‘శబ్దానికంతకూ నిశ్శబ్దం మూలమైనట్టు రంగులన్నిటికి తెలుపు మూలమైనట్టు, కళ అంతటికి ప్రకృతి మూలమైంది…. ప్రకృతి శిల్పి అస్తవ్యస్త ప్రకృతిని అద్భుత రూపాల సృష్టిలోనికి మార్చే రూపాంతరీకుడు. ఉత్తుంగ శైల శృంగాలు లోతైన పచ్చని లోయలు, ప్రవహించే సెలయేళ్లు మేఘాచ్చన్న మైన పగళ్లు వర్షపు రాత్రులు, శారద ప్రభాతాలు, గ్రీష్మ సంధ్యలు, ఇవన్నీ కూడా రేఖల లయతోనూ రంగుల రాగాలతోనూ స్పందిస్తుంటాయి’ అని సంజీవ్‌దేవ్ తన స్వీయచరిత్రలో రాసుకున్నారు.
‘సమాజంలోని వివిధ విభాగాలలో జోక్యం పెట్టుకుంటూ సమాజపు ఉత్పత్తిగా ప్రతీ కళాకృతి ఉంటుంది’ అని జానెట్ ఉల్ప్ The Social Production of Art అనే తన గ్రంథంలో పేర్కొన్నాడు. అవి సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరంగా ఉంటుంది. మధ్యయుగంలో మతపరమైన, పౌరాణికమైన వస్తువులతో చిత్రాలు వస్తే తరువాత కాలంలో లౌకిక కళాకృతులు వెలిశాయి. అవి ఆధునిక కాలంలో కళా విద్యారంగంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చాయి. వివిధ పట్టణాలల్లో ప్రయివేటు ఆర్డ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. 1788లో సర్ చార్లెస్ మాటెల్ పూనాలో మొదటి ఆర్ట్ స్కూలును ప్రారంభించారు. డ్రాయింగ్, మోడలింగ్, డిజైనింగ్, శిలాముద్రణ, ఉడ్ కార్వింగ్ మొదలైన అంశాలు ఆ ఆర్ట్ స్కూలు పాఠ్యాంశాలుగా ఉండేవి. రాజా రవివర్మ, యం.వి.దురంధర్, ఎ.పి. బాగ్జీ, బి.పి. బెనర్జీ, గణపతిరావ్ మెహాతే, పిజీరామ్ వంటి వారి చిత్రాలలో వీటి ప్రభావం కన్పించేది. కానీ ఒక కొత్తరకం చిత్రకళ మన రాజమహేంద్రవరంలో పురుడు పోసుకుంది. నాటకరంగం దానికి ఊత మిచ్చింది (నాటక ప్రదర్శనలో ఉపయోగించే తెరల తయారీ). ఈ నేపథ్యంలో పుట్టారు దామెర్ల (మార్చి 8,1897-ఫిబ్రవరి 6,1925).
హైస్కూల్ స్థాయిలోనే గాడిచర్ల రామమూర్తి, ఎర్రింకి వెంకటశాస్త్రి లాంటి చిత్రకారులు విద్యార్ధు లను చిత్రకళ వైపు ఆకర్షితులయ్యేటట్టు చేసేవారు. ఇదే సమయంలో 1909లో రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలప్రిన్సిపాల్‌గా ఆస్వాల్డ్ కూల్డ్రే నియమితు లయ్యారు. ఆయన పూర్వం లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్డస్‌లో విద్యార్థి. చిత్రలేఖనంపై ఎంతో ఆసక్తి కనపరిచాడు. గొప్ప కవి కూడా. ఆయన దామెర్ల రామారావు బొమ్మలను చూసి ఎంతో మెచ్చుకొని చిత్రకళతో ఎన్నో మెలుకువలను నేర్పి ప్రోత్సహిం చాడు. తన చుట్టూ ప్రతిభగల విద్యార్ధులను సమకూర్చుకున్నాడు. చిత్రలేఖనం నేర్చుకోవడానికి అందులోని వివిధ కోణాలను గురించి చర్చించడానికి వారికి అవకాశం కల్పించాడు. ఆ కాలేజీలో దామెర్ల రామారావు అన్న పని చేసేవాడు. అతని ద్వారా కూల్డ్రే రామారావును మొదటిసారి కలుసుకున్నాడు. అప్పటికి రామారావు వయసు 10 సంవత్సరాలు. బొగ్గుతో గోడలపై బొమ్మలు వేసేవాడు. అతనికో మిత్రుడు ఉండేవాడు. అతడు వరదా వెంకటరత్నం. ఇతడు కూడా చిత్రకారుడే. ఇతనిపై రామారావు ప్రభావం మెండుగా ఉండేది.
దామెర్ల రామారావు మార్చి 8, 1897న జన్మించినారు. తండ్రి దామెర్ల వెంకట రమణరావు. ప్రముఖ వైద్యుడు. తల్లి లక్ష్మీదేవి. వారి రెండవ కుమారుడే రామారావు. ఆయన మేనమామ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేసేవారు. రామారావుపై ఆయన ప్రభావం మెండుగా ఉండేది. 6 సంవత్సరాల వయసులోనే గోడపై బొగ్గుతో బొమ్మలు వేయడం ఆ తరువాత తెల్ల కాగితంపై పెన్సిల్‌తో బొమ్మలు వేసి అందరి అభినందనలు పొందేవాడు. తరువాత గోదావరి గట్టుమీద కూర్చుని, లాంచీల్లో తిరుగుతూ, అనేక ప్రకృతి దృశ్యాలను వేశాడు.
బొంబాయిలో అప్పటికే చిత్రలేఖనం నేర్పడానికి జమ్జెట్జీ జీజీబాయ్ స్కూల్ ఆఫ్ ఆర్టస్‌ను 1878లో స్థాపించారు. ఆస్వాల్డ్ కూల్డ్రే దామెర్ల రామారావును తన సొంత ఖర్చుతో బొంబాయి జె.జె. కాలేజీకి పంపారు. నాడు డీన్ సి.సి.ఎల్.ఎన్.బర్నస్ వద్దకు వెళ్లారు రామారావు. శిక్షణ లేకున్నా, వ్యక్తీకరణ బలంగా లేకున్నా కాని రామారావు స్కెచ్‌లు డీన్‌ను ఆకట్టుకున్నాయి. దీని ఫలితంగా రామారావును నేరుగా 3వ సంవత్సరంలో చేర్చుకున్నారు. ఇతని రచనలు ఫ్రాన్స్‌కు చెందిన పువ్స్.డి.చావెన్నెస్ (పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్) బొమ్మలతో పోల్చారు. రామారావులోని కళామతల్లిని చూసి ఆయనను అజంతా ఎల్లోరా తీసుకువెళ్లి వాటిని గీయించారు. రామారావు రచనల్లో ఎంతగానో ఆకట్టుకున్న ‘‘తూర్పు కనుమల గోదావరి’’ చిత్ర లేఖనాన్ని వైస్రాయ్ లార్డ్ రీడింగ్ కొనుగోలు చేశాడని చెబుతారు. జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్టస్‌లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ‘‘మేయో’’ బంగారు పతకాన్ని పొందాడు. రామారావును జె.జె.స్కూల్ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉండాలని కోరినా తన స్వరాష్ట్రంలోనే కళామతల్లికి సేవ చేస్తానని చెప్పి రాజమండ్రి వచ్చి అక్కడ ఆర్ట్ స్కూల్‌ను ప్రారంభించారు.
1922లో కలకత్తా చిత్ర కళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన ‘‘రుష్యశృంగ బంధనం’’ చిత్రానికి ప్రథమ బహుమతిగా ‘‘వైస్రాయ్ ఆఫ్ ఇండియా’’ పతకం వచ్చింది. కలకత్తాతో పాటు లండన్, టోరంటోలలో కూడా ఈ చిత్రాలను ప్రదర్శించారు. రామారావు చిత్రించిన గొల్ల పడుచు గోదావరి లోయ, పుష్పా లంకరణ (సీమంతం), ద్రోణుడు, సిద్ధార్థుని రాగో దయం, బావి దగ్గర, భరత వంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నందిపూజ, పేరంటము, కార్తీక పౌర్ణిమ, కృష్ణలీల మొదలైన చిత్రాలు దేశవిదేశాల్లో ఎన్నో ప్రశంసలను పొందాయి.
బరోడా మహారాజు రామారావు గీసిన చిత్రాలను చూసి అబ్బురపడి ఆయనను ఘనంగా సత్కరించారు. కలకత్తా, బొంబాయి నగరాల్లో నిర్వహించిన బ్రిటిష్ ఎంపైర్ ప్రదర్శనశాలల్లో దామెర్ల చిత్రాలను చూసిన విదేశీయులు ఎంతగానో కొనియాడారట. విశ్వ విఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ నైపుణ్యం దామెర్ల గారిది. 1925లో 28 ఏళ్లకే ఆయన అకాల మరణం చెందారు. 1929లో రాజమండ్రి వంకాయలవారి వీధిలో దామెర్ల వారింట్లో దామెర్ల రామారావు ఆర్ట్ గాలరీని గాంధీజీ ప్రారంభించారు. రామారావు గీసిన 34 తైలవర్ణ చిత్రాలు, 129 నీటి రంగుల చిత్రాలు, 250 పెన్సిల్ స్కెచ్‌లు, 25 స్కెచ్ బుక్కులు రాజమండ్రిలో ఉన్నాయి.
ఆ రోజుల్లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గుజరాత్‌లోని దక్షిణామూర్తి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూండగా రామారావు సాధారణ తెల్ల కాగితం పై రవీంద్రుని రూప చిత్రం పెన్సిల్ స్కెచ్ గీసి చూపించి ఆయన ఆశీస్సులు పొందారు. గురుదేవ్ ఆహ్వానం మేరకు శాంతి నికేతన్ సందర్శిం చారు. 1919 జూన్‌లో రామారావుకు సత్యవాణితో వివాహమయ్యింది. ఆమె గర్భవతి కాగా ఆమెకు సీమంతం చేశారు. దానిని ఆయన చిత్రంగా గీశారు, అది గొప్ప కళాఖండమైంది. ఆ కాలంలోనే రామారావు సిద్దార్ధ రాగోదయం చిత్రించారు. అది దేశోద్దారక నాగేశ్వరరావు గారు ప్రారంభించిన భారతి పత్రికకు కొంతకాలం ముఖచిత్రమయ్యింది.
1925లో సత్యావాణీతో కలిసి తిరుపతి వెళ్ళి ఆలయ పరిసరాలకు సంబంధించిన అందాల్ని స్కెచ్ పుస్తకంలో ప్రతిరూపించారు. తిరుగు ప్రయాణంలో మశూచి కారణంగా అనారోగ్యం పాలై మరణిం చారు. కేవలం మూడు పదులకు ఆ చిత్రకారుడి జీవిత చిత్రం అసంపూర్ణ దశలోనే వెలవెలబోయింది.
మిత్రుడు రామారావు కీర్తిశేషులైననూ వారి పేరు చిరస్థాయిగా ఉంచాలనే దృక్పధంతో ‘‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’’ అనే పేరుతో చిత్ర ప్రదర్శనా శాలను 1925లో శ్రీ వరదా వెంకటరత్నం గారు ప్రారంభించారు. తరువాత రామారావు స్కూల్ ఆఫ్ ఆర్టస్‌కు ప్రిన్సిపాల్‌గా ఉంటూ సుమారు నాలుగు దశాబ్దాలు మిత్రుని శాంతికి, ఆశయ సిద్ధికి కృషి చేసి వందలాది శిష్యులకు గురువుగా తన విధిని నిర్వర్తించారు.
చిత్ర లేఖనా విమర్శకుడు జి. వెంకటాచలం శ్రీ దామెర్ల రామారావు గురించి ఇలా వ్యాఖ్యా నించారు. ‘‘ఈ చిత్రకారుడు తన వ్యవహర శైలిని లార్డ్ లీటుంగ్ చిత్రాల నుండి గ్రహించాడు. లీటుంగ్ ఎంతో అధికంగా గ్రీకు కళారచన వలన ప్రభావితు డయ్యాడు. దేశీయ వస్తువులపై దేశీయ అంశాలతో చిత్రించడంలో అతడు చేతన ప్రయత్నంతో తన దృష్టిని కేంద్రీకరించడాన్ని ఎవరూ కాదనలేరు’’.
మూలం:
- ఆధునిక ఆంధ్రా, హైదరాబాద్,, చిత్ర కళాభివృద్ధి బై సుధారెడ్డి, పేజీ.559.
- A History of Indian Painting Volume-2, Page 162
- సుంకర చలపతిరావు, దామెర్ల రామారావు శతవర్ధంతి వ్యాసం
- చిత్ర కళా తపస్వి శ్రీ వరదా వెంకటరత్నం బై నేదునూరి గంగాధరం.
వేదంలా ఘోషిస్తూ ఉంటుంది గోదావరి. అమరధామంలా శోభిస్తూ ఉంటుంది రాజమహేంద్రి. ఆ గట్టు మీద కూర్చుని అందాలు ఆస్వాదించేవాడు ఆ బాలుడు. ఆ తరంగాల సోయగం, తీరాల సౌందర్యం ఆ బాలుడిని ఎలాంటి తర్ఫీదు లేకుండానే ఆకర్షణీయమైన చిత్రాలు గీసేందుకు ప్రేరేపించాయి. బొగ్గు చేతబట్టి ఇంట్లోనే బొమ్మలు గీసేవాడు. తరువాత ఆ బాలుడే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్రకారుడయ్యాడు. పేరు దామెర్ల రామారావు.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు