ప్రస్తుత కాలంలో ఏఐయిజమ్, డేటాయిజమ్ మానవాళితో జుగల్బందీ ఆడుతున్నాయి. మనిషిని అడుగడుగున శాసిస్తున్నాయి. ఆధ్యాత్మికత నుంచి అంతరిక్షం దాకా అంతటా ఈ రెండింటి పెత్తనమే సాగుతున్నది. ఖర్చును తగ్గించుకోవడానికి, అన్ని విషయాల్లో ముఖ్యంగా లాభార్జనలో మానవ ప్రమేయాన్ని లేకుండా చేసుకోవడానికి మనిషి వడివడిగా వేస్తున్న అడుగుల్లో నీడలా అనుసరిస్తున్నాయి.
మనవరకు వస్తే.. ఏఐని వాడుకోవడంలో భారత సైన్యం ముందంజలో ఉంది. జాతీయ భద్రత, రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసమని ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది. అయితే అదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ లాంటి టెర్రరిస్టు మూకలు సైతం ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. గత కొద్ది మాసాలుగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఈ ముష్కర మూకలు తమ స్వార్థం కోసం ఏఐని ఎలా వాడుకున్నదీ తేటతెల్లం చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రానున్న రోజుల్లో మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటానికి ఏఐ ఓ సాక్షిగా మారనుంది. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీని వాడుకోవడంలో ఆధిపత్య పోరు ఆకాశాన్నంటుతుంది. ప్రపంచానికి ముప్పు చేయడానికి ఉగ్ర మూకలు ఏఐని వాడుతుంటే, ఆ ముప్పును మొగ్గలోనే తుంచేయడానికి భారత సైన్యం అత్యంత సమరోత్సాహంతో కొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయడానికి తన శక్తి సామర్థ్యాలను ఏఐ తోడుగా పెంచుకుంటోంది. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది.
సంక్లిష్టమైన ముప్పులను ఎదుర్కోవడంలో టూల్స్ వినియోగిస్తోంది. మన సైన్యం ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ – ఓఎస్‌ఐఎన్‌టి, బిగ్ డేటా, జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీలను వాడుతోంది. ఈ టెక్నాలజీలు సైన్యానికి రియల్ టైమ్ పరిజ్ఞానాన్ని, భవిష్యత్ దర్శనం చేయిస్తాయి. ఇది సరైన నిర్ణయం తీసుకోవడంలో, సకాలంలో స్పందించడంలో, ముప్పును గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడు తుంది. జాతీయ భద్రతను మరింత పటిష్టపరచడంలో ఏఐ ప్రాధాన్యతను భారత సైన్యం గుర్తించింది. భారతీయ బలగాలు ఓ పక్క వాటి సైబర్ భద్రతను మెరుగుపరుచుకుంటూనే మరో పక్క నిఘాను యాంత్రీకరణ చేసుకున్నాయి.
సైన్యంలోకి ఏఐ రాకతో మూడు సమ్మిళిత కమాండ్‌లు కాస్త అత్యంత శక్తిమంతమైన డేటా డ్రైవ్ హబ్‌లుగా అవతరించాయి. ఇది నింగీ నేలా నీటిపైన అనుసంధాన కార్యకలాపాలకు సాయపడింది. ఈ ఏకీకరణ మిలటరీ కమాండర్‌లకు రియల్ టైమ్ ప్రతిస్పందనను సమకూర్చడానికి తోడు మంచి సమన్వయం, సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి దారి చూపింది.
సైన్యంలో మానవ వనరులను తగ్గించాలనే మాట వినపడుతున్న సమయంలో అడుగుపెట్టిన ఏఐ అన్ని విషయాల్లోనూ ప్రాభవాన్ని చాటిచెపుతోంది. వామనుడిలా పాదం మోపిన ఈ టెక్నాలజీ అత్యంత బలశాలి ఐన త్రివిక్రముడిలా నేడు అవతరించింది. సైన్యం ఏఐ తోడుగా కొద్దిపాటి మానవవనరులతోటే మరింతగా సాధించగలదు. ఈ టెక్నాలజీ కొండంత భారాన్ని అవలీలగా మోసి అవతల పడేస్తుంది. సైన్యంలో రోజువారీ లక్ష్యాలను చిటికెలో పూర్తి చేస్తోంది. సైన్యం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో వడంలో సాయపడుతోంది. పోరాట సంసిద్ధతను సైతం ఏఐ మెరుగుపరుస్తోంది.
ఏఐని భద్రతా ఏజెన్సీలు వినియోగించుకోవడం ఓ స్వాగతించాల్సిన పరిణామం. అదే సమయంలో ఏఐ నాణేనికి మరోవైపు ఓ చీకటి కోణం ఉంది. ఈ మధ్యకాలంలో ఉగ్రమూకలు మరీ ముఖ్యంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇస్లామిక్ స్టేట్ కొత్త ఊపిరి పోసుకోవడానికి ఏఐని విపరీతంగా వాడుకుంటోంది. ఈ ఉగ్రమూక ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ప్రచారానికి వినియోగిస్తోంది. తొలి ప్రయోగం అన్నట్టుగా ఇటీవల ఏఐ ఆధారిత వార్తా బులెటిన్‌ను ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేసింది. ఆ బులెటిన్‌లో ఏఐ ద్వారా క్రియేట్ అయిన న్యూస్ ప్రజెంటర్ ఇస్లామిక్ స్టేట్ మతోన్మాదాన్ని ప్రచారం చేసే వార్తలను చదువుతుంటుంది.
అయితే ఇలాంటి మతోన్మాద ఉగ్రమూకలు ఏఐ వాడటాన్ని కేవలం వాటి ప్రచారంతోనే సరిపెట్టుకో వనేది నిపుణులు అంటున్న మాట. ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ఈ టెక్నాలజీతో తన ఉగ్ర కార్యకాలాపాలను సాగించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. దాని అన్వేషణ ఫలించిన పక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఏ భద్రతా ఏజెన్సీలూ, ఏ రకమైన నిఘా ఏజెన్సీలు కనిపెట్టడానికి వీల్లేదని విధంగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉగ్రమూకలు రిమోట్ కంట్రోల్డ్ వాహనాలతో దాడులు జరపడానికి ఏఐని వాడటానికి ప్రయత్ని స్తున్నాయనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఇస్లామిక్ స్టేట్ అత్యంత దారుణంగా ఆలోచిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు ఉద్దేశించిన వ్యవస్థలను హ్యాక్ చేయడానికి దారులు వెతుక్కుంటోంది. దానికే కనుక ఓ దారి దొరికిన పక్షంలో అది జరిపే దాడుల్లో ప్రాణ నష్టం అపారంగా ఉంటుందనే విషయం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇటీవల తెలిసివచ్చింది.
ఇస్లామిక్ స్టేట్ చేతిలో ఉన్న అత్యంత ప్రమాదకర మైన ఆయుధం మతోన్మాద ప్రచారం. ఈ ఉగ్రమూకకు కీలకమైన ఇరాక్, సిరియాలో నిలువనీడ లేకుండా పోయినప్పుడు అది తన కోసం పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదులను వారి స్వదేశానికి వెళ్లి ఒంటరి తోడేలు తరహాలో దాడులకు పాల్పడాలని ఆదేశిం చింది. ఇలాంటి దాడులకు పెద్దగా ఖర్చుండదనేది ఉగ్రమూకల భావన. అయితే మతోన్మాద ప్రచారం ఎంత ప్రభావితంగా చేసారనేదానిపై ఈ తోడేలు తరహా దాడులు ఆధారపడి ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ఉగ్ర మూకలకు ఏఐ ఉపకరిస్తోంది. మతోన్మాద ప్రచార సామాగ్రి ప్రధానంగా అరబిక్ భాషలో ఉంటుంది. ఏఐ ఆగమనంతో అరబిక్ ప్రచార సామాగ్రిని ప్రపంచంలో వాడుకలో ఉన్న అన్ని భాషల్లోకి అనువదించి కావలసినంత మందికి బ్రాడ్‌కాస్ట్ చేసే అవకాశం ఉంది. ఉగ్ర మూకలు కొత్త టెక్నాలజీతో ఆన్‌లైన్ ద్వారా కొత్తవారిని నియమించుకుంటున్నాయి. పథక రచన చేస్తున్నాయి. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ల ద్వారా వ్యక్తులను మతోన్మాదం వైపు ప్రేరేపిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కో వడంలో భారత్ సహా ప్రపంచదేశాలు అంతే ధీటుగా క్షణక్షణం వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న డేటాయిజమ్ మానవ మనుగడకు సవాల్‌గా మారింది. మానవ జీవితంపై ఏఐ దుష్ప్రభావాలను గురిచి లోతైన, ఆలోచనాపూర్వకమైన చర్చలు జరగాలి. అమెరికా అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కావొచ్చు చైనాకు చెందిన డీప్‌సీక్ కావొచ్చు.. ఇలాంటి ఏఐ వేదికలు వాటి సొంత దేశాల భావజాలానికి తగ్గట్టుగా కంటెంట్‌ను అందిస్తున్న వైనాన్ని వాటి వినియోగదారులు ఇప్పటికే రుచి చూశారు. ఏఐ వేదికల విషయానికి వస్తే అవి తమ ఏకపక్ష భావజాలాన్ని జనబాహుళ్యంలోకి తీసుకొస్తాయి. చివరకు ఆ ఏకపక్ష భావజాలమే ఓ ప్రామాణికమౌతోంది. ఈ పక్రియలో వినియోగ దారులు పొందేది మనుష్యుల చేతుల్లోని యంత్రం ద్వారా ధ్రవీకృతమైన ఓ ‘కృత్రిమ నిజం’. నిజానికి ఓ బొమ్మ లేదా ఓ వీడియో రూపంలో నిర్మితమైన డీప్ ఫేక్ నుంచి ఎలాంటి సవాల్, సంక్షోభం ఉండదు. అసలైన సంక్షోభం పుట్టుకొచ్చేది అంతర్గతంగా నిర్మితమైన ఏకపక్ష భావజాలాల పునాదుపై కృత్రిమ నిజం కట్టుబడి నుంచే.
ఈ డేటా కేంద్రీత జీవనం, నియంత్రిత మేధ నుంచి వచ్చే మరో సమస్య అది కొత్త రూపాల్లో పుట్టించే గుత్తాధిపత్యాలు. డేటా అనేది ఇప్పటికే వలసరాజ్య స్థాపన పక్రియకు సరికొత్త ఉపకరణ మైంది. సాంకేతిక• చోదక మేథపై అర్థం లేకుండా ఆధారపడటమనేది మానవ మేథకు ఆత్మహత్యా సదృశం. ఐనప్పటికీ ఇప్పటికీ అన్ని దేశాలు అదే దానిపై బుర్ర లేకుండా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం నైతిక ఏఐ అనే సరికొత్త వాదన చలామణీ లోకి వచ్చింది. అది ఇతర దేశాలకు ఉన్న పోటీ తత్వంతో కూడుకున్న మూలాధార ఏఐ నమూనాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తోసిరాజంటోంది. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలిపించుకునే దేశాలు ఓ వైపు అందరికీ అందుబాటులో టెక్నాలజీని తీసుకురావడంపై అభయం ఇస్తూనే మరోవైపు ప్రపంచం నుంచి అడ్డూ అదుపూ లేకుండా లాభాలు పిండుకునే పనిలోపడి ద్వంద్వ వైఖరిని పాటిస్తు న్నాయి. ఇది వలసరాజ్య స్థాపనకు సరికొత్త రూపం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్ సౌత్) ఏకం కావాలి. ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. దానిని మానవాళి మేలు కోసం వాడుకోవాలి. నిరభ్యంతరంగా వాడుకునేలా ఉచిత డేటాను సమకూర్చని పక్షంలో ఏఐ మూలాధార వేదికలు పనికిమాలినవిగా మిగిలిపోతాయి. సోషల్ మీడియా వేదికలు, అంతర్జాతీయ ఎన్జీవోలు ఇప్పటికే దురుద్దేశాలతో ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ దుర్వినియోగమౌతున్నాయి. డేటా వక్రీకరణ, గుత్తాధి పత్యం ఆధారిత సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో కృత్రిమ మేధ మానవత్వాన్ని కబళించివేస్తుంది. ఈ ఏడాది మొదట్లో ప్యారిస్‌లో కృత్రిమ మేధ-ఏఐపై తీసుకో వాల్సిన చర్యపై అసంపూర్తిగా ముగిసిన సదస్సు ఏఐను సహేతుకంగా వినియోగించుకోవడంలో అత్యవ సరంగా ఓ ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెప్పాయి. మానవ వివేకము, భావోద్వేగాలు అతి పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలి పోయాయి. ఈ నేపథ్యంలో ఏఐయిజమ్, డేటాయిజమ్ అనే సరికొత్త భావజాలాలతో అమెరికా, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆడుతున్న ఆటలో పావుగా మారకుండా ఉండాల్సిన అవసరం ప్రపంచదేశాలకు ఎంతైనా ఉంది.
– జాగృతి డెస్క్