ఈ ‌యువకుడు భారతదేశానికి ప్రధాని కాగలడు అంటూ ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ ఒకానొక సందర్భంలో అటల్‌ ‌బిహారీ వాజపేయి గురించి ఒక బృందంతో అన్నట్టు చెబుతారు. ఆ నెహ్రూయే మరొక సందర్భంలో వాజపేయి వంటి వ్యక్తులని అక్కడికి అనుమతించడం నాకు నచ్చదు అని కశ్మీర్‌ ‌విషయంలో లేఖ రాశారు. ఈ విషయం అభిషేక్‌ ‌చౌధురి రాసిన పుస్తకం ‘వాజపేయి: ది ఎసెంట్‌ ఆఫ్‌ ‌ది హిందూ రైట్‌ 1924-1977 అన్న పుస్తకంలో నమోదు చేశారు. దాని గురించి క్లుప్తంగా.

ఆ యువ జనసంఘీయుడు పెద్ద తలనొప్పేమీ కాదని కొద్దికాలం అనుకున్నారు వాజపేయి గురించి నెహ్రూ. కానీ అటల్‌జీ కొన్ని చర్యలు క్షమింపరాని తప్పిదాలుగా నెహ్రూకి కనిపించాయి. వాజపేయి అడపా దడపా జమ్ము సందర్శించేవారు.  జమ్ముకు సమీపంలోని కశ్మీర్‌ ‌లోయ ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు. అక్కడితో ఆగేవారు కాదాయన. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 అధికరణాన్ని తొలగించవలసిందిగా భావోద్వేగంతో, కవితాత్మ కంగా పార్లమెంటులో విన్నవిస్తూ ఉండేవారు. ఇదంతా చూసి షేక్‌ అబ్దుల్లా సన్నిహితుడు పీర్‌ ‌మహమ్మద్‌ ‌గిలానీ నెహ్రూ కలుసుకుని మరీ ఫిర్యాదు చేశాడు. 1958లో గులాం బక్షీ ప్రభుత్వం ఉండేది. కశ్మీర్‌లో పుట్టి పెరిగిన మమ్మల్ని గులాం బక్షీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. కానీ వాజపేయి వంటి యువ జనసంఘీయులని, అభ్యంతరకర ప్రసంగాలు చేయడానికి మాత్రం అనుమతిస్తున్నారు అన్నదే ఆ ఫిర్యాదు సారాంశం. ఇది 1958 ఫిబ్రవరిలో జరిగింది.

 క్షణం కూడా ఆలస్యం చేయకుండా నెహ్రూ ముఖ్యమంత్రి గులాం మహమ్మద్‌ ‌బక్షీకి ఒక లేఖాస్త్రం సంధించారు. వాజపేయి అత్యంత అభ్యంతరకర మైన వ్యక్తి అని అందులో వ్యాఖ్యానించారు. అతడు జమ్ముని ఆగమాగం చేయగల సమర్ధుడు. దానితో నీవు అనుసరిస్తున్న విధానానికి గండి కొట్టగలడు అని కూడా ఆ లేఖలో హెచ్చరించారు నెహ్రూ. పనిలో పనిగా కేబినెట్‌ ‌కార్యదర్శి విష్ణు సాహేకు కూడా ఒక లేఖ రాశారాయన. ఆ హిమాలయ రాష్ట్రానికి భవిష్యత్తులో ఈ యువ జనసంఘీయుడిని అనుమతించబోమని మీరు నాకు కచ్చితంగా చెప్పాలి అన్నది ఈ లేఖ సారాంశం. ఆ లేఖలోనే, వాజపేయి వంటి వ్యక్తులను స్వేచ్ఛగా అక్కడికి అనుమతించడం నాకు నచ్చదు అని రాశారు. అయితే ఆ తరువాత కొద్దికాలానికి ఇద్దరి మధ్య వేడి కాస్త చల్లారింది. 1958 ఆగస్ట్‌లో అంతర్జాతీయ పరిస్థితి మీద చర్చ జరిగింది. అందులో వాజపేయి మాట్లాడారు. నెహ్రూ అనుసరిస్తున్న విదేశాంగ విధానంగా మొత్తంగా చూస్తే బాగానే ఉంది అని వాజపేయి శ్లాఘించారు. అయితే… తనదైన సహజ శైలిలో… భారత్‌కు నేరుగా ఏమీ పర్యవసానాలు ఎదుర్కొనవలసి అవసరం లేనప్పటికీ కొన్ని అంతర్జాతీయ సంఘటన లలో అనవసరంగా తలదూర్చుతున్నారని ఒక వాత వేశారు. ఈ విమర్శ గురించి ప్రథమ ప్రధాని పట్టించుకోలేదు. ఎందుకంటే నాటికి వాజపేయి తొలిసారి ఎంపీ• కావడమే కాదు, పాస్‌పోర్టు కూడా ఆయనకు లేదు. అయితే భారత విదేశాంగ విధానం సరైన మార్గంలో వెళుతున్నదని వ్యాఖ్యానించినందుకు వాజపేయికి నెహ్రూ ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే భారతదేశానికి ఎలాంటి లబ్ధి చేకూర్చని విషయాల జోలికి పోకపోవడమే మంచిదన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని కూడా చెప్పారు. తీరా రెండో సంవత్సరంలో ప్రవేశించేసరికి వాజపేయి కాస్త వైఖరి మార్చుకున్నారు. నలుగురు సభ్యులున్న ప్రతిపక్షం జనసంఘ్‌ ‌నేతగా లోక్‌సభలో ఉండవలసినంత పదునుగా తన ఉపన్యాసాలు ఉండడం లేదని ఆయన అభిప్రాయానికి వచ్చారు.  తాను పార్టీ కార్యక్రమాలలో, బహిరంగ సభలలో మాట్లాడినంత తీవ్ర స్థాయిలో మాట్లాడడం లేదని ఆయన అభిప్రాయం. అప్పుడే బాగా ఎదురు చూసిన తరువాత లోక్‌సభలో మాట్లాడే అవకాశం వచ్చింది. అదికూడా నూన్‌ ఒప్పందం గురించి. భారత భూభాగాన్ని ఇతరులకు ధారాదత్తం చేయడానికి ఏ ఒక్కరికీ భారత రాజ్యాంగం హక్కు ఇవ్వలేదని వాజపేయి అన్నారు. నూన్‌ ఒప్పందానికి వ్యతిరేకంగా జనసంఘ్‌ ‌సభ్యులతో పాటు వాజపేయి కూడా అరెస్టు కావడం నెహ్రూకు నచ్చలేదు. అయితే పాకిస్తాన్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం కాగలదన్న ఉద్దేశంతో నెహ్రూ బేరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు (ఇప్పటి బాంగ్లా) అప్పగించడానికి అంగీకరించాడు. ఇదే నూన్‌-‌నెహ్రూ ఒప్పందం. దీని గురించి జనసంఘ్‌, ‌వాజపేయి నెహ్రూను తీవ్రంగానే విమర్శించాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE