– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

రాజకీయ తప్పిదాలు ప్రపంచాన్ని కన్నీటి లోయగా మార్చేస్తాయంటారు. ఉగ్రవాదం అలాంటి ఘోర తప్పిదమే. అది ఆధునిక రాజకీయ తప్పిదాలకీ, కొన్ని దేశాల స్వార్థ ప్రయోజనాలకీ కలిగిన అక్రమ సంతానం. కశ్మీర్‌ ‌హింసాకాండ, భారత పార్లమెంట్‌ ‌మీద దాడి, బొంబాయి పేలుళ్లు, గోకుల్‌చాట్‌, ‌లుంబినీ పార్క్ ‌పేలుళ్లు, అమెరికాలో ట్విన్‌ ‌టవర్స్ ‌పతనం, అఫ్ఘాన్‌లో మానవబాంబులు, నిన్నటివరకు సాగిన శ్రీలంక హింస..ఇంకా ఎన్నో.. అన్నీ ఉగ్రవాద కార్యకలాపాల వేర్వేరు ముఖాలే. ఇస్లాం ఫండమెంటలిజం, వామపక్ష ఉగ్రవాదం, క్రైస్తవంలోని కొందరి ఉన్మాదం ఏం మిగిల్చాయి? నెత్తుటి ప్రవాహాలూ, కన్నీటి వాగులే కదా! లక్షల ప్రాణాలు హరిస్తూ, అవన్నీ కలసి పనిచేస్తున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా మూడు దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగించిన నెత్తుటికాండ తరువాత ఇప్పుడు భూగోళం మొత్తానికి నొప్పి తెలిసింది. ఉగ్రవాదానికి నిజమైన బాధితురాలు భారత్‌ ‌చెబుతుంటే, ఉగ్రవాదులు తమ దేశాలనీ రక్తమడుగులు చేస్తుంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు చెవియొగ్గి ఆలకిస్తున్నాయి. ఉగ్రవాదం అంటే కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకునే ఛాందసవాదం. కొన్ని వర్గాల అణచివేత. ఉగ్రవాదమంటే స్త్రీల హక్కుల మీద వేటు. ఉగ్రవాదమంటే వలసలు. ఉగ్రవాదమంటే మత్తు పదార్థాల మీద వచ్చిన నెత్తుటి కూడుతో పెరిగిన చీడ. అంతర్జాతీయ చీకటిరాజ్యం నిధులు పోసి పెంచుతున్న విషనాగు. ఇప్పుడు ఆ నిధులు ఆపితే, ఆ పాము పడగ మీద కొట్టడానికి వీలవుతుంది. ఇందుకు భారత్‌ ‌పూనిక వహించింది. నిజానికి అంతర్జాతీయ ఉగ్రవాదం పోరు అంటూ అమెరికా ఆరంభించిన యుద్ధం కంటే, భారత్‌ ఆరంభించిన ఈ పోరాటం మరిన్ని ఫలితాలను ఇచ్చేదిగా కనిపిస్తున్నది. ఆనాడు కనిపించని సమన్వయం ఇప్పుడు భారత్‌ ‌నాయకత్వంలో సాధ్యమవుతున్నది.


‘కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానం మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, మరికొన్ని దేశాలు టెర్రరిస్టుల పైన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి’. భారత ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ దేశాలను ఉద్దేశించినవో అర్థం చేసుకోవటం కష్టం కాదు. అందులో ఒకటి మన దాయాది దేశం పాకిస్తాన్‌. ‌భారత్‌లో తీవ్రవాద దాడుల వెనుక పాక్‌ ‌పాత్ర ఉండటం బహిరంగ రహస్యం. రెండోది చైనా. భారత్‌లో దాడులకు కారకులయిన పాక్‌ ‌తీవ్రవాదులపైన ఈగ వాల కుండా చూసుకుంటుంది. ప్రధాని తన ప్రసంగంలో ఈ అంశాలను పేర్కొని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. అలాగే భారత్‌ అధ్యక్షతన నిర్వహించిన ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌పాక్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం ముప్పు ఎక్కడ నుంచి మొదలైందో ఈ ప్రపంచం మరిచిపోలేదనీ, ఇకనైనా ఆ దేశం చేష్టలను మార్చుకుని పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలనీ హితవు పలికారు.

భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించని ‘జీరో టెర్రరిజం పాలసీ’ విధానం అవలంబిస్తోంది. జీ 20 అధ్యక్ష స్థానాన్ని అందుకున్న సందర్భంలో గానీ, ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి సమావేశంలో గానీ, ఇతర అంతర్జాతీయ వేదికలపైన గానీ భారత్‌ ఇదే విషయాన్ని గట్టిగా చెబుతోంది. దేశాలన్నీ సమైక్యంగా పోరాడితే గానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేమన్న కఠిన వాస్తవాన్ని ముందుంచుతోంది. రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదులను మంచి, చెడు అన్న విధంగా వర్గీకరించటం సరికాదని భారత్‌ ‌భావిస్తోంది. అలాగే తీవ్రవాదులకు అండదండలంది స్తున్న దేశాలను దూరంగా పెట్టాలని, ఆర్థికపరమైన ఆంక్షలతో కట్టడి చేయాలని సూచిస్తోంది. టెర్రరిజం ఫైనాన్సింగ్‌ను పూర్తిగా ఎదుర్కోవటానికి శాశ్వతమైన సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఉగ్రవాదాన్ని తరిమికొట్టే శక్తిసామర్థ్యాలను మెరుగు పరుచుకోవ టానికి, బాధిత దేశాలకు అండగా నిలిచేందుకు ఐరాసకి బాసటగా నిలిచింది. యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ట్రస్ట్ ‌ఫండ్‌కు ఈ ఏడాది భారత్‌ ‌తన వంతుగా 5,00,000 డాలర్ల• విరాళంగా ఇచ్చింది. దేశీయంగా కూడా ఉగ్రవాదం నిర్మూలనకు భారత్‌ ‌పటిష్ఠమైన కార్యాచరణకు నడుం బిగించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)‌ను, ఇతర ఏజెన్సీలను బలోపేతం చేసింది. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ ‌శాఖలను ఏర్పాటు చేసి ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. చట్టపరంగా కూడా ఎన్‌ఐఏ ‌చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సవరించటం ద్వారా వ్యక్తిగత ఉగ్ర వాదులను ప్రకటించే నిబంధనకు రూపకల్పన చేశారు. ఎన్‌ఐఏకు ప్రాదేశిక అధికార పరిధి ఇచ్చారు. ఉగ్రవాదానికి సంబంధించి, ఉగ్రవాదం ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే హక్కు కూడా ఎన్‌ఐఏకు దఖలు పరిచారు. ఎన్‌ఐఏ ‌కఠిన చర్యల కారణంగా, 94 శాతం కేసుల్లో శిక్షలు అమలు చేయటం సాధ్యమైంది. అలాగే సరిహద్దుల్లో భద్రతా చర్యలను మెరుగుపరిచారు. సైనిక సిబ్బందికి అధునాతన ఆయుధాలను అందించారు. నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలను పటిష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కారణంగా ఒకప్పుడు దేశీయంగా సెక్యూరిటీ హాట్‌ ‌స్పాట్‌లుగా పేరుపడ్డ ప్రాంతాలు నేడు ప్రశాంతతకు నెలవులుగా మారాయి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ ‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌.. ఈ ‌ముగ్గురూ సాగిస్తున్న విజయ ప్రస్థానమిది.

‘ఒకరితో ఒకరు పోరాడటం వల్ల కాదు. కలిసి పోరాడితేనే ఉగ్రవాద సమస్యను పరిష్కరించుకోగలం’ అని ప్రకటించారు ప్రధాని మోదీ. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఆయన ఈ అంశానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని దేశాలు ఇందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణం, విపత్తుల సమస్య మాదిరిగానే ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఉగ్రవాదం సమసిపోయే దాకా భారత్‌ ‌విశ్రాంతి తీసుకునేది లేదని ఆయన ఘంటాపథంగా ప్రకటిం చారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘నో మనీ టెర్రర్‌’ (ఎన్‌ఎమ్‌ఎఫ్‌టీ) పేరిట నవంబరు 18, 19 తేదీలలో నిర్వహించిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. 75 దేశాలతో పాటు, వివిధ అంతర్జాతీయ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ‘ఎవరయితే తీవ్రవాదానికి మద్దతు పలుకుతారో అలాంటి వ్యవస్థలను దూరంగా పెట్టాలి. తీవ్ర వాదానికి మద్దతు పలికే దేశాలపైన భారం మోపాలి. ప్రపంచమంతా ఈ విషయంలో ఏకతాటిపైన నడవాలి’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యక్రమా లను నిరోధించటానికి వారికి నిధులు అందకుండా చూడటమే ఉత్తమమైన మార్గం అని భారత్‌ ‌భావిస్తోంది. టెర్రరిజం, మిలిటెన్సీ వల్ల దేశాలు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటాయి. అది పాలనపైన ప్రభావం చూపుతుంది. రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. కొన్ని ప్రాంతాలు పాలన పరిధి నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. టెర్రరిజంలో అంతర్జాతీయ ధోరణులు, వారికి ఆర్థిక అండదండలు అందించటంలో సాంప్రదాయ, సాంప్రదాయేతర విధానాలు, దీన్ని అధిగమించటానికి అంతర్జాతీయ సహకారం కోరేందుకు ఈ సమావేశాలు సాగాయి.

హింసను అమలుచేయటం కోసం టెర్రరిస్టులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. భావజాలాన్ని వ్యాప్తి చేయటానికి, తమ గుర్తింపును దాచిపెట్టటానికి ‘డార్క్ ‌నెట్‌’‌ను, క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్నారు. ఈ విధానాన్ని గుర్తించి పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. తీవ్రవాదం కంటే, తీవ్రవాదానికి నిధులు అందించటం అత్యంత ప్రమాదకరమైన విషయమని హోం మంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు.

‘నో మనీ ఫర్‌ ‌టెర్రర్‌ (ఎన్‌ఎమ్‌ఎఫ్‌టీ) కింద, ఉగ్రవాదులకు ఆర్థిక అండదండలు (టెర్రర్‌ ‌ఫైనాన్సింగ్‌) అం‌దకుండా శాశ్వతమైన సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలని భారత్‌ ‌భావిస్తోంది. తమ ఉద్దేశాలను వివరిస్తూ ముందుగా ఒక నోట్‌ను అందించి, అందరి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక పూర్తి స్థాయి కార్యాచరణకు దిగాలని యోచిస్తున్నారు. చిన్న చిన్న ఆర్థిక నేరాల నుంచి వ్యవస్థాగత ఆర్థిక నేరాల వరకూ నిఘా సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు మధ్య సమన్వయం తప్పనిసరి అని హోం మంత్రి చెబుతున్నారు. గుర్తించటం (ట్రేస్‌), ‌గురిపెట్టటం (టార్గెట్‌), ‌నిర్మూలించటం (టెర్మినేట్‌) ‌విధానాల ద్వారా అవి ముందుకు వెళ్లాలని సూచించారు. సెక్రటేరియట్‌ ‌నిర్మాణం ఎలా ఉంటుంది? దాని విధి విధానాలు ఏమిటి? ఇతర దేశాల నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు అందుతాయనే అంశాలపై స్పష్టత రావాలి.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం అవలంబించవలసిన విధానాలపై ఐరాస భద్రతా మండలిలో భారత్‌ అధ్యక్షతన డిసెంబరు 14, 15 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ అధ్యక్షత వహించారు. 15 దేశాలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సమావేశా లకు ముందు అందరికీ ఒక నోట్‌ ‌సర్క్యులేట్‌ ‌చేశారు. ‘సెప్టెంబరు 11, 2001న న్యూయార్క్ ‌మహా నగరంపై తీవ్రవాదులు జరిపిన దాడి అనంతరం, కౌంటర్‌ ‌టెర్రరిజంపైన అంతర్జాతీయ దృష్టి మారింది. అప్పటి నుంచి లండన్‌, ‌ముంబై, పారిస్‌లతో పాటు పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలు తీవ్రవాదుల దాడికి గురయ్యాయి. వీటి ద్వారా ఒక విషయం అర్థమవుతుంది. ఉగ్రవాదం అనేది తీవ్రమైనది, విశ్వవ్యాప్తమైనది. ఒక ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రవాద చర్య మిగిలిన ప్రపంచంలో శాంతిని, భద్రతను దెబ్బతీస్తుందనే విషయాన్ని అది చాటి చెబుతుంది. తీవ్రవాదులు, వారి సహాయకులు, అన్ని రకాలుగా అండదండలందించే వారు పరస్పరం సహకారంతో పనిచేస్తారు. ఒక దేశంలో ఉండి, మరొక ప్రదేశంలో కార్యకలాపాలు నిర్వహి స్తూంటారు. దీనిని ఎదుర్కోవడం ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్ని సహకారం వల్లనే సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాకిస్తాన్‌ ‌మంత్రి ఒకరు భారత్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపైన జైశంకర్‌ ‌తీవ్రంగా స్పందించారు. ‘ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్‌ ‌పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఓ వ్యాఖ్య చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి’ అని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

‘9/11 న్యూయార్క్, 26/11 ‌ముంబై సంఘ టనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. గత రెండు దశాబ్దాలుగా టెర్రరిజాన్ని గట్టిగా తిప్పికొడు తున్నాం. అయినా అదొక యుద్ధం. ఈ విషయంలో విశ్రమించటానికి తావులేదు’ అని ఆయన వివరించారు.

సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయటంలో ఇంటర్నెట్‌, ‌సామాజిక మాధ్యమాలు మిలిటెంట్‌ ‌గ్రూప్‌ల టూల్‌కిట్లలో శక్తిమంతమైన సాధనాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక సమాచారం సరికొత్త సవాళ్లను విసురుతోంది. ఉగ్రముప్పును ఎదుర్కోవటానికి యూఎన్‌ ‌భద్రతా మండలి చర్యలు తీసుకున్నా ఉగ్రవాదం విస్తృతమవుతోంది. ఆసియా, ఆఫ్రికాల్లో పరిస్థితి తీవ్రమవుతోంది. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించటంలో, ఉగ్ర సంస్థలకు నిధులు అందించే దేశాలను గుర్తించ టంలో మండలి కీలకంగా మారింది. మండలి ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం పెచ్చుమీరటం పట్ల కేంద్ర మంత్రి జైశంకర్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. 1267 శాంక్షన్స్ ‌కమిటీ నివేదిక ఎత్తి చూపిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

పాకిస్తాన్‌ ‌ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ‌టాస్క్ ‌ఫోర్సు (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‌గ్రే లిస్టులో ఉండటం వల్లనే జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు తగ్గిపోయాయని బహిరంగంగా ప్రకటించటంలో భారత్‌ ‌వెనకాడటం లేదు. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్ష్యాలను అందుకోకపోవటం వల్ల పాక్‌ను నాలుగేళ్ల పాటు గ్రే లిస్టులో ఉంచారు. ఇటీవల గ్రే లిస్టు నుంచి పాక్‌ను తొలగించారు. దీనితో ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం దక్కించుకుంది. దీని వల్ల మళ్లీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని భారత్‌ ‌హెచ్చరించింది. ఉగ్రవాద మూలాలు ఏ దేశంలో ఉన్నాయో అందరికీ తెలుసు అని ప్రకటించటంలో అంతరార్థం ప్రపంచ దేశాల దృష్టిలో పాక్‌ను దోషిగా నిలపటానికే. కౌంటర్‌ ‌టెర్రరిజంపైన ముంబైలో మరో సమావేశం, ఢిల్లీలో ఇంటర్‌ ‌పోల్‌ (‌యాన్యువల్‌ ‌జనరల్‌ అసెంబ్లీ ఆఫ్‌ ‌ది ఇంటర్‌ ‌పోల్‌) ‌సమావేశం నిర్వహించారు. ఈ రెండు అంతర్జాతీయ సమావేశాలు ఈ ఏడాది అక్టోబర్‌లోనే సాగాయి.

అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి పనిచేసే అంతర్జాతీయ ఉగ్రవాద బృందాలను ఎదుర్కోవటానికి సంయుక్త కార్యాచరణ అవసరమని షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్సీఓ) ఆధ్వర్యంలోని రీజియనల్‌ ‌యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్‌ (ఆర్‌ఏటీఎస్‌) అభిప్రాయ పడింది. ఈ సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. ఎస్సీఓ-రాట్స్ అధ్యక్ష హోదాలో భారత్‌ ఈ ‌సమావేశం నిర్వహించింది. చైనా, పాకిస్తాన్‌ ‌సహా సభ్య దేశాలకు చెందిన సీనియర్‌ ‌సభ్యులు పాల్గొన్నారు. కొవిడ్‌-19 ‌తర్వాత చైనా బృందం వ్యక్తిగతంగా సమావేశాలకు హాజరయ్యింది ఇక్కడే. అప్ఘన్‌లోని టెర్రరిస్టులకు పాకిస్తాన్‌ ‌వెన్నుదన్నుగా నిలవటం, ఆర్థిక సహాయం అందించటం అనేది అందరికీ తెలిసిందే. దాంతో ఈ సమావేశాలకు విశేషమైన ప్రాధాన్యం ఏర్పడింది. డిప్యూటీ నేషనల్‌ ‌సెక్యూరిటీ అడ్వయిజర్‌ ‌దత్తాత్రేయ పాల్గొన్నారు. ‘అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి పనిచేసే టెర్రరిస్టు బృందాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి ఎస్సీఓలోని సభ్యదేశాలన్నీ అంగీకరించాయి’ అని తర్వాత భారత్‌ ‌ప్రకటన విడుదల చేసింది. ‘సాలిడారిటీ-2023’ పేరిట వచ్చే ఏడాది చైనాలో మిలటరీ డ్రిల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశం 2023 మార్చిలో తాష్కెంట్‌లో నిర్వహిస్తారు.

ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్‌ ఎం‌బసీ, భారత సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఢిల్లీలో సెక్యూరిటీ డ్రిల్‌ ‌నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి టెర్రరిస్టు దాడులనయినా ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నామనే సందేశం పంపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందటానికి ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయని ఇజ్రాయెల్‌ ఎం‌బసీ పేర్కొంది.

చింతన్‌ ‌శిబిర్‌ ‌పేరిట కేంద్ర ప్రభుత్వం హరియాణాలోని సూరజ్‌ ‌కుండ్‌లో రెండు రోజుల పాటు మేధోమథన శిబిరం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, లెఫ్టినెంట్‌ ‌గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సారధులు పాల్గొన్నారు. ఇందులోనూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి అంతర్గత భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాలను చర్చించారు. హోం మంత్రి అమిత్‌ ‌షా కీలకో పన్యాసం చేశారు. దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్గత భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా వినియో గించుకోవలసిన అవసరం ఉందని సూచించారు. ‘ఒకే సమాచారం.. ఒక ప్రవేశం’ అన్న సూత్రంపై ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఉగ్రవాద కేసులకు సంబంధించిన డేటాబేస్‌ ఎన్ఫోర్స్మెంటు డైరక్టరేట్‌కు అందుబాటులో ఉందని చెప్పారు.

మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌ముస్లిం సంస్థ ‘ఉలేమా’తో చర్చలు జరిపారు. ఇండోనేసియా మంత్రి మహమ్మద్‌ ‌మహఫడ్‌తో పాటు ఉలేమా ప్రతినిధుల బృందం ఇక్కడికి విచ్చేసింది. తీవ్రవాదాన్ని రూపుమాపటానికి, శాంతి, సహజీవనం మెరుగుపడటానికి ఉమ్మడి కార్యాచరణ అవసరం అని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం అనేవి ఇస్లాం మతసిద్ధాంతాలకు వ్యతిరేకం. ఆధునికమైన ఈ సిద్ధాంతాలను తెలియచెప్పి ప్రజలను విద్యావంతులను చేయటంలో, వారిని తీవ్రవాదం నుంచి దూరం చేయటంలో ఉలేమాల పాత్ర కీలకమని చెప్పారు. ‘ప్రజా స్వామ్యంలో ద్వేషపూరితమైన ప్రసంగాలకు, దుష్ప్రచారానికి, హింసకు, స్వార్థపూరితమైన వ్యవహారాలకు మతాన్ని వినియోగించటం వంటివి సరికాదు. ఇండియా, ఇండోనేసియా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ఐసిస్‌ ‌ప్రేరిత తీవ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని చాలా వరకూ అధిగమించగలిగాం. పౌరసమాజం కూడా చొరవ చూపాలి. సిరియా, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వచ్చి తీవ్రవాద చర్యలకు పాల్పడేవారిని, ఐసిస్‌ ‌ప్రేరేపిత తీవ్రవాద బృందాలను తరిమి కొట్టటానికి భద్రతా సిబ్బందికి సహకరించాలి’ అని దోవల్‌ ‌పేర్కొన్నారు.

భారత్‌ అనుభవాలు

తీవ్రవాదం విషయంలో భారత్‌ ఒకప్పుడు బాధితురాలు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, జమ్ముకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు ఒకప్పుడు హింసకు, అశాంతికి నిలయాలుగా ఉండేవి. మోదీ ప్రభుత్వ హయాంలో గత ఎనిమి దేళ్లుగా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈశాన్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయి. 2014 నుంచి తిరుగుబాటు ఘటనలు 74 శాతం, భద్రతా బలగాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 60 శాతం, పౌరుల మరణాలు 90 శాతం తగ్గుదల నమోదయ్యింది. జాతీయ త్రిపుర విమోచన ఫ్రంట్‌ (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ), బోడో, బ్రూ, కార్బీ అంగ్లాంగ్‌ ‌వంటి సంస్థల తీవ్రవాదులతో సహా తొమ్మిది వేల మంది ఉగ్రవాదుల లొంగుబాటుకు ఒప్పందాలు చేసుకోవటం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన శాంతి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా 60 శాతానికి పైగా ఇక్కడ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ని ఉపసంహరించారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.హింసాత్మక ఘటనలు 77 శాతం తగ్గాయి. అలాగే హింస వల్ల మరణాలు 85 శాతం తగ్గాయి. గతంలో వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమయ్యే జిల్లాలు 120 ఉంటే వాటి సంఖ్య 46కు తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని జిల్లాలు ఇంకా సతమవుతూనే ఉన్నాయి.

ఆగస్టు 5, 2019న ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత, జమ్ముకశ్మీర్‌లో కొత్త శకం మొదలయ్యింది. ఆ తర్వాత ఉగ్రవాద ఘటనలు 34 శాతం, భద్రతా దళాల మరణాలు 54 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2021 నాటికి దాదాపు 102 మంది టెర్రరిస్టులు బలహీనపడ్డారు. మే 2018, జూన్‌ 2021 ‌మధ్య దాదాపు 630 టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ప్రయత్నంలో 85 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌మీద కూడా ఎన్‌ఐఏ ‌కఠినంగా వ్యవహ రించింది.

పాక్‌, ‌చైనాల చెలిమి

భారత్‌ ‌కన్నా ఒక రోజు ముందుగా స్వాతంత్య్రం అందుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌. ‌మనదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటే, అక్కడ నెత్తుటి చరిత్ర నడుస్తోంది. అది తీవ్రవాదుల అడ్డా. పైకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా, వ్యవహారాలు నడిపించేది సైన్యమే. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లు మనలేదు. పుల్వామా దాడి తర్వాత భారత్‌లో చొర బడటానికి పాక్‌ ‌తీవ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పాక్‌ ‌సరిహద్దు గ్రామల నుంచి భారత్‌లోకి ప్రవేశించటానికి అనేక సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఆయుధ సామాగ్రి అందించటానికి డ్రోన్లను వినియోగించటం, పావురాల ద్వారా సందేశాలు పంపటం వంటివి తరచూ వార్తల్లో చోటు చేసుకుంటూంటాయి. భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటమే కాదు, డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచే ఉగ్రవాదుల టెక్నాలజీ వెనక పాక్‌ ‌హస్తం ఉందని యూఎన్‌కు ఫిర్యాదు చేసింది.

ఇక చైనా.. ఒక పక్క పాకిస్తాన్‌తో, మరోవైపు అప్ఘన్‌ ‌తాలిబాన్‌తో కలిసి నడుస్తోంది. స్వప్రయోజ నాల కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. ఇతర దేశాలను ఆదుకోవటానికి అప్పులు ఇస్తుంది. అప్పు తీర్చలేదని ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా మంటుంది. యూఎన్‌ ‌శాంక్షన్స్ ‌కమిటీ కింద పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే అబ్దుల్‌ ‌రహమాన్‌ ‌మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ఇండియా, అమెరికాలు సంయుక్త ప్రతిపాదన చేస్తే దాన్ని చైనా వ్యతిరేకించింది.

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జమత్‌ ఉద్‌ ‌దవా (జెయూడీ) రాజకీయ వ్యవహారాలకు మక్కీ నాయకత్వం వహించాడు. అలాగే ఎల్‌ఈటీ విదే శాంగ సంబంధాల వ్యవహారాలను పర్యవేక్షించాడు. భారత్‌లో 26/11 ముంబై దాడులు, 2000లో ఎర్రకోట పైన దాడి, 2008లో రాంపూర్‌ ‌సీఆర్ఫీఎఫ్‌ ‌క్యాంప్‌పై దాడి, 2018లో వరుసగా ఖాన్పోర (బారముల్లా) దాడి, శ్రీనగర్‌ ‌దాడి, గురాజ్‌ /‌బండిపోర దాడులు వీటన్నింటి వెనక మక్కీ హస్తం ఉంది. 2019 మే నెలలో పాకిస్తాన్‌ అతన్ని అదుపులోకి తీసుకుని లాహోర్‌లో హౌస్‌ అరెస్టు చేసింది. టెర్రరిస్టు ఫైనాన్సింగ్‌ ‌చేస్తున్నందుకు పాకిస్తాన్‌ ‌జైలు శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ చట్టాల మేరకు భారత్‌, అమెరికాలు మక్కీని టెర్రరిస్టుగా ప్రకటించాయి. చైనా అడ్డుకోకపోయి ఉంటే అంతర్జా తీయంగా కూడా భారత్‌ ‌విజయం సాధించి ఉండేది. తీవ్రవాదుల విషయంలో చైనా అడ్డుకోవటం ఇది మొదటిసారి కాదు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ (‌జేఈఎమ్‌) ‌చీఫ్‌ ‌మౌలానా మసూద్‌ అజర్‌ ‌విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది.

మాటల్లోనే కాదు, ఆచరణలోనూ..

సరిహద్దుల మధ్య గట్టి నిఘా, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం ద్వారానే తీవ్రవా దులను, తీవ్రవాదుల బృందాలను కట్టడి చేయవచ్చని యూఎన్‌ ‌సెక్యూరిటీ కౌన్సిల్‌ 1373 (2001) ‌ప్రతిపాదన చెబుతోంది. బోర్డర్‌ ‌సెక్యూరిటీ అనేది అన్నింటి కంటే కీలకం. ఫారిన్‌ ‌టెర్రరిస్టు ఫైటర్స్ (ఎఫ్టీఎఫ్‌) ‌సహా అన్ని రకాల తీవ్రవాదులను అడ్డుకోవాలి. అలాగే గూడ్స్, ‌కార్గో వంటివి అక్రమంగా ప్రవేశించకుండా చూడాలి. సముద్రం, తీర ప్రాంతాలపై నిఘా పెట్టటం అనేది మరో అంశం. దీనిని సమర్థవంతంగా అమలు చేయటానికి టెర్రరిస్టుల పూర్తి సమాచారం (డేటా బేస్‌) అం‌దు బాటులో ఉండాలి. అత్యున్నత సాంకేతిక వ్యవస్థతో కూడిన ఉపకరణాలు, మానవ వనరులు అవసర మవుతాయి. ఉగ్రవాదుల కదలికలను నియంత్రించ టానికి చాలా దేశాలు ట్రాన్సిట్‌ ‌వీసాలు ప్రవేశ పెట్టాయి. కొన్ని దేశాలు ఇంటర్‌ ‌పోల్‌ ‌డేటా బేస్‌, ఇం‌టర్‌ ‌పోల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం క్రిమినల్‌ ఎనాలసిస్‌ ‌ఫైల్‌ (‌సీటీసీఏఎఫ్‌)‌తో స్క్రీనింగ్‌ ‌వంటి చర్యలు చేపడుతున్నాయి. అది పూర్తిస్థాయిలో అమలు కావటం లేదనే చెప్పాలి. బోర్డర్‌ ‌మేనేజ్‌మెంట్‌ అనేది స్థానిక చట్టాలపైన, అంతర్జాతీయ ఒడంబడికల ఆధారంగా సాగుతుంది.

భారతదేశం ‘ఫార్వర్డ్ ‌పాలసీ’ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా సైనిక విమానాశ్రయాలని పెంచుతోంది. ఇప్పటివరకూ గుజరాత్‌లో వడోదర, జామ్‌నగర్‌, ‌భుజ్‌, ‌నాలియా (కచ్‌)‌లలో సైనిక స్థావరాలున్నాయి. తాజాగా ఐదో స్థావరమైన ‘డీసా’కు ఈ మధ్యనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుటికే ఇక్కడ 20 నిఘా టవర్లున్నాయి. దాని చుట్టూ గోడ కూడా ఉంటుంది. మొత్తం 4,519 ఎకరాల్లో, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఉపకరణాలతో ఆధునిక సాంకేతికతతో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. రెండు దశల్లో ఇది సాగుతుంది. యుద్ధ విమానాల కోసం రన్‌ ‌వే, సమాంతర టాక్సీ వే, టూప్‌ ‌టాక్సీ ట్రాక్‌, ‌ఫైటర్‌ ‌స్క్యాడ్రన్‌ ‌డిస్పెరల్‌ ఏరియా మొదలైనవి సిద్ధమవుతాయి. రెండో దశలో ఆధునిక సాంకేతిక నియంత్రణ భవనం, వైమానిక దళ సిబ్బంది కోసం ఇళ్లు నిర్మితమవుతాయి. ఇది దేశ వైమానిక భద్రతకు కీలకం. అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడ నుంచి కేవలం 130 కి.మీ. దూరంలో ఉంది. మన బలగాలు, ముఖ్యంగా వైమానిక దళం డీసాలో ఉంటే, పశ్చిమ సరిహద్దులో ఎలాంటి సవాళ్లనయినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని ప్రధాని పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ తర్వాత భారత దేశం వైమానిక దళాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరించే పనిలో పడింది. భారత్‌ ‌యుద్ధ విమానాలు చాలా వరకూ రష్యా నుంచి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి మిగ్‌ 21, ‌మిగ్‌ 29, ‌సుఖోయ్‌. ‌మిగ్‌ 21 అన్నింటికంటే పాతది. వీటి స్థానంలో రఫేల్‌, ‌మిరాజ్‌, ‌జాగ్వార్‌ ‌వంటి కొత్త యుద్ధ విమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం 632 యుద్ధ విమానాలు, 438 హెలికాప్టర్లు, 250 రవాణా విమానాలు, 304 శిక్షణ విమానాలు సహా మొత్తం 1645 విమానాలు భారత్‌ ‌వద్ద ఉన్నాయి. ఇటీవల దేశీయంగా తయారైన లైటర్‌ ‌కంబాట్‌ ‌యుద్ధ విమానం ‘తేజస్‌’, ‌ప్రచండ’ హెలికాఫ్టర్లు వైమానిక దళంలోకి వచ్చి చేరాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అలాగే భారత్‌ ‌వద్ద 31 ఫైటర్‌ ‌స్కాడ్రన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే పదేళ్లలో వీటి సంఖ్యను 42కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. వైమానిక దళాల ఆధునీకరణతో పాటు రాబోయే సంవత్సరాలలో మరిన్ని సైనిక విమానాశ్ర యాలు, సరిహద్దుకు సమీపంలో కొత్త ఎయిర్‌ ‌స్ట్రిప్‌లను నిర్మించాలనే లక్ష్యంతో భారత్‌ ఉం‌ది.

మరోవైపు సైన్యం నియామకాలు, ఆధునీకరించే కార్యక్రమం కూడా చురుగ్గా సాగుతోంది. రక్షణ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సగటున 60 వేల మంది సైనికులు నియమితులవుతూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కావటం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. సైన్యాన్ని ఫ్యూచర్‌ ఇన్‌ ‌ఫాంట్రీ సోల్జర్‌ ఆస్‌ ఏ ‌సిస్టమ్‌ (ఎఫ్‌-ఐఎన్‌ఎస్‌ఏఎస్‌) ‌ద్వారా అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధం చేయటానికి ఏర్పాట్లు చేశారు. దీనికింద ప్రత్యేక రక్షణ వ్యవస్థలు, పరికరాలు ఉంటాయి. కొత్త తరం ల్యాండ్‌మైన్లు, ట్యాంకుల కోసం అప్‌ ‌గ్రేడ్‌ ‌చేసిన సైట్‌ ‌సిస్టమ్‌, అటాక్‌ ‌బోట్‌లు, హైమొబిలిటీ ఇన్‌ ‌ఫాంట్రీ వాహనాలు వంటి వాటిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌సైన్యానికి అప్పగించారు.

రాత్రి కూడా చూడగలిగేలా హోలోగ్రాఫిక్‌, ‌రిఫ్లెక్స్ ‌విజన్‌తో కూడిన మొట్టమొదటి ఆధునిక అసాల్ట్ ‌రైఫిల్‌ ‌సైనికుల చేతిలో ఉంటుంది. అలాగే వారు ధరించే హెల్మెట్‌లో 360 డిగ్రీల బైనాక్యులర్‌ ఉం‌టుంది. రైఫిల్‌తో పాటు సైనికుడి వద్ద వివిధ అవసరాల కోసం కత్తులు, వివిధ రకాల హ్యాండ్‌ ‌గ్రానైడ్లు అందుబాటులో ఉంటాయి. ఇక రెండో భద్రతా వ్యవస్థ సైనికుడికి బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌జాకెట్‌. ఈ ‌జాకెట్‌ ఏకె 47 లాంటి ఆయుధాల నుంచి వచ్చే బుల్లెట్‌ ‌నుంచి కూడా సైనికుడిని రక్షిస్తుంది. మూడోది కమ్యూనికేషన్‌ అం‌డ్‌ ‌సర్వైవలెన్స్ ‌సిస్టమ్‌. ‌కీలక సమయాల్లో సైనికులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్‌ ‌చేసుకోగలుగుతారు. అలాగే పుణెలోని ఆర్మమెంట్‌ ‌రీసెర్చి డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అం‌డ్‌ ఇం‌డియన్‌ ‌డిఫెన్స్ ఇం‌డస్ట్రీ సహకారంతో కొత్త రకం ల్యాండ్‌మైన్లను కూడా తయారు చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ల్యాండ్‌మైన్ల కంటే ఇది అత్యంత ప్రభావవంతమైనది.

ఆయుధాల ఎగుమతిదారుగా కూడా..

2024 నాటికి భారత ఆయుధ ఎగుమతులను 5 బిలియన్‌ ‌డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్‌ ‌హోం ఇంటర్నేషనల్‌ ‌పీస్‌ ‌రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ‌నివేదిక ప్రకారం 2015-19 మధ్య కాలంలో ఆయుధాల దిగుమతిలో భారత్‌ ‌రెండో అతి పెద్ద దేశంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సాంప్రదాయ ఆయుధాల మార్కెట్‌లో అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్‌ ఆధిపత్యం చూపిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌ ‌కూడా అడుగు పెడుతోంది. యుద్ధాల్లో డ్రోన్లు, కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. ఎన్నో యూరోపియన్‌ ‌దేశాలు దీన్ని అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయి ఎగుమతిదారుగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాయి. అందుకు ఉదాహరణ తూర్పు యూరప్‌లో ఒకటైన చెకోస్లోవేకియా. ఇంతకుముందు భారత్‌ ఈక్వెడార్‌కు కొన్ని హెలికాఫ్టర్లు అమ్మింది. తర్వాత రోజుల్లో ఏవో కారణాల వల్ల ఆ ఒప్పందం ముందుకు సాగలేదు. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్‌ ‌క్షిపణిని భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించే దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. పూర్తిగా భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపు దిద్దుకుని, 2014లో దీనిని భారత వైమానికదళం అమ్ముల పొదిలో చేర్చారు. ఇలా భారత్‌ ‌విధానాల పరంగా, ఆచరణపరంగా ఉగ్రవాద వ్యతిరేక పంథాను అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నం విజయవంతం కావడమంటే ప్రపంచ శాంతికి మార్గం ఏర్పడడమే.

By editor

Twitter
Instagram