భారత్‌, ‌చైనా మధ్య వాస్తవాధీనరేఖ (లైన్‌ ఆఫ్‌ ఆక్చువల్‌ ‌కంట్రోల్‌) ‌నిర్దిష్టంగా లేక ఒక బ్రహ్మ పదార్థంలా పరిణమించడంతో ఆ ప్రాంతమంతా కొన్ని దశాబ్దాలుగా అట్టుడుకుతూనే ఉంది. భారతదేశపు అనేక సరిహద్దు ప్రాంతాలు తమవేనంటూ చైనా తన హక్కులు ప్రకటించుకోవడం, ఆ ప్రాంతాల పేర్లు మార్చేయడం మనకు తెలిసిన చరిత్రే. ఈ క్రమంలో 2020లో గల్వాన్‌ ‌ఘర్షణతో ఏర్పడిన ప్రతిష్ఠంభనను పరిష్కరించుకునే దిశగా సరిహద్దులలో ఉన్న ఇరు దేశాల సేనలను ఉపసంహరించుకోవాలని, ఎవరి వైపు సరిహద్దులలో వారు పహారా ఉండాలనే అంగీకారానికి రావడం ఆసియా ప్రాంతంలో ఒక గొప్ప పరిణామం. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ ‌సదస్సు వేదికగా భారత్‌, ‌చైనా దేశాధినేతలు కలుసుకుని చర్చలు జరపడంతో ఇది అధికారికం అయింది. పరస్పర విరుద్ధమైన జాతీయ ప్రయోజనాలు, ఒకరంటే మరొకరికి పొసగని వైఖరి ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేశాలు రెండూ కూడా బహుళ ధ్రువ ప్రపంచ స్థాపనకు చేతులు కలపడం ఒక శుభపరిణామం.

ఈ సేనల ఉపసంహరణ ఒప్పందం ఆహ్వానించదగినది. అయితే, అక్సాయ్‌ ‌చిన్‌లోని కొన్ని ప్రాంతాలలో చైనా వేగంగా సేనలను మోహరించగల సామర్ధ్యం కలిగి ఉన్నందున మన దళాలను మరొక చోట మోహరించే అవకాశం లేదని కొందరు విశ్లేషకుల భావన. దానినీ కాదనలేం, ఎందుకంటే, చైనా సలామీ స్లైసింగ్‌ ‌పక్రియలో నిష్ణాతత సాధించింది. కాగా, భారతదేశం గల్వాన్‌ ‌ఘర్షణకు ముందు గల పరిస్థితికి తిరిగి వెళ్లాలంటూ మొండి పట్టు పట్టడం వల్లనే నేటి ఒప్పందం సాధ్యమైందన్నది వాస్తవం.

ఈ ఒప్పందం తూర్పు లద్దాక్‌లో దీర్ఘకాలికంగా ఉన్న ఉద్రిక్తతలను పరిష్కరించడమనేది వాస్తవాధీన రేఖ వెంట శాంతిని పునరుద్ధరించడంలో దౌత్యపరంగా జరిగిన కృషిలో ఒక మైలు రాయి. తాము రక్తం పంచుకుపుట్టిన సోదరలమని చెప్పుకునే పాకిస్తాన్‌ను విస్మరించి, చైనా మనతో స్నేహం చేసేందుకు ముందుకు రావడం పాక్‌లో కొన్ని వర్గాలకు మింగుడు పడడం లేదనే వార్తలు వినిపిస్తు న్నాయి. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ చైనా ఆ దేశంతో తనకు గల ప్రయోజనాలను పక్కకు పెట్టి మరీ రాజీకి వచ్చింది.

భారత్‌, ‌చైనాలు తమ మధ్య అభిప్రాయభేదాలను ‘కొంత మేరకు తగ్గించుకొని’, తూర్పు లద్దాక్‌లో కొన్ని ఘర్షణాత్మక స్థలాల్లో సేనలను ఉపసంహరించు కునేందుకు ‘కొద్ది ఏకాభిప్రాయాన్ని’ సాధించాయని, త్వరలోనే ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన తీర్మానానికి వస్తాయంటూ గత నెలలో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆచితూచి ప్రకటన విడుదల చేసిన తర్వాతి వారాలలో, ఇరు పక్షాల మధ్య సంబంధాలలో గణనీయమైన మార్పుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. కాగా, ఈ నెల మొదట్లో భారత రక్షణ మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌ ‌కూడా సరిహద్దు ప్రతిష్ఠంభన పరిష్కారం కోసం భారత్‌- ‌చైనా మధ్య చర్చల పురోగతి సానుకూలంగా కనిపిస్తోందని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఆకస్మిక పరిస్థితులకు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉందంటూ సైనిక దళాల ఉన్నతాధికారులకు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. ఏమైనప్పటికీ, భారత్‌ అ‌ప్రమత్తంగానే అడుగులు వేస్తోందని రక్షణమంత్రి వ్యాఖ్యలు చెప్తున్నాయి.

ఈ ఒప్పందం ఎందుకు ముఖ్యం?

పాశ్చాత్య ప్రపంచంలో సంచలనం సృష్టించిన బ్రిక్స్ ‌సదస్పుకు ముందు ఈ ఒప్పందం జరగడం చాలా విషయాలు చెప్పకనే చెబుతున్నాయి. 2020లో గల్వాన్‌ ‌వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణల అనంతరం ఇరు దేశాలూ కూడా వాస్తవాధీన రేఖ వద్ద తమ సైన్యాలను మోహరించడంతో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉన్నది. సేనల ఉపసంహరణ స్తంభించింది, కానీ ఇప్పుడు ఇరు పక్షాలూ కూడా నూతన పహారా ఏర్పాట్లపై ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం కింద వాస్తవాధీన రేఖ వెంట కొన్ని పహారాల పాయింట్లు భారతీయ దళాలకు అందుబాటులోకి వస్తాయి. ప్యాంగాంగ్‌ ‌లేక్‌ ఉత్తర్‌ ‌ప్రాంతం వంటి నిర్దిష్ట ఘర్షణాత్మక ప్రాంతాలలో గత సేనల ఉపసంహరణ సమయంలో బఫర్‌ ‌జోన్లను చైనా దళాలు ఏర్పాటు చేసి, భారతీయ సేనలను అడ్డుకుంటున్నారు. ఇటువంటి ప్రాంతాలు కూడా భారతీయ సేనల పహారాకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

గతంలో భారత్‌, ‌చైనాలు పలు ప్రాంతాలలో ప్రతిష్ఠంభనలను పరిష్కరించినప్పటికీ, ఇప్పటి వరకూ పరిష్కారం కాని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఈ అంగీకారానికి రావడానికి దౌత్యపరమైన, సైనిక సహా బహుళ మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడమే కారణమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిశ్రీ వెల్లడించడం, దీని ప్రాధాన్యతను చెప్పకనే చెప్తుంది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌ అనంతరం శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశ ప్రతినిధులు పని చేశారు.

భారత్‌కు దీనివల్ల లాభమేమిటి?

పలురకాలుగా ఈ ఒప్పందం భారత్‌కు మేలు చేకూర్చనుంది. సేనల ఉప సంహరణతో భారతీయ దళాలు 2020కు ముందు నియమాలకు అనుగుణంగా తమ నిత్య పెట్రోలింగ్‌ను నిర్వహించ వచ్చు. జాతీయ అభివృద్ధి కోసం కీలకమైన సరిహద్దుల వెంట శాంతి అనే వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది. అమెరికా, కెనడా వంటి పాశ్చాత్య దేశాలతో సంబంధాలు సంక్లిష్టమైన తరుణంలో అంతర్జాతీయ శక్తులతో సంబంధాలు ఆశించిన విధంగా భవిష్యత్తులో లేకపోతే, గొప్ప నష్టాన్ని లేదా వైఫల్యాన్ని ఈ ఒప్పందం నివారించనుంది.

పాశ్చాత్య ప్రభావానికి దూరంగా తన దౌత్యపరమైన ప్రత్యామ్నాయాలను బహుముఖం చేసుకునేందుకు బ్రిక్స్ ‌వేదిక భారత్‌కు ఈ అవకాశాన్ని అందించింది. చైనాతో సంబంధాలు మెరుగు పడుతున్న నేపథ్యంలో, తన దీర్ఘకాలిక ప్రయోజ నాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది.

 చైనా ఇప్పుడు ఎందుకు అంగీకరిస్తోంది?

వాస్తవాధీన రేఖ వద్ద గల ఉద్రిక్తతలను పరిష్కరించుకోవాలన్న భావనకు చైనా రావడానికి కారణం, తైవాన్‌పై అది పెడుతున్న దృష్టే అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అటు ఉక్రెయిన్‌, ‌మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అమెరికా సతమతమైపోతూ ఉన్న నేపథ్యంలో చైనా తన సైనిక దృష్టిని తైవాన్‌పై కేంద్రీకరించేందుకు ఇది తగిన సమయంగా భావిస్తోంది. భారత్‌-‌చైనా సరిహద్దుల వద్ద సేనలను ఉపసంహరించడం ద్వారా, చైనా తన తైవాన్‌ ‌లక్ష్యం కోసం మరిన్ని సేనలను కేటాయించ వచ్చు. తైవాన్‌ను కలుపుకునేందుకు అవసరమైన సైనిక చర్యలను ప్రారంభించేందుకు కూడా ఆస్కారం ఉంది. అదనంగా, పాశ్చాత్య దేశాల వ్యవస్థలకు బ్రిక్స్ ‌ప్రత్యామ్నాయమని చైనా భావించి, విలువ ఇస్తోంది. బ్రిక్స్ ‌చట్రంలో చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలంటే భారత్‌తో స్థిరమైన సంబంధాలు కొనసాగించడం కీలకంగా మారింది.

దౌత్యపరమైన సమతుల్యత

ఆసియా ప్రాంతంలో సంక్లిష్టమైన బల/ శక్తి సమతుల్యత ఎంత ప్రధానమో ఈ ఒప్పందం పట్టి చూపుతుంది. అటు భారత్‌, ఇటు చైనా రెండూ కూడా బహుళ పొరల భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అందుకే, విస్తృతమైన అంతర్జా తీయ ప్రయోజనాల కోసం తమ సరిహద్దులలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. పాశ్చాత్య ఆధిపత్య వేదికలకు ప్రత్యామ్నాయంగా ఉద్భవించిన బ్రిక్స్ ఈ ‌క్రియాశీలతలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇరు దేశాలూ కూడా తమ మధ్య సహకారం బలంగా ఉందనే సందేశాన్ని ఈ సదస్సుకు పూర్వమే పాశ్చాత్య ప్రపంచానికి పంపారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఈ ఒప్పందం ప్రస్తుతానికి శాంతికి సంబం ధించిన సంకేతాలను పంపినా, భవిష్యత్తు అస్థిరంగానే ఉండనుంది. తైవాన్‌ ‌నుంచి దృష్టి తొలిగిపోతే, దీర్ఘకాలికంగా చైనాకు గల విస్తరణవాద లక్ష్యం తిరిగి పుట్టుకురావచ్చు. ఈ క్రమంలో భవిష్యత్తులో చొరబాట్లు, ఆక్రమణలు జరుగకుండా, భారత్‌ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుత సేనల ఉపసంహరణ అనేది తాత్కాలికం కావచ్చు కానీ, ఇరు దేశాలూ తమ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.

ఈ ప్రాంత భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా అనూహ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, పరస్పర ప్రయోజనాల ఆధారంగా తమ పొత్తులను మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్‌ -‌చైనాలు తమ సేనలను ఉపసంహరించుకున్నా, వారి దీర్ఘకాలిక సంబంధం అనేది రానున్న సంవత్సరాలలో ఈ ప్రయోజనాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయనే అంశంపై ఆధారపడి ఉండనుంది.

పాశ్చాత్య దేశాల ఉలుకు?

ఆసియా ప్రాంతంలో అగ్ని రాజుకుంటుంటేనే అగ్ర దేశాల అహం సంతృప్తి పడుతుంది. అందుకే, ప్రస్తుతం భారత్‌, ‌చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు దానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, చైనాపై ఎట్లా అయినా ఉక్కుపాదం మోపాలని ఎదురు చేస్తున్న అమెరికా ఎత్తులను ఈ సమీకరణం చిత్తు చేస్తోంది. ప్రపంచ వ్యవహారాల దశ దిశను నిర్దేశించగల సామర్ధ్యాన్ని లాక్కునే పరిణామం ఇది. అందుకే, అనేకమంది మేధావులు, రచయితలు భారత్‌, ‌చైనాల మధ్య స్నేహం అమెరికాను సవాలు చేయడానికేనా అని, భారత్‌ ఇప్పుడు పాశ్చాత్య వ్యతిరేక చైనాతో పొత్తు కుదుర్చుకుంటుందంటూ తమకు నచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు.

గత రెండున్నర దశాబ్దాల నుంచి పెరుగుతున్న బహుముఖీయ సంబంధాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం వలసవాదం నుంచి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అవగతం అవుతాయి. ముఖ్యంగా కజాన్‌ ‌వేదికగా, ఒకనాటి వలసదేశాలు అన్నీ అక్కడకు చేరి, తమ ప్రయోజ నాలను గురించి ఆలోచించడం చూసినప్పుడు ఇది స్పష్టమవుతుంది. ఇప్పటికే, భారత్‌, ‌చైనా, రష్యా వంటి దేశాలు అగ్రశక్తుల అభిప్రాయాలు లేదా ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా తమ జాతీయ ప్రయోజనాలకు ఏది ముఖ్యమో, ఉత్తమమో అవే చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాలతో గత రెండేళ్లకు పైగా పరోక్ష యుద్ధంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ ‌పుతిన్‌, ‌తమపై విధించిన ఆర్ధిక ఆంక్షలను ధిక్కరించి, భారత్‌, ‌చైనాలతో సాగిస్తున్న సంబంధాలు కొనసాగిస్తూ రావడమే కాదు, ఆర్ధికంగా తన దేశం మరింత పుంజుకునేందుకు బాటలు వేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పెద్ద దేశాలూ తమ మధ్య కనీస సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా ఆసియా ప్రాంతంలో శాంతిని సాధించడమే కాదు, నిన్నటి వరకూ ఎడముఖం పెడముఖంగా ఉన్న శక్తులు స్నేహపూర్వకంగా ఉండడం బహుళ ధ్రువ ప్రపంచంలో అవసరమన్న సందేశాన్ని ఇచ్చారను కోవాలి.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్ధిక శక్తి చైనాకు కూడా తాము ఒక ఒప్పందానికి రాక పోతే భారతదేశం తమను వారి మార్కెట్‌ ‌నుంచి క్రమంగా ఏరివేస్తుందని తెలుసు. ఇప్పటికే అనేక చైనా యాప్‌లను నిర్మొహమాటంగా భారత్‌ ‌నిషేధించిన విషయం తెలిసిందే. అందుకే, పరిమిత స్థాయిలో అయినప్పటికీ భారత లక్ష్యాలు, అవసరాల విషయంలో తాము రాజీపడకపోతే, తమకే నష్టమని తెలుసు కనుకే వారు ఒక మెట్టు దిగారు. ఆ రకంగా, చైనా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అధ్యక్షుడు గ్జి భారత ప్రధాని మోదీతో చేతులు కలిపారు.

ప్రాథమికంగా ప్రపంచం నేడు మారుతున్న వైనం ఇది. పరస్పర విరుద్ధంగా ఉన్న భారత్‌, ‌చైనాలలో ఒకరు సౌదీ అరేబియా- ఇరాన్‌ల మధ్య శాంతిని నెలకొల్పేందుకు యత్నాలు చేస్తుంటే, మరొకరు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రాజీ కుదర్చాలని యత్నిస్తున్నారు. సరిహద్దులలో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలను ఎదుర్కొంటున్నప్పటికీ శాంతి కోసం రెండూ యత్నించడం ఒక వైచిత్రి. అయినా, నీతులు చెప్పడమే కాకుండా ఆచరించి చూపి, తమ నిబద్ధతను చాటుకున్నందుకు ఇరు దేశాలనూ అభినందించవలసిందే!

-నీల

About Author

By editor

Twitter
YOUTUBE