కాలంతో పాటు యుద్ధ రీతులు కూడా మారుతున్నాయి. ఇటీవలే ఇజ్రాయెల్‌, ‌మొస్సాద్‌ ‌కలిసి చేసిన ప్రయోగాత్మక సైబర్‌ ‌యుద్ధం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. తీవ్రవాద గ్రూపుగా యుఎస్‌ ‌గుర్తించిన హిజ్బుల్లాకు చెందిన అనేకమంది కీలక వ్యక్తులను ఒక్క బుల్లెటును వాడకుండా హతం చేసి, వేల మందిని తీవ్రగాయాలకు లోను చేసిన తీరు చూసిన ప్రపంచం ఉలిక్కిపడింది. హిజ్బుల్లాకు కంచుకోటలని భావించే దక్షిణ లెబనాన్‌, ‌బీరూట్‌లో పేజర్లు, వాకీ టాకీలు, హ్యాం రేడియో, సోలార్‌ ‌ప్యానెళ్లు సహా పలు ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు పేలిపోవడంతో వేలమంది గాయాల పాలయ్యారు. తమ రహస్య కార్యకలాపాలకు సెల్‌ ‌ఫోన్ల కన్నా పేజర్లు, వాకీటాకీలే మేలని భావించి వాడుతున్న హిజ్బుల్లాను తన సైబర్‌ ‌యుద్ధరీతితో ఇజ్రాయెల్‌ ‌దెబ్బతీసింది. అంతేనా, ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధం చేసిన వేలాది రాకెట్లను, మిస్సైళ్లను ధ్వంసం చేసింది. సైబర్‌ ‌యుద్ధమంటే సహజంగా కంప్యూటర్లను హ్యాక్‌ ‌చేయడం అని ఉన్న సాధారణ భావనను ఇజ్రాయెల్‌ ‌తుడిచిపెట్టేసింది. ఈ ఘటనలలో అనేకమంది హిజ్బుల్లా కీలక నేతలు తీవ్రంగా గాయపడడమో, మరణించడమో జరగడం ఇజ్రాయెల్‌ ‌నిఘా సామర్ధ్యానికి, పట్టుదలకు చిహ్నం.

హమాస్‌, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య దాడి, ప్రతిదాడులు ప్రారంభమై ఈ అక్టోబర్‌ 7‌వ తేదీకి రెండేళ్లు కావస్తున్నాయి. ఈ క్రమంలో, గాజాలో దాదాపు హమాస్‌ ‌స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌, ‌ప్రస్తుతం హమాస్‌కు మిత్రపక్షంగా, ఇరాన్‌ ‌మద్దతుతో తనకు వ్యతిరేకంగా చెలరేగి పోతున్న హిజ్బుల్లాపై దృష్టి పెట్టింది. ఏకకాలంలో జరిపిన తన పేలుళ్లలో హిజ్బుల్లా సమాచార నెట్‌ ‌వర్క్‌ను ఇజ్రాయెల్‌ ‌లక్ష్యంగా చేసుకుంది. చిత్రమేమి టంటే, ఇంతకాలమూ హిజ్బుల్లా వాడుతున్న ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలన్నింటినీ ఇజ్రాయెల్‌ ‌సానుభూతి పరుల యజమాన్యంలోని ఒక షెల్‌ ‌కంపెనీ నుంచి కొనుగోలు చేయడం. ఈ వ్యూహాన్ని చేపట్టడం ద్వారా ఆధునిక యుద్ధతంత్రంలో సైబర్‌ ‌విధ్వంసాన్ని భౌతిక స్థాయికి ఎలా తేవచ్చో ఇజ్రాయెల్‌ ‌ప్రదర్శించింది. కాగా, ఈ తంత్రం అటు దేశాలను, తీవ్రవాద గ్రూపులను ఎలా నిర్వీర్యం చేయవచ్చో ప్రత్యక్షంగా చూపడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

వరుసగా రెండు రోజులు పేలుళ్లు

సమాచారం కోసం ఉపయోగించే పరికరాలు పేలిపోవడాన్ని లెబనాన్‌ ‌వరుసగా రెండు రోజులు చవిచూసింది. మొదట దేశవ్యాప్తంగా, ఏకకాలంలో పేజర్లు పేలిపోవడంతో (వాస్తవ గణాంకాలు బయటకు రానప్పటికీ), పలువురు మరణించగా, వేలమంది గాయపడ్డారు. ‘బిలో ది బెల్ట్’ అపరేషన్‌గా దీన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని హిజ్బుల్లా మల్లగుల్లాలు పడుతుండగా, 24 గంటలు తిరక్కుండానే హిజ్బుల్లా కంచుకోటలని భావించే ప్రాంతాలలో వాకీ టాకీలను పేలిపోయాయి. దీనితో, దేశంలో ఏక కాలంలో సామూహిక విధ్వంసానికి, హననానికి ఇజ్రాయెల్‌ శ్రీ‌కారం చుట్టింది. నిజానికి, పేజర్‌ ‌దాడిలో మరణించిన హిజ్బుల్లా నాయకుడి కుమారుడి అంత్యక్రియలకు కార్యకర్తలు హాజరైన సమయంలో వాకీ టాకీలు పేలిపోవడంతో అక్కడ పలువురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌ను అభివర్ణిస్తూ, ‘ఇజ్రాయెలీలు ఘర్‌ ‌మే ఘుస్‌కర్‌ ‌మారా’ అన్న మాటలకు అర్ధాన్నే మార్చేశారంటూ ప్రముఖ యాంకర్‌ ‌రాహుల్‌ ‌శివశంకర్‌ ‌సోషల్‌ ‌మీడియా వేదిక ‘ఎక్స్’‌పై వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు, ‘ఇజ్రాయెల్‌ ‌కూడా భారత్‌లాగా అత్యంత ప్రతికూల వాతావరణంలో ఉంది. మారణహోమానికి, విదేశీ వైముఖ్యానికి మాత్రమే విధేయత చూపే ఇస్లామిస్టులు వారి చుట్టూ ఉన్నారు. కానీ భారత్‌లోలా కాకుండా ఇజ్రాయెల్‌లో మెజారిటీ యూదులు (73శాతం) రాజకీయ ఇస్లామ్‌కు వ్యతిరేకంగా సమైక్యతను ప్రదర్శిస్తున్నార’ని ఆయన అభిప్రాయపడ్డారు.

హిజ్బుల్‌ ఏజెంట్లను బహిర్గతం చేసిన దాడి

ఈ దాడి కేవలం లెబనాన్‌లోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో హిజ్బుల్లా ఏజెంట్లు లేక సభ్యుల నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. ఎందుకంటే, వారంతా కూడా సమాచార మార్పిడికి తమ గ్రూపు జారీ చేసిన పేజర్లనే వాడుతున్నారు! ఈ దాడులతో ఆగ్రహంతో ఊగిపోతూ, ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పి తీరతామంటూ హిజ్బుల్లా నేత హస్సన్‌ ‌నస్రల్లా దీనిని జన హననంగా అభివర్ణిస్తూ, దీనికి తీవ్ర మైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌ను ఊహించిన చోట, ఊహించని చోట కూడా దెబ్బతీస్తామని ఆయన గర్జించాడు. అతడు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఇజ్రాయెలీ ఫైటర్‌ ‌జెట్లు బీరూట్‌లో విహారం చేసాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ‌రక్షణ దళాలు (ఐడిఎఫ్‌) ‌తమపై ప్రయోగించడానికి సిద్ధం చేసిన వంద రాకెట్‌ ‌లాంచర్లను తాము లెబనాన్‌లో ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలలో సంసిద్ధం చేసిన ఈ లాంచర్లలో వేల రాకెట్‌ ‌బ్యారెళ్లు దగ్థం అయ్యాయని చెప్తు న్నారు. ఇందుకు అదనంగా, పలు హిజ్బుల్లా భవనాలు, ఒక ఆయుధాల డిపో కూడా ఇందులో ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. కాగా, సైబర్‌ ‌దాడులతో హిజ్బుల్లా మొబైళ్లు, కంప్యూటర్లు సహా కమ్యూనికేషన్‌ ‌పరికరాలను ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది.

యుద్ధ రీతులు మారుతున్నాయన్న ఇజ్రాయెల్‌

‌యుద్ధం నూతన దశలోకి ప్రవేశిస్తోందని, సరిహద్దులు, యుద్ధక్షేత్రాలు ఆధునిక యుద్ధరీతులను నిర్వచించలేవని, వాటిని కేవలం సాంకేతికత, నిఘా మాత్రమే వివరించ గలవని ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి గాలెంట్‌ ‌వివరించారు. దీనితో పాటుగా ఇజ్రాయెల్‌ ‌పూర్తి సామర్ధ్యాలను లెబనాన్‌లో క్రియాశీలకం చేయలేదంటూ హెచ్చరించారు. మధ్య ప్రాచ్యంలో మారుతున్న యుద్ధ స్వభావానికి ఆయన ప్రకటన అద్దం పడుతోంది. దీనితోపాటుగా, గాజా నుంచి యుద్ధక్షేత్రం మారిందనే సంకేతాన్ని ఇస్తోంది. సాంకేతిక పురోగమనంతో దాడి చేసే పద్ధతులు కూడా మారుతు న్నాయి. ప్రస్తుతం సైనిక వ్యూహాలను మలచడంలో సైబర్‌ ‌యుద్ధ రీతులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇజ్రాయెల్‌ ‌రుజువు చేసింది.

ఇరాన్‌ ‌మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌లో దాడులకు పాల్పడిన హమాస్‌కు బలమైన మిత్రపక్షం. అనునిత్యం హిజ్బుల్లా ఉత్తర సరిహద్దుల నుంచి ఇజ్రాయిలీలపై దాడులకు పాల్పడడంతో ఈ యుద్ధం ప్రాంతీయ పోరుగా మారి, ఐడిఎఫ్‌ ‌తిరుగబడడానికి కారణమైంది. యుద్ధంలోని ఈ నూతన దశలో, గణనీయమైన అవకాశాలే కాదు గణనీయమైన ప్రమాదాలు కూడా ఇమిడి ఉన్నాయంటూ, హిజ్బుల్లా హింసకు లోనైనట్టు భావిస్తుందని, తమ ఆక్రామతకు గ్రూపు భారీ మూల్యం చెల్లిస్తుందని తన మనసులో మాట, తమ భవిష్యత్‌ ‌కార్యకలాపాలను గాలెంట్‌ ‌బయటపెట్టారు.

ప్రత్యక్షంగా మారిన పరోక్ష యుద్ధం

ఈ ప్రాంతంలో హిజ్బుల్లా ముసుగులో ఇరాన్‌ ‌పరోక్షంగా చేస్తున్న యుద్ధం ఇదనే విషయం బహిరంగ మైంది. హిజ్బుల్లా కమ్యూనికేషన్‌ ‌పరికరాలపై దాడి ఇజ్రాయెల్‌కు కేవలం వ్యూహాత్మక విజయాన్ని ఇవ్వడమే కాదు, ఎంతో సురక్షితమైన నెట్‌వర్క్‌లలోకి కూడా మొస్సాద్‌ ‌ప్రవేశించి భారీ విధ్వంసాన్ని సృష్టించగలదని ఇరాన్‌కు, దాని ప్రతినిధులకు ఒక భారీ సందేశం కూడా. సంప్రదాయ సైనిక పోరు కాకుండా అత్యాధునిక సైబర్‌ ‌తంత్రాల ద్వారా తన శత్రువులను నిర్వీర్యం చేయాలన్న ఇజ్రాయెల్‌ ‌విస్తృతమైన వ్యూహానికి ఇది అద్దం పడుతుంది. ఇరాన్‌ ‌ప్రస్తుతానికి అయితే ఖండనల మినహా రంగంలోకి రాలేదు. బహుశ, ఈ హఠాత్‌ ‌దాడితో వారు తమ భవిష్యత్‌ ‌వ్యూహాలను మార్చుకుంటున్నారేమో!

లెబనాన్‌, ఇరాన్‌ ‌ఖండన, అమెరికా విజ్ఞప్తి

తమ భూభాగంలో దాడుల పట్ల లెబనాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్‌ ‌మండిపడ్డారు. ఇజ్రాయెలీ వైమానిక దాడులు, లెబనాన్‌ ‌సార్వభౌ మత్వం, భద్రతపై బహిరంగ దాడులంటూ అభివర్ణిం చారు. ఇవి పెరిగితే అది విస్తృతమైన ప్రాంతీయ ఘర్షణకు దారి తీసే అవకాశ ముందని హెచ్చరిం చారు. కాగా, ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డస్ ‌మాత్రం ఇజ్రాయెలీ చర్యలకు వారిని తుడిచిపెట్టే ప్రతిస్పందన ఉంటుందంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఇదిలా ఉండగా, అందరూ సంయమనం పాటించాలని పిలుపిస్తూ, అటు ఇజ్రాయెల్‌, ఇటు హిజ్బుల్లా కూడా యుద్ధం తీవ్రమయ్యే చర్యలకు పాల్పడవద్దంటూ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ‌విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌, ‌హమాస్‌కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు బైడెన్‌ ‌ప్రభుత్వం ముప్ప తిప్పలు పడుతోంది. ఈ పరిణామలతో, యుద్ధం మధ్య ప్రాచ్యానికి పాకకుండా నిలువరించే సవాలుతో కూడిన బాధ్యత ఇప్పుడు దానిపై పడింది.

ఐరాస ఆందోళనలను తిప్పికొట్టిన ఇజ్రాయెల్‌ ‌మాజీ నిఘా అధికారి

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆం‌టోనియో గుటెరస్‌ ఈ ‌దాడులను ఖండించడమే కాదు, ఈ ఆపరేషన్‌ ‌లెబనాన్‌పై భారీ దాడికి నాందీ వాచకంగా ఇజ్రాయెల్‌ ‌చేసిన పని అంటూ అన్న మాటలతో ఇజ్రాయెల్‌ ‌మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అవీ మెలామెద్‌ ‌విబేధిచారు. ఇది హిజ్బుల్లాకు కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని తన అభిప్రాయ మన్నారు. ఇప్పుడు బంతి హిజ్బుల్లా, ఇరాన్‌ ‌కోర్టులో ఉందని, వారి స్పందనను బట్టే ఇజ్రాయెల్‌- ‌లెబనాన్‌ ‌సరిహద్దుల వద్ద భారీ సైనిక ఆపరేషన్‌ ‌ప్రారంభ మవుతుందా కాదా అన్న విషయం నిర్ధారితమవు తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హిజ్బుల్లా రోజూ చేసే దాడుల నుంచి తన వారిని కాపాడుకునేందుకు ఉత్తర ఇజ్రాయెల్‌ ‌ప్రాంతం నుంచి వేలాదిమంది పౌరులను ఖాళీ చేయించిన విషయాన్ని పట్టిచూపారు. ఈ ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల దాడి అనేది హిజ్బుల్లా సామర్ధ్యాలను ధ్వంసం చేసి, ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేసేలా వారిపై• అదనపు ఒత్తిడి పెట్టేందుకేనని ఆయన అన్నారు. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకపోతే, అప్పుడు భారీ సైనిక ఆపరేషన్లు సహా పలు మార్గాలను గురించి ఇజ్రాయెల్‌ ‌యోచిస్తుందని స్పష్టం చేయడం గమనార్హం.

ప్రపంచంపై దీని ప్రభావం

మొస్సాద్‌ ‌చేపట్టిన ఈ విజయవంతమైన ఆపరేషన్‌ ‌ప్రభావం, పరిణామాలు మధ్య ప్రాచ్యం ఆవల కూడా పడనున్నాయి. నానాటికీ అనుసంధాన మవుతున్న ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల భద్రత అన్నది భారీ ఆందోళనగా మారనుంది. పేజర్లు, వాకీ టాకీలు, ల్యాండ్‌లైన్‌ ‌ఫోన్లను కూడా అక్రమంగా ట్యాంపరింగ్‌ ‌చేయడ మన్నది ప్రపంచ సమాచార నెట్‌వర్క్‌లలో పెరిగిపోతున్న బలహీనతను పట్టిచూపుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాలలో పలు ప్రశ్నలను లెవనెత్తుతోంది. పరికరాలను సవరించి, వాటిని మారుమూల నుంచే మొస్సాద్‌ ఆయుధీకరించగలగినప్పుడు, ఇతర దేశాలు ఇతర ప్రాంతాలలో ఇటువంటి కార్యకలాపాలను సాగించేం దుకు ఏది నిరోధిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు, మొబైల్‌ ‌ఫోన్లు, స్మార్ట్ ‌వాచీలు, గృహోపకరణ ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులు ఆయుధాలుగా మారితే? లెబనాన్‌లో దాడి అటువంటి పరిస్థితి సాధ్యం కావడమే కాదు, ప్రమాదకరం కూడా అనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది.

దేశాలన్నీ కూడా ఇప్పుడు తమ ఎలక్ట్రానిక్‌ ‌సరఫరా లంకెలను తక్షణమే సురక్షితం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. తమ పరికరాలు సవరించ డానికి వీలులేనివిగా, విదేశీ తంత్రానికి లోబడనివిగా చూసుకోవాలి. అంతేకాదు, ఇది ప్రపంచ సైబర్‌ ఆయుధాల రేసుకు దారి తీసేందుకు కారణం కావచ్చు. ఇటువంటి విధ్వంసాలను తట్టుకునే సాంకేతికతలను అభివృద్ధి చేసి, మోహరించేందుకు దేశాలు ఇప్పుడు పోటీపడతాయి. అదే సమయంలో, శత్రువుల కమ్యూనికేషన్‌ ‌నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసేందుకు సాంకేతికతలను ఆయుధీకరించే మార్గాలను కూడా అన్వేషిస్తాయి. ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్లు, విమాన, రక్షణ రంగాలకు చిక్కులు అనంతంగా ఉండనున్నాయి.

ఈ ఘటన యుద్ధరీతులలో నూతన శకానికి తెరలేపింది. ఇక్కడ సమాచార సాంకేతికతే యుద్ధ క్షేత్రం. నిన్నటి వరకూ దునియా ముఠ్ఠీ మే అనుకున్న ప్రపంచం, తన అరచేతిలోని ఆ పరికరాన్ని ఎవరైనా ఆయుధీకరించవచ్చన్న వాస్తవంతో కుస్తీపడాలి. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచ భద్రత అన్నది సురక్షిత మైన సరఫరా లంకెలు, నెట్‌వర్క్‌లు, సమాచార మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. సైబర్‌ ‌యుద్ధం పరిణామం చెందుతున్న కొద్దీ గతంలో కన్నా ఎక్కువగా నష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్‌ ‌యుద్ధాలను యుద్ధక్షేత్రంలో కాక మనందరినీ అనుసంధానం చేసే వైర్లు, పరికరాలు, సర్క్యూట్‌లపై జరుగుతాయని లెబనాన్‌లో పేలుళ్లు మనను హెచ్చరిస్తున్నాయి.

– ‌డి. అరుణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE