కృషి పరాశరము: రెండో భాగం

సంచార సంస్కృతి అంతరించింది. సాగు చేపట్టిన ప్రతీచోట ప్రజలు స్థిరపడటం ప్రారంభించారు. సేద్యం ప్రారంభించారు. కృషి అంటే సాగు చేసిన భూమి. సాగుతో పాటు నివాసాలను తీసుకు వచ్చినందువలన ఈ పదం అర్ధం ‘జనావాస భూమి’గా సూచిస్తారు. ‘కృషి’ అన్న పదం ఒకవైపు వ్యవసాయం మరోవైపు మానవ నాగరికతా చరిత్ర మధ్య పరస్పరం సంబంధాన్ని చూపుతుంది. పరాశర రుషి ప్రజాపతి బ్రహ్మకు నమస్కరించి వ్యవసాయ దారులకు ఉపయోగపడే ‘కృషికర్మ’ విశేషాలను తెలియ జేశాడు. ఇక్కడ పరాశరుడు బ్రహ్మను ఎంచుకోవడా నికి కారణం- వ్యవసాయానికి ఆద్యుడు బ్రహ్మదేవుడని మార్కండేయ పురాణం చెబుతోంది.

‘‘ప్రజాపతిం నమస్కృత్య కృషి కర్మ వివేచనమ్‌

‌కృషకాణాం హితాయబ్రూతీ ఋషి పరాశరః’’

కృషి పరాశరంలో 243 శ్లోకాలున్నాయి. సృష్టి, ప్రభువు, సంతానోత్పత్తికి అధ్యక్షత వహించే దైవత్వం, ప్రారంభ పద్యంలో ప్రజాపతికి నమస్కారాలు. తరువాత రచయిత పేరును ఋషి పరాశరః అని గౌరవ ప్రదంగా ప్రస్తావించాడు. అలాగే ‘‘కృషి కర్మ వివేచనం’’ అని పేర్కొన్నాడు. రచన ఉద్దేశాన్ని ‘‘కృషికానం హితార్ధాయ’’ రైతుల ఉపయోగం కోసం అంటూ రాశారు. వ్యవసాయ వృత్తిని కీర్తిస్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. నిజానికి వేదాలలోను, వేదాంగాల లోను సేద్యం గురించిన ప్రస్తావన విశేషంగానే ఉంటుంది. కానీ సేద్యం గురించి ప్రత్యేకంగా చర్చిం చిన పుస్తకం, సేద్యాన్ని ఒక శాస్త్రంగా ఆవిష్కరించినది కృషి పరాశరం. ప్రపంచంలోనే కృషి విజ్ఞానాన్ని అందించిన తొలి పుస్తకం ఇదేనన్న అభిప్రాయం ఉంది.

కృషి పరాశరము ఒక కీలక అంశం చర్చించిన అజరామర గ్రంథంగా నిలిచింది. మానవాళికీ, ప్రకృతికీ, సేద్యానికీ నడుమ ఉన్న బంధం గురించి ఈ గ్రంథం మన ముందు ఉంచుతుంది. నేల, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం అనే అంశాల మధ్య ఉండవలసిన సమతౌల్యం గురించి పరాశరుడు గొప్ప శాస్త్ర దృష్టితో విశ్లేషించాడు. పర్యావరణ సమతుల్యం, మనిషి జోక్యం గురించి సరైన రీతిలో చెప్పాడు. భూసారాన్ని రక్షించడం ఎంత అవసరమో ప్రస్తా వించాడు. నీటి వినియోగం, అందులో జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయంతో జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆనాడే ఆవిష్కరించాడు. కంపోస్ట్, ఆఖరికి పంట మార్పిడి గురించి కూడా ఆనాటి పంథాలో వివరించడం కనిపిస్తుంది. వర్షపాతాన్ని బట్టి పంట ఎంపిక ఉంటుంది. ఏ పంటను ఎంచు కోవాలి? పంట వేసే విధానాలు, ఆయా కాలాలలో కనిపించే మార్పులు కూడా ఆయన వివరించాడు. ప్రాంతాన్ని బట్టి, అక్కడ నేల లక్షణాన్ని బట్టి పంట వేయాలని చెప్పడంతో పాటు ఏయే పంటలు వేయవచ్చునో కూడా సూచించాడు. పశు సంపదకీ, సేద్యానికీ ఉండే సహజ బంధాన్ని ఆయన వెల్లడిం చాడు. పశువుల ఎంపిక, వాటి పోషణ, రక్షణలతో పాటు పేడ వంటి పదార్థాలు పంటలకు ఎంత మేలు చేయగలవో వివరించాడు.

సేద్యానికి నేల తరువాత నీటి వనరు ప్రధానం. ఈ అంశాలకు పరాశరుడు సహజంగానే గొప్ప ప్రాధాన్యం ఇచ్చాడు. పొలాలకే కాదు, మానవాళికి కూడా వర్షమే జీవనాధారం అన్నాడాయన. వర్షంతో సస్యాలు పండుతాయి. జీవజాలం ప్రాణం నిలబడుతుంది. వర్షాలు ఇచ్చే మేఘాలను నాలుగు రకాలుగా విభజించాడు పరాశరుడు. అవి- ఆవర్త, సమవర్త, పస్కర, ద్రోణ. ఆవర్త రకం మేఘం వర్షం కొద్ది ప్రాంతానికి పరిమితం. సమవర్త అన్నిచోట్ల వర్షిస్తుంది.పస్కర పిసినారిది. ద్రోణ కుంభవృష్టిని ఇస్తుంది. కాలువలు, వర్షపు నీటి వినియోగం, బిందు సేద్యం తరహాలో జరిగే సేద్య విధానాన్ని కూడా పరాశరుడు తెలియచేశాడు. ఆయా ప్రదేశాలలో వాతావరణ పరిస్థితులను బట్టి నీటి వినియోగం ఉండాలంటాడు. నీటి దుబారాను బాగా తగ్గించే విధానాలను ఆచరించమని చెప్పాడు. వర్షపాతం గురించి పరాశరుడు విశేషమైన దృష్టిని ప్రదర్శించాడు. వర్షపాతం, దాన్ని కొలిచే పద్ధతులు వివరించాడు. పశువుల నిర్వహణ కోసం వివరణాత్మక సూచనలు చేశాడు. నాగలి, ఇతర పనిముట్లు వ్యవసాయంలో వీటి ప్రాధాన్యం గురించి వాస్తవంగా దశలవారీగా వివరిస్తాడు. విత్తనాల సేకరణ, దున్నడం, చదును చేయడం, విత్తడం, నీటి నిర్వహణ, కలుపు తీయడం, మొక్కల రక్షణలను వివరిస్తూ ముగింపులో పంట, పంటకోత పండుగ, ఆహార ధాన్యాల నూర్పిడి, కొలవడం, నిలవ చేయడం నాటి పద్ధతులు ఎలా ఉండాలో కళ్లకు కడతాడు పరాశరుడు. చివరి పద్యంలో సంపద దేవత లక్ష్మిని కీర్తిస్తాడు. రైతుల కోసం ఆమె ఆశీర్వాదం కోరుతూ సాగే ప్రార్ధన అది.

వాతావరణ పరిస్థితులను జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలను నిర్దేశించాడు. వర్షాన్ని అంచనా వేయడానికి ఆయన అనేక పద్ధతులు, సిద్ధాం తాలను ముందుకు తెచ్చాడు. వర్షపాతాన్ని అంచనా వేయడానికి ఆయన ప్రధాన సాంకేతికత సూర్య చంద్రుల స్థానం ఆధారంగా నిర్మితమై ఉంటుంది.

పరాశరుడు వర్షపాతాన్ని కొలిచే ప్రాథమిక యూనిట్‌ ‘‘అధకం’’ (26వ శ్లో) ముప్పై యోజనాల లోతులో, వంద యోజనాల విస్తీర్ణంలో విస్తరించిన నీటిని నిర్వచించాడు. యోజన అంటే (వెడల్పు) ‘ఒక వేలు’. అదే శ్లోకంలో ‘‘విస్టిమ’’ అనే పదాన్ని వాడాడు. అంటే ‘చదరపు’ అని అర్థం చేసుకుంటే గేజ్‌ను నిర్ణయించడానికి కావలసిన మూడు కొలతలు (10×10×30 క్యూ, అంగుళాలు) మనకు లభిస్తాయి.

పరాశరుడు ‘అధకం’ మూడవ కోణాన్ని (లోతు) 8 అంగుళాలుగా తీసుకొని వివరించాడు.

1 ద్రోణం = 4 అధకాలు = 6.4 సెం.మీ. ఈ సూత్రం ప్రకారం పరాశర కొలత ఆధునిక యూని ట్లతో అనుసంధానించడానికి తోడ్పడుతుంది. వరాహ మిహిరుడు ప్రకారం ‘అధక’ అంటే 50 పలాసల నీటిని కలిగి ఉన్న ఒక విశాలమైన కుండ. కౌటిల్యుడు వర్షపు నీటిని కొలిచేందుకు ‘ద్రోణం’ను యూనిట్‌ (4 ‌కాలు) తీసుకుంటే, తన అర్ధశాస్త్రంలో ఆ యూనిట్‌ ఎలా స్థిరంగా ఉందో వివరణ లేకుండా, ప్రాచీన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వార్షిక వర్షపా తాన్ని, పంపిణీని ‘ధ్యానం’ పరంగా చర్చించాడు.

ఆహారధాన్యాలు కొలిచే ఒక యూనిట్‌ ‘అధక’ (238 శ్లో) పన్నెండు మానవ వేళ్ల వెడల్పుగా నిర్వచించాడు. అయితే పాత్ర లోతును చెప్పలేదు. పన్నెండు వేళ్లు అంటే వృత్తాకార పాత్ర వ్యాసం లేదా ఆ కొలత చతురస్త్రాన్ని సూచిస్తుంది. ఇది పరాశరుని వర్షపాత సిద్ధాంతానికి ఆధారం. ‘దండపతాక సిద్ధాంతం’ బహిరంగ ప్రదేశంలో గట్టిగా నాటిన కర్రకు జెండాను కట్టడం ద్వారా ప్రతీ నెల గాలి కదలికల దిశను గమనించడం ద్వారా పౌష్య మాసం (జనవరి) నుండి రాబోయే నెలల్లో వర్షపాతాన్ని అంచనా వేయవచ్చును. కాలానుగుణ వర్షాలను ముందు నెలల్లో మేఘాలు, పొగమంచు, గాలివానలు, హిమపాతం, వడగళ్ల వాన, వేడి తరంగాలు, మెరుపులు మొదలైన వాటిని గుర్తించవచ్చును.

‘మేష సంక్రమణ సిద్ధాంతము’, నక్షత్రాలను నాలుగు భాగాలుగా విభజించి సూర్యుడు మేషరాశి లోనికి మారడాన్ని నమోదు చేయడం, సూర్యుడు ‘విషువ’ను (భూమధ్యరేఖను) దాటే సమయాన్ని అంచనా వేయడానికి ‘విశ్వ సంక్రాంతి సిద్ధాంతము’, నిర్దిష్ట దినాలలో ఒక రాడ్‌ ‌సహయంతో నది ప్రవాహం స్థాయి, ఎదుగుదల, తగ్గుదలను ప్రవాహ దండ సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలం. దీని ద్వారా ఆకస్మిక వర్షాలు, కరవు సూచనలను కూడా అంచనా వేయవచ్చును.

‘వాహన విధాన సిద్ధాంతం’లో పశుసంరక్షణ అంశాన్ని క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. గోశాలలో పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించాలి, గోశాలల నిర్మాణం, పశువులకు ఉపయోగకరమైన పోషణ, ఆవుపేడను వినియోగించుకోవడం, నాగలి కాడికి కట్టాల్సిన ఎద్దుల సంఖ్య, వేడి ఇనుముతో ఆవులకు బ్రాండింగ్‌ ‌చేయడం, పశువుల సుదూర కదలికలు అంశాలు చర్చించారు.

వ్యవసాయ పనిముట్లు వివరణ ముఖ్యంగా నాగలి, దాని వివిధ భాగాలు, వివరణాత్మక వర్ణన పరాశరుడు అందించాడు. నాగలిలోని వివిధ భాగాల కొలతలు (చేయి, వేలు, అరచేయి కొలతల ప్రమాణం) వాస్తవ ఆచరణలో ప్రతి రైతు తన సొంత యూనిట్‌ను ఉపయోగించేవారు. పనిముట్లు స్థానికంగా గ్రామంలోని వడ్రంగి లేదా కమ్మరి తయారు చేసినందున కొలత ప్రకారం తయారు చేయడం సాధ్యమైంది. ఏదైనా కావచ్చు, నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు.

‘మాయికదాన విధానం’ (182వ శ్లో) ఇది విత్తనాలు విత్తిన తరువాత నిర్వహించే వ్యవసాయ చర్య, విత్తనాలను సమానంగా కప్పటానికి తీసుకొనే చర్య. నేడు దానినే ‘తొడుగు తోలడం’గా పిలుస్తున్నాం. వ్యవసాయం, ప్రకృతి మధ్య బంధం గురించి ప్రాచీనులు అనేక విషయాలను పద్యరూపంలో, శ్లోక రూపంలో పొందుపరిచి భవిష్యత్‌ ‌తరాలవారికి అందించిన అద్భుత విజ్ఞాన కృషి సంపద. వ్యవసాయం భారతదేశానికి జీవగర్ర. దానిని సక్రమ శాస్త్ర విజ్ఞాన అనుభవాలతో, దృష్టితో చేయకపోతే రైతుకు గిట్టుబాటు కాదు. కృషి పరాశరములో ఆ మహాముని ఇచ్చిన సేద్య పోకడలు ఇవాళ్టికి అమలు చేయదగినవేనని పలువురు చెబుతున్నారు. అందుకే కొన్ని విశ్వవిద్యాలయాలలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించి ఆయన సూత్రాలను నిరంతరం గుర్తు చేస్తున్నారు. వాతావరణం పరిరక్షణ, పశు సంపదకు గౌరవం, నీటి వాడకంలో మెలకువలు ఇవన్నీ ఆ ముని దాదాపు 1600 సంవత్సరాల క్రితం రాసి పెట్టాడు. వాటిని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది.

మనిషి నాగరికత దశలో అడుగు పెట్టడానికి ముందుటి దశ వ్యవసాయం. నాగరికుడు అన్న బిరుదు మనిషికి ఇచ్చినది సేద్యం. కాబట్టి సేద్యం మానవ నాగరికత చరిత్రలో గొప్ప పరిణామం. అంతటి మలుపు ఇంకొకటి చూసే అవకాశం ఇంకా మనిషికి దక్కలేదు. అలాంటి సేద్యం గురించిన శాస్త్రాన్ని మనకు వందల ఏళ్ల క్రితం అందించినవాడు పరాశరుడు. భారతావని మొత్తం ప్రణమిల్లవలసిన రుషి.

మూలం:

  1. వ్యవసాయ శాస్త్రము (మొదటి సంపుటి) కృషితత్వము: గోపేటి జోగిరాజు.
  2. పరాశర ముని విరచిత కృషి పరాశరము : వాఖ్యాత డా।। ఎమ్‌.‌విశ్వనాథరాజు (వ్యవసాయ విషయక జ్యోతిష గ్రంథము)
  3. శ్రీ రెట్ట మత శాస్త్రము: అయ్యల భాస్కరుడు (పురాణం సూర్యనారాయణ తీర్ధులు సంస్కరించారు)
  4. మాండలిక వృత్తి పదకోశము: ఎడిటర్‌ ‌భద్రిరాజు కృష్ణమూర్తి.
  5. ఆసియన్‌ ఆ‌గ్రి హిస్టరీ పౌండేషన్‌ – ఆ‌గ్రి హిస్టరీ బులిటెన్‌- ‌నెం.2

(సమాప్తం)

విత్తడానికి వైశాఖ మంచిది

‘కృషి పరాశరము’లో బాగా ఆకర్షించే అంశం- విత్తనాలు. విత్తనాల సేకరణ, పరిరక్షణ, విత్తడం అనే అంశాలను పరాశరుడు శాస్త్రీయంగా చర్చించాడు. విత్తన సేకరణ తప్పనిసరిగా మాఘ లేదా ఫాల్గుణ మాసాలలో చేయాలని సూచిం చాడు. మొదట వాటిని ఎండలో బాగా ఎండబెట్టా లన్నాడు. తరువాత పొల్లు పొట్టు తొలగించి, గడ్డి చుట్ట లలో భద్రపరచాలి. విత్తనాలు అనేక రకాలు ఉంటాయి. ఒకదానిలో ఒకటి చేర్చకూడదని కచ్చితంగా చెబుతాడు పరాశరుడు.  కలగూరగంప వంటి విత్తనాలతో దిగుబడి తగ్గుతుందని హెచ్చరించాడు. విత్తనాలలో గడ్డి పరకల ముక్కలు కూడా ఉండకూడ దన్నాడు. దానితో కలుపు ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటాడు. విత్తనాలకు మంట, నీరు తగలితే నిరుపయోగమవుతాయని తెలియ చేశాడు. విత్తడానికి ఎప్పుడూ వైశాఖమే ఉత్తమమైనదని సూచించాడు. ఆషాఢం వరకు ఆగవద్దన్నాడు. విత్తడానికి శ్రావణం అసలే పనికిరాదని చెప్పాడు. శని, మంగళవారాలలో విత్తడా నికి ప్రయత్నం చేయవద్దని, అప్పుడే మిడతల దండు నుంచి, ఎలుకల నుంచి పంటకు రక్షణ ఉంటుందని తెలియచేశాడు. విత్తనాలు వేసిన తరువాత చేనంతా సమంగా పరుచు కోవడానికి నిచ్చెన ఉపయోగించమన్నాడు. ఈ విధానం ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తుంది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE