అక్షరాలా అంతర్యుద్ధం కోరలలో చిక్కుకుంది సూడాన్‌. ఒక కోర సూడాన్‌ ‌సైన్యం. మరొక కోర పారా మిలటరీ ర్యాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్సెస్‌. ఈ ‌రెండూ దేశం మీద ఆధిపత్యం కోసం అంతర్యుద్ధానికి దిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 15‌న మొదలయిన ఈ అంతర్యుద్ధం పరిపాలనను ప్రజా ప్రభుత్వానికి అప్పగించే క్రమంలో ఆరంభం కావడమే వింత. అంటే ప్రజాపాలనను ప్రతిష్టించడానికి సైన్యం, పారా మిలటరీ అంతర్యుద్ధానికి దిగి అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎడతెగని సంక్షోభాల సూడాన్‌ ‌చరిత్రలో శాంతికి పెద్దగా చోటు లేదు. విదేశీయులు తమ తమ దేశాలకు వెళ్లడానికి ఆస్కారం కల్పిస్తూ వైరిపక్షాలు ఇచ్చిన 72 గంటల కాల్పుల విరమణ కూడా సరిగ్గా అమలు జరగలేదు. అంత తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతున్నది. రెండు వారాల యుద్ధాన్ని కూడా ఆ పేద దేశం భరించలేకపోతున్నది. ఇప్పటికే దేశంలోని ఆహార నిల్వలు, త్రాగునీరు, ఔషధాలు, ఇంధనం అన్నీ నిండుకుంటున్నాయి. సూడాన్‌ ‌ప్రజలు కూడా దేశం వదిలి ఈజిప్ట్ ‌సరిహద్దులలోకి పారిపోతున్నారు.

సూడాన్‌కు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లు కొత్తకాదు. అలాగే విదేశీ దురాక్రమణలు కూడా ఆ దేశాన్ని చిరకాలం చిందరవందర చేశాయి. తెగల మధ్య ఘర్షణలు, మత కల్లోలాలు వీటికి అదనం. సూడాన్‌  ‌నిరంతరం సంక్షోభంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటీవలి చరిత్రలోనే దక్షిణ ప్రాంతానికీ, కేంద్రానికీ మధ్య రెండుసార్లు అంతర్యుద్ధాలు జరిగాయి. దక్షిణ సూడాన్‌లో పదిహేను లక్షల మంది చనిపోయారు. ఉత్తర ప్రాంతంలోని డర్ఫర్‌ ‌కూడా రక్తంతో తడిసిపోయింది. ఇక్కడ ఈ ఘర్షణల మూలంగా రెండు లక్షల మంది చనిపోయారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1956లో స్వాతంత్య్రం సాధించుకున్న ఈ పేద దేశంలో 15 సైనిక తిరుగుబాట్లు జరిగాయంటేనే ఇక్కడి అనిశ్చిత స్థితిని అర్థ్ధం చేసుకోవచ్చు.

తాజా సాయుధ సంఘర్షణ ఇద్దరి అధికార దాహం ఫలితమే. సూడాన్‌ ‌సైనిక పాలకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అబ్దుల్‌ ‌ఫతా అల్‌ ‌బుర్హన్‌, ‌జనరల్‌ ‌మహమ్మద్‌ ‌హమ్దాన్‌ ‌దాగాలో (ర్యాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్సెస్‌ అధిపతి, పాలక వ్యవస్థలో రెండో స్థానంలో ఉన్నవాడు. ఇతడినే హెమెద్టి అని కూడా అంటారు) అధికారం కోసం ఇంత విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ ఇద్దరు ఇటీవలనే సూడాన్‌లో జరిగిన ప్రభుత్వ కూల్చివేతలో కలసి పనిచేసినవారే. 2019లో అధ్యక్షుడు ఒమర్‌ అల్‌ ‌బషీర్‌ను ఆ ఇద్దరూ కలసి పదవీచ్యుతుడిని చేశారు. బషీర్‌ను పదవీచ్యుతుడిని చేయడం  వెనుక అంతుపట్టని కారణాలే ఉన్నాయి. అతడు మూడు దశాబ్దాలుగా సూడాన్‌ను పాలిస్తున్నాడు. కానీ ఇటీవల కాలంలో పెరిగిన ఆహారోత్పత్తుల ధరలు, తరువాత జరిగిన అలజడులు అతడి మీద తిరుగుబాటుకు కారణమైనాయి. కానీ బషీర్‌ను పదవి నుంచి దించడానికి అదొక్కటే కారణంగా చెప్పడానికి అంత అవకాశం లేదు. ప్రస్తుతం అంతర్యుద్ధం పాలబడిన దక్షిణ సూడాన్‌ ‌బషీర్‌ ‌కాలంలోనే ఉత్తర సూడాన్‌ ‌నుంచి వేరుపడింది. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న డర్ఫర్‌లో జరిగిన యుద్ధనేరాల గురించి బషీర్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ ‌కోర్టు వారెంట్‌ ‌జారీ చేసింది. ఎట్టకేలకు బషీర్‌ను దింపేశారు. తరువాత సమస్య మొదలయింది. ప్రజా ప్రతినిధులతో, సైనికాధికారులతో ప్రభుత్వం ఏర్పడింది. ఆ భాగస్వాముల మధ్య పొంతన కుదరలేదు. అంతిమంగా 2021లో జరిగిన సైనిక తిరుగుబాటులో సైనిక పాలకుడు ఫతా అల్‌బుర్హన్‌, ‌జనరల్‌ ‌మహమ్మద్‌ ‌హమ్దాన్‌ ‌దాగాలో, ర్యాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్సెస్‌ అధిపతి హెమెద్టి కీలకంగా వ్యవహరించారు. తరువాత ర్యాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసే అంశంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశంలో ప్రజాపాలనను పునరుద్ధరించడంలో ఆ విలీనం కూడా భాగంగా మొదట భావించారు. ప్రజాపాలనను ప్రతిష్టించిన తరువాత ఎవరి కింద ఎవరు పనిచేయాలన్న అంశమే కీలకంగా మారి, అంతిమంగా అంతర్యుద్ధానికి దారి తీసింది. బషీర్‌ ‌ప్రస్తుతం సూడాన్‌ ‌సాయుధ దళాల అదుపులో కార్తూమ్‌ ‌జైలులో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

నిజానికి ర్యాపిడ్‌ ‌సపోర్ట్ ‌ఫోర్సెస్‌, ‌దాని ప్రస్తుత నేత దాగాలో గతం వివాదాస్పదమైనదే. దాగాలో ఇంతవరకు తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్నాడు. డర్ఫర్‌ ‌ఘర్షణ సమయంలో ఇతడు జన్జావీద్‌ ‌దళాలకు నాయకునిగా ఉన్నాడు. ఇది స్థానికుల మీద హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇక అరాచకాలు సరేసరి. నిజానికి సైన్యం ఉండగానే పదవీచ్యుతుడైన బషీర్‌ ‌దీనిని ఏర్పాటు (2013) చేశాడు. దీనినే బోర్డర్‌ ఇం‌టెలిజెన్స్ ‌యూనిట్‌ అని పిలిచారు. ఆరేళ్లకే బషీర్‌కు ఎదురుతిరిగిన దాగాలో కార్తూమ్‌లో జరిగిన ప్రజా ప్రదర్శన మీద కాల్పులు జరిపాడు. అందులో 118 మంది చనిపో యారు. బషీర్‌ ‌దిగిపోయిన తరువాత అధికార మార్పడి కోసం ఏర్పడిన ట్రాన్సిషనల్‌ ‌సోవరిన్‌ ‌కౌన్సిల్‌కు దాగాలో ఉపాధ్యక్షుడయ్యాడు. ఈ అంతర్యుద్ధాన్ని ఆరంభించింది కూడా ఇదే. పలు ప్రభుత్వ వ్యవస్థ కార్యాలయాల మీద సాయుధ దాడికి దిగడంతో యుద్ధం మొదల యింది. దీనికే రష్యా మద్దతు ఇస్తున్నది.

By editor

Twitter
Instagram