– క్రాంతి

వడ్డించేవాడు మనవాడైతే.. పంక్తిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి. బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇటీవల చేసిన పని ఇంత కాలంగా ఆయన వేసుకున్న ముసుగును ఒక్కసారిగా తొలగించింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ వర్గానికి చెందిన కలెక్టర్‌ను హత్య చేయించిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని ‘సత్ప్రవర్తన’ కారణంగా జైలు నుంచి విడిచిపెట్టారు. గ్యాంగ్‌స్టర్‌, ‌మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌సింగ్‌ ‌విడుదల వెంటనే వివాదాస్పదంగా మారింది. ఆయన విడుదలను సవాలు చేస్తూ దివంగత కలెక్టర్‌ ‌సతీమణి ఉమాదేవి సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

30 ఏళ్ల క్రితం జరిగిన ఘటన. ఇంకా ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిగిపోలేదు. జరిగింది బిహార్‌లోనే అయినా, తెలుగు ప్రాంతంతోను ముడిపడి ఉంది. లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌బిహార్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అది. అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పోటీ ప్రభుత్వాన్ని నడిపేవి. 1994లో ముజఫర్‌పూర్‌ ‌గ్యాంగ్‌స్టర్‌ ‌ఛోటన్‌ ‌శుక్లా అనే నేరగాడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ ‌చేశారు. ఇతడు గ్యాంగ్‌స్టర్‌, ‌బిహార్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (బీపీపీ) ఆనంద్‌ ‌మోహన్‌ ‌సింగ్‌ ‌తోమర్‌కు ముఖ్యఅనుచరుడు. ఈ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. 1994 డిసెంబర్‌ 5‌న ఛోటన్‌ ‌శుక్లా అంత్యక్రియకు భారీ సంఖ్యలో బీపీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ సమయంలోనే గోపాల్‌గంజ్‌ ‌జిల్లా మేజిస్ట్రేట్‌ (‌కలెక్టర్‌) ‌జి.కృష్ణయ్య (35) అదే మార్గంలో కారులో వెళుతున్నారు. ఆనంద్‌మోహన్‌ ‌పిలుపుతో ఓ పెద్ద ముఠా కృష్ణయ్యను కారు నుంచి బయటకు లాగి రాళ్లతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తనపై దాడి జరుగుతున్నా వెంట ఉన్న అంగరక్షకున్ని పాడేందుకు ప్రయత్నించారు కృష్ణయ్య. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఆందోళనకారులను రెచ్చగొట్టి కృష్ణయ్య హత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలపై ఆనంద్‌మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు విచారణలో ఉండగానే, కారాగారం నుంచి 1996లో సియోహర్‌ ‌స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభ సభ్యునిగా గెలిచాడు. కానీ ఈ కేసులో బిహార్‌ ‌దిగువ కోర్టు ఆనంద్‌మోహన్‌ను దోషిగా తేల్చి, 2007లో అతడికి మరణశిక్ష విధించింది. అలా ఆనందమోహన్‌ ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడిగా కూడా చరిత్రకు ఎక్కాడు. కాగా ఈ తీర్పుపై విచారణ చేపట్టిన పట్నా హైకోర్టు 2008లో ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఆనంద్‌మోహన్‌ ‌సింగ్‌కు బిహార్‌ ‌రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలున్నాయి. యావజ్జీవ శిక్షతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినా జైలు నుంచే చక్రం తిప్పేవాడు. ఆయన సతీమణి లవ్లీ ఆనంద్‌ ‌కూడా ఒకసారి లోక్‌సభకు ఆర్‌జేడీ తరపున ఎన్నికయ్యారు. వీరి కుమారుడు చేతన్‌ ఆనంద్‌ ‌ప్రస్తుతం ఆర్‌జేడీ ఎమ్మెల్యే. తన కొడుకు చేతన్‌ ‌నిశ్చితార్థం కోసం 15 రోజుల పెరోల్‌పై బయటికొచ్చాడు ఆనంద్‌మోహన్‌. ఈ ‌వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ‌సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

జైలు మాన్యువల్‌ 2012 ‌నిబంధనలలో నితీశ్‌కుమార్‌ ‌సర్కారు ఏప్రిల్‌ 10‌న కీలక మార్పులు చేసింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసి, శిక్ష అనుభవిస్తున్నవారికి ‘రెమిషన్‌’ (‌శిక్షాకాలం తగ్గింపు) ఇవ్వరాదన్న నిబంధనను తొలగించారు. దీని ప్రాతిపదికగానే 27 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఇందులో ఆనంద్‌మోహన్‌ ‌సింగ్‌ ‌కూడా ఒకరు. ఏప్రిల్‌ 20‌న జరిగిన రెమిషన్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌ ‌మోహన్‌ ‌నిబంధనల సవరణతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు మాన్యువల్‌లో మార్పులు చేయకపోతే ఆనంద్‌మోహన్‌ ‌మరో ఆరేళ్లు జైలులోనే ఉండాలి. అయితే తన కుమారుడు చేతన్‌ ఆనంద్‌ ‌నిశ్చితార్థం కోసం పెరోల్‌పై బయటకువచ్చాడు. ఈ వేడుకల్లో ఉండగానే జైలు నుంచి శాశ్వతంగా విడుదలవుతున్న సమాచారం అందించారు.

రాష్ట్రంలో కులగణన గురించి చర్చ జరుగుతున్న సమయంలో నితీశ్‌ ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని అనుకున్నారో తెలియదు కానీ, ఆర్జేడీ-జేడియూ-కాంగ్రెస్‌ ‌సంకీర్ణ సర్కారులో రాజ్‌పుత్‌ ‌నాయకుల వత్తిడి మేరకే ఆనంద్‌మోహన్‌ ‌విడుదల నిర్ణయం నితీశ్‌ ‌తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్‌పుత్‌లను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నితీశ్‌ 2016‌లో ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తానే నీరుగార్చారన్న విమర్శ కూడా ఉంది.

నితీశ్‌ ‌తమ కూటమి భాగస్వామి ఆర్జేడీ చేతుల్లోకి పావుగా మారిపోయారని బిహార్‌ ‌బీజేపీ అగ్రనేత సుశీల్‌కుమార్‌ ‌మోదీ ఆరోపించడం అందుకే. మిత్రపక్షం ఆర్జేడీ కోసం నితీశ్‌ ‌చట్టాన్ని త్యాగం చేశారని ధ్వజమెత్తారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వారిలో ఆనంద్‌మోహన్‌తో పాటు భయంకర నేరాలతో శిక్షలు అనుభవిస్తున్నవారు కూడా ఉన్నారు. కాబట్టే సంఘవిద్రోహ శక్తుల నుంచి ప్రజలకు ఇక రక్షణ ఎక్కడిదన్న ఆందోళనలు కూడా మొదలయినాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగికి భయపడి నేరగాళ్లు రాష్ట్రం వదిలి పోతుంటే, నితీశ్‌ ‌జైళ్లలో ఉన్న నేరగాళ్లని ప్రధాన జీవన స్రవంతిలోకి వదిలి పెడుతున్నారు.ఈ నిర్ణయం కృష్ణయ్య రెండో హత్య అని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గ ఐఏఎస్‌ అధికారి హత్య కేసులో దోషి విడుదలపై తప్పు పట్టారామె. ఈ వ్యాఖ్యలేవీ అసంబద్ధమైనవని అనలేం. పైగా నితీశ్‌ ఈ ‌నిర్ణయం చేయడానికి తీసుకున్న సమయం ఆయన భవిష్యత్తుకి కూడా చేటు చేసేదే. నితీశ్‌ ‌విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా ప్రచారం పొందుతున్న సమయంలో ఆనంద్‌మోహన్‌ ‌విడుదల నిర్ణయం ఏమిటి? పదవీ వ్యామోహంలో ఆయన అంతగా స్పృహ లేకుండా ఉన్నారా? అందుకే కరుడగట్టిన నేరగాళ్లను కేవలం రాజకీయాల కోసం విడిచిపెట్టే ప్రభుత్వంపై, నాయకులపై ప్రజలకు ఏం నమ్మకం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు.

ఆనంద్‌మోహన్‌ను విడుదల నిర్ణయాన్ని ఇండియన్‌ ‌సివిల్‌ అం‌డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌ (‌సెంట్రల్‌) అసోసియేషన్‌ ‌తప్పుపట్టింది. విధి నిర్వహణలో ఉన్న ఐఎస్‌ఎస్‌ అధికారిని హత్య చేసిన కేసులో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించింది. ఇది న్యాయ నిరాకరణతో సమానం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. ‘‘ఖైదీల వర్గీకరణ నిబంధనలను మార్చడం ద్వారా గోపాల్‌గంజ్‌ ‌మాజీ జిల్లా మేజిస్ట్రేట్‌ ‌జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసినవారిని విడుదల చేయాలనే బిహార్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సెంట్రల్‌ ఐఎఎస్‌ అసోసియేషన్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది’’ అని అది పేర్కొంది. ఆనంద్‌ ‌మోహన్‌ ‌విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధప్రదేశ్‌ ఐఏఎస్‌ అసోసియేషన్‌ ఓ ‌ప్రకటన విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల ఐఏఎస్‌లు ఈ చర్యను ఖండించారు. బిహార్‌ ‌ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అయితే బిహార్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘం మాత్రం ఆనంద్‌ ‌మోహన్‌ ‌విడుదలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. దీనినే హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌ ఒవైసీ నిలదీశారు.

ఆనంద్‌మోహన్‌ ‌విడుదలను దివంగత కృష్ణయ్య కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేయడం సహజం. ఏ తప్పూ చేయని తమ ఇంటి యజమానిని హత్య చేయించిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడం ఆ కుటుంబం గట్టిగా వ్యతిరేకించింది. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేననీ, బిహార్‌లో ఇప్పటికీ నడుస్తున్నది ఆటవిక రాజ్యమేననీ కృష్ఱయ్య భార్య ఉమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆనంద్‌మోహన్‌ను మళ్లీ జైలుకు పంపాలని నితీశ్‌ను డిమాండ్‌ ‌చేశారు. రాజకీయ కారణాలతోనే నీతీశ్‌ ‌ప్రభుత్వం ఆనంద్‌ను విడుదల చేసిందని కృష్ణయ్య కుమార్తె పద్మ విమర్శించారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు.

కానీ గొప్ప ప్రజాస్వామికవాదిగా, ఉదారవాదిగా పేరు సంపాదించిన నితీశ్‌ ‌తన చర్యను సమర్ధించు కోవడం విశేషం. ఆనంద్‌మోహన్‌ ‌విడుదలను పూర్తిగా సమర్థించుకున్నారు. ఆనంద్‌మోహన్‌, 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న 26 మందిని కూడా విడుదల చేయడంలో తప్పేముందని ఎదురుదాడికి దిగారు కూడా. జైల్‌ ‌మాన్యువల్‌లో మార్పులను నాడు అందరూ ఆహ్వా నించారని, నేడు ఎందుకు విమర్శలు చేస్తున్నారని నితీశ్‌ ఎదురు ప్రశ్నించారు. తన భర్తను విడుదల చేసినందుకు ఆనంద్‌మోహన్‌ ‌భార్య లవ్లీ ఆనంద్‌ ‌నితీశ్‌ ‌ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏమైనా ఆనంద్‌మోహన్‌లో నాటకీయత కాస్త ఎక్కువే. తన విడుదల వార్త తెలిసిన తరువాత ఆయన నితీశ్‌ ‌కృతజ్ఞతలు, కృష్ణయ్య భార్యను కలుసుకుం టాను అని ట్వీట్‌ ‌చేశారు. ఇందులో అతిని చూడ కుండా ఉండడం కష్టం. నితీశ్‌ ‌నిర్ణయంతో ఏప్రిల్‌ 27‌వ తేదీన సహర్సా జైలు నుంచి ఆయన విడుదల య్యారు. ఇటీవలి వికృత సంప్రదాయానికి తగ్గట్టే ఏదో ఘనకార్యం చేసి జైలుకు వెళ్లి వస్తున్న వారి కోసం అన్నట్టే స్వాగతం పలికేందకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కానీ జైలు నుంచి రాగానే రహస్య ప్రదేశానికి వెళ్లిపోయాడు ఆనంద్‌మోహన్‌. ‌తన తండ్రి కృష్ణయ్య కుటుంబాన్ని కలవాలనుకుంటున్నారని ఆయన కుమారుడు చేతన్‌ ఆనంద్‌ ‌మీడియాకు చెప్పారు. దీనిపై బీజేపీ తెలంగాణ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలుంటామని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ‌పాలమూరు బిడ్డ కృష్ణయ్యను అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్‌మోహన్‌ ‌కృష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారన్న వార్త తనను కలిచివేస్తోందన్నారు. నిజానికి ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది-నితీశ్‌, ‌కేసీఆర్‌ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్‌ ‌హైదరాబాద్‌ ‌రావాలన్న నిర్ణయం ప్రకటించారని తాము భావిస్తున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరొక ముఖ్య విషయం కూడా ఉంది. ఆనంద్‌మోహన్‌ ‌విడుదలను అన్ని విపక్షాలు తప్పు పట్టాయి. కానీ మృతుడు తెలంగాణ వాసి అయినప్పటికీ, హత్య కిరాతకమే అయినప్పటికీ ఈ అంశం మీద భారస ప్రభుత్వం మాత్రం పెదవి విప్పలేదు. దేశ వ్యాప్తంగా అని వైపుల నుంచి బిహార్‌ ‌సర్కారును అంతా తప్పు పట్టినా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు లేఖ రాయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి నితీశ్‌ ‌సర్కారు వైఖరిపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇప్పుడు తన దోస్తు , బిహార్‌ ‌సీఎం నితీశ్‌ ‌కుమార్‌ను సమర్థిస్తారా లేక ఐఏఎస్‌ అధికారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తారో లేదో చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి వాటికైనా కేసీఆర్‌ ‌స్పందిస్తే ఆయన ఎంతటి ప్రజాస్వామ్యవాదో జనానికి తెలుస్తుంది.


కూలీ నుంచి ఐఏఎస్‌ అధికారిగా..

తెలుగు ఐఏఎస్‌ ‌కృష్ణయ్య జీవితం వడ్డించిన విస్తరి కాదు. కానీ దేశ యువతకు ఆయనొక ఆదర్శమే. పేద కుటుంబంలో పుట్టి కూలీగా జీవితం ప్రారంభించి సివిల్‌ ‌సర్వీసులకు ఎంపికైన స్ఫూర్తిదాయక జీవితమాయనది. జోగుళాంబ గద్వాల్‌ ‌జిల్లా ఉండవల్లి మండలం, భైరాపురం గ్రామంలో శేషన్న, వెంకమ్మ దంపతులకు ఫిబ్రవరి 8, 1957న జన్మించారు కృష్ణయ్య. చిన్నప్పటి నుంచి కూలీ పనులు చేయాల్సి వచ్చేది. మూడు పైసలకు సిమెంట్‌ ‌బస్తాలు ఎత్తడం, వ్యవసాయ కూలీ పని చేయడంతో పాటు రైల్వే గ్యాంగ్‌మెన్‌ అయిన తండ్రికి కూడా సాయం చేసేవారు. అలాంటి పరిస్థితులలోను కృష్ణయ్య చిన్నప్పటి నుంచి పుస్తకాలను విరివిగా చదివే అలవాటు చేసుకున్నారు. గద్వాల్‌లోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఓయూ పీజీ కాలేజీలు చదువుకున్నారు. జర్నలిజంతో పాటు ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేశారు. సాదాసీదా జీవితాన్ని ఇష్టపడే కృష్ణయ్య స్వయంసేవక్‌ ‌కావడం గమనార్హం. స్వామి వివేకానంద బోధనల నుండి ప్రేరణ పొందారు. ఎంతో పట్టుదలతో సివిల్స్ ‌సాధించారు. గద్వాల్‌లో ఉన్నప్పుడు ఉమాదేవిని ప్రేమించి, ముస్సోరిలో ఐఏఎస్‌ ‌శిక్షణ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కృష్ణయ్యను మొదట బొగ్గు గనులతో నిండిన హజారీబాగ్‌లో నియమించారు. కృష్ణయ్యకు అర్ధరాత్రి ఫోన్‌ ‌కాల్స్ ‌వచ్చిన వెంటనే బయలు దేరేవారు. ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌తనకు లబ్ది కూర్చే పనుల కోసం కృష్ణయ్యను అడిగేవారు. కానీ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని ఆయన స్పష్టం చేసేవారు. పనినే కర్తవ్యంగా భావించే కృష్ణయ్య తన తండ్రి మరణించి నప్పుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఎందుకంటే అయోధ్య ఉద్యమ సమయంలో బాబ్రి కట్టడం కూల్చివేత తర్వాత ఆ రోజు బిహర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారం తర్వాత స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. కృష్ఱయ్య గోపాల్‌గంజ్‌ ‌జిల్లా మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న కాలంలో పేద ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చు కున్నారు. డిసెంబర్‌ 5, 1994‌న హత్యకు గురయ్యారు.

కృష్ణయ్య మరణం తరువాత భార్య ఉమాదేవికి బిహార్‌ ‌ప్రభుత్వం సబ్‌ ‌డివిజనల్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌పదవిని ఇచ్చింది. అయితే ఆమె నిరాకరించి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. నాటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఉమాదేవికి ఉద్యోగం ఇచ్చింది.

సుప్రీం కోర్టులో పిటిషన్‌

ఆనంద్‌మోహన్‌ ‌సింగ్‌ను బిహార్‌ ‌ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఐఎఎస్‌ ‌జి.కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆనంద్‌మోహన్‌కు అంతిమ శ్వాస వరకు జీవితకాల శిక్ష పడిందని, కానీ, 14 ఏళ్లకే విడుదల చేయడం సరికాదని అన్నారు. ఆయనకు ఎలాంటి వెసులుబాటూ ఇవ్వకుండా, కోర్టు ఆదేశాలను కచ్చితమైన రీతిలో పాటిస్తూ ఆయనను చనిపోయే వరకు జైలులో ఉంచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఉమా కృష్ణయ్య తరపు న్యాయవాది చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం విచారణ తేదీని ఖరారు చేసింది. ఈ పిటిషన్‌ను మే 8న విచారించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

About Author

By editor

Twitter
Instagram