రాజకీయ పార్టీల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, సమీక్షలు, సరిదిద్దుకోవడాలు, అంతర్గతంగా విభేదాలు, సయోధ్యలు సర్వ సాధారణం అంశాలే. అయితే, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం, తామే ప్రత్యేక రాష్ట్రం తెచ్చామని చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) లో ఒక్క లేఖతో తుపాను చెలరేగింది. ఆ లేఖ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవిత నేరుగా తండ్రికి సంధించిన లేఖాస్త్రంపై సంచలనంతో పాటు, సందేహాలు చుట్టుముడుతున్నాయి. ఆమె తన తండ్రికి లేఖ రాయడం సహజంగానే జరిగిందా? మరి ఆ లేఖను బట్టబయలు చేసింది ఎవరు? అందుకు కారణమేంటి? పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నమా? లేదంటే.. అప్పుడప్పుడు అలిగే అసంతృప్తులకు హెచ్చరిక జారీ యత్నమా? పార్టీలో అసలేం జరుగుతోంది? ఈ ప్రశ్నలు బీఆర్‌ఎస్ నేతలు, శ్రేణుల్లోనే..తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
తన తండ్రి చంద్రశేఖరావు దేవుడని, కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని, వాళ్ల వల్లనే పార్టీకి చాలా నష్టం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పార్టీలో కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే, తన తండ్రికి తాను రాసిన లేఖను బయటపెట్టాయని, అంతేకాదు.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు కూడా జరుగుతున్నాయని కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత.. విమానా శ్రయంలోనే కవిత చేసిన ఆ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ శ్రేణులను ఉలిక్కిపడేలా చేశాయి. ఇంతకీ ఆ దయ్యాలు ఎవరని గులాబీ శ్రేణుల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కవిత లేఖపై రాజకీయంగా కలకలం చెల రేగుతున్న తరుణంలో, కవిత నేరుగా చేసిన వ్యాఖ్యలు, వెల్లడిరచిన అభిప్రాయాలు వేడిని మరింత పెంచాయి.
కవిత లేఖాస్త్రంతో బీఆర్‌ఎస్ ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఆమె మరో బాంబు పేల్చారు. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి.. లేఖ లీక్ అయ్యిందంటూ హంగామా జరుగుతోందని, అది రెండు వారాల క్రితమే రాసిందని స్పష్టం చేశారు. గతంలో కూడా తన అభిప్రాయాలను ఇలా లేఖల ద్వారా చాలాసార్లు తండ్రికి చెప్పానని పేర్కొన్నారు. వరంగల్ సభ తరువాత తన అభిప్రాయాలను లేఖ ద్వారా పార్టీ అధినేతకు వెల్లడిరచానని స్పష్టం చేశారు. అది అలా ఉంచితే, పదేళ్లలో తాము వందలసార్లు చెప్పిన మాటలనే అలవోకగా మార్చేసి, మాటలు తప్పిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ పత్రికకు కవిత షాక్
కవిత లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టడంతో మీడియా దృష్టి అటువైపు మళ్లింది. ఇప్పటికే కొన్ని వారాల నుంచి బీఆర్‌ఎస్‌లో, కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందన్న లీకులు వస్తున్నాయి. వాటిపై మీడియాలో రకరకాల కథనాలు ప్రచురితం, ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖ బయటకు రావడంపై సహజంగానే మీడియా ప్రధానాంశంగా చేసింది. అయితే, కేసీఆర్ సొంత పత్రికలో మాత్రం విరుద్ధ కథనం వచ్చింది.
ఆ లేఖను కవిత రాసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందంటూ పెద్ద వార్తా కథనం రాసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చేర్చడంతో మళ్లింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ ఈ లేఖ నాటకం ఆడుతోందని, ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు కొత్త ఎత్తు వేసిందన్నది ఆ వార్తా కథనం సారాంశం. అయితే, మరుసటిరోజే అమెరికా నుంచి తిరిగొచ్చిన కవిత..ఆ లేఖను తానే రాశానని మీడియాకు చెప్పడంతో కేసీఆర్ పత్రికకు ఊహించని షాక్ తగిలింది. మరోవైపు.. ఆమె చెప్పిన పలు అంశాల్లో వైరుధ్యాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. లేఖ తానే రాసినట్లు ప్రకటించిన కవిత,దానిని బయటపెట్టిన వారెవరో తేలాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని, వారిని తప్పిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు పుట్టించాయి.
కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ఎవరు? అధినేత కేసీఆర్ చూట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? అనేది బీఆర్‌ఎస్‌ను మథనంలో పడేసింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమైన పార్టీకి, 2023లో జాతీయ రంగు వేసి భారత రాష్ట్ర సమితిగా అట్టహాసంగా ప్రకటించారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్‌లో కోవర్టులు ఉన్నారనే మాటలు తొలిసారి వినిపించాయి. అదీ కవిత నోట రావడం తీవ్రచర్చగా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అవసరమైన సందర్భాల్లోనూ అస్సలు స్పందించకపోవడం పార్టీ శ్రేణుల్లో నిస్తేజాన్ని పెంచాయి. పార్టీలో ఎవరో నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. అసంతృప్తితోనో, కోపంలోనో అన్నారని సర్దిచెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాక్షాత్తూ పార్టీ అధినేత కూతురే కోవర్టులు, దయ్యాలు అనడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారని చర్చ జరుగుతోంది.
బల నిరూపణగా స్వాగత కార్యక్రమం?
కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమెకు ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిలో స్వాగత కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. ఆమె లేఖ బయటకు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. అంటే.. ఇది సరైన సమయమన్నట్లుగా ఆమె ఆమె బల నిరూపణ చేసుకున్నట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా.. అంతమంది అభిమానుల్లో ఒక్కరి చేతిలో కూడా బీఆర్‌ఎస్ జెండా కానీ, తండ్రీతనయులు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను పట్టుకోలేదు. గులాబీ ఆనవాళ్లు కానీ కనిపించలేదు. కేవలం ఆమె సొంత సంస్థ తెలంగాణ జాగృతి శ్రేణులు, అభిమానులే స్వాగతం పలికారు. ఎన్నడూ లేని విధంగా జనం ఈ స్థాయిలో విమానాశ్రయానికి వచ్చారంటే, కవిత ఆదేశాలు లేకుండా వచ్చినవాళ్లు కాదంటున్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.
దశాబ్దకాలంలో ఉద్యమ కారుల గురించి గానీ, సామాజిక తెలంగాణ అనే నినాదం గురించి గానీ ప్రస్తావించని కవిత.. ఇప్పుడు ఒక్కసారిగా ఆ అంశాలను లేవనెత్తి తాను సామాజిక తెలంగాణ ప్రతినిధినని చెప్పుకున్నారు. అంటే.. బీఆర్‌ఎస్‌లో సామాజిక తెలంగాణ కొరవడిరదన్న భావం వచ్చేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. ‘భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం. భూమి ఉన్న వాళ్లకే పంట పెట్టుబడి సాయం ఇచ్చాం. కానీ ఏమీ లేనివాళ్లకు ఏం చేయలేకపోయాం’ అన్న కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో తన పార్టీలోకి చేర్చుకున్నారు. అసలు మరో పార్టీ అనేది ఉండకూడదన్న రీతిలో చేర్పుల పర్వం కొనసాగింది. అలాగే, అధికారంలో ఉన్నంత కాలం ఆయన కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేకుండా చూశారు. తాను అనుకున్న వాళ్లకు తప్ప ఇతరులను ఆ భవన్‌లోకి అనుమతించలేదు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. అప్పట్లో ఏనాడు ఈ అంశాలను ప్రస్తావించని కవితకు,ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యమకారులు, సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది.
సొంత కుంపటికి సిద్ధమా?
వాస్తవానికి కొద్ది నెలల నుంచి బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోందని లీకులు వస్తున్నాయి. తన రాజకీయవారసుడిగా కుమారుడు తారకరామారావు(కేటీఆర్)వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని, ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కవితకు పార్టీలో ప్రాధాన్యం గల హోదాలేదు.
దాంతో, తనకు అన్న కేటీఆర్‌తో సమానమైన పోస్టు ఉండాల్సిందేనని ఆమె కొంతకాలంగా పట్టుబడుతున్నారని, ఈ అంశంలోనే కేటీఆర్‌తో కవితకు దూరం పెరిగిందన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. పైగా.. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉండటంతో పార్టీలో తన స్థానం ఏమిటో కవితకు తెలిసి వచ్చిందని, ఈ పరిణామాల్లో భాగమే లేఖ, విమానాశ్రయం వద్ద వ్యాఖ్యలు అని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
కేటీఆర్ స్పందనలో ఆంతర్యం?
కవిత లేఖాస్త్రం, వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మరుసటిరోజే మీడియా ముందుకొచ్చారు. అందరూ ఊహించినట్లు కవిత అంశమే ప్రస్తావనకు రాలేదు. ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే మీడియ సమావేశమని తేలిపోయింది కొందరు పాత్రికేయులు కవిత లేఖను ప్రస్తావించగా, కేటీఆర్ దాటవేసే ప్రయత్న ం చేశారు. అయితే మీడియా ప్రతినిధులు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో, కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. కేసీఆర్‌కు ఎవరైనా చీటీలు,లేఖలు ఇవ్వొచ్చు అన్నారు. కోవర్టులు ఉంటే ఉండొచ్చని వ్యాఖ్యానించిన ఆయన, పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకొచ్చారు.
సైలెన్స్! అంటూ ఆదేశించిన కేసీఆర్
బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా.. ఈ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సూచించారు. తద్వారా పార్టీ నేతలకు కూడా సందేశం పంపారు. మే 25న కేటీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకున్న కేసీఆర్.. దాదాపు మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రధానంగా కవిత వ్యవహారంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరచడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కవిత లేఖ గురించి ప్రెస్‌మీట్లు, ఇతర సమావేశాల్లో చర్చించవద్దని, సున్నితమైన విషయంపై ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068