జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం

భారత దేశ జనాభా చైనాను మించిపోయినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86 కోట్లు కాగా, చైనా జనాభా 142.57 కోట్లుగా వెల్లడించారు. ఈ పరిస్థితిని మనం ముందుగానే ఊహించాం కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఇక్కడ అందోళన చెందాల్సిన అంశం మరొకటి ఉంది. దేశ జనాభా సమతౌల్యం క్రమంగా దెబ్బ తింటూ వస్తోంది. హిందువుల జనాభా నిష్పత్తి తగ్గుతుంటే, ముస్లిం జనాభా పెరుగుతోంది.

మన దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనగణన (సెన్సస్‌) ‌జరుగుతుంది. చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా జరలేదు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ఇందులో హిందువుల జనాభా 96.62 కోట్లు (79.80 %). ముస్లింల జనాభా 17.22 కోట్లు (14.23 %) క్రైస్తవ జనాభా 2.78 కోట్లు, సిక్కులు 2.08 కోట్లు, బౌధ్దులు 0.84కోట్లు, జైనులు 0.45కోట్ల మేర ఉన్నారు. వీరు కాకుండా ఇతర మతస్థులు 0.29 కోట్ల వరకూ ఉంటారు. ఎక్స్‌పోనెన్షియల్‌ ‌గ్రోత్‌ ‌మోడల్‌ ‌ప్రకారం, 2021 నాటికి హిందువులు 120.6 కోట్లకు పెరిగారు. ముస్లింల జనాభా 22.6 కోట్లకు పెరిగింది.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికొస్తే జమ్మూ కశ్మీర్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌ ‌జనాభాలో 68.31 శాతం వరకు ముస్లింలు. 34.22 శాతంతో అస్సాం రెండో స్థానంలో ఉంది. గత 5 దశాబ్దాలను పోల్చి చూస్తే 2001-2011 మధ్య గరిష్టంగా ముస్లిం జనాభా పెరిగింది. ఈ సమయంలో ముస్లిం జనాభా 17 కోట్లు దాటింది. 1961-71తో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

పెరుగుతున్న ముస్లింలు

భారత్‌లో జనాభా పెరుగుదల గణాంకాలు విచిత్ర పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. మైనార్టీలైన ముస్లిం జనాభా పెరుగుతోంది. మెజార్టీగా ఉన్న హిందూ జనాభా తగ్గుతోంది. 2001-2011 ఈ పదేళ్ల కాలంలో ముస్లిం జనాభా 0.8 శాతం పెరిగి 13.8కోట్ల నుంచి 17.22 కోట్లకు చేరుకుంది. హిందూ జనాభా 0.7శాతం తగ్గి 96.63 కోట్లకు చేరుకుందని మత ప్రాతిపదికన వెల్లడైన తాజా జనగణన వివరాలను బట్టి స్పష్టం అవుతోంది.

1992-93లో నిర్వహించిన మొదటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం నాడు ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది. ఈ లెక్కన చూస్తే ఒక ముస్లిం మహిళ తన జీవిత కాలంలో నలుగురికి మించి పిల్లలకు జన్మనిస్తున్నది. సుమారు 3 దశాబ్దాల తర్వాత నాటి గణాంకాలను పరిశీలిస్తే, హిందూ మహిళల సంతానోత్పత్తి రేటు 1.9 కాగా ముస్లిం మహిళల్లో ఈ సంఖ్య 2.3గా ఉంది. అంటే హిందూ మహిళల కంటే ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గమనిస్తే హిందువుల జనాభా తగ్గుతోంది. ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. ఇందుకు కారణాలు అనేకం. కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా విధానం వల్ల ఎక్కువగా నష్టపోయింది హిందువులే. ముస్లింలు కుటుంబ నియంత్రణకు దూరంగా ఉన్నారనేది కాదనలేని నిజం. దేశంలో మతాంతరీ కరణలు, చొరబాట్లు ప్రమాదకర స్థాయిలో సాగుతున్నాయి. దేశంలో అక్రమంగా చొరబడ్డ బంగ్లా దేశీయులు, రోహింగ్యాల కారణంగా సరిహద్దు రాష్ట్రాల జనాభా సమతౌల్యం ఇప్పటికే దెబ్బతిన్నది. రాజకీయ పార్టీలు దేశ భద్రతను పణంగా పెట్టి వీరికి ఆధార్‌ ‌కార్డులు, ఓటర్‌ ఐడీలు, రేషన్‌ ‌కార్డులు ఇప్పిస్తున్నాయి.

ముస్లిం జనాభా స్థిరంగా ఉందా?

మనదేశంలో జనాభా పెరుగుదల విషయంలో ముస్లిం విశ్లేషకుల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. జనాభా పెరుగుదలను హిందూ-ముస్లిం సమస్యగా చూడవద్దని ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ ‌ఖురేషీ అంటారు. ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు. కానీ ఇందుకు ఆ వర్గం సిద్ధంగా ఉందని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుదలను మాత్రమే కాకుండా, బెంగాల్‌, అస్సాం, నేపాల్‌తో మన సరిహద్దులలో పెరిగిన ముస్లిం జనాభాను కూడా గమనంలోకి తీసుకోవాలని ఆయన అంటారు. అలాగే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో హిందూ జనాభాలో రెండు శాతం తగ్గుదల కనిపిం చింది. ఆ మేరకు ముస్లిం జనాభా పెరిగింది. వాస్తవా నికి భారతదేశంలోని అన్ని మతాల్లోనూ సంతానో త్పత్తి రేటు తగ్గుముఖం పట్టింది. ముస్లింలలో కూడా ఇదే జరిగింది. ముస్లిం జనాభా వృద్ధి మందగిం చిందని, జాతీయ సగటుతో సమానంగా ఉంటుందని సచార్‌ ‌కమిటీ నివేదిక తెలియజేస్తోంది.

సచార్‌ ‌కమిటీ నివేదిక 2100 నాటికి దేశ జనాభాలో ముస్లింల నిష్పత్తి 17-21 శాతం మధ్య స్థిరపడుతుందని అంచనా వేసింది. ఈ గణాంకాలు తప్పు. మన దేశంలోని ముస్లిం జనాభా 2100 నాటికి మొత్తం జనాభాలో 25-30 శాతంగా ఉండ వచ్చు. జనాభా ఇలాగే పెరుగూ పోతుంటే మొత్తం 2100 నాటి 200 కోట్లకు చేరుకోవచ్చు. ఇందులో ముస్లిం జనాభా 75-90 కోట్లకు చేరుతుంది. ఇది ఒక రకంగా హిందువులకు ఆందోళన కలిగించే విషయమే.

కారణాలు అనేకం

మన దేశంలో ముస్లిం జనాభా పెరగడానికి కారణాలు అనేకం. అందులో అన్నింటికన్నా ప్రధాన మైనది కుటుంబ నియంత్రణ పాటించకపోవడమే. ప్రపంచంలో అనేక దేశాలు ఇస్లాం ముందు తలవంచాయి. కానీ భారత దేశంలో మాత్రం సనాతన హిందూ ధర్మం చెక్కుచెరదలేదు. మన దేశం అనేక దండయాత్రలను తట్టుకొని నిలిచింది. ముస్లింల పాలనాకాలంలో హిందువుల ఆలయాలను పడగొట్టినా, బలవంతంగా మతం మార్చినా, అత్యాచారాలు, గోహత్య, జిజియా పన్నులాంటి అవమానకర విధానాలను అమలు చేసినా వారు ఆశించిన ఫలితాలు కనిపించలేదు. దురదృష్టవశాత్తు స్వతంత్య్ర భారత దేశంలో హిందువులు మాత్రమే అవలంబించిన కుటుంబ నియంత్రణ విధానం పెద్ద శాపంగా మారిపోయింది.

ఇస్లాం కుటుంబ నియంత్రణను అంగీక రించదని, దాన్ని పాటించి భగవంతుడు ఇచ్చే పిల్లలను కనే హక్కును నిరాకరించడం అపరాధం అనే అపోహలను ఇస్లాం ఛాందసవాదులు, మత పెద్దలు పెంచుతూ వచ్చారు. మన సెక్యులర్‌ ‌ప్రభుత్వాలు కూడా వీరిని బలవంత పెట్టకుండా చూసీ చూడనట్లు వ్యవహరించాయి. సగటు హిందూ కుటుంబంతో పోలిస్తే ముస్లింల సంతానోత్పత్తి రేటు 1:3% -1:4% అనేది వాస్తవం.

ముస్లింలు అనుసరించే షరియా (పర్సనల్‌ ‌లా) ప్రకారం బహుభార్యాత్వం నేరం కాదు. హిందువుల విషయానికి వచ్చే సరికి చట్టం ఇందుకు అంగీక రించదు. తప్పుదోవ పట్టించే ముల్లాల (మతపెద్దలు) బోధనలు, ఛాందసవాదం,పేదరికం, అవిద్య కూడా వారి జనాభా పెరుగుదలకు కారణాలుగా మారిపోయాయి.

ఖురాన్‌లో చెప్పలేదు

పవిత్ర ఖురాన్‌లో ఎక్కడా కూడా కుటుంబ నియంత్రణను నిషేధించలేదు. మహ్మద్‌ ‌ప్రవక్త కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరో విచిత్రం ఏమిటంటే పరోక్షంగా ఖురాన్‌ ‌కుటుంబ నియంత్ర ణను అనుమతించిందని చెప్పవచ్చు. ఉదాహరణకు పిల్లలకు రెండు సంవత్సరాల పాటు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని ఖురాన్‌ ఆదేశించింది. ఇది ఒక రకంగా తల్లీబిడ్డల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. రెండేళ్ల పాటు పాలివ్వడం అంటే ఈ మధ్య కాలంలో జననాలకు అవకాశం ఉండదు.

ఇరాన్‌, ఈజిప్ట్, ఇం‌డోనేషియా, బంగ్లాదేశ్‌ ‌వంటి సాంప్రదాయ ఇస్లామిక్‌ ‌దేశాలు కుటుంబ నియంత్రణను పాటిస్తున్నాయి. అక్కడి మతాధికా రులు, ఉలేమాలు, మసీదులో ఇమాంలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తూ, అవగాహన కల్పిస్తారు. బంగ్లాదేశ్‌లో మనకంటే ఎక్కువ మంది సంప్రదాయ వాద ముస్లింలు ఉన్నారు. అయినప్పటికి వారు కుటుంబ నియంత్రణలో మనకన్నా ముందున్నారు. ఇండోనేషియాలో ఇమామ్‌లు, మసీదులను కుటుంబ నియంత్రణ కమ్యూనికేషన్‌కు కేంద్రంగా ఉపయో గించుకుంటున్నారు. మరొక సాంప్రదాయిక ఇస్లామిక్‌ ‌దేశమైన ఇరాన్‌ ‌కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులను 74% ఆమోదించింది.

కానీ మన దేశంలో ఇస్లాం మత పెద్దలు వారిని గందరగోళంపై పెడుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఇస్లాంకు విరుద్ధమనే అపోహను విజయవంతంగా పాతుకుపోయేలా చేశాయి.

భయపెడుతున్న ఉమ్మడి పౌరస్మృతి

ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఇంతకాలం షరియా పేరుతో అమలైన ముస్లిం పర్సనల్‌ ‌లా ప్రభావం పోతుందనే అందోళన మొదలైంది. వారి వివాహం, విడాకులు, మనోవర్తి, వారసత్వం, దత్తత తదితర అంశాలు ప్రభావితం అవుతాయని భావిస్తు న్నారు. ముఖ్యంగా ఇతర మతాలతో సమానంగా కుటుంబ నియంత్రణ పాటించాల్సి వస్తుందనే భయం కూడా ఏర్పడింది. భారతదేశంలో జిహాదీ శక్తుల పెరుగుదల ఆందోళన కలిగించే విషయం. భారతీయ ముస్లింలు పెద్ద సంఖ్యలో అల్‌-‌ఖైదా, ఇస్లామిక్‌ ‌స్టేట్‌, ఇతర జిహాదీ సంస్థల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఏ కొంత మంది రాడికల్‌ ఇస్లాం-జిహాదీ భావ జాలాన్ని ఆశ్రయించినా-అది మనందరికీ తీవ్ర తలనొప్పిగా మారుతుంది. ఇవన్నీ కూడా జనాభా అసమతౌల్యంలో ఏర్పడే సమస్యలే.

దురదృష్టవశాత్తు మన దేశంలో రాజకీయ పార్టీలు, సంస్థలు ముస్లింలు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి వారిని మరింత ఛాందసవాదులుగా మారుస్తున్నాయి. దేశ హితాన్ని కోరే ఆర్‌ఎస్‌ఎస్‌, ‌హిందుత్వ, జాతీయ వాదులను వారికి బూచిగా చూపి సమాజం నుంచి మరింత దూరం చేస్తున్నాయి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram