శాలివాహన 1946 శ్రీ క్రోధి ఫాల్గుణ శద్ధ ఏకాదశి – 10 మార్చి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


దేవమాన్యాలకు ఒక పరమార్ధం ఉంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు, వారి భోజనవసతి వంటి వాటికి, హిందూ బాలబాలికల విద్యావ్యాప్తికి అవి ఉపయోగపడాలి. ఇంకా, ఆలయ వ్యవస్థలతో తరతరాలుగా అనుబంధం కలిగిన కుటుంబాలను ఆదుకోవాలి. శిల్పులు, కళాకారుల కడుపు నింపాలి. దశాబ్దాల నాడో, శతాబ్దాల నాడో ఆలయాలకు భూములు ఇచ్చిన వారి, ఇతర దానాలు చేసిన వారి అంతరంగం ముమ్మాటికీ అదే. కానీ బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలకు డబ్బులు లేవు కాబట్టి, దేవాలయాలు (హిందూ దేవాలయాలు మాత్రమే) ధన సహాయం చేయాలని ప్రభుత్వాలు కోరడంలో ఔచిత్యం ఏమిటి? ఈ పనే నిస్సిగ్గుగా చేసింది హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువైన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఒక పక్కన హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం కూలాలని విశ్వహిందూ పరిషత్‌ దేశవ్యాప్త ఉద్యమానికి సమాయత్తమవుతుంటే ఇలాంటి పితలాటకం తేవడం కాంగ్రెస్‌కే చెల్లింది. మెజారిటీ హిందువుల పట్ల ఆ పార్టీకి ఉన్న గౌరవం ఎంతటిదో ఇదే చెబుతోంది. సుఖ్విందర్‌ సింగ్‌ సుకు నాయ కత్వంలో డిసెంబర్‌ 2022న హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 28, 2023న సెప్టెంబర్‌ 3, 2024న ఆ పథకాలను ప్రకటించారాయన. వీటి ఉద్దేశం మంచిదే. 6000 మంది అనాథ బాలబాలికలకు ఆశ్రయం, విద్య, సంక్షేమం కోసం వాటిని ప్రవేశపెట్టారు. వీటి కోసం 2024`25 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.272.27 కోట్లు కేటాయించినా మళ్లీ ఆలయాల నుంచి నిధులు కోరడమే వింత.

 జనవరి 29న సామాజిక న్యాయం, సాధికారత శాఖ పేరుతో ఇచ్చిన పత్రికా ప్రకటన ఉద్దేశం ఆలయాలు వాటి నిధులు సర్కారు ఖజానాలో కుమ్మరించాలనే. ఆ రెండు పథకాలని బతికించడం కోసం గుడులు విరాళాలు ఇవ్వాలట. నిజం చెప్పాలంటే నిధుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడులకు మెత్తగా హుకుం జారీ చేసింది. ప్రభుత్వ దేవాదాయా ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల నుంచి మాత్రమే విరాళాలు కోరుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొని, కాస్త మసి కూడా పూశారు. ఎలా అంటే, సర్కారు వారి కొన్ని కార్యకలాపాలకు నిధులు ఇవ్వడం మన ఆలయ ధర్మకర్తల మండళ్లుకు రివాజే సుమా అంటూ ఆ ప్రకటన ముక్తాయించింది. ఇందులో మతలబేమిటో సులభంగానే తెలుస్తుంది. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా, దేవస్థానాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుస్తాయి. అందుకే హిమాచల్‌ సర్కారు అంత ధీమాగా నిధులు కోరింది. గుడులను గుల్ల చేయాలని చూస్తోంది.

హిమాచల్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో 36 పెద్ద ఆలయాలు ఉన్నాయి. వీటికి రూ. 400 కోట్ల మేరకు డిపాజిట్లు ఉన్నాయని అంచనా. జఖు, జ్వాలాజీ, చాముండ, చింత్‌పూర్ణి, నైనాదేవి, బజరేశ్వరి, బైజనాథ్‌, లక్ష్మీనారాయణ ధర్మకర్తల మండళ్లు వాటిలో ముఖ్యమైనవి. చిత్రం ఏమిటంటే ప్రభుత్వం అడిగింది కాబట్టి, ఆలస్యం తగదన్న తీరులో జఖు, తారాదేవి (సిమ్లా) ధర్మకర్తల మండళ్లతో పాటు ఇంకొన్ని కూడా ఇప్పటికే దేవుడి నిధులు ప్రభుత్వానికి అర్పించే మార్గాల గురించి చర్చించడం కూడా పూర్తి చేశాయని జాతీయ మీడియా ఘోషిస్తున్నది. కాబట్టే, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధుల కోసం గుడులను దేబిరించడం లేదు, ఘరానాగా దోచేస్తున్నది అని ప్రతిపక్ష బీజేపీ ఘాటు విమర్శలకు దిగింది.

 రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలా ధర్మకర్తల మండళ్ల నుంచి నిధులు గుంజాలని చూడలేదని, ఇది పూర్తిగా అసంబద్ధమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు జైరామ్‌ ఠాకూర్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి సుఖు, ఆయన పార్టీ కాంగ్రెస్‌ తెల్లవారి లేస్తే సనాతన ధర్మాన్ని దూషిస్తూ ఉంటారని, కానీ హిందూ దేవాలయాల నిధులు మాత్రం కావాలని విమర్శించారు. ఇలా నిధుల కోసం అభ్యర్ధిస్తున్నట్టు నటిస్తూనే, ఆలయాల అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆయన అసలు గుట్టు బయటపెట్టారు. రెండేళ్లుగా ఈ పథకాల గురించి రాష్ట్రంలో అంగుళం కూడా మిగల్చకుండా అడ్వర్‌టైజ్‌మెంట్లు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించారనీ, ఫలితంగా లబ్ధిదారులకు లేదా బాధితులకు సున్నా మిగిలిందనీ ఆయన చెబుతున్నారు. బడ్జెట్‌లో ఆ పథకాల కోసం నిధులు కేటాయించడం నిజమే అయితే ఇలా దేవాలయాల మీద దండెత్తడం ఎందుకు అన్నదే ఆయన ప్రశ్న. ఇంతవరకు సుఖ్‌ శిక్షా పథకం మీద నిధుల కోసం ఖర్చు చేసినది రూ.1.38 కోట్లు మాత్రమేననీ, సుఖ్‌ ఆశ్రయ పథకం మీద ఆ మాత్రం కూడా వెచ్చించలేదని ఆయన చెప్పారు. ఆలయాల నుంచి నిధులు సేకరణ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఇందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తలాతోకా లేని వివరణ ఇచ్చింది. తాము దేవాలయాలనే కాకుండా, సాధారణ ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, చిన్నారుల కోసం, మహిళల కోసం కార్యక్ర మాలు చేపట్టి అందుకు నిధులు సేకరిస్తున్నదని ఆమె చెప్పారు. అంతవరకు సరే! సంక్షేమ పథకాలకు ఒక్క దేవాలయాల నుంచే ఎందుకు డబ్బులు లాగుతున్నారన్నదే ప్రశ్న. అతి పెద్ద భూస్వామిగా అవతరిస్తున్న వక్ఫ్‌బోర్డునీ, విదేశీ నిధులతో కోట్లకు పడగలెత్తిన చర్చ్‌లని ప్రభుత్వం ఎందుకు విరాళాలు కోరడం లేదు? ఈ యాచనకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుగోలుగా ఇస్తున్న ఉచితాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా అడ్డమైన ఉచితాలు ప్రకటించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

నిన్న కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడుల మీద కప్పం విధించి భంగపడిరది. ఇప్పుడు అదే దుశ్చర్యకు హిమాచల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒడిగడుతోంది. ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్నెన్ని రుజువులు కనిపిస్తున్నా కాంగ్రెస్‌ తన హిందూ ద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయవద్దా మరి!

About Author

By editor

Twitter
YOUTUBE