‘కోపంతో గాలిని వేడెక్కిస్తూ, కన్నీళ్లతో శిలల్ని కరిగిస్తూ! / మనసు మొక్కమీద ఎండిపోయిన
ఆకుల్ని రాల్చేసి, కొత్తపూత పూయిస్తూ / గుండె పగుళ్లపై అక్షరధారల్ని జల్లుజల్లులుగా కురిపిస్తూ’
కారాగార గదుల్లో ఎవరికి వారుగా ఆ ముగ్గురూ! స్నేహలత, గాయత్రీదేవి, విజయరాజె సింధియా. ముగ్గురిదీ అపురూప శక్తిసంపన్నత. అంతటి దక్షతా అత్యవసర పరిస్థితి అనే దాని ఆంతరంగిక భద్రతా… కాదు కాదు… క్షుద్రతా నిబంధనాల చట్రంలో చిక్కువడిరది. ఒక వ్యక్తి రూపంలోని మహమ్మారితనానికి గురైపోయింది. అది 1975 ప్రాంతం. ఇది 2025 సంవత్సరం. సరిగ్గా యాభై ఏళ్లు! నాటి పాలక పక్షీయుల మసుగుతత్వం, వక్రోక్తుల వ్యవహారం, వ్యర్థాలాపం, విషస్వప్నం, తేనెపూసిన కత్తి వ్యక్తిత్వం, నమ్మకద్రోహం, ద్వేషం, రోషం, ఉక్రోషం, ప్రశ్నను సహించలేనితనం అన్నీ ఒక్కటయ్యాయి.ఎమర్జెన్సీగా మన దేశానికి దాపురించాయి. ఆత్యయికం, మీసా ఏ పేరుతోనైనా పిలవచ్చు అలనాటి ఆ పాలన అరాచకాన్ని! ఎవరికి అత్యవసర స్థితి? దుర్మార్గ పాలకత్వానికి! ఎందుకని మీసా (మెయింటెన్సెస్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్)? ఎదిరించి నిలువరించేవారిని చట్టం అమలు పేరిట తొక్కి ఉంచడానికి! అందుకే… జైళ్లు నోళ్లు తెరిచాయి. జనస్వామ్యవాదులను కబళించాలని చూశాయి. ఆ బాధిత వాదుల్లోని స్నేహలత సహజసిద్ధ నిపుణ కళాకారిణి. గాయత్రీదేవి, విజయరాజె సింధియాలు మహారాణులు. అయినా పాలకుల ‘అత్యవసరం’ ఆ ముగ్గురినీ నిర్బంధించింది. అవన్నీ కారుచీకటి రోజులు. తలచిన ప్రతీసారీ మన హృదయాల్ని బరువెక్కించే సందర్భాలు. పాలనా కుటిలత్వాన్ని ఏవగించుకుంటూ మనందరి పిడికిళ్లూ బలంగా బిగిసేంత ఉద్వేగ తీవ్రతకు కారకాలు. ఆ ముగ్గురు వనితలూ మెరిసిన కొడవళ్లు! ఎంతో భారంగా చెమర్చిన కళ్లు. అవి స్వతంత్రత రగిల్చిన అగ్నిజ్వాలలు!
నిజానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించాలి? యుద్ధం, అవతలి నుంచి దురాక్రమణ, దేశంలో సాయుధ తిరుగుబాటు, 1962, 1971 సంవత్సరాలు యుద్ధ సమయాలు. మరి 1975? నిరంకుశత్వాన్ని, నియంత తత్వాన్ని ఎవరు నిగ్గదీసినా అస్సలు భరించని, సహించని జాడ్యం. అనుమానించిన ప్రతీ ఒక్కరినీ పోలీస్ లాకప్‌లోకి తోసేసే దుష్టత్వం. అప్పట్లో అలా వేలమంది నిర్బంధితులు.
ఆ వ్యధితుల్లో స్నేహలత ఉన్నారు. సృజన సాహితీవేత్త పఠాభి సతీమణి. ఆమె నటరంగంలో ప్రజ్ఞాశాలి. అటువంటి కళాత్మకతతోనే దురన్యాయాన్ని ప్రశ్నించేవారు. అదే పాలకులకు కంటగింపు.
ఓ రాత్రి పోలీసులు దొంగదారిన వచ్చిపడ్డారు. అంతకుముందే నానారకాల ‘నాటకాలూ’ ఆడారు. ఆమె పిల్లల్ని ‘అపహరించుకుపోయారు’. తాను ఇంట్లో లేని వేళన, తల్లినీ బాధించారు. భార్యాభర్తలిద్దరినీ ఎన్నో విధాలుగా హింసించారు. మానసికంగా క్షోభపెట్టారు. రోజుల పర్యంతం వేధించారు. భర్తనీ పట్టుకుపోయారు ఎక్కడికో!
‘మావారు ఏరీ? మా అబ్బాయి పరిస్థితేమిటి? మా అమ్మాయిని ఎంతగా రాచి రంపాన పెడు తున్నారో ఏమిటో?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిం చిందామె. అసలే ఎమర్జెన్సీ పోలీసులు! ఎందుకు స్పందిస్తారూ? రాజకీయ అభిప్రాయాలున్న స్నేహితుడి జాడ చెప్పాలంటూ సతాయించారు పోలీసులు. ఆయన ఎక్కడుంటాడో ఆమెకేం తెలుసు?
అది 1976. ఆమెను బంధించారు. అదీ ఒక ఇంట్లో! ఒకరోజున ఉన్నట్లుండి మాయం చేశారు స్నేహలతని! మోసం, దారుణం. మోసం ఏమిటంటే` ఏవో కాగితాల మీద బలవంతంగా సంతకాలు పెట్టించడం. మరెంతో దారుణాతి దారుణం తెలుసా? ఆమెను వివస్త్రను చేయడం! అదేమంటే… సోదా అనడం! బెంగళూరు సెంట్రల్ జైల్లో ఎన్నో` ఇలాంటి ‘పరిస్థితులు’. ఆమె ఉంది జైలుగది అనే నరకంలో! ‘మీసా’ అంటూ నిర్బంధకాండ కొనసాగిం చారు పాలక పోలీసులు.
ఒకటీ రెండూ మూడూ నాలుగూ ఐదూ ఆరూ ఏడూ ఎనిమిదీ… ఆపై తొమ్మిది! అన్ని నెలలూ బంధించి ఉంచారామెను. ‘ఎందుకీ దమననీతి’ అంటే ` ‘ఇదంతే’ అన్నదే పాలకపక్ష (పాత) జవాబు. వ్యాధుల బారిన పడ్డారామె. సాధింపులు, వేధింపుల బెడదతో చిక్కి శల్యమయ్యారు. కుటుంబానికి దూరంగా నానా యాతనా! ‘నన్ను బతకనిస్తారా వీళ్లు’ అనిపించింది ఆమెకి. అధికార బధిరాంధ ప్రేరిత పోలీసువర్గం ఎంత ప్రమాదకరమో బాగా అర్థమైంది ఆ తల్లికి! అప్పుడు రాసుకున్నారు డైరీని! ఎవరు ఆమె, ఎటువంటివారు? స్వతంత్ర సమరయోధగా ఉన్నవారు. మేటి నటి. సాటిలేని రచయిత్రి, సామాజిక సంక్షేమ క్రియశాలి. అంతటి కళావేత్తకు ఒంటరి నిర్బంధం! చీకటి గదిలో తొమ్మిది నెలలుగా మగ్గిపోయా రామె. బాలల పత్రికలకు సంపాదకు రాలు ఒకప్పుడు. సున్నిత భావుకురాలు. అలాంటి ఆమె కర్కశపాలన బారినపడి, శ్వాసకోశ వ్యాధి పీడితురాలిగా కటకటపడి, ఎటువంటి చికిత్సా అందని స్థితిలో… జైలు నుంచి పెరోల్ మీద బయట పడిన నాలుగైదు రోజులకే శాశ్వతంగా కన్ను మూశారు. దుష్ట దుర్మార్గ అక్రమ అన్యాయ నిర్బంధానికి బలయ్యారామె!
యమర్జెన్సీ కాలంలో కారాగార గది గోడల మధ్య నుంచి స్నేహలతా రెడ్డి వెల్లడిరచిన డైరీ నాటి చీకటి చరిత్రకి అక్షర సాక్ష్యం. 1975 జూన్ 25 రాత్రి మొదలు 1977 మార్చి 21వరకు 21 నెలల పర్యంతం ‘యమ’ అర్జెన్సీ! లక్షా పది వేలమందిపైగా పలు చట్టాల కింద బంధితులయ్యారంటే అదంతా పాలకపక్షి పాప ఫలితమే. అనుమానం వస్తే వచ్చి పట్టుకెళ్లడమే. దర్యాప్తు, విచారణ ఏవీ లేకుండా జైళ్లల్లో కుక్కేయడమే. అసలు అది కదా ఘోరాతిఘోర నేరమంటే!
ఆమె డైరీలో ఏముంది? అది ‘ప్రిజన్ డైరీ’. అదీ 1977లో వెలుగు చూసింది. ‘నా శరీరం అనేకానేక అవమానాలు ఎదుర్కొంది. అణచివేశామని ‘ఇందిరా’ మందిరం అనుకోవచ్చు. నా ఆత్మను ఏ ఒక్కరూ అణచివేయలేరు. నాలోని స్ఫూర్తిని ఎవరూ ఏమీ చేయలేరు.’
ఇవి చాలు కదా…. స్నేహలత పరమాద్భుత వనిత అని చాటి చెప్పడానికి! ఆ అద్భుతత్వం ఆమె మాటలు, రాతలు, చేతల్లో అన్ని విధాలుగా కూడా పుష్కలం. జయహో స్నేహలతా!
గాయత్రీదేవి సైతం ఇందిరమ్మ పీడుతురాలే! తిహార్ కారాగారంలో నిర్బంధిత. అక్కడే గాయత్రి ఆరోగ్యం చాలా క్షీణించింది. శరీరం బరువు విపరీతంగా తగ్గి నిస్సత్తువ ఆవరించింది. తొలి నుంచీ స్వతంత్ర భావనలున్న ఆమె అంటే నాటి పాలక వర్గానికి సుతరామూ పడదు. అందువల్లనే జైలుపాలు చేసిందామెను. అసాధారణ మహిళామణి గాయత్రీదేవి. జైపుర్ మహారాజా అర్థాంగి. ‘రాజమాత’గా విఖ్యాతురాలు. అంతకుమించి సంప్రదాయ సౌందర్యవంతురాలు. సమాజ ప్రయోజనాల గురించే సదా తన ఆలోచన, ఆచరణ కూడా! విశ్వభారతిలో విద్యాభ్యాసం. శాంతినికేతన్‌తో విద్యానుబంధం. ఎంత సంప్రదాయవాదో అంత ఆధునికత ఆమెది. వాహనాలు నడపాలన్నా, క్రీడల్లో మునిగి తేలాలన్నా ఆమే! తన ప్రాంతంలో పబ్లిక్ స్కూల్ సంస్థాపకురాలు. చిత్ర నిర్మాణ విభిన్నతను పరిపోషించినవారు. ఇన్ని శాస్త్రాలు, కళలు, విద్యల్లో ఆరితేరి ఉన్నాÑ ఎమర్జెన్సీ పీడ దాపురించిందామెకు. ఐదు నెలలపాటు కారాగారంలో ఉండి ఎన్నో రకాల బాధల పాలయ్యారు. ఆమెను ఎటువంటి గదిలో బంధించారంటే ` కరడుగట్టిన నేరగాళ్ల దరిదాపుల్లో! విషప్పురుగులు సంచరించే చిన్నపాటి గది లోపల! ఇంతకీ ఆమె చేసిన అంత పెద్ద నేరమేమిటో?
పదే పదే అదే పనిగా పాలకపక్షానికి బాకా ఊదకపోవడం. చుట్టూ చేరి ‘ఆహా ఓహో’ అంటూ మెప్పులతో పబ్బం గడపకపోవడం. ఆమె స్వతంత్రతా రీతిని సహించలేని పాలకులు అప్పటి అత్యవసర చట్టాలను అడ్డం పెట్టుకునిÑ చేయకూడని పనులన్నింటినీ నిర్లజ్జగా చేసేశారు! కారాగార దురన్యాయాలపరంగా గాయత్రీదేవి రాసిన పుస్తకం ‘ఎ ప్రిన్సెస్ రిమెంబర్స్Ñ ది మెమొరీస్ ఆఫ్ ది మహారాణి ఆఫ్ జైపూర్’. రాజకీయ ప్రత్యర్థితత్వంతోనే జరిగింది ఆమె అరెస్టు. నిజానికి గాయత్రీదేవి, ఇందిరాగాంధీ బాల్యమిత్రులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అయినప్పటికీ గాయత్రి అంటేనే ‘ఆ’ నేతకు తెగ కంటగింపు. రాజకీయ రంగాన సమున్నతంగా ఎదిగి, ఎన్నికల పర్వాన అఖండ విజయఢంకా మోగించి, ప్రజాదరణను సుస్థిరపరచుకున్న గాయత్రిని చూస్తేనే ధుమధుమలాడేవారు పాలకేందిర. పార్లమెంటు భవనంలో తనను చూడాలంటేనే అదోలా ఉండేది ఆవిడకు! ‘ఆత్యయిక’ను అడ్డుపెట్టుకుని పాతకక్షలు తీర్చుకునే పని మొదలు పెట్టింది పాలకపక్షం. అసలే అధికార ఉన్మాదం. ఆపైన చట్ట నిబంధనలను దుర్వినియోగం చేసే విధానం. ఇక చెప్పేదేముందీ? విజృంభించిన దర్పం గాయత్రిని కారాగారానికి తరలించింది. అంతకుముందర వైద్యచికిత్స అవసరమై ముంబయిలో ఉన్న ఆమెను ఏ మాత్రం కనికరం లేకుండా తదుపరి బందీని చేసింది. ఎమర్జెన్సీని విధించిన నెలలోపలే గాయత్రీదేవి కారాగారం లోపలికి! ఎంతెంతో క్షోభ అనుభవించారామె. అధికారవర్గాల టక్కుటమారాలు, మాయోపాయాలు, నీచ వ్యవహారాలకు విసిగి వేసారారు. వేదన ఫలితంగా అనారోగ్యం ఎక్కువైంది. వ్యాధుల తీవ్రత పెరిగింది. చికిత్స మాత్రం ఏ దశలోనూ సవ్యంగా అందలేదు. అంత వ్యధలోనూ ఆమె సేవాభావన చెక్కు చెదరలేదు. తిహార్ జైల్లో ఉండగానే, అక్కడి ఇతర ఖైదీ మహిళల పిల్లలకు పాఠాలు చెప్పారు. పుస్తకాలు కొని చదువుకునేలా చేసేందుకు తనవంతు సాయం అందించారు. బాలల ఆటపాటల కోసమూ ఎంత చేయాలో అంతా చేశారు ఆ రాజమాత!
తన బాధలు ఎలా ఉన్నా, కారాగారంలోని ఇతర ఖైదీల గురించి మానవతా భావన కనబరిచారు. అధికార పక్షీయులతో పోలిస్తే ఎంత తేడా? వాళ్లది అణచివేత. ఈమెది మానవత. చివరికి ఏవేవో షరతులతో విడుదల చేశారామెను. ఆ ఆదేశాలు 1976 జనవరిలో అందాయి. వాటిల్లోనూ ‘ఉత్త్వ’ర్వుల మాయాజాలం! ఆఖరికి ఎలాగైతేనేం విడుదలయ్యారు. తన కథను తాను రాశారు. కాలం గడిచింది. కారాగార గది గోడల వాతావ‘రణం’ తప్పలేదు ఆమెకి. పక్షవాత సమస్య చుట్టుముట్టి, ఊపిరితిత్తుల బాధ తోడుపడి, మరో లోకానికి వెళ్లిపోయారు. తిరిగి ఇక్కడికి రాలేని లోకం అది!
విజయరాజె సింధియా, ఈమె కూడా మహారాణి, గ్వాలియర్‌కి. ప్రజల్లో ఈమెకీ అపార ఆదరణ ఉంది. రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాని పాలకపక్షం ఈమెపైన కూడా ఆర్థిక నేరాల అభియోగాలను మోపి, ఆత్యయిక స్థితిని ఇష్టానుసారం వాడేసుకుంది. ఇరుకిరుకు జైలు గదిలో నిర్బంధించింది. గాలి చొరబడని గది అదంతా!
దోమల వీరవిహారం అక్కడి ‘అదనపు సౌకర్యం’! అంతా అత్యవసర స్థితీగతీ. అదే సంవత్సరం (1975) సెప్టెంబర్ 3న రాజమాత విజయరాజె సింధియాను తిహార్ జైలుకి తెచ్చారు పోలీసులు. అప్పటికే ఆమె బ్యాంకు ఖాతాలన్నింటినీ స్తంభింపచేశారు. సరిగ్గా అక్కడే ఆ గదిలోనే అప్పటికి గాయత్రీదేవి ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని గౌరవంగా నమస్కరించుకున్నారు. మరికొన్ని రోజులయ్యాయి. విజయరాజె సింధియా రాసిన వాస్తవిక గాథ పుస్తకం ‘ప్రిన్సెస్!’ తమ ఉభయుల గురించీ వివరంగా రాస్తూ వచ్చారామె. సమాచారం ప్రకారం ` అదే జైలు గది పరిసరాల్లో ఇతరత్రా ఖైదీలు (కొంతమంది హత్యానేరాల్లో ఉన్నవాళ్లు) తిరుగుతుండేవారు. ఎవరి నుంచి ఎటువంటి ఆపద ముంచొకొస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. గది అంతటా అదో రకం వాసన. ఈగలు తెగ ముసురు తుండేవి. నరకం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఆ గదిని చూస్తే తెలుస్తుంది ఎవరికైనా!
జైల్లో అనారోగ్యంతో తల్లడిల్లిన విజయరాజె సింధియా అటు తర్వాత ఢల్లీిలోని ఆస్పత్రిలో చేరారు. చూసేందుకు కుటుంబ సభ్యులను సైతం అనుమతించలేదు. అలా అధికార పటాటోపం మీద సాగింది ఆమె పోరాటం! మరెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలానికి ఆమె అంతిమశ్వాస విడిచారు. ఆమె ఆరాట పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసమే. ఎదిరించి నిలవడమే తప్ప, రాజీపడటం తెలియని ధీరోదాత్తురాలు. ఆ రోజుల్లో ఎంత అణచివేత ఉందో అంతకు దీటుగా ప్రతి ఘటనా ఉంది. నిరంకుశత్వాన్ని ప్రతిఘటించి ఉద్యమించిన మహిళామణి రత్నాలే ఈ ముగ్గురూ! వీరి చరిత ప్రజాస్వామ్య స్ఫూర్తికి అక్షర ప్రతీక. జయజయజయహే!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్