రెండు దశాబ్దాల కిందట బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆ‌ఫ్రికాలతో కూడిన కూటమికి ‘బ్రిక్స్’ అం‌టూ గోల్డ్‌మాన్‌ ‌సాక్స్ ‌చైర్మన్‌ ‌జిమ్‌ ఓ ‌నీల్‌ ‌నామకరణం చేసినప్పుడు, అది ఒక శక్తిమంతమైన భౌగోళిక రాజకీయ, పాశ్చాత్యేతర శక్తిగా ఎదుగుతుందని ప్రపంచం ఊహించి ఉండదు. అర్థ దశాబ్దకాలంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న తరుణంలో బ్రిక్స్ ‌భావనకు ప్రాధాన్యత పెరిగి, బహుళధృవ, డాలరేతర ప్రపంచం దిశగా పరివర్తనకు అధికారికంగా రష్యాలోని కజాన్‌లో జరిగిన సమావేశంలో పునాదులు పడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్ధిక క్రమానికి కీలక వృద్ధి యంత్రాలుగా మారుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్, 134 అం‌శాలతో కూడిన తన ‘కజాన్‌ ‌డిక్లరేషన్‌’‌లో ప్రజాస్వామిక ప్రపంచ క్రమాన్ని, సమానత్వాన్ని, పారదర్శకత, నిజాయితీతో కూడిన సంబంధాలతో బహుళపాక్షికతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, ప్రపంచ, ప్రాంతీయ భద్రత, ఆర్ధిక సహకారం, ప్రజా సంబంధాల ప్రతిబింబించింది.

ఏకధ్రువ ప్రపంచంలో డాలర్‌ను ఆయుధీక రించి అమెరికా చేస్తున్న అకృత్యాలతో, దాని పెత్తనంలో ఉన్న ఐఎంఎఫ్‌, ‌ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నియంత్రణలతో విసిగిపోయిన గ్లోబల్‌ ‌సౌత్‌గా ప్రాచుర్యం పొందిన పేద, బలహీన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలూ అమెరికాకు ప్రత్యామ్నాయం కోసం ఆరాటపడుతున్న తరుణంలో బ్రిక్స్ ‌భావన బలపడింది. ముఖ్యంగా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం, రష్యాపై ఆంక్షలు, రష్యా భారత్‌, ‌చైనాలు తమ తమ కరెన్సీలలో వ్యాపారం జరుగుతున్న క్రమంలో బ్రిక్స్ ‌భావన బలం పుంజుకుని, దాని ప్రాధాన్యత పెరిగింది. భౌగోళిక వైవిధ్యం కారణంగా ఈ కూటమి పట్ల తొలుత కొన్ని అనుమానాలు వ్యక్తమయినప్పటికీ, వారి ఆర్ధిక పథాలలో ఉన్న పోలికల వల్ల వాస్తవంలో ఒక బలమైన, ప్రబల సంకీర్ణంగా బ్రిక్స్ ఉద్భవించిందంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ ‌పాండా మీడియాతో అన్న మాటలు అక్షర సత్యం. ప్రస్తుతం బ్రిక్స్ ‌దేశాలు తమ దేశీయ కరెన్సీలలో ఇతర సభ్య దేశాలతో వ్యాపార లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఈ వ్యవస్థ సౌలభ్యాన్ని కల్పిస్తోంది.

ఏమిటీ బ్రిక్స్, ‌బ్రిక్స్ ‌ప్లస్‌?

‌బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆ‌ఫ్రికానే కాకుండా తమతో సహకరించే ఇతర దేశాలను కూడా కలుపుకొని బ్రిక్స్ ‌వేదిక ఏర్పడింది. ప్రస్తుతం సమష్టిగా ఈ వేదిక 44.3శాతం ప్రపంచ జనాభాను, 29.5 శాతం భూభాగాన్ని, ప్రపంచ జీడీపీలో 30.8 శాతానికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. కొనుగోలుశక్తి సమానత్వం (పిపిపి-పర్చేజింగ్‌ ‌పవర్‌ ‌ప్యారిటీ) విషయానికి వస్తే ప్రపంచ జీడీపీలో 49.7 శాతంగా ఉంది. తమ విలువలను పంచుకుని, తమతో సహకరించాలనుకునే దేశాలకు ద్వారాలు తెరిచే ఉంటాయని, బ్రిక్స్‌ను ‘భాగస్వామ్య రాజ్యాలు’ అనే నూతన శ్రేణి ద్వారా విస్తరించేందుకు చర్చిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌వెల్లడించడం గమనార్హం. అంటే, బ్రిక్స్ ‌దాదాపు ప్రస్తుతమున్న ఏకోన్ముఖ అంతర్జాతీయ క్రమానికి పూర్తి ప్రత్యామ్నాయంగా ఆర్ధిక, సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవించుకునే విధంగా ముందుకు రానుంది.

ఇటీవలే రష్యాలోని కజాన్‌లో జరిగిన సదస్సులో చేసిన ప్రకటనలు నూతన ప్రపంచ క్రమ ప్రాధాన్యా నికి తెరలేపుతున్నాయి. సంక్లిష్టమైన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో విఫలం అవుతున్న పాశ్చాత్య నాయకత్వంలోని ప్రపంచ క్రమానికి కాలదోషం పట్టి, అసంగతమవుతోందన్నది నిపుణుల భావన. ఎదుగుతున్న గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల ఆర్ధిక వృద్ధిని ఈ క్రమం విస్మరిస్తోందని వారంటున్నారు. ప్రస్తుతం బ్రిక్స్ ‌చేపట్టిన ‘ఆహార ధాన్యాల మార్పిడి’ అన్న చొరవ అంతర్జాతీయ ఆహార ధాన్యాల ధరలను నిర్ధారించేందుకు నిజాయితీతో గల సూచికలుగా ఉపయోగపడనున్నాయి. ‘ఈ చొరవను అమలు చేయడం ద్వారా తమ జాతీయ మార్కెట్లలో బహిర్గత శక్తుల జోక్యం, సట్టావ్యాపారం, కృత్రిమ ఆహార కొరతను సృష్టించే యత్నాల నుంచి బ్రిక్స్ ‌దేశాలను పరిరక్షిస్తుంది.’

ప్రపంచ సంస్థల్లో అస్తిత్వంలేక అసంతృప్తి

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన ఏ అంతర్జాతీయ సంస్థల్లోనూ భారత్‌ ‌సహా పలు దేశాలకు శాశ్వత ప్రాతినిధ్యం లేకపోవడం ఒక లోపం. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ ‌స్థానాన్ని కోరుతున్న ప్పటికీ, వారు విస్మరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్‌ ‌నార్త్ (అభివృద్ధి చెందిన దేశాలు)కు అతిపెద్ద ఉత్పత్తి దారులు, వినియోగదారులూ కూడా అయిన గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాలు పాశ్చాత్య నాయకత్వంలోని ఆర్ధిక సంస్థలలో తమకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ దేశాల మధ్య సంఘీభావం పెరిగి, ప్రస్తుత వ్యవస్థ పట్ల తమ అసంతృప్తిని నేరుగా వ్యక్తం చేస్తున్నారని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగానే పాశ్చాత్యేతర కూటములు అయిన బ్రిక్స్ ‌వంటివి పరస్పర గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాలతో వేదికలను అందించ డంతో దాదాపు మూడు డజన్‌ ‌దేశాల నుంచి ఆసక్తి రేకెత్తిందని నిపుణులు అంటున్న మాటల్లో నిజం లేకపోలేదు. వృద్ధి చెందుతున్న లేదా ఉద్భవిస్తున్న ఆర్ధిక వ్యవస్థలకు, గ్లోబల్‌ ‌సౌత్‌ ‌సంక్షేమానికి బ్రిక్స్ ‌ప్లస్‌ ‌ప్రాధాన్యతను ఇస్తోంది. బ్రెట్టన్‌ ‌వుడ్స్ (‌రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం), ఇతర పాశ్చాత్య వ్యవస్థలను ఏకపక్షంగా రూపొందించి, ‘తమకు సరైనదే ప్రపంచానికి కూడా సరైనదనే’ వైఖరితో ఈ దేశాల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాయని, అందుకే బ్రిక్స్ ‌పుట్టిందని విశ్లేషకుల అంటున్నారు.

 వనరులను దోచుకునేందుకు ఒక ప్రాంతంగా మాత్రమే ప్రపంచంలోని ఇతర దేశాలను పరిగణించే పాశ్చాత్య దృక్పథం వల్లనే ప్రపంచ అభివృద్ధిలో నేటి అసమతుల్యతలు సంభవించాయన్నది వాస్తవం. ఈ దృక్పథం అసమానతలను కొనసాగించడమే కాక, సమానత్వం, సహకారంతో కూడిన ప్రపంచ చట్రాన్ని ఏర్పరచే అవకాశాన్ని ఆటంకపరుస్తోంది. ప్రపంచ వ్యవస్థలోని సంక్లిష్టతలను సమర్ధవంతంగా నిర్వ హించే సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ చట్రాన్ని ఒక ప్రాథమిక అవసరంగా గుర్తించడం కీలకం. అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రపంచాల మధ్య ఉన్న అసమానతలను పూడ్చేందుకు బ్రిక్స్‌లో ఉద్భవిస్తున్న ఆర్ధికవ్యవస్థల బలాన్ని ఉపయోగించడం అవసరమనే భావన ఉంది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని, భాగస్వామ్యాలను పెంచి పోషిం చడం ద్వారా అన్ని ప్రాంతాలకూ లబ్ధి చేకూరేలా మరింత సమతలుమైన, సమానమైన ప్రపంచ చట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్ధికవేత్తలు సూచిస్తున్నారు.

పారదర్శకత, సమానత్వమే లక్ష్యాలు

 గ్లోబల్‌ ‌సౌత్‌ అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆహారం, ఇంధన భద్రత అన్నవి అత్య వసరం. అయితే, ఇందుకు బ్రిక్స్ ‌సభ్యుల మధ్య బలమైన విశ్వాసం ఉండాలన్నది ఆర్ధికవేత్తల మాట. పాశ్చాత్య నాయకత్వంలోని వ్యవస్థాగత, ఆర్ధిక, అంతర్జాతీయ గవర్నెన్స్ ‌పట్ల ప్రతి చోటా అసంతృప్తి పెరుగు తోంది. ప్రతి దేశం కూడా తమను కలుపుకు పోవాలని, పారదర్శకత, సమానత్వం ఉండాలని కోరుతున్నప్పటికీ, ఉనికిలో ఉన్న బహుపాక్షిక వేదికలు వీటిని నెరవేర్చడం లేదన్న విషయం బహిరంగ సత్యం. ఈ అంతరాన్ని పూడ్చాలన్న లక్ష్యాన్ని బ్రిక్స్ ‌పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. బ్రిక్స్ ‌ప్లస్‌ ‌సహకార యంత్రాంగంతో పరస్పర లాభదాయక మైన, నిలకడైన పరిష్కారాలను అందిస్తూనే, ఫల వంతంకాని మరొక పాశ్చాత్య వ్యతిరేక వ్యవస్థగా ఈ కూటమి మారకుండా భారత్‌ ‌నివారించాలని వారు చేస్తున్న సూచన గంభీరంగా పరిగణించవలసిన విషయం.

బ్రిక్స్ ‌కరెన్సీకి ఇంకా సమయముంది

కాగా, బ్రిక్స్ ‌సదస్సు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని ప్రకటిస్తుందని, అలాగే వ్యాపార ఆర్ధిక లావాదేవీలకు స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయం ఉంటుందని చాలా బలమైన వాదనలు షికార్లు చేశాయి. అయితే, బ్రిక్స్ ‌ప్రస్తుతానికి అటువంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. తమ దేశీయ కరెన్సీలలో బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలను చేసుకునేందుకు బ్రిక్స్ ఒక అంగీకారానికి వచ్చింది అంతే. గతంలో బ్రెట్టెన్‌ ‌వుడ్స్ ‌సృష్టించినట్టుగా ఒక నూతన ప్రపంచక్రమానికి కజాన్‌లో జరిగిన బ్రిక్స్ ‌నాంది పలికింది. దీని ప్రాముఖ్యత అంతా బహుళధ్రువ ఆర్ధిక ప్రపంచానికి అధికారికంగా ప్రారంభించడంలోనే ఉంది. అయితే ఇది, ఉనికిలో ఉన్న ప్రస్తుత వ్యవస్థను రాత్రికి రాత్రే మార్చివేస్తుందనుకుంటే పొరపాటే. ఒక ప్రత్యా మ్నాయ ఆర్ధిక వ్యవస్థ దిశగా చోటు చేసుకోనున్న మార్పుకు ఇది తప్పనిసరిగా ఒక విశ్వసనీయ అడుగు అనడం అతిశయోక్తి కాదు.

స్విఫ్ట్ ‌గుత్తాధిపత్యానికి పోటీ?

ప్రస్తుతం స్విఫ్ట్ (‌సొసైటీ ఫర్‌ ‌వరల్డ్‌వైడ్‌ ఇం‌టర్‌ ‌బ్యాంక్‌ ‌ఫైనాన్షియల్‌ ‌టెలికమ్యూనికేషన్స్) ‌ద్వారా మాత్రమే ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్ధిక చెల్లింపులు, లావాదేవీలనేవి స్వఫ్ట్ ‌ద్వారానే చోటు చేసుకుంటు న్నాయి. ఇది వినడానికి అత్యంత సాంకేతికంగా అనిపించినా, ప్రపంచ ఆర్ధిక నాడీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచంపైనే పూర్తి గుత్తాధి పత్యాన్ని కలిగి ఉంది. అది రోజుకు కొన్ని ట్రిలియన్ల డాలర్ల మారకాన్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి మళ్లించేందుకు దాదాపు 40 మిలియన్‌ ‌సందేశాలను ప్రాసెస్‌ ‌చేస్తుందిట! ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యూపీఐ ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు సాగిస్తే ఎలా ఉంటుందో ఊహించండి.

అటువంటి ఆర్థిక చెల్లింపు వ్యవస్థ ఖాతాలకు ప్రమాణం అవసరం, దీనితోనే వాణిజ్య ఉత్పత్తుల ధరలు నిర్ణయిస్తారు, తద్వారా లావాదేవీలు జరుగు తాయి. అమెరికా అధిపత్యానికి లంకె కలిపే కీలకం ఈ ఖాతాల వ్యవహారంలోనే ఉంది. ఈ స్విఫ్ట్ ‌ఖాతాకు ప్రమాణం డాలర్‌ ‌కావడమే అమెరికా ఆధిపత్యానికి దారి తీసింది. కృత్రిమమైనదైనా-డాలర్‌కు బలమైన డిమాండ్‌ను సృష్టించేందుకు మార్గాన్ని సుగమం చేసింది.

ఇక్కడే సమస్యలు తలెత్తుతున్నాయి. స్విఫ్ట్ ‌గుత్తాధిపత్యం, దాని డాలర్‌ ఉపయోగం కారణంగా, ప్రపంచ వాణిజ్యంలో పాల్గొనడానికి దేశాలు గణనీయమైన డాలర్‌ ‌నిల్వలను నిర్వహించాలి. దీనితో డాలర్‌ ‌ప్రపంచ రిజర్వ్ ‌కరెన్సీగా మారింది. ఈ నిల్వలు అమెరికా ట్రెజరీ బాండ్ల రూపంలో ఉండడంతో, వాషింగ్టన్‌కు అది కామధేనువుగా మారింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు వారి డాలర్‌ ‌రిజర్వ్‌ను నిర్మించుకోవడానికి – వాణిజ్యం కోసం అమెరికా ట్రెజరీలను కొనుగోలు చేయడం మినహా మరొక మార్గం లేకుండా పోయింది. ఆ గుత్తాధిపత్యంతోనే, డాలర్‌ను గ్లోబల్‌ ‌రిజర్వ్ ‌కరెన్సీగా స్థాపించడమే కాకుండా ఇతర దేశాలపై ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికాకు స్విఫ్ట్ అం‌దిస్తుంది.

అమెరికా ఆంక్షలకు బ్రిక్స్ ‌విరుగుడు

అమెరికా ఆంక్షలు విధించడమంటే, లక్ష్యం చేసుకున్న దేశపు బ్యాంకులను స్విఫ్ట్ ‌వ్యవస్థ నుంచి తొలిగించి, దానిని ప్రపంచ వాణిజ్యంలోకి రాకుండా నిరోధించడమన్నమాట. ఈ పనిని అమెరికా దశాబ్దాలుగా చేస్తూ వస్తోంది. దీనికి విరుగుడుగా, సుముఖంగా ఉన్న భాగస్వాముల మధ్య ద్వైపాక్షిక దేశీయ కరెన్సీలతో లావాదేవీలను నిర్వహించుకునే అవకాశాన్ని బ్రిక్స్ ‌ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవస్థ అమలులోకి వచ్చింది కూడా. ఇటీవలి కాలం వరకూ, అమెరికాను సవాలు చేస్తూ, ఆంక్షలు విధించిన దేశాలతో వ్యాపారలావా దేవీలు జరిపేందుకు దేశాలు సుముఖంగా లేవు. అయితే, రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. భారత్‌, ‌చైనా సహా పలు దేశాలు రష్యాతో దైపాక్షిక వాణిజ్యాన్ని ప్రారంభించి, సఫలం అవుతుండడంతో పలు దేశాలు ఈ తరహా వాణ్యిం పట్ల మొగ్గు చూపుతున్నాయి.

అమెరికా ఆర్ధిక ఆధిపత్యానికి చిక్కులు

మొత్తం ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 35-40 శాతం వాణిజ్యం బ్రిక్స్ ‌సభ్యులు, వారి నూతన భాగస్వామ్య దేశాల మధ్య జరుగుతోంది. ఈ వాణిజ్యంలో సగం ద్వైపాక్షిక, బహుళ పాక్షిక వాణిజ్యం వైపు మళ్లినా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భూకంపం వస్తుంది. దీనితో వాణిజ్య సరళులను ప్రతిబింబించే కేంద్ర బ్యాంకు రిజర్వుల్లో దశాబ్దం దశాబ్దమున్నర కాలంలో డాలర్‌ ‌నిల్వలు పడిపోయే అవకాశం ఉంది. ఫలితంగా, ఆర్ధిక శక్తిగా అమెరికా ఆధిపత్యానికి తీవ్రమైన దెబ్బతగలడమే కాదు, అది విధించబోయే ఆంక్షలలో పస ఉండదు.

ఏది ఏమైనా ఎటువంటి అట్టహాస ప్రకటనలు లేకుండానే నిశ్శబ్దంగా ప్రత్యామ్నాయ ఆర్ధిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ, డాలర్‌ ఆధిపత్యం క్రమ క్షీణతకు నాంది పలికినదిగా కజాన్‌ ‌సదస్సును రానున్న తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఈ మార్పులు తక్షణమే కనిపించకపోయినా, దిశ మాత్రం స్పష్టం.

ప్రపంచ వాణిజ్యం, విత్తమనే గొప్ప చదరంగంలో బ్రిక్స్ ఇప్పుడు అత్యంత సూక్ష్మమైనదైనా, నిర్ణయాత్మకమైన ఎత్తువేసిందని ఆర్ధిక విశ్లేషకులు అంటున్న మాటలు వాస్తవం కావాలని ఆశిద్దాం.

– డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE