సంధ్యారాణి, సరిత. ఇద్దరి పేర్లూ ‘స’తోనే ఆరంభం. ‘స’ అంటే సబల. అవును. ఇద్దరూ సబలలే! డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నారు. ఒకరు ఒడిశాలో, మరొకరు తెలంగాణలో. ‘ప్రథమ’ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉభయులూ ప్రభుత్వ వ్యవస్థకు చెందినవారే.వాహనాలు మాత్రం వేరు వేరు. సంధ్యారాణి మాఝీది కారు! సరితది బస్సు!! డ్రైవ్ అనేది దక్షత, ఏకాగ్రతల కలబోత. బండి నడవటం, ఒత్తిడిని దాటి పటిమ కనబరచడం అందరికీ సాధ్యం కాదు. ప్రత్యేకించి – ఎంతో అభిరుచి, నిపుణత ఉంటే తప్ప… డ్రైవింగ్ విద్య పట్టుబడదు.పట్టుదలకు మారు పేరైన ఆ ఇద్దరు వనితలకీ అంతా సుసాధ్యమైంది. రికార్డు సృష్టించేలా చేసింది.
ఒడిశాలోని కిందుఝార్ పర్యాటక ప్రాంతంలోని ఆలయాలు, జలపాతాల సందర్శనకు రోజువారీ పర్యాటకుల సంఖ్య ఎక్కువ. అనేక రకాల వాహనాల సంఖ్యా అధికం. ట్రాక్టర్ల వంటి భారీ వాహనాలు మిక్కుటం.అక్కడి చాలా మందికి వాహనాలు నడపడమే ఉపాది. అటువంటి వాతావరణంలో పుట్టిపెరిగిన సంధ్యకి సహజంగానే యంత్ర పరిజ్ఞానం అలవడింది. విద్యుత్ ఉపకరణాల పనిచేసే తండ్రి నుంచి సాంకేతిక ప్రజ్ఞ జత చేరింది.
తెలివి, శక్తి కలగలిస్తే ఇంకేముందీ? ముందుగా ద్విచక్ర వాహనం నడపటం నేర్చేసు కుంది. అందులోని మెలకువలనీ అలవోకగా ఒంటపట్టించుకుంది.
పెళ్లి అయింది. భర్తదీ వాహనచోదక వృత్తి కావడంతో ఆమెలోని నైపుణ్యం మరింత మెరుగు పడింది. భారీ వాహనాల వైపు చూపు సారిం చింది. ఎంతటి దృష్టి కేంద్రీకరణ అంటే, ఏకంగా బస్సుల్ని నడపగలగడం. తన ఆసక్తికి శక్తిని సమీక రించి, ఉపాధి మార్గంగా మలుచుకుంది. కొన్ని పాఠశాలల బస్సులకి ఆమే ‘మహిళా’ డ్రైవర్!
ప్రభుత్వ శాఖలో భారీ వాహనాలు నడిపేందుకు చోదకులు కావాలని ఒకనాడు ఓ ప్రకటనను పత్రికల్లో చూసిందామె. ప్రభుత్వ శాఖల పత్రికా ప్రకటన చూసిన ఆమె దరఖాస్తు చేసుకుంది.ఉద్యోగ విజయం సాధించింది. ఆడపిల్లకు డ్రైవింగ్ ఏమిటంటూ చుట్టు పక్కల వారి నుంచి విమర్శలు ఎదుర్కొంది. ‘ద్విచక్ర వాహనం/కారు లాంటివి సరేకానీ; బస్సుల వంటి భారీ వాటిని అమ్మాయిలు నడపటమేమిటీ? పురుషులకే ఎన్నో ప్రయాసలుంటాయి. ఆ డ్రైవింగులో! మహిళలు ఎలా భరిస్తారు అవన్నీ?’అని సందేహాలు, విమర్శలు రువ్వారు కొంతమంది. మరేదైనా పని చూసుకుంటే మంచిదని ఉచిత సలహాలు, సందేశాలు వినిపించారు.
ఎందరు ఎన్ని మాటలన్నా, ఎన్నెన్ని వ్యాఖ్యానాలు చేసినా- లేనిపోని భయాలూ అనుమానాలను రేకెత్తించినా నిరసనలనీ రుసరుసలనీ రంగరించినా జంకలేదు ఆమె. ఎందుకంటే – తనకు భర్తే చేదోడు వాదోడుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం పెంచగలిగాడు.
‘మన కర్తవ్యం మనదే. శ్రద్ధగా నిర్వర్తిస్తే చాలు’ అని ఉత్సాహాన్ని నూరిపోశాడు. అందుకే సంధ్య సఫలీకృతమైంది. రవాణా/వాణిజ్య ఉన్నతాధికారి వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తోంది ప్పుడు. ఈ బండినే కాదు- ఎంత పెద్ద వాహ నాన్నీ నడుపుతానని సగర్వంగా చెప్తోంది ఇప్పటికీ!
ఏమిటి ఆమె బలం? తనమీద తనకున్న నమ్మకం. జీవిత భాగస్వామి నుంచే ప్రోత్సాహం లభిస్తున్నప్పుడు ఇక తిరుగేముంటుంది?
వాహనం చోదకంలో తనను తాను నిరూపించుకొన్న… ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో మొదటి మహిళా డ్రైవర్ సంధ్య ఎందరికో స్ఫూర్తి.
డిగ్రీ చేసింది. రెండు/ మూడు / నాలుగు చక్రాల వాహనాలను తోలడంలోనూ తనదైన నేర్పును చాటుకుంది. లైసెన్సులు పొంది, విస్తృత శిక్షణలు అందుకుని, నెంబరు వన్‌గా నిలుస్తోంది ఇప్పుడు!
ఇక సరితది మరో విజయగాథ. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవరు. హైదరాబాద్-మిర్యాలగూడ మార్గంలో ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుకు డ్రైవరు ఆమె!యాదాద్రి- భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం ప్రాంతంలోఇన సిత్య తండా ఆమె సొంత ఊరు. ఆమెది వ్యవసాయ కుటుంబం. సాధారణ జీవితం.
ఆమెకు మొదటి నుంచీ డ్రైవింగ్ పట్ల మక్కువ ఎక్కువ. అయితే బస్సు డ్రైవింగ్ సరితకు కొత్తదేమీ కాదు.ఢిల్లీలో కొంతకాలంగా ఇతరత్రా బస్సు డ్రైవింగ్ విధులు నిర్వర్తించిన ఆమె స్వరాష్ట్రంలో ఉపాథిని ఆశించింది. ఆ కోరిక ఫలించింది.
ఆమెను కదిలిస్తే – వనితా సాధికారత గురించి మాట్లాడుతుంది. మహాలక్ష్మి పథకం (బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం), ఇతరత్రా సదుపాయాలనూ విశదీకరిస్తుంది. ఇంతటి సంస్థలో వాహన చోదకు రాలిగా తాను ఉండటాన్ని భాగ్యంగా అభివర్ణిస్తుంది. ‘అవకాశాలు ఎక్కడో ఉండవు. మన చుట్టూనే ఉంటాయి. వాటిని సవ్యంగా వినియోగించుకోవడమే మన పని. ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. విజయం మన దరికి చేరక మానదు’ అనేదే సరిత జీవన సూత్రం.
అది ఎలక్ట్రిక్ బస్సు. డీజిల్ / పెట్రోలు మాదిరి కాదు. బ్యాటరీలతో శక్తి వినియోగం. గాలి నాణ్యత దీనితోనే కదా మెరుగుపడేది! పర్యావరణ పరిరక్షణ దీనివల్లనే కదా సాధ్యమ య్యేదీ! శబ్దం తక్కువ. నిర్వహణ వ్యయమూ తగినంత ఉంటుంది. ప్రయాణికులకు, చోదకులకు సానుకూలం. ‘ప్రజారవాణా’కు అనువైన ఆ బస్సును నడిపే అవకాశం తనకెంతో అదృష్టమంటోంది సరిత.
ఆర్టీసీ అనగానే మనకు గుర్తుకొచ్చేవి; సుఖమయ; ప్రమాదరహిత ప్రయాణాలు. ‘ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత సుఖవంతం’ అన్నదే సంస్థ నినాదం. వీటన్నింటి ప్రాతిపదికన – ఆ సంస్థలో ఉద్యోగ సాధన తనకు గర్వకారణమంటోంది డ్రైవరు సరిత. విద్య, విజ్ఞానం, వికాసం, వృత్తి, ఉపాధి, వాణిజ్య, క్రీడలు, సైన్యం వంటి రంగా పరిధి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. ముందుకు రమ్మని యువతకు పిలుపునిస్తోంది.ఆ అవకాశాలను ఎందుకు వినియోగించుకోకూడదన్నది ఆమె ప్రశ్న.
మహిళా ప్రగతి గురించి ఎన్నో మాట్లాడు తుంటారు. పథకాలు, కార్యక్రమాలను వల్లె వేస్తుం టారు. ప్రణాళికల వివరాలతో హోరెత్తిస్తుంటారు. వీటి విశ్వసనీయత గ్రహించి, ఆలోచనను ఆచరణకు తెచ్చినపుడే పురోగమనం. సరిత ఇప్పుడు ఆ మార్గంలో పయనిస్తోంది. భారీ వాహన చోదకత్వాన్ని అలవరచు కుని, స్త్రీ శక్తికి పర్యాయమవుతోంది. గతంలో ఢిల్లీలో కారుడ్రైవరుగా పని చేసింది సరిత. ఒక అధికారిణి సహాయంతో పల్లె నుంచి మహానగ రానికి చేరింది. అక్కడి రవాణా వ్యవస్థలో తన చోదక నైపుణ్యాన్ని, పాటవాన్ని కనబరిచింది. స్వరాష్ట్రానికి చేరి, వృత్తిపరంగా విజయవంతంగా దూసుకు పోతోంది. ఆమెది వ్యవసాయ కుటుంబం. సాధారణ జీవితం. అక్కడి నుంచి ఆరంభించిన ప్రస్థానాన్ని తనే ఇన్నిన్ని మలుపులు మలుపులు తిప్పిందంటే ఆశలూ, ఆశయాలూ, శక్తులూ యుక్తులూ, దీక్షాదక్షతలూ కలగలసిన సంధ్య, సరితలు ఆదర్శప్రాయులు.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్