– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

జానపద సంప్రదాయాలకు కాణాచిగా పేర్కొనే తెలంగాణలో అక్కడి సంస్కృతీ సంప్రదాయా లకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మచ్చుతునక. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే ఆనవాయితీ ప్రకారం, ఈ నెల (డిసెంబర్‌) 18‌న మల్లన్న కల్యాణం వైభవంగా జరిపారు. మరునాడు ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, మహా మంగళ హారతి నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో తయారు చేయించిన కిలోన్నర పరిమాణం గల బంగారు కిరీటాన్ని అందచేశారు. సంక్రాంతి తరువాత ఆదివారం నుంచి ఉగాది ముందటి ఆదివారం వరకు మల్లన్న జాతర జరుగుతుంది.

సిద్ధిపేట జిల్లాలోని కొమరవెల్లిలో కొండపై వెలసిన మల్లికార్జునస్వామి మామూలుగా కనిపించే లింగాకారంలో కాకుండా శిరస్సున పడగవిప్పిన నాగేంద్రుడు, కోరమీసాలతో గంభీరరూపుడిగా నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. ఆయనను ప•రమేశ్వరుడి అవతారమైన మార్తాండ భైరవుడని చెబుతుండగా, మహారాష్ట్రీయులు ‘ఖండోబా’ అనే పేరుతో పూజిస్తారు. మల్లన్న శివుని కుమారుడని, ఎల్లమ్మకు తమ్ముడని మల్లన్న కథలో వస్తుంది. మణి-మల్ల అనే రాక్షసులను సంహరించేందుకు రమేశ్వరుడు మల్హాసురుగా అవతరించినట్లు బ్రహ్మాండ పురాణగాథ చెబుతోంది. కుమారస్వామి ఈ ప్రాంతంలో త•పస్సు చేయడం వల్ల కుమారవెల్లి అని పేరు వచ్చి, కాలక్రమంలో ‘కొమరవెల్లి’గా, ‘కొమ్రెల్లి’గా మారిందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని అపర శ్రీశైలంగా పరిగణిస్తూ, అక్కడికి వెళ్లలేని వారు ఈ మల్లన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉంది.

స్థలపురాణం ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్‌ ‌జిల్లా మాలెగావ్‌ ‌ప్రాంతంలో ఖండోబా (మల్లికార్జున స్వామి) ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి ‘కొమరవెల్లి కొండ గుహలలో వెలసినట్లు’ చెప్పడంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చి, అక్కడ శివలింగం ఉండడంతో పూజాదికాలు మొదలు పెట్టారట. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పెరిగిన పుట్ట మట్టితోనే మాలెగావ్‌లోని స్వామి విగ్రహం తరహాలో ఇక్కడ మూర్తిని తయారు చేసినట్లు తమ పూర్వికులు చెప్పినట్లు ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. మల్లన్న ఆలయాలు గ్రామ పొలిమేరల్లోనో, ఆడవుల్లోనో ఉంటాయి. కొత్తగా చేపట్టే ఆలయాలను ఊరి చివరే కడతారు.

మల్లన్న ఆలయాలలో బ్రాహ్మణేతరులే (బలిజలు, తమ్మాలి, జంగాలు) పూజారులుగా ఉన్నారు. ఆలయం వెలుపల మల్లన్న కల్యాణోత్సవం నిర్వహించే వారంతా ఒగ్గు సామాజికవర్గం వారే. మల్లన్న దేవుడు యాదవ, లింగబలిజ సామాజిక వర్గాలకు చెందిన కేతమ్మ, మేడలమ్మలను పెళ్లాడడం వల్ల ఆయా సామాజికవర్గాల వారే పూజాదికాలు నిర్వహిస్తున్నారని చెబుతారు. పశుపాలకులైన కురుమ, యాదవ సామాజికవర్గాలకు ఆయన అత్యంత ప్రియమైన దేవుడు.

ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు మొదలయ్యే మల్లన్న వార్షిక కల్యాణం, జాతర ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందటి ఆదివారం) వరకు కొనసాగుతుంది. మకర సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాలలో జాతర జరుగుతుంది. సంక్రాంతి తరువాతి ఆదివారం ‘పట్నం’ వారమని, రెండవ ఆదివారాన్ని బోనాలు లష్కర్‌ ‌వారమని అంటారు. మల్లన్న తమ ఆడబిడ్డ మేడలాదేవిని మనువాడి నందున ఈ వారాన్ని యాదవులు అత్యంత ప్రీతి కరంగా భావిస్తారు. పురుషులు ఎల్లమ్మ అవతారంలో చీర ధరించి బోనం తీసుకువెళ్లి సమర్పిస్తారు. కొందరు వీరభద్రునిలా గజ్జెలతో కూడిన వస్త్రాలు ధరించి వస్తే, ఇంకొందరు శివసత్తులులా ఉంటారు.

భక్తులు ఆ మూడు నెలల కాలంలో బోనం, ‘పట్నం’ అనే విశేష కార్యక్రమాలలో మొక్కులు సమర్పించుకుంటారు. అలంకరించిన కొత్త కుండలో అన్నం వండి స్వామివారికి నివేదించడాన్ని బోనం అంటారు. బెల్లం, బియ్యాన్నే బోనంగా సమర్పిస్తారు తప్ప బలి సమర్పణలు ఉండవు. మల్లన్నను కీర్తిస్తూ జానపద శైలిలో ‘ఒగ్గు వాయిస్తూ పాటలు పాడతారు. ప్రకృతి సిద్ధమైన అయిదు రంగులతో వేసే పెద్ద ముగ్గులను ‘పెద్ద పట్నం’గా పిలుస్తారు. హోళీ పండుగకు ముందు దీనిని నిర్వహిస్తారు. ఒగ్గు పూజారులు 49 వరుసలతో ఈ ముగ్గు వేస్తారు. (జాతర తరువాత ఈ ముగ్గును సేకరించి పంట పొలాల్లో చల్లుతారు). ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు స్వామి వారి ప్రతిష్ఠ నాడే అంకుర రూపం దాల్చిందని చెబుతారు. భక్తులు ముందుగా ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. మొక్కుబడిగా కొబ్బరికాయను వస్త్రంలో చుట్టి దానికి కడతారు.

మహాశివరాత్రి సంరంభం

మహాశివరాత్రిని లింగోద్భవ వారంగా వ్యవహరిస్తారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మల్లన్న స్వామి ఆలయానికి కొంత చేరువలో కొండపై కొలువుదీరిన రేణుకాదేవిని ఆయన సోదరిగా భావించి భక్తులు బోనాలు సమర్పిస్తారు, జాతర నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు వరాల బండకు భక్తులు, ముఖ్యంగా మహిళలు పూజలు చేస్తారు. దీనివల్ల సంతానం కలుగుతుందని విశ్వాసం.

మట్టిపాత్రల ప్రసాదం

భక్తులు మల్లన్నకు మట్టి పాత్రలలో పదార్థాలను నైవేద్యం పెడతారు. తరువాత ఆ పాత్రలను పాడి పంటల అవసరాలకు వినియోగిస్తారు. దీని వల్ల పాడి పండటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. ఆ పాత్రలను గృహావసరాలకూ వినియోగిస్తారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE