ప మరేంలేదని, ఇదొక ‘‘రాక్షస’’ బిల్లని వ్యాఖ్యానించారు. ఎంఐఎం నాయకుడు అసుదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లు కేవలం విపక్షాల ప్రభుత్వాలను పడగొట్టడానికి తప్ప మరెందుకూ ఉపయోగించదని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఏవిధంగా బాధ్యత వహించకుండా, దేశంపై ఆధిపత్యం వహించడానికే ప్రవేశపెడుతు న్నారని విమర్శించారు. శాంతి భద్రతలు రాష్ట్రాల జాబితాలో ఉన్నందున, ఇప్పుడీ బిల్లు అమల్లోకి వస్తే ఈ రాజ్యాంగ సూత్రం కూడా దెబ్బతింటుందని కొందరు విమర్శకుల విశ్లేషిస్తు న్నారు. ఎందుకంటే ఈ బిల్లును రాష్ట్ర నాయకత్వానికి కూడా వర్తింపజేయడంవల్ల సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుందన్నది వీరి వాదన. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ సంస్థలను ప్రయోగించడం విపరీతమైందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దర్యాప్తు సంస్థల వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలని కోరుతూ 2023 మార్చిలో విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కూడా. 2014 నుంచి 95 శాతం కేసులు ఈడీ, సీబీఐలు విపక్షాలపై నమోదు చేసినవని, అదే కాంగ్రెస్ హయాంలో ఇవి 60శాతం మాత్రమేనన్నది వాటి వాదన.ప్రస్తుత పార్లమెంట్‌లో 41శాతం సభ్యులు నేరాభియోగాలు ఎదుర్కొంటుండగా వీరిలో 31శాతం మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్ వంటి తీవ్ర నేరాభియోగాలుండటం గమనార్హం.
బిల్లుకు ప్రేరణ
ఈ బిల్లును ప్రభుత్వం తగిన కారణాలు లేకుండా తీసుకురావడంలేదు. గత రెండేళ్ల కాలంలో జరిగిన వివిధ సంఘటనలు ప్రభుత్వాన్ని ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు ప్రేరేపించాయి. 2024 సాధారణ ఎన్నికల సమయంలో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు కుడిభుజం వంటి మరో మంత్రి మనీష్ సిసోదియాను దర్యాప్తు సంస్థలు వివిధ కేసుల కింద అరెస్ట్ చేశాయి. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఐదు నెలలపాటు జైల్లో గడిపారు. ఈ సందర్భంగా తన పదవికి రాజీనామా చేయడానికి ఆయన అంగీకరించలేదు సరికదా, ఏకంగా జైలు నుంచే పాలన కొనసాగించారు. ఇందుకోసం జైల్లోనే పాలనా నిర్వహణకోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇది దేశ చరిత్రలోనే ఒక విచిత్ర పరిస్థితి అని చెప్పాలి! మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు, ఆయన్ను సెక్రటేరియట్‌కు రాకూడదని నిబంధన విధించింది. దీంతో ఆయనకు పదవిని వీడక తప్పలేదు! 2023లో తమిళనాడుకు చెందిన మంత్రి సెంథిల్ బాలాజీ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనకు ఎటువంటి పోర్ట్‌పోలియోను కేటాయించ కుండానే మంత్రిగా కొనసాగించడాన్ని గవర్నర్ రవి తీవ్రంగా తప్పుపట్టారు.
సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత సెంథిల్‌ని తిరిగి ఆయన పోస్టులో స్టాలిన్ నియమించారు. విచిత్రమేమంటే మంత్రిగా ఆయన కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ గట్టిగా చీవాట్లు పెట్టిన తర్వాత మాత్రమే సెంథిల్ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు కొన్ని నెలల పాటు ఆయన మంత్రిగానే కొనసాగారు! అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే హేమంత్ సొరేన్‌ను అవినీతి ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది. రాజకీయ నాయకుల ఇటువంటి నైతికనిష్ట లేని అసంబద్ధ చర్యలకు రాజ్యాంగపరమైన పరిష్కారం చూపాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించి, ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది. అంతేకాదు ‘‘అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదు’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు నొక్కి చెబుతున్న నేపథ్యం కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక ఉంది. గత పన్నెండేళ్ల ఎన్డీఏ పాలనలో కనీసం 12 మంది విపక్షాలకు చెందిన మంత్రులు 30 రోజులకు పైగా జైలు పాలయ్యారు. వీరిలో 9 మంది ఢల్లీి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారని పేర్కొంటూ విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. గత జులై నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ మాట్లాడుతూ ఈడీని కేవలం తమ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యా నించడం గమనార్హం.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 22న ప్రధాని నరేంద్రమోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ, మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయా ల్సింది పోయి, పదవిని అంటిపెట్టుకునే జైలుకెళ్లడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. అంతేకాదు తన పదవికి రాజీనామా చేయడానికి తిరస్కరించడం ఏ ప్రజాస్వామ్య సంప్రదాయం? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం విచిత్రా ల్లోకెల్లా విచిత్రం! ఇట్లాగైతే అవినీతిపై పోరాటం ఎలా సాగుతుంది? నేరగాళ్లు జైల్లో ఉండే పరిపాలన కొనసాగించాలా? అని ప్రశ్నించారు. లిక్కర్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్, తమిళనాడుకు చెందిన మంత్రి సెంథిల్ కుమార్ నుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. గతంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె అడ్వాణీ ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌షాలు తమపై ఆరోపణలు వచ్చినప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, సచ్ఛీలత రుజువైన తర్వాతనే తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నైతికత కేజ్రీవాల్‌లో లోపించింది! ఈ జైలు బిల్లును కేవలం బిహార్‌లోని పట్టణ ప్రాంత, మధ్యతరగతి ఓటర్లను ప్రభావితం చేయడానికి మాత్రమే కేంద్రం ప్రవేశపెట్టిందని కొందరు విమర్శకుల వాదన. ప్రస్తుతం కాంగ్రెస్ తదితర విపక్షాలు, తమ ప్రభుత్వాలను పడగొట్టడానికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈచట్టాన్ని తీసుకొస్తున్నదని వాదిస్తున్నాయి.
రాహుల్ అనాలోచిత చర్య
యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైల్లో ఉంటే అతను తన పదవిని కోల్పోతాడు. కానీ దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదమున్నదన్న ఆలోచనతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ తీర్పు వర్తించని రీతిలో ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువస్తే దాన్ని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో దాన్ని చించివేశారు. నిజం చెప్పాలంటే ఇది రాహుల్ గాంధీ ఆలోచనా రాహిత్యానికి, అవగాహనా లోపానికి గొప్ప నిదర్శనం. తాను ఏకంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవిధంగా చేస్తున్నానన్న కనీస ఆలోచన లేకుండా చేసిన పనికి అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం ఇరుకున పడిరది. దీనివల్ల గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లోనే ఉండటంలో, జైలుశిక్ష పడిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజ్యసభ సీటును కోల్పోయారు. తర్వాత కాలంలో రాహుల్ గాంధీకి ఒక కేసులో రెండేళ్లు శిక్షపడటం, లోక్‌సభ సభ్యత్వం రద్దవడం కూడా చరిత్ర. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోగలిగారు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్