నవంబర్‌ 15 ‌గురునానక్‌ ‌జయంతి

మానవుడికి ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికచింతన లాంటివి దివ్యసంపద. అవి మనిషిని ‘మనీషి’ చేస్తాయి. ఆ లక్షణాలు లోపించినప్పుడు ఎన్ని సంపదలు ఉన్నా వృథా. నేను మనిషిని మాత్రమే చూస్తాను. అతడు ధరించిన మత పరమైన దుస్తులు, విశ్వాసాలతో నిమిత్తం లేదు.. బాహ్య ప్రపంచాన్ని జయించాలనుకునే ముందు స్వీయ లోపాలను సరిదిద్దుకోవడం అత్యంత ముఖ్యం… ఇది సిక్కు మతప్రవక్త గురునానక్‌ ‌దేవ్‌ ‌ప్రబోధం.

ప్రస్తుత పాకిస్థాన్‌లోని రావీ నదీతీరంలోని నన్‌ ‌కానా సాహిబ్‌ (‌తల్హాండి)లో 1469లో సంప్రదాయ కుటుంబంలో జన్మించిన గురునానక్‌దేవ్‌ అవతార పురుషుడుగా ఆరాధనలు అందుకుంటున్నారు. ఐదేళ్ల వయస్సు నుంచే నిరంతరం దైవ నామస్మరణ చేస్తుండేవారట. చిన్నతనం నుంచి ప్రశ్నించి, ఆలోచించే తత్వం కలిగిన ఆయన హిందూ మతంలోని తాత్త్త్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదలివెళ్లారు. ఏకాత్మ, పరమాత్మ తత్వాలను ప్రజలకు బోధించారు. ఆయన బోధించిన సిక్కు ధర్మం గురుశిష్య సంప్రదాయానికి సంబంధించినది.

 సామాజిక అంశాలను ఆధ్యాత్మికతకు జోడించి మానవ జాగృతికి తపించిన మహనీయుడు గురునానక్‌దేవ్‌. ‘అహంకారం మనిషికి అతి పెద్ద శత్రువు. దానిని విడనాడి వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలి. మతం, కులం, తెగలకు అతీతంగా మనుగడ సాగించాలి. మానవసేవే మాధవసేవ అనే సూక్తికి సమాంతరంగా సేవా దృక్పథాన్ని అనుసరించాలి. అహం, గర్వం, కోరికలు వదిలి అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. సమభావం కలిగి ఉండాలి’ అని ఉద్బోధించారు. మూఢాచారాలకు, బూర్జువా విధానాలకు, అంధ విశ్వాసాలకు ఆయన ఉపాసన పద్ధతి పూర్తిగా వ్యతిరేకం.

సృష్టిలో ఎవరి కన్నా ఎవరూ తక్కువా, ఎక్కువా కాదంటూ, స్త్రీపురుషుల మధ్య వివక్షను నిరసించారు. భగవంతుని కృపకు ఇరువురు సమపాత్రులేనని అభిప్రాయపడ్డారు. పురుషులకు జన్మనిస్తున్న మహిళలు వారి కంటే ఎలా అల్పులు? అని ప్రశ్నించారు. మహిళలను పరిపూర్ణంగా గౌరవించడంతో పాటు వారికి సమాన ప్రతిపత్తి కల్పించాలని, స్త్రీపురుషుల మధ్య అంతరాలను తొలగించాలని ఐదు శతాబ్దాల క్రితమే ప్రబోధించారు. ‘స్త్రీలు చెడ్డవారైతే గొప్పగొప్ప మహారాజులకు ఎలా జన్మనిచ్చేవారు? వారిని ఎలా పెంచేవారు?’ అన్నది ఆయన సూటి ప్రశ్న.

 ఆయన సర్వేశ్వరవాది. బాహ్యాచారాలు, ఆడంబరాల కంటే, మానసిక సాధన ద్వారానే దేవుడు ప్రీతి చెందుతాడని, అన్ని ప్రాణులలో భగవంతుని చూడగలిగిన వారే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రులని బోధించారు. ‘నిరాకారుడైన భగవంతుడిని విగ్రహారాధన, తీర్థయాత్రలు, ఇతర కర్మకాండల ద్వారా కనుగొనలేం. జీవకోటికి తండ్రిలాంటి పరమాత్మను అన్నిట చూడగలినవారే భగవత్‌ ‌కృపకు పాత్రులవుతారు. స్వార్థరహితంగా సత్కార్యాలు ఆచరించడమే ముక్తికి మార్గం.నిజాయతీతో కూడిన సత్ప్రవర్తనతో జీవించడం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, మంచి నడవడి కలిగి ఉండడమే భగవంతుని చేరేందుకు ఏకైక అర్హత’ అన్నది ఆయన సందేశం. సంప్రదాయక ధార్మిక క్రియలను సామాజిక కోణంలో భాష్యం చెప్పారు. ఉదాహరణకు, యజ్ఞోపవీత ధారణ అంటే… ‘దయ అనే పత్తి, సంతోషం/సంతృప్తి అనే దారం, సంయమనం అనే ముడి’ కూడినదే నిజమైన యజ్ఞోపవీతం అని వ్యాఖ్యానించారు

మానవ మనుగడకు డబ్బు అవసరమే కానీ డబ్బే ప్రధానం కాదంటారు నానక్‌. ‘‌సమాజ హితాన్ని కాదని దోచుకొని దాచుకోవడం ధర్మసమ్మతం కాదు.కష్టించి నిజాయతీతో ఆర్జించిన దానిలో జీవితావసరాలకు పోను అవసరార్థులకు కొంత కేటాయించాలి.ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారు తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు కేటాయించాలి’ అని ప్రవచించారు. ఆర్జించిన దానిలో పదోవంతును అలా వినియోగించాలంటూ ‘దశ్వాంద్‌’ అనే భావనను ప్రవేశపెట్టారు. ఆగర్భ శ్రీమంతుడు కూడా, ఏదో ఒకలా శ్రమించి జన్మను సార్థకం చేసుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. ‘పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుంది’ అని చెప్పడమే కాదు… ఆచరించారు. పొలాలలో పనిచేస్తూ జీవనం సాగించి ఆదర్శంగా నిలిచారు. గురుద్వారలలో నేలను తుడవడం, పాత్రలను శుభ్రపరచడం, నీటిని వంట గదికి చేర్చడం వంటి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రాపంచిక సుఖాలను పట్ల విముఖులను, భోగపరాయణులను ఇద్దరినీ నిరాకరించారు. గృహస్థాశ్రమం ఉత్తమమార్గమని బోధించారు. జీవితాన్ని నిండుగా ఆస్వాదించిన వారే సమాజ హితైషులని, వారు సమాజానికి మేలు చేయగలుగుతారని పేర్కొన్నారు.

కులభేదాలకు అతీతంగా ప్రసాదం (లంగర్‌) ‌స్వీకరించడం, సంగీతంతో కూడిన సామూహిక ప్రార్థనలను ఆయన సిక్కు దేవాలయాలు (గురుద్వారాలు)లో ప్రవేశపెట్టారు. శ్రీలంక, నేపాల్‌, ‌టిబెట్‌, ‌చైనా, ఇరాక్‌, ‌సిరియా, టర్కీ, ఇరాన్‌, ‌సౌదీ, అరబ్‌, ‌పాలస్తీనా, ఇరాక్‌, ఆ‌ఫ్రికా దేశాలతో పాటు మనదేశంలో ఐదుసార్లు పర్యటించి తన వాణిని వినిపించారు. వీటినే ‘ఉదాసీ’ యాత్రలు అంటారు. ఆయన స్మృతి చిహ్నంగా చైనాలో ఒక నగరానికి ‘నాన్‌ ‌కింగ్‌’ అని పేరు పెట్టారు. 1949-50 మధ్య కాలంలో తొలి ప్రధాని జవాహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ చైనా సందర్శించినప్పుడు ఆయనకు సమర్పించిన సన్మాన పత్రంతో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఏ రంగంలో నైనా సమర్థతే గణనీయం తప్ప వారసత్వం కాదన్నది గురునానక్‌ ‌నిశ్చితాభిప్రాయంగా చెబుతారు.

సమర్థపాలకులతోనే సుపరిపాలన అందుతుం దన్నట్లే సమర్థ గురువులతోనే జ్ఞానం అందుతుందని విశ్వసించారు. పాలకుల, జ్ఞాన ప్రదాతల ఎంపికలో వారసత్వం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరాదన్నది ఆయన భావనగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానం, అనుభవం కలవారి వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని భావించి ఉంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు (శ్రీచంద్‌, ‌లక్ష్మీదాస్‌) ఉన్నప్పటికీ గురుపీఠం వారసులుగా వారిని కాదని, తన శిష్యుడు లహనాను ఎంపిక చేశారు. ఆయనే (లహనా) గురు అంగద్‌గా ప్రసిద్ధులు. ఉత్తరాధికారి నియామకం జరిగిన కొద్ది కాలానికే (సెప్టెంబర్‌ 22, 1539) ‌గురునానక్‌ ‌తనువు చాలించారు. స్మారకాలకు ఆయన వ్యతిరేకం. ‘నేను చెప్పింది మననం చేయండి. స్మారకాలు వద్దు’ అనేవారు.

అయినా ఆయన శిష్యులలోని కొందరు ముస్లింలు, హిందువులు వేర్వేరుగా సమాధులు నిర్మించగా, కొన్నాళ్లకు పొంగివచ్చిన రావీనది వాటిని తనలో లీనం చేసుకుంది. ఆయన మాట అలా నిజమైందన్నది ఆయన అనుయాయలు భావన.

-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE