‌హిమాచల్‌‌ప్రదేశ్‌ అం‌టే ఏం గుర్తొస్తుంది? సుందర పర్వత ప్రాంతం. అర్థ శతాబ్ది కిందట వాయవ్య భారతాన రూపొందిన రాష్ట్రం. మరి..రీనా కశ్యప్‌ ‌పేరు? ఆ పేరు ఇప్పుడు అక్కడ మారుమోగుతోంది. అక్కడే కాదు, దేశమంతటా!  ఆ  రాష్ట్ర శాసనసభకు జరిగిన తాజా ఎన్నికలలో విజయం సాధించిన ఏకైక మహిళామణి ఆమె. ‘రాజకీయాల్లోనూ వనితలదే కీలకపాత్ర’ అని చెప్పడమే  కాకుండా  చేసి చూపారు.  పాలనచక్రం తిప్పడంలో కూడా అతివలు మిన్న అని ప్రకటించి మరీ నిరూపించారు. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాలలో పచాడ్‌  ‌స్థానం నుంచి విజేతగా నిలిచారు రీనా.  ఈసారి 24 మంది అభ్యర్థినులు పోటీ చేస్తే  గెలుపు ఢంకా మోగించిన ఒకే ఒకరు రీనాయే! నిజానికి రాష్ట్రంలో దాదాపు సగం మంది స్త్రీలే ఉన్నారు. దాదాపు 78 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే నాలుగుసార్లు  ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసింది. ఇప్పటి పోలింగ్‌ ‌ముందు అంచనాలు, పోలింగ్‌ ‌సరళిని బట్టి  ఆ పక్షమే అధికారపగ్గాలు దక్కుతాయని భావించారు. ఫలితం వేరుగా ఉన్నా, రీనా ఎన్నిక మటుకు మకుటాయమానంగా మారింది. అక్కడ బీజేపీ తరఫున గెలుపొందిన ఆమెది విజయ చరిత్ర. మునుపటి ఉప ఎన్నికలో గెలిచి, ఇప్పుటి ఎన్నికల్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పదుల సంఖ్యలో కొలువు తీరిన శాసనసభ్యుల్లో తనదే ప్రత్యేక స్థానం. ప్రత్యేకతల ఆలవాలం ఆమె జీవితం.


అప్పట్లో పచాడ్‌ ఎమ్మెల్యేగా సురేష్‌ ‌కశ్యప్‌ ఉం‌డేవారు. లోకసభ ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటుకు వెళ్లడంతో ఉపఎన్నికలు (2019) అనివార్యమయ్యాయి. వ్యవసాయ కుటుంబానికి చెందిన 37 ఏళ్ల రీనా బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

సిర్మేర్‌ ‌జిల్లాకు చెందిన పచాడ్‌ ‌శాసనసభ స్థానం సిమ్లా లోకసభ నియోజక వర్గం పరిధిలో ఉంది. ప్రధానంగా గ్రామీణ వాతావరణ ప్రాంతం. అక్షరాస్యత 80 శాతం దాకా ఉంది. భౌగోళికంగా ఉన్న ఏడు తహసీల్‌ ఏరియాల్లో పచాడ్‌ ఒకటి. అనేకమంది హిందీ ప్రధానంగా మాట్లాడుతుంటారు. గత నెలలో (నవంబర్‌) ఒకే విడతలో పోలింగ్‌ ‌జరిగింది. నమోదైన పోలింగ్‌ ‌శాతం 66. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే సంవత్సరం (2023) జనవరి 8వ తేదీతో ముగుస్తుంది.

 నియోజకవర్గ ప్రజానీకంలో సరికొత్త ఆశాభావనలు రేకెత్తిస్తున్న రీనా తాను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందంటున్నారు. వనితా సాధికారత అనేది రాతలకు, మాటలకు పరిమితం కాకుండా చేసి చూపుతానంటున్నారు. ‘ప్రభుత్వాలు ఎన్నెన్నో చేయాలనుకుంటాయి. అందుకు పథకాలు, ప్రణాళికలను రూపొంది స్తుంటాయి. స్త్రీల స్థితిగతుల మెరుగుదలకు ఎందరో ఎన్నెన్నో కార్యక్రమాలను ప్రతిపాదిస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఆచరణ ప్రధానం. వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి తప్ప కేవలం కార్యాలయ గదుల్లో కూర్చుని పథక రచన చేస్తే చాలదు. నా విజయయాత్ర నా బాధ్యతల్ని మరింతగా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందికిపైగా మహిళా ఓటర్లున్నారు. వారిలో అనేక మంది ఓట్లు వేసి, తమ నిర్ణయశక్తిని ప్రకటించారు. నియోజకవర్గంలోనూ దళిత ఓటర్లు తమ ప్రాధాన్యత తెలియజెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్త్రీ అభ్యర్థులు పోటీ పడినా నన్నే ఎన్నుకోవడం నా బాధ్యతను మరింత పెంచినట్లయింది’ అన్నారామె.

గ్రామీణ మహిళామణి

రీనా నేపథ్యం గమనిస్తే…ఆమె బాల్యమంతా గ్రామప్రాంతాల్లో గడిచింది. చదువు, ఉపాధి, వివాహం, కుటుంబ జీవనంలో గ్రామీణులు, మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, పరిస్థితులు ఆమెకి బాగా తెలుసు. అవకాశాలు కల్పించి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తే స్త్రీ ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది. తనతో పాటు కుటుంబాన్నీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తుంది. పచాడ్‌ ‌ప్రాంతాల్లో అనేకులు చిన్నపాటి పనులతో జీవిస్తుంటారు. వాటి గురించి సులువుగా తెలిసేలా శిక్షణ ఇస్తే మరింతగా ముందడుగు వేస్తారు. ఆదాయ మార్గాల గురించి వారికి తెలియచెప్పాలి. ఆర్థికంగా ఆదుకోవడమే గాక, సంపాదించిన మొత్తంలో కొంత పొదుపు చేసుకునే అలవాటునీ ప్రభుత్వం పెంచగలగాలి. మేం చేస్తున్నదీ అదే. సొంతంగా ఆలోచించి, సమర్థంగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతాం. ఆ దిశలో ఇప్పటికే మొదలుపెట్టిన ప్రయత్నాలను కొనసాగించడమే మా కర్తవ్యం’ అని విజయోత్సవ సభలో వివరించారు రీనా. ప్రభుత్వం చేయాల్సిన వాటిని విశదీకరించి ఆచరణ బాట పట్టిస్తానని చెప్పారు. అధికారం ఎవరిదైనా కావచ్చు కానీ, పౌరుల అభిమానం కొందరి మీదనే వర్షిస్తుందని ఆమెకు గట్టి నమ్మిక. విపక్షంలో ఉన్న తనకు జనం నాడి తెలుసు కాబట్టి ఆ మేర ముందుకు సాగగలనని ధీమా వ్యక్త పరిచారు. సర్వ సహజంగానే ఆమె నిత్య ఉత్సాహిగా ఉంటారు. ప్రజల్లోకి వెళ్లి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటారు. తనకీ, ప్రజలకీ మధ్య మరెవ్వరి ప్రమేయాన్ని అనుమతించరు. సమస్యల పరిష్కారపరంగా ప్రాధాన్యతలు తనకు తెలిసినా, ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలనూ గమనిస్తుంటారు. ఒక సందర్భంలో- మారుమూల ప్రాంతంలో గ్రామీణ వైద్యశాల అవసరం తన దృష్టికి రాగా, వెంటనే రంగంలోకి దిగి దానిని సాధించగలిగారు. ప్రతిపాదన మొదలు నిర్ణయ ప్రకటన వరకు తానే అన్నీ అన్నట్లు వ్యవహరించారు. అదీ రీనా తరహా పట్టుదల.

 ప్రజా ప్రతినిధులు, అధికారుల అంతిమ లక్ష్యం ప్రజా సేవ. అంతేతప్ప ప్రచార ఆర్భాటానికో, హడావిడి పర్యటనకో తావు ఇవ్వకూడదని చెప్తున్నారు; ఆచరిస్తున్నారు కూడా. కీలకమైన వ్యవసాయరంగంతో పాటు ఉద్యానవనాలు, పర్యాటక స్థలాల అభివృద్ధివైపు చూపు సారిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో విద్యుదీకరణ పనులు సత్వరం పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పరిశుభ్రత సాధనకు కొనసాగే ప్రచార కార్యక్రమాల్లో తానూ పాల్గొంటూ, గ్రామీణులందరితోనూ మమేకమవుతున్నారు.

అంతరాలు పోవాలంటూ….

నిత్యం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే రీనా ఎవరికీ దేనికీ భయపడరు, అనుకున్నది నెరవేరేదాకా విశ్రమించరు. ఇకముందూ విధాన సభలో స్వరం పెంచి ప్రశ్నిస్తానని, అధికార పక్షం నుంచి సకాలంలో సరైన సమాధానాలు రాబడతానని పత్రికా విలేకరుల సమావేశంలో ఆత్మవిశ్వాసం కనబరిచారు. వివక్ష నశించి అందరికీ సత్ఫలితాలు అందాలని అన్నారామె. అతివల హక్కుల పరిరక్షణ, బాలికా విద్యకు ప్రోత్సాహం, గృహిణులకు కుటీర పరిశ్రమల అవకాశాలు కల్పించడం తన త్రిముఖ ప్రణాళిక అని ప్రకటించారు. వ్యవసాయానికి అనుబంధంగా చిన్నపాటి పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే, గృహిణుల ఆదాయ మార్గాలు పెరుగుతాయని తరచూ చెప్తుంటారు. హక్కులనేవి ఎవరో ఇస్తే వచ్చేవి కావని, అలాగే బాధ్యతలనేవి ఎవరికి వారే స్వీకరించాలని బలంగా నమ్ముతారు. పనుల పరిపూర్తికి అనువుగా, వివిధ శాఖలను సమన్వయం చేసి సమీక్షలు సాగిస్తుంటారు. ఇదే విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించి, పాలకుల-పాలితుల నడుమ వారధిగా నిలవాలన్నది తన అభిమతం. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు యత్నాలు, వాటిని అధికారుల ముందు పెట్టి పరిష్కారాలు పొందడంలోనూ ఆమె దిట్ట. మహిళా ప్రతినిధిగా వేరేవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అని అడిగితే, ఎదిరించి నిలవడంలో స్త్రీ పురుష అంతరమేదీ ఉండదని సూటిగా బదులిచ్చారు. ప్రచార, సమాచార సాధనాల్లో ఎంతో వేగంగా స్పందించడం ఆమె అలవాటు. స్థితిగతులను ఎప్పటికప్పుడు తనకు నివేదించడానికి బాధితులు అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలనూ ఉపయోగించుకోవాలని కోరుతుంటారు.

‘ఏకైక కాదు-సమైక్య’

‘రాజకీయం అనే పదానికి రీనా ఇచ్చే అర్థం వేరు. రాజరికం ఏనాడో పోయింది. ప్రజాస్వామ్యం అంతటా వేళ్లూనుకుంది. ప్రజలే రాజులైన ఈ రోజుల్లో అందరి ఆలోచనలూ విస్తరించాలని, ప్రజా ప్రతినిధులు తాము సేవ చేయడాన్ని బాధ్యతగా భావించాలే కానీ అధికార ప్రదర్శనగానో సంపాదన మార్గంగానో పరిగణిస్తే గుణపాఠం తప్పద’ని హెచ్చరిస్తుంటారు రీనా. వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు, కుటుంబ జీవిత సమాచారం వివరించేందుకు అంతగా ఇష్టపడని ఆమె… ఇంటా బయటా అభిమానులూ అనుచరులతో మాట్లాడేటప్పుడు అనేకమార్లు సేవ గురించే ప్రస్తావిస్తుంటారు. ‘ఏకైక మహిళా ప్రతినిధిని అనిపించుకోవడం నాకూ సంతోషంగానే ఉంటుంది. ఇది గణాంకానికి సంబంధించిందిగా ఉండకూడదు. ‘సమైక్య మహిళా ప్రతినిధి’ అని ప్రజలతో పిలిపించుకోవడం’ తనకు ఇంకా ఇష్టమంటున్నారు రీనా కశ్యప్‌. ఆ ‌నాయకురాలి ఆశలూ, ఆశయాలు ఫలించాలని కోరుకుందాం. హిమాచల్‌ ‌సభలో వనితావాణిని బలంగా వినిపిస్తూ, శక్తియుక్తుల్ని చాటి చెప్పాలని అభిలషిద్దాం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram