తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కుర్తాళం పరమయోగులు నడయాడిన పవిత్ర ప్రదేశం. వేదమూర్తులైన సాధకుల దిశానిర్దేశంలో వెలుగొందింది. దక్షిణ భారతదేశం సైతం ఎందరో మహాయోగులకు, సాధకులకు ఆలవాలం. అక్కడి చిదంబరం, మధురై, తిరువేంగడం, తిరునల్వేలి, కుర్తాళంను నటరాజ పంచసభలుగా వ్యవహరిస్తారు. వేటికవే ప్రత్యేకమైనవి. కుర్తాళం మరింత ప్రత్యేకమైనది. దక్షిణ కాశి (తేన్ కాశీ)కి మూడు మైళ్ల దూరంలో చిత్రానది తీరాన త్రికూటాచలం తీర్థంగా వెలసి కాలక్రమేణ కుర్తాళంగా మారింది. గొప్ప సౌందర్యానికి ప్రతీకగా నిలిచే కుర్తాళంలో సుమారు 110 ఏళ్ల క్రితం (1916) ఆంధ్ర దేశంలోని చీరాలకు చెందిన మౌనస్వామి ఆధ్వర్యంలో ధ్యాన, యోగ, తపస్సాధనకు సిద్ధేశ్వరీ మఠం (పీఠం) స్థాపితమైంది.
మౌనస్వామిగా ప్రఖ్యాతి పొందిన శివచిదా నంద సరస్వతి కన్యాకుమారి నుంచి కశ్మీరు దాక పర్యటించి, ఎందరో సిద్ధపురుషల నుంచి యోగ సాధన మార్గాలు గ్రహించి ఈ పీఠాన్ని స్థాపించారు. రాజరాజేశ్వరీ జగన్మాతని ఆహ్వానించి శ్రీ చక్రస్థాపన చేశారు. అటు తరువాత ఇది శ్రీ సిద్ధేశ్వరీ పీఠంగా ప్రాచుర్యం పొందింది. ఈ పీఠం.. ధర్మతత్వ సాధన పక్రియలను, ఆచార నియమాలను, తాత్విక చింతనను, సాధన కేంద్రాలను, నిష్ఠ అనుష్ఠానాలను, సంగీత, సాంస్కృతిక, సాహిత్య, విద్వత్తును ప్రోత్స హిస్తూ సుస్థిర స్థానం పొందింది. మౌనస్వామి ఆయన వారస పీఠాధిపతులు అంకితభావంతో అనేక సమస్యలు, కష్టాల మధ్య పీఠాన్ని కాపాడుతూ, సుకీర్తిని ఆర్జించారు. భక్తకోటి మదిలో ఆధ్యాత్మిక భావనను పెంపు చేశారు.
పీఠం ఏదైనా, దాని అధిపతి ఎవరైనా హిందూ సనాతన ధర్మ పరిరక్షణే అంతిమ లక్ష్యం. ఆ బాధ్యతను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పీఠాధిపత్యం కొందరికి మాత్రమే దక్కే అరుదైన అపూర్వ అవకాశం. ఈ సన్యాస దీక్ష అత్యంత ప్రముఖమైనది. సన్యసించిన వారంతా పీఠాధిపతులు కావాలని లేదు.అందులోనూ ప్రతిష్ఠాత్మక పీఠాల హోదాలను అధిరోహించడమంటే ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి.
సంపూర్ణ జ్ఞానమార్గంలో సమాజాన్ని నడిపించడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రస్తుత పీఠాధిపతి తమ వారసుడిని ఎంపిక చేస్తారు. పరివ్రాజకత్వానికి అనేక నియమ నిబంధనలు ఉంటాయి. వారిది కఠిన నియమాల మధ్య జీవనం. వారి కుటుంబ నేపపథ్యంతో పాటు ప్రస్తుత పీఠాధిపతికి వారసుడి సమర్థతపై గల అభిప్రాయం, ఆయనలోని ఆధ్యాత్మిక అంశాలపై ఎంపిక పక్రియ ఆధారపడి ఉంటుంది ఆ మేరకే శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి తమ వారసుడిని నిర్ణయించారని చెబుతారు.
స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, జూన్ 6,2025 ఉదయం 7 గంటల 45 నిమిషాలు చిత్తా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశంలో శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామి కుర్తాళం పీఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. రుత్విక్కుల వేదమంత్రాలు, పురుషసూక్త సహిత మంగళా శాసనాల నడుమ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఈ క్రతువును నిర్వహించారు. దేశంలోని పుణ్యనదీ జలాలు, పంచపల్లవాలతో కలశపూజ చేశారు. వేదపండితులు ఈ కలశాల జలాలతో ఆయనకు అపభృత స్నానం చేయించారు. శ్రీ శక్తిపీఠం నుంచి మంగళ వస్త్రాలు అందజేశారు. మాతాజీ – శ్రీ రమ్యానందభారతీ స్వామిని,ఉత్తర పీఠాధిపతివారిని సన్మానించి, కుర్తాళ గురుపరంపర చిత్రపటాన్ని బహూకరించారు. శ్రీ పాద వల్లభుల జన్మనక్షత్రం కూడా ఆ రోజే కావడం విశేషం. కుర్తాళనాథ, లోపాముద్ర, అగస్త్య మహర్షి, మౌనస్వామి కొలువుదీరిన పీఠం ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు అద్వైత ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. కుర్తాళ సంబంధిత పీఠాధిపతులు, యతీశ్వరులు, దేశ, విదేశాలలోని భక్తులు, పీఠ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, ప్రజానాయకులు, అధికారులు, భక్తకోటి ఈ వేడుకకు హాజరయ్యారు.
సిద్ధేశ్వరానందభారతి స్వామి రచించిన ‘రసగంగ’ ఖండకావ్యం, ‘సిద్ధుల కథలు’ పుస్తకాలు ఈ సందర్భంగా ఆవిష్కృతమయ్యాయి. పరబ్రహ్మమైన పదార్ధాన్ని, పరబ్రహ్మ మహాత్మ్యం గురించి ఆది శంకరులు వివరించారు. బ్రహ్మానుభవం కలగాలని ప్రబోధించారు. అయితే ఎంతో జ్ఞానం, వై•రాగ్యసిద్ధి లభిస్తే తప్ప బ్రహ్మానందం కలగదు. ఆ బ్రహ్మానుభవం అందరికి సాధ్యం కాదు. అయితే సంగీత సాహిత్యాల ద్వారా రసానుభవం పొందవచ్చు. ఈ రసానందాన్ని బ్రహ్మానంద సహోదరం అన్నారు. దానిని తపస్సు ద్వారా సాధించవచ్చు. లేదా ఇలాంటి గ్రంథాల పఠనంతో రసానుభూతి పొందవచ్చు.
సిద్ధ పురుషులకు ఆలవాలం కుర్తాళం:
సిద్దేశ్వరానందభారతీ అనుగ్రహ భాషణం
మహాసిద్ధుడు, స్వర్ణసిద్ధుడు మౌనస్వామి వారి కరుణా కటాక్షాలు, సిద్ధగురువుల అనుగ్రహంతో శ్రీ దత్తేశ్వరానందస్వామి వారిని ఈ పీఠం ఉత్తరాధికారిగా పీఠం సంప్రదాయంలోకి ఆహ్వానించుకుంటున్నాం. పీఠం వ్యవస్థాపకులు పూజ్య మౌనస్వామి, దత్తాత్రేయ పరంపరకు చెందినవారు. హిమాలయాలలో తపస్సంపన్నులు సచ్చిదానంద సరస్వతి స్వామి, మౌనస్వామికి సన్యాస దీక్ష ప్రసాదించిన గురువు. దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన ఈ పీఠాన్ని ‘దత్తాత్రేయ పీఠం’గా పిలిచేవారు. మౌనస్వామి దీనిని సిద్ధేశ్వరి పీఠంగా నిర్ణయించారు. వారు ప్రసిద్ధులైన తరువాత వారి పేరిట ‘మౌనస్వామి పీఠం’గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ పీఠాధిపత్యాన్ని చేపట్టిన వారంతా దత్తాత్రేయస్వామి భక్తులే. మౌనస్వామి కూడా దత్త మంత్రంతోనే అనేక సిద్ధులను సాధించారు.
మౌనస్వామి తమ ఆధ్యాత్మిక కేంద్రంగా కుర్తాళంనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే…వారణాసి, బృందావనం, శ్రీశైలం, తిరుపతి వంటి వాటి మాదిరిగా ఇది దివ్య క్షేత్రం. తపస్సుకు ఎంతో అనువైన ప్రదేశం. జపతపాలు ఇళ్లలో కంటే సిద్ధపురుషులు తిరుగాడిన ప్రదేశాలలో చేయడం వల్ల కలిగే ఫలితం అధికంగా ఉంటుంది. కొన్నివేల సంవత్సరాల నుంచి సిద్ధ పురుషులు ఇక్కడ నడయాడరు. సిద్ధులున్న చోట ఆచరించే త•పస్సు ద్వారా సత్వర దేవతానుగ్రహం కలుగుతుందని పూర్వాచార్యుల వాక్కు. నాగరాజు అనే బాలుడు ఇక్కడ తపమాచరించి అగస్త్యమహర్షి దర్శనంతో జగత్ ప్రసిద్ధుడయ్యాడని ప్రతీతి. అగస్త్య మహర్షి ఇప్పటికీ ఉన్నారని, వచ్చే మన్వంతరం వరకు ఇక్కడే ఉండి, ఆ తర్వాత కాశీ వెళ్లి వ్యాస అంశ పొందుతారని పెద్దల మాట.
జ్ఞాన గురువుతో జన్మ సార్థకం :ఉత్తరాధికారి అభిభాషణ
జన్మను సార్ధకం చేసుకోవాలనే నిష్ఠ కలిగిన వానిని భగవంతుడు…. మహా పురుషుడు, యోగ్యుడు, జ్ఞాని అయిన గురువు వద్దకు చేరుస్తాడు. తనను తాను తరింపచేసుకుంటూ, లోకాన్ని తరింపచేసే నిస్వార్థపరుడు గురువు. అజ్ఞానాంధకారాన్ని నివారించే, సంసార సాగరాన్ని దాటించగల వారే గురువు. మిగిలిన వారు ఆయా శాస్త్ర విషయాలను బోధపరిచే అధ్యాపకులు మాత్రమే. మానవుడికి తీవ్రమైన వైరాగ్యం కలిగినపుడు భగవంతుని ఆశీస్సులతో మనకి గురువు అనుగ్రహం లభిస్తుంది.
ప్రపంచంలో, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రేయః అనేవి అతి దుర్లభమైనవని ఆదిశంకరులు ‘వివేక చూడామణి’లో పేర్కొన్నారు. మహాపురుషుల సంశ్రయం అంటే వారి సాన్నిధ్యం. అలాంటి మహాపురుషునికే శిష్యుడు కావడం అనేక జన్మల పుణ్యఫలం.
దత్తాత్రేయుని అనుగ్రహం కారణంగా సద్గురువు అనుగ్రహం లభించింది. నన్ను పీఠం ఉత్తరాధికారగా ప్రతిపాదించినప్పుడు ఇంతటి బాధ్యతను ఎలా నిర్వహించగలను? అనే సందేహం కలిగింది. అదే విషయాన్ని స్వామివారి వద్ద ప్రస్తావించగా, ‘ఇది నేను నిర్ణయించినది కాదు, మౌనస్వామి, సిద్ధేశ్వరీ మాతల నిర్ణయం.
నేను నీతో చిరకాలం ఉంటాను’ వాత్సల్యపూర్వక ఆశీస్సులు అందచేశారు. ఆ ధైర్యంతోనే ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. మనందరిపై గురువు మౌనస్వామి, సిద్ధేశ్వరీ అమ్మవార్ల అనుగ్రహం సంపుర్ణంగా ఉండాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను.
ఉత్తరాధికారి పూర్వాశ్రమం

కుర్తాళం ఉత్తరపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరా నంద భారతీస్వామి పూర్వాశ్రమ నామం కాదంబరి అరవింద్.గోదావరి ప్రాంతంలో 1988లో జన్మించిన ఆయన వైద్య విద్య (ఎంబీబీఎస్) అభ్యసించారు. ఎం.డి (ఎనస్తీసియా) పూర్తి చేయాల్సి ఉండగా, భగవత్ నిర్ణయం కుర్తాళం పీఠం వైపు అడుగులు వేయించింది. హిమాలయాల్లోనో, మరెక్కడెక్కడో ప్రశాంత ప్రాంతాలలో ధ్యానం చేసుకుంటూ యోగుల దర్శనంతో యోగమార్గంలో గడపాలన్న ఆకాంక్షతో సద్గురువు కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి అనుగ్రహం లభించింది. తనను గత ఏడాది డిసెంబర్‌లో సన్యాసం అనుగహ్రించారు. పీఠానికి ఉత్తరాధికారిగా ఎంపిక చేశారు. ఆ నిర్ణయం డాక్టర్ అరవింద్‌ను అమితంగా ఆశ్చర్య పరిచింది. వైద్య వృత్తితో సమాజ సేవ చేస్తూ, ఒంటరి ప్రయాణం సాగించాలనుకుంటున్న ఆయన పీఠం ఉత్తరాధికారిగా ఎంపికయ్యారు. ఆయనకు చిన్నతనం నుంచే ఆదిశంకరులు. స్వామి వివేకానంద ప్రభావం ఎక్కువగా ఉండేది. నాటి నుంచే వైరాగ్య భావనలు పెరిగి లౌకిక విద్యలతో పాటు యోగమార్గం వైపు అడుగులు వేశారు. ఉపాసన, సాధన పెంచుకుంటూ వచ్చారు.
కుర్తాళం పీఠం గురుపరంపర
1) శ్రీ శివచిదానంద సరస్వతీ మౌనస్వామి (1916-1943)
2) శ్రీ విమలానంద భారతిస్వామి (1943-1950)
3) శ్రీ త్రివిక్రమరామానంద భారతీస్వామి (1950-1991)
4) శ్రీ శివచిదానంద భారతీస్వామి (1991-2002)
5) శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి (2002-)
6) శ్రీ దత్తేశ్వరానంద భారతీస్వామి-ఉత్తరాధికారి (2025-)
పీఠం
వ్యస్థాపకులు మౌనస్వామి సహా వారి వారసులు ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్రతో పీఠం ప్రతిష్ఠను పెంచారు. మౌనస్వామి తప్ప మిగతా పీఠాధిపతులు వివిధ శాస్త్రాలలో పారంగతులు. విమలానందభారతి తర్కశాస్త్రంలో, త్రివిక్రమ రామానందభారతి యోగ విద్య, సంగీతం, వీణావాదనంలో, శివచిదానంద భారతి జ్యోతిష్య శాస్త్రంలో అపారశేముషీ వైభవ ప్రాభవ సంపన్నులు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా సారస్వతలోకంలో సుప్రసిద్ధులు. అవధానం, ఆశుకవిత్వం, అధ్యాపనం, వ్యాయామం, మల్లయుద్ధం, యోగవిద్య, మంత్ర, తంత్ర శాస్త్రాలలో శిఖర సమానులు. ఉత్తరాధికారి కాదంబరి అరవింద్ వైద్య శాస్త్ర నిపుణులు.
– కుర్తాళం నుంచి భండారు గిరి