భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అభినందించకుండా ఉండలేం. చెదలు పట్టి సుమారు డెబ్బైనాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా వేలాడుతున్న చెట్టును మోదీ, జైశంకర్‌ ద్వయం ఆసాంతం నరికేసింది. యునైటెడ్‌ నేషన్స్‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్తాన్‌ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం. ఈ బృందం ముఖ్య ఉద్దేశం భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకునే సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదికలు ఇవ్వడం. ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు పోస్తున్నాం. కానీ ఇదొక విషం. అయినా ఎన్నో ఏళ్లుగా పోషిస్తున్నాం.. చివరకు మనపైనే పడబోతుంటే మోదీ ప్రభుత్వం కేవలం ముప్పై నిమిషాల్లో దేశం నుండి తరిమికొట్టింది.

1948లో నెహ్రూ కశ్మీర్‌ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పగించిన ఫలితమే ఈ పరిశీలక బృందం రాక. సాక్షాత్తు ఐక్య రాజ్యసమితి దీనిని పంపించింది. ఈ బృందానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసి, జీత భత్యాలతో పాటు సకల సధుపాయాలు కల్పించింది. కానీ ఈ బృందం చేసినదేమిటి? కశ్మీర్‌ మీద నిత్యం అబద్ధాలను ప్రపంచం మీదకి సంధించడం. కశ్మీర్‌ వివాదంపై నిఘా దానిపని. కానీ, ఆ సంగతి మరచి ఈ సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ సెన్సార్‌ బోర్డులా మారింది.

 జమ్ము కశ్మీర్‌ సమస్య భారత పాకిస్తాన్‌ మధ్య ఉన్నదే కాదు, చైనాకి కూడా భాగం ఉన్నది అంటూ రెండేళ్ల క్రితం ఈ పరిశీలక బృందం సమితికి ఒక నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా, తమ కార్యకలా పాలకి భారత్‌ మాత్రమే కాదు, చైనా కూడా అడ్డంకులు కల్పిస్తున్నదంటూ ఫిర్యాదు చేసింది.

ఈ బృందం బహిరంగ వేదికలపై భారతదేశాన్ని అనేకసార్లు నిందించింది. కశ్మీరీ సమస్యను ద్వైపాక్షిక సమస్యగా కాకుండా త్రైపాక్షిక సమస్యగా చిత్రీకరించ డానికి ప్రయత్నించింది. అంతేకాదు, తమకు జీతభత్యాలు సరిపోవడం లేదని, ఆర్థిక సహాయాన్ని ఇంకా పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికీ, ఐక్యరాజ్యసమితికీ వినతిపత్రం కూడా ఇచ్చింది. ఇది అన్నం పెట్టే యజమాని మీద కుక్క మొరగడం వంటిది.

జీతభత్యాలు చాలడం లేదని, అవి బాగా పెంచాలని అడగటంతో, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలక బృందంలోని నలభై మంది వీసాలు భారత విదేశాంగ శాఖ రద్దు చేసి, పది రోజులలో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ బృందానికి జీతభత్యాలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌ నుంచి వస్తాయి. మరి భారత్‌ అదనంగా ఈ నలభై మందికి ఎందుకు జీతాలు ఇస్తున్నది అన్నది ప్రశ్న. నిజానికి ఈ బృందానికి రెండు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్‌లో(మే నుంచి అక్టోబర్‌) రెండు ఇస్లామాబాద్‌లో (నవంబర్‌ నుంచి ఏప్రిల్‌). ఇవి భారత్‌, పాక్‌లు నిర్మించినవే.

ఆ మధ్య శ్రీనగర్‌లోని బృందం లీలలు ఇంకా ఉన్నాయి. ఇక్కడి ఆఫీసును నిబంధనల్ని అతిక్రమించి కట్టారని నోటీసులు ఇచ్చింది అక్కడి మునిసిపాలిటీ. అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారు. ఇక నలభై మందికి విలాసవంతమైన గృహాలు, వాహనాలు, పనివాళ్లు… చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తోంది, ఈ డెబ్భైనాలుగు ఏళ్లుగా. ఇవి కాక ఇతర భత్యాలు తడిసిమోపెడు. వ్యక్తిగత వాహనాలతో పాటు సరిహద్దుల దగ్గరకి వెళ్లిరావడానికి మిలటరీ వాహనాలు సమకూర్చాలి. వీటి డీజిల్‌, ఇతర నిర్వహణ ఖర్చులు భారీగానే ఉంటాయి. వీటినే ఇంకా పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంత జరిగాక ప్రతిఫలం ఏమిటి? మనకు వ్యతిరేకంగా ప్రకటనలు, నివేదికలు, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం. ఇఫుడు దీనికే స్వస్తి పలికారు.

ఐరాస నివేదిక వచ్చిన ప్రతిసారీ భారతదేశాన్ని ఇరికించే ప్రయత్నం జరిగింది. ఇఫుడు మోదీ ప్రభుత్వం సదరు బృందానికి వీధి తలుపు చూపిం చింది. ఇది చివరి బ్రిటిష్‌ జెండాను తొలగించిన క్షణం లాంటిది. నేటికీ దేశంలోని 99% మందికి ఐక్యరాజ్యసమితి పేరుతో బ్రిటిష్‌ వారి నీడ మనదేశంలో ఉందని తెలియదు. దాదాపు డెబ్బైనాలుగు ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మోదీ ప్రభుత్వం ముప్పై నిమిషాల్లో చేసింది. నిశ్శబ్దంగానే అయినా నిర్ణయాత్మకంగా దాడి చేసింది. ఇది కేవలం ఒక కాగితం మీద జరిగిన పని కాదు. ఇది సాంస్కృతిక, దౌత్య, మానసిక స్వాతంత్య్రానికి చిహ్నం.

1971 బాంగ్లా విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలను అమెరికాకు చేరవేసినది ఈ పరిశీలక బృందమే. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హైరిజూల్యూషన్‌ ఫోటోలు తీసే ఉపగ్రహాలు లేవు, అమెరికా దగ్గర. కాబట్టి పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. అమెరికా తన ఏడవ నావికా దళాన్ని పాకిస్తాన్‌కు సహాయంగా పంపడానికి ప్రయత్నించడం, దానిని అప్పటి సోవియట్‌ యూనియన్‌ విఫలం చేయడం చరిత్ర. ఆక్రమిత కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్తాన్‌ చైనాకి దానం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో చైనాను కలపడం దేనికీ? భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్‌ దానం చేసిన భూమి కూడా సాంకేతికంగా మన అధీనంలోకి వచ్చినట్లే. దానిపై చైనా స్పందనను బట్టి భారత్‌ ప్రతిస్పందన ఉంటుంది. అంతే కానీ సమస్య భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య అయితే చైనాని పార్టీగా చేయడంలో పరిశీలక బృందం వ్యూహం ఏమిటో అర్ధమవుతోంది కదా! వీళ్ల ఉద్దేశం కశ్మీర్‌ అంశాన్ని మరింత జటిలం చేయాలి. దానికిగాను చైనాని కూడా ఇంకో పార్టీగా చేరిస్తే సరి. మొన్నటి ఎన్నికలకు ముందు ఈ పరిశీలక బృందం మరో చిచ్చుపెట్టే పని చేయబోయింది.

 అది పసిగట్టిన మోదీ, జైశంకర్‌ వెంటనే వీళ్లని దేశం వదిలి పెట్టి పొమ్మని ఆదేశించారు. ఇరాన్‌-ఇరాక్‌, ఇజ్రాయిల్‌-పాలస్తీనా, టర్కీ-సైప్రస్‌, దక్షిణ కొరియా-ఉత్తర కొరియా, చైనా-సరిహద్దు ఏడు దేశాలు. వాటితో ఉన్న సమస్యల విషయంలో ఇలాంటి పరిశీలక బృందాలు ఏర్పాటు చేయలేదు ఇంతవరకు? మరి కశ్మీర్‌ విషయంలో ఎందుకు?

 డెబ్బై నాలుగేళ్ల క్రితం నెహ్రూ నాటిన విషపు మొక్క పెరిగి మహావృక్షంలా మారి చెదలు పట్టి, ఆ చెదలు పక్కన ఉన్న మంచి చెట్టుకు పాకి వాటి నాశనానికి కారణం అవుతూ వస్తున్నా, ఇంతవరకు ఏ ప్రభుత్వం దైర్యంగా ఆ చెట్టుని సమూలంగా నరికివేయడానికి ముందుకు రాలేదు. ఈ బృందాన్ని వెనక్కి వెళ్లమని వాళ్ల వీసాలు రద్దు చేయడం అనేది  ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్య.

ఇప్పుడు భారతదేశంలో కూర్చున్న ఏ విదేశీ సంస్థ కూడా భారతదేశానికి మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నేర్పించదు. ఇప్పుడు భారతదేశం తన భూమిపై ఎవరు నివసించాలో, ఎవరు నివసించకూడదో స్వయంగా నిర్ణయించుకుంటుంది. ఇది ఆంగ్లేయుల నీడ చివరి అవశేషం. దానిని కూడా మనం పెకిలించి వేశాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది కాబట్టే పురోగతి విషయంలో చరిత్రాత్మక మైన మైలురాళ్లు కనిపిస్తున్నాయి.

 మీకు తెలుసా? ప్రపంచంలో విద్యుత్‌ మీద నడిచే రైలు వ్యవస్థల్లో ఇప్పుడు చైనా, రష్యా, అమెరికా, జర్మనీ దేశాలను దాటుకుని భారత్‌ ప్రథమ స్థానం చేరుకుంది. భారతదేశం ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ రైల్వే నెట్వర్క్‌’’గా నెంబర్‌ వన్‌ స్థానం సంపా దించింది. ఇది ఎలా సాధ్యపడిరదో, భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ గురించి తెలుసుకుందాం. దీనిని రూట్‌ కిలోమీటర్లుగా లెక్కిస్తారు.

 స్వతంత్ర భారత్‌ పాలనను మూడు కాలాలుగా విభజించుకుంటే, అంటే… 1947 నుంచి 2004 వరకూ, 2004 నుంచి 2014 వరకూ, 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే…

1) 1947 నుండి 2004 వరకూ ఏభైఏడు సంవత్సరాలు, భారతీయ రైల్వేలు దాదాపు 17,508 కిలోమీటర్లు బ్రాడ్‌ గేజ్‌ నెట్‌వర్క్‌ను విద్యుదీకరణ పని పూర్తి చేసుకున్నాయి. అంటే సగటున 307 కిలోమీటర్లు.

2) 2004 నుండి 2014 వరకూ అనగా పది సంవత్సరాలు దాదాపు 3,995 కిలోమీటర్లు అదనంగా విద్యుదీకరించారు. మొత్తం 21,413 కిలోమీటర్లు 2014 నాటికి సాధించారు. అంటే సగటున సంవత్సరానికి 390 కిలోమీటర్లు.

3) ఇక 2014 నుండి 2024 వరకూ రైల్వే విద్యుదీకరణ అంటే పది సంవత్సరాలలో మొత్తం బ్రాడ్‌-గేజ్‌ నెట్‌వర్క్‌లో 45,435 కి.మీ. మొత్తం 66,848 కి.మీ.విద్యుదీకరణ జరిగింది. అంటే దాదాపు 96% రైల్వే నెట్‌ వర్క్‌ విద్యుదీకరణ జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే 1947-2004 (57 సంవత్సరాలు) 17508 కిలోమీటర్లు. (సంవత్స రానికి సగటున 307 కి.మీ) 2004-14 (పది సంవత్సరాలు) 3905 కిలోమీటర్లు. (సంవత్సరానికి సగటున 391 కిలోమీటర్లు). 2014-2024 (పది సంవత్సరాలు) 45,435 కిలోమీటర్లు. (సంవత్సరానికి సగటున 4,544 కిలోమీటర్లు), అంటే మన్‌మోహన్‌ పాలనాకాలంతో పోలిస్తే సుమారు పన్నెండు రెట్లు వేగంగా రైల్వే విద్యుదీకరణ జరిగింది.

 మోదీ ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించుకుంటే-ఈ ప్రభుత్వం  “Mission 100% Electrification”: అనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని central Organisation for railway electrification (CORE) ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇది 2030 నాటికి ‘‘Net zero carbon railway’’ లక్ష్యంతో సమన్వయం చేశారు. మన్‌మోహన్‌ పాలనలో (2004-2014)  ఇలాంటి స్పష్టమైన, దీర్ఘకాలిక లక్ష్యం లేదు. మోదీ పాలనలో 2024 నాటికి 96% బ్రాడ్‌- గేజ్‌ నెట్‌వర్క్‌ను విద్యుదీకరించారు. మన్‌మోహన్‌ పాలనలో కేవలం 32% నెట్‌వర్క్‌ను విద్యుదీకరించారు. విద్యుద్దీకరణ వలన లాభాలు.. విద్యుదీకరణ ద్వారా రైల్వేల ఇంధన ఖర్చు తగ్గింది. సంవత్సరానికి రైల్వేకు రూ.10,500 కోట్లు ఆదా అవుతున్నది. డీజిల్‌ దిగుమతులపై ఆధార పడటం తగ్గింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఉద్భవించింది.

 మిషన్‌ 100% విద్యుదీకరణ అనేది చాలా సవాలుతో కూడిన ప్రాజెక్టు. ఎందుకంటే ఇందులో రైళ్లు నడుస్తూ బిజీగా ఉన్న రైల్వే లైన్లను విద్యుద్దీక రించడం అంటే పని చేయడానికి దొరికే సమయం చాలా తక్కువగా ఉంటుంది.అందుకే, అందరూ కోవిడ్‌ను చూసి భయపడితే, మోదీ ప్రభుత్వం కోవిడ్‌ను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని పాత రైల్వే ట్రాక్స్‌ తీసి కొత్తవి వేయడం, విద్యుదీకరణ భారీ ఎత్తున చేపట్టింది.

– అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము, 9394743591

About Author

By editor

Twitter
YOUTUBE