‘‌కృషి పరాశరము’- ఇది వ్యవసాయం గురించి చర్చించే గ్రంథం. రచయిత పేరు కూడా గ్రంథశీర్షికలోనే కలసి ఉంది-పరాశరుడు. ఇదే కాదు, మానవులకు ప్రధాన ఆహారం చెట్ల నుండే వస్తుంది గనుక ‘వృక్షాయుర్వేదము’తో ఆ విషయాన్ని చర్చించినవారు కూడా పరాశరుడే. మరొకటి, ‘పరాశర హోర’-వేల సంవత్సరాల క్రితమే జ్యోతిష్యానికి భూమికను నిర్మించిన గ్రంథం. ఇదీ పరాశరుడి రచనే. ఇలాంటి గ్రంథాల రచయిత పరాశురుడు సప్తర్షులలో ఒకరైన వసిష్టుని మనవడు, శక్తి మహర్షి కుమారుడు. అతడు నిత్య యాత్రికుడు. మత్స్యకన్యను (సత్యవతి) వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే వ్యాసుడు. వ్యాసునితోనే ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. అంటే పరాశరుడు కౌరవ పాండవుల పూర్వికుడు. గొప్ప వేదపండితుడాయన. రుగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవునికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఆయన పేరు మీదనే ఉన్నాయి. భారతీయ విజ్ఞానాన్ని సుసంపన్నం చేసిన వారిలో పరాశరుడు కూడా ఒకరిగా అవతరించాడు. కాలానుగుణమైన చట్టాల గురించి వ్యాసుడు, ఇతర రుషుల మధ్య సంభాషణ రూపంలో ‘పరాశర స్మృతి’ ప్రారంభమవుతుంది. కలియుగంలో వర్తించే చట్టాలను తెలుసుకోవాలని అనుకున్నారు మునులు. పరాశరస్మృతి ఒకటో అధ్యాయం 22వ శ్లోకం యుగ స్వభావానికి అనుగుణంగా చట్ట నియమాలు మారుతూ ఉంటాయని చెబుతుంది. కృత నియమాలు త్రేతాయుగానికి భిన్నం. ద్వాపర నియమాలు కలి నియమాలతో సమానం కావు అంటూ హిందూ ధర్మశాస్త్రాన్ని బోధించాడు పరాశరుడు.

పరాశరుడు ఏ కాలంవాడు? వేదాలు, భారతం, అర్ధశాస్త్రంతో ఆయనకు పరిచయం ఉన్నట్టు రచనల ద్వారా తెలుస్తుంది. పరాశరుడిని వ్యవసాయం, ఖగోళం, వాతావరణ, జ్యోతిష్య శాస్త్రాలపై అధికారం కలిగిన వ్యక్తిగా వరాహమిహిరుడు ప్రస్తావించడం కృషి పరాశరం రచయిత కాలాన్ని నిర్ణయించడానికి మూలాధారమైంది. కాశ్యప, గార్గిలతోపాటు ఆయన పేరు ఉండటం, వృక్షాయుర్వేద రచయితగా గుర్తింపు పొందాడు. కొందరు పండితులు పరాశర స్మృతి 1- 5వ శతాబ్దాల మధ్య వెలువడిందని నిర్ణయించారు.

సేద్యం ప్రాధాన్యం గురించి అద్భుతమైన మాట అన్నాడు పరాశరుడు. నాలుగు వేదాలు చదివినవాడు, శాస్త్రాలు తెలిసినవాడు, మేధావియైన బ్రాహ్మణుడు కూడా కృషికర్మ (సేద్యం చేయడం) తెలియకుంటే దారిద్య్రం అనుభవిస్తాడంటారాయన. సంపద, బంగారం, వెండి, రత్నాలు, వస్త్రాలు పుష్కలంగా ఉన్నప్పటికీ తిండిగింజలకు ప్రజలు వ్యవసాయదారులను ఆశ్రయించ వలసిందే. మెడ, కంఠం, చెవి, చేతులకు ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా, అవి కడుపు నింపవు. ఆభరణాలు లేకున్నా జీవనం గడుస్తుంది. అన్నం లేకుంటే జీవితమే లేదు. కానీ సేద్యగాడు ఎవరి ముందు చేయి చాచవలసిన అవసరముండదు అంటాడు పరాశరుడు.

సేద్యమంతా ప్రకృతి మీద ఆధారపడినదే. రుతువులే సేద్యానికి ఆద్యంతాలు. హలారంభ ముహూర్తం గురించి చెబుతూ పరాశరుడు- స్వాతి, ఉత్తరత్రయం, రోహిణి, మృగశిర, మూల, పునర్వసు, పుష్యమి, శ్రావణం, హస్త నక్షత్రాలలో పొలం దున్నడం శ్రేయస్కరమంటాడు. పశు సంబంధిత లావాదేవీలు అష్టమినాడు చేయరాదన్నాడు. మొక్కలు నాటేందుకు ఆషాఢం అన్నిటి కన్నా ఉత్తమం, శ్రావణం మధ్యస్థం, భాద్రపదమాసం అధమమని నిర్దేశించాడు (శ్లో।। 169).

నాగరికత ఆరంభానికి ముందు మనుషులు అడవులలో తిరుగుతూ కందమూల ఫలాదులు తిన్నారు. కొన్ని జంతువులను పట్టి వధించి వాటి మాంసం తిన్నారు. సాధు జంతువులను మచ్చిక చేసి, పాలు మాంసం ఆహారంగా ఉపయోగించుకున్నారు. ఉపయోగపడని వృక్షాలను నరికి, ఆహార పదార్థాలిచ్చే కొన్ని జాతుల గింజలను ప్రత్యేకంగా గుర్తించి, చల్లారు. వాటి నుండి వచ్చే పంటను ఆహారంగా ఉపయోగించారు. వ్యవసాయ పనిముట్లను మొదట రాతితోనూ, కర్రతోనూ, తరువాత లోహాలతోనూ చేసుకున్నారు. ఆ దశలో వారు దిగంబరులు. శీతాకాల తీవ్రతను తట్టుకొనడానికి జంతు చర్మాలను తరువాత నార, ప్రత్తి పండించి వాటిని బట్టలుగా తయారు చేసుకొన్నారు. జీవితం సౌఖ్యవంతంగా ఉంచుకునేందుకు తోడ్పడే మందులు, లేపనాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసుకున్నారు. మనుషులు తమకు కావలసిన అన్నవస్త్రాలకు అవసరమైన ద్రవ్యాలను ఉత్పత్తి చేసుకునే కళనే వ్యవసాయమంటున్నారు. వ్యవసాయం అనే శబ్దానికి ‘కృషి’ లేక పరిశ్రమ అని మాత్రమే అర్ధం. చివరికి ‘కోటి విద్యలూ కొండ్రుకు లోపలనే’ అన్నట్టు ఈ కళ భారతభూమిలో అభివృద్ధి చెందింది.

సేద్యకళలో ‘క్షేత్రకృషి’, ‘జంతుకృషి’ అని రెండు ప్రధాన శాఖలు. నేలను ఆయత్త పరచి, విత్తనాలు వేసి పలు పంటలను, చెట్లను పెంచడం క్షేత్రకృషి. పచ్చికను, ఇతర మేత దినుసులను వృద్ధి చేసి పశుసంపద పెంచడం జంతు కృషి. క్షేత్రకృషి మళ్లీ మూడు విధాలు. ఉద్యాన కృషి (హార్టీకల్చర్‌), ‌సామాన్య కృషి (కల్టివేషన్‌) ‌తరు కృషి (ఫారెస్ట్రీ).

కర్షకునికి వర్షం వలన ప్రయోజనం మొత్తం పరిమితిని బట్టిగాక, అది కురిసే కాలాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వర్షపాత పరిమితిని బట్టి కూడా ఉంటుంది. శీతాకాలంలో కురిసిన 1 అంగుళం వర్షం, వేసవిలో పడిన ఒక అంగుళం వర్షం కంటే ఎక్కువ ఉపయోగం. అరగంటలోనే కుమ్మరించే రెండు అంగుళాల కుంభవృష్టి కంటే, ఆ రెండు అంగుళాల వానే 24 గంటల పాటు ఆగి ఆగి కురియడం మేలు. నేల ఇదివరకే పదును తేరి ఉంటే చిన్న చిన్న జడులయినా ఉపయుక్తమే. పదును లేని నేలకి ఆ జడుల వలన ప్రయోజనముండదు. 40 అంగుళాల వర్షం 2-3 మాసాలలో ముంచెత్తడం కంటే, తక్కిన నెలలన్నీ వర్షం పడకపోవడం కంటే, కొంత తక్కువైనా, అంతే వర్షం 5-6 మాసాల పాటు అప్పుడప్పుడు కురిస్తే కనుక వివిధ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. (వ్యవసాయ శాస్త్రము పేజీ.182).

చినుకు పడినప్పుడు వాయువు నుంచి కొంత అమ్మోనియాను పీల్చుకుంటుంది. మేఘం నుండి వర్షపు బిందువులు ఏర్పడినప్పుడు విద్యుచ్ఛక్తి చేత గాలిలోని నత్రజని, తేమ సంయోగం చెంది కొంత నత్రికామ్లం జనించి వర్షంతో పాటే పడుతుంది. ఇంకా, వర్షపుధారలు పడినప్పుడు గాలిలోని కొన్ని సేంద్రియ పదార్ధపు రేణువులను కూడా తెస్తుంది. నత్రజని సస్యాలకు కావలసిన ఆహార ద్రవ్యాలలో ఒకటి. అందుచేత వర్షంతోనే నేలకు కొంత సారం చేరుతుంది. 1888లో చెన్నపట్టణం (నేటి చెన్నై)లో క•రిసిన వర్షాలపై పరిశోధనలు చేసి ఎకరానికి 4 పౌనుల వంతున నత్రజని చేరినట్లు లెక్క కట్టారు. ఇంగ్లండ్‌లోని ఒక ప్రాంతంలో సగటున 7.21 పౌనుల నత్రజని ఇలా నేలకు చేరుతున్నదని, అందులో 6.46 పౌన్లు అమ్మోనియా రూపంలో ఉందని లెక్క తేల్చారు. ప్రపంచం మొత్తం ఈ పదార్థాలు ఇలాగే ఏటేటా పదికోట్ల టన్నుల వరకు పుడమికి చేరతాయని అంచనా వేస్తున్నారు.

‘కన్నెర్రనైనా మిన్నెర్రనైనా నీళ్లు కారతాయి’ అని సామెత. సూర్యబింబంతో ఆకాశం బాగా ఎర్రగా ఉంటే అది వర్షసూచనగా భావిస్తారు. చంద్రుని చుట్టూ సుస్పష్టంగా పెద్ద పరివేషం (గూడు) కడితే అది కూడా వర్షసూచనగా పరిగణిస్తారు. వర్షపాతానికీ, ఖగోళంలోని ఆ పరిణామాలకీ నడుమ సంబంధాన్ని శాస్త్రజ్ఞుడు చెప్పాలి.

రెట్ట మతశాస్త్రం అనే గ్రంథం కూడా వర్ష సూచనల గురించి వివరించింది. హెచ్చుగా మంచు కురిసినా; చింత, మామిడి, నేరేడు, బాగా పూసినా, కాసినా మోదుగ వంటి కొన్ని కాయలలోని గింజల సంఖ్యను బట్టి, తూనీగల వంటి కొన్ని కీటకాల అభివృద్ధి, పింఛం విప్పి నెమలి నర్తించడం మొదలైనవి వర్ష సూచనలుగా చూస్తారు. (పేజీ.206).

మోదుగకాయలో మూడు గింజలుంటే, ఆర్ద్రకార్తి మొదలుకొని అనగా ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల పూర్వాషాఢ కార్తెలలో మంచి వర్షం కురుస్తుంది. ఆ మూడు ప్రదేశాలలో మొదటి గింజ మాత్రమే ఉంటే మొదటి కార్తెలోను, మధ్య గింజ ఉంటే మధ్య కార్తెలోను, కడపటి గింజ మాత్రమే ఉంటే కడపటి కార్తెలలోను చక్కని వానలు పడతాయని అంచనా వేసేవారు. ఆ మూడూ వట్టి గింజలైతే? వర్షం కొంచెమేనని పెద్దలు చెబుతారు.

మంచి కవీశ్వరులను పోషించినవాడా! అంతం లేని దయకు నిధియైన వాడా! వేంకటరాజా! మనిషి గోవులను పూజించినప్పుడు ఆ మంద నుండి ఎర్రని కాంతి గలదిగాని, కుంటిదిగాని, గుడ్డిదిగాని, బక్క చిక్కినది గాని, మనో దుఃఖము చేత నడవ జాలని ఎద్దుగాని, ఆవుగాని బయటకు వస్తే భూమి మీది ప్రజలు రోగాలతో చనిపోతారు. వానలు క•రియవు. ఆ దేశ రాజుకు హాని వాటిల్లును అని రెట్టడనే ఆ శాస్త్రజ్ఞుడు చెప్పారు. (రెట్ట మతశాస్త్రము పేజీ-30 టు 33). పశు సంపదకు ఒక కాలం ఇచ్చిన మర్యాద ఇది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE