‘స్వదేశీ’ అనేది కేవలం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడమే మాత్రమే కాదు ఇది నిజమైన ఆత్మనిర్భరత. సాంస్కృతిక సమగ్రత, ఆర్థిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి దోహదపడే సమగ్రమైన, లోతైన జాతీయ తత్వం. దత్తోపంత్ ఠేంగడి వివరించినట్లుగా, ‘‘స్వదేశీ అనేది దేశభక్తి ప్రామాణిక స్వరూపం.’’ ఇది స్వయం పరిపూర్ణతను సాధించాలన్న జాతీయ సంకల్పాన్ని, సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి.. సమానత్వం, పరస్పర గౌరవం మీద ఆధారపడిన ప్రపంచ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆపరేషన్ సిందూర్ భారతదేశపు సైనిక వ్యూహాత్మక బలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని నిరూపించింది. స్వదేశీగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణి నిరోధక వ్యవస్థల సహాయంతో తీవ్రవాద శిబిరాలు, శత్రు మౌలిక సదుపాయాలపై వేగంగా, ఖచ్చితంగా దాడి చేసి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించగల సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. ఈ విజయవంతమైన వ్యూహాత్మక చర్య మన సైనిక దళాల శౌర్యాన్ని మాత్రమే కాదు, మన స్వదేశీ రక్షణ వ్యవస్థలోని శాస్త్రీయ క్షమతను కూడా ప్రదర్శించింది. మన ప్రధానమంత్రి మాటల ప్రకారం, ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదు- ఇది సరిహద్దుల వద్దనే కాదు, ఇప్పుడు మన ఇళ్లలో, మార్కెట్లలో మన ఆర్థిక నిర్ణయాల ద్వారా కొనసాగుతోంది.’’
స్వదేశీ ప్రతి పౌరుని బాధ్యత
ఆపరేషన్ సిందూర్ విజయం ఇప్పుడు ఆర్థిక రంగానికి విస్తరించాలి. సైనికులు సరిహద్దుల వద్ద దేశాన్ని రక్షించే విధంగా, ప్రతి పౌరుడు తన దైనందిన జీవితంలో స్వదేశీని ఆచరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే బాధ్యతను కలిగి ఉన్నాడు. నిజమైన ఆత్మనిర్భర భారత్ అంటే స్వంతంగా చేసిన ఉత్పత్తులను వినియోగించి, వాటిలో పెట్టుబడి పెట్టే వ్యవస్థతో కూడిన దేశం. ఇది దేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, దేశంలోనే మూలధనాన్ని తిరిగి పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి.
విదేశీ బహుళజాతి కంపెనీల-ఎమ్‌ఎన్‌సీల ఉత్పత్తుల వినియోగం దేశ సంపదను ఇతర దేశాలకు తరలించడమే కాకుండా, విదేశీ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఉదాహరణకు, హిందుస్థాన్ యూనిలీవర్ (యూకే, నెదర్లాండ్స్), నెస్లే ఇండియా (స్విట్జర్లాండ్), కోల్గేట్ పాల్మోలివ్, పెప్సికో, జాన్సన్ & జాన్సన్(అమెరికా) వంటి విదేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు భారతీయ మార్కెట్ నుండి ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ లాభాల్లో ఎక్కువ శాతం వాటి మూలదేశాలకు తరలుతున్నాయి.
ఈ దేశాల్లో అనేకం భారత్‌కు శత్రుత్వంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు కలిగి ఉన్నాయి.
కాబట్టి, స్వదేశీ వినియోగం కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన జాతీయ ఆవశ్యకత.
ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది మన దేశంలో ఒక బలహీనతగా మారుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం ఎంచుకున్న విదేశీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత్ నుండి రూ. 3.29 లక్షల కోట్లకు పైగా ఆదాయం ఆర్జించగా, లాభాలు రూ. 31వేల కోట్లకు మించాయి.
మరో• వైపు, ఎంచుకున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అన్ని కలిపి కేవలం రూ.1.01 లక్షల కోట్ల ఆదాయం సాధించగా, లాభాలు కేవలం రూ. 2,824 కోట్లు మాత్రమే ఉన్నాయి.
ఉదాహరణకు హెయిర్ (చైనా) వంటి కంపెనీలు 55.2% లాభ మార్జిన్ నమోదు చేయగా, గోద్రేజ్, మైక్రోమాక్స్ వంటి భారతీయ బ్రాండ్లు 1% కన్నా తక్కువ లాభ మార్జిన్లతో పనిచేస్తున్నాయి. ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నవి ఏమిటంటే భారతీయ మార్కెట్‌లో విదేశీ కంపెనీల ఆధిపత్యం మన దేశ ఆర్థిక స్వావలంబనను బలహీనపరుస్తోంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో విదేశీ ఆధిపత్యం:
ఎంచుకున్న 11 ప్రధాన విదేశీ ఎలక్ట్రానిక్ కంపెనీలు కలిసి భారత మార్కెట్లో రూ.3.29 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, రూ. 31,029 కోట్ల నికర లాభాలు సంపాదించాయి. దీనికి బదులుగా, 8 ప్రధాన భారతీయ కంపెనీలు కలిపి కేవలం రూ.1.01 లక్షల కోట్ల ఆదాయం, రూ.2,824 కోట్ల లాభాలు మాత్రమే సాధించాయి.
దీన్ని బట్టి చూస్తే విదేశీ కంపెనీలకు మొత్తం మార్కెట్ ఆదాయంలో 76.5% వాటా ఉంది, లాభాల్లో అయితే 91.7% వాటా విదేశీ కంపెనీలదే.
ఎలక్ట్రానిక్స్ రంగం కేవలం వ్యాపారం మాత్రమే కాదు జాతీయ భద్రతకు పునాది, డేటా స్వాతంత్య్రా నికి ఆధారం, సాంకేతిక స్వావలంబనకు అవసరమైన రంగం.
విదేశీ కంపెనీల ఆధిపత్యం వల్ల భారత్‌కు కొన్ని తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి:
– డిజిటల్ నిఘా (మన సమాచారాన్ని గోప్యంగా చూడటం)
– బ్యాక్‌డోర్ యాక్సెస్ (సిస్టమ్స్‌లో దాడులకు అవకాశం)
– అవిశ్వసనీయ సరఫరా గొలుసులు (ఉత్పత్తుల సరఫరాలో భద్రతా లోపాలు)
కాబట్టి, భారత్ సాంకేతికంగా, ఆర్థికంగా నిజంగా స్వావలంబిగా మారాలంటే స్వదేశీ ఎలక్ట్రా నిక్ కంపెనీలను బలోపేతం చేయడం అత్యవసరం. ఇది అభివృద్ధి కోసం మాత్రమే కాదు భద్రత కోసం కూడా అవసరం.
ఆధునిక కాలంలో స్వాతంత్య్రం – సాంకేతి కంగా స్వయం ఆధారతే మార్గం.
భారతదేశం దిగుమతి చేసే సెమీకండక్టర్లు, రౌటర్లు, కమ్యూనికేషన్ హార్డువేర్ లపై ఆధారపడటం, సైబర్ యుద్ధాలు మరియు కృత్రిమ మేధస్సు ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో, మన దేశ వ్యూహాత్మక సన్నద్ధతను నేరుగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితి మన ముందు ఉంచేది ఒక కొత్త రకం కాలనీయత్వం – ఇది సైనిక ఆక్రమణ కాదు. సాంకేతిక, ఆర్థిక ఆధిపత్యం.
గణాంకాలు చెబుతున్నవి ఏమిటంటే భారత దేశం కేవలం విదేశీ ఉత్పత్తులను కొనడం లేదు- విదేశీ లాభాలను నిధులుగా అందిస్తోంది. విదేశీ వస్తువులపై ఆధారపడే పరిస్థితిని కొనితెచ్చు కుంటోంది. స్వదేశీ సంరక్షణవాదం (జూతీశీ•వమీ•ఱశీఅఱఎ) గురించి కాదు. ఇది భారతదేశ స్వతంత్రతకు సంబంధించింది.
భారతదేశం తన ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది స్వదేశీ సిద్ధాంతాల ఆధారంగా జరిగే మార్గదర్శనం కావాలి. ఒంటరిగా ఉండటానికి కాదు, సంస్కృతి ఆధారిత, అసలైన ఆత్మనిర్భరత కోసం.భారతదేశం ఇకపై గ్లోబల్ టెక్నాలజీ వినియోగదారుగా కాకుండా, స్వదేశీ కొత్త ఆవిష్కరణలను సృష్టించి ప్రపంచానికి అందించే దేశంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది.
విదేశీ లాభాల్లో ఆధిపత్యం ఉండడం అంటే భారతీయ వినియోగదారులు నేరుగా విదేశీ సాంకేతిక అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు. అమెరికా, చైనా – రెండూ పాకిస్తాన్‌కు సైనిక ఆర్థిక సహాయం అందించిన దేశాలు. అవి భారత మార్కెట్ ద్వారా భారీగా లాభపడుతున్నాయి. ఈ దేశాలకు చెందిన కంపెనీల లాభాలు, తమ రక్షణ సాంకేతికత అభివృద్ధికి తమ వ్యూహాత్మక లక్ష్యాల కోసం, పరోక్షంగా పాకిస్తాన్ సైనిక వ్యవస్థను బలపర్చడానికి వినియోగ పడుతున్నాయి.
స్వదేశీ తప్పనిసరి ఆచరణాత్మకం కావాలి
నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం అనేది ప్రజలు జాగృతంగా స్వదేశీ ఆచరణను చేపడితేనే సాధ్యమవు తుంది. అంటే, ఎలక్ట్రానిక్స్, దుస్తులు. ఆహారం, దైనందిన అవసరాల కోసం భారతీయ బ్రాండ్లను ఎంచుకోవడం, భారతీయ పారిశ్రామిక వేత్తలు. స్టార్టప్లు, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడం, ప్రభుత్వ కొనుగోళ్ల విధానాలను దేశీయ సంస్థలకు అనుకూలంగా మార్చడం వంటివి అంతర్భాగం కావాలి.
‘స్వదేశీ’ అంటే ఒంటరిగా ఉండాలన్న భావన కాదు. ఇది సమతుల్యతను పునఃస్థాపించడమే, అంతర్గత బలాన్ని తిరిగి నిర్మించడమే. మన వినియోగపు అలవాట్లు జాతీయ ప్రయోజనాలకు హానికరం కాకుండా మార్చడమే.
స్వదేశీని అమలు చేస్తే మన దేశీయ పరిశ్రమలు బలపడతాయి, ఎగుమతులు పెరుగుతాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రైతులు, మన మాతృమూర్తులు ఆర్థికంగా సాధికారత పొందుతారు.
స్వదేశీ పిలుపు అనేది కేవలం భావోద్వేగ పిలుపు కాదు. ఇది వ్యూహాత్మక, ఆర్థిక మేల్కొలుపు. ఆపరేషన్ సిందూర్ భారత సైనిక బలాన్ని ఎలా చూపించిందో, ఈ ఆర్థిక యుద్ధం మన పౌరుల చేత గెలవాలి. ఇప్పుడు స్వదేశీ అనేది ఒక సిద్ధాంతం కాదు. అది ఒక ఆవశ్యకత. ఈ సంకల్పయాత్రలో, ప్రతి భారతీయ వినియోగదారుడు ఒక సైనికుడే. భారతీయ ఉత్పత్తు లపై ఖర్చు చేసే ప్రతి రూపాయి భారత సార్వభౌమ త్వానికి, భద్రతకు, భవిష్యత్తుకు బాటలు వేసే ఒక బుల్లెట్ లాంటిదే. ఆయుధాలతో కాకపోయినా, ఆర్థిక వివేకంతో మన దేశాన్ని బలో పేతం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకుందాం. మన ఖర్చులు. మన ఎంపికలు, మన దృష్టి స్వదేశీయం చేద్దాం. ఒక శక్తివంతమైన, ఆత్మనిర్బర భారత్ కోసం మనమందరం స్వదేశీతో ముందుకు సాగుదాం.
డా.ఎస్.లింగమూర్తి
అసోసియేట్ ప్రొఫెసర్
కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం