చవకైన, వేగవంతమైన రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం నూతన లాజిస్టిక్స్ (‌రవాణా సదుపాయాలు) విధానాన్ని ప్రకటించి అమలు చేస్తుండగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం సహకారం ఇవ్వడం లేదు. నేడు వస్తు విక్రయాల్లో రవాణా, నిల్వ ఖర్చే 14 శాతం వరకు ఉంటుంది. దీనిని తగ్గించుకోవడం ద్వారా వస్తువుల ధరలను వినియోగదారులకు తక్కువకే అందుబాటులోకి తీసుకురావచ్చు. విలువైన ప్రజా ధనాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఈ నూతన లాజిస్టిక్స్ ‌విధానం పటిష్టంగా అమలు కావాలంటే నాణ్యమైన రవాణా సదుపాయాలు, గిడ్డంగులు కావాలి. కాని మన రాష్ట్రంలో ఇవి సక్రమంగా లేవు. ఉన్నవి కూడా కేంద్ర ప్రభుత్వం వేసిన జాతీయ రహదారులే. కొత్త రైల్వే లైన్లు కూడా అభివృద్ధి చెందలేదు. ఓడరేవుల పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రానికి లాజిస్టిక్స్ ‌పార్కు ఇస్తామని గతంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. కనీసం గ్రామీణ రహదారులు కూడా పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో లాజిస్టిక్స్ ‌విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది.

దేశ అభివృద్ధిని త్వరితం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన లాజిస్టిక్స్ ‌విధానం (ఎన్‌ఎల్పీ) ప్రకటించింది. ఈ విధానం లక్ష్యాలు సరైన ఉత్పత్తిని అందించడం-సరైన స్థితిలో ఉంచడం -సరైన చోటుకి తీసుకువెళ్లడం – సరైన సమయానికి తీసుకువెళ్లడం-సరైన ఖాతాదారుకు చేరేలా చూడటం. ఇది అమలైతే చిన్న రైతులకు; సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇలు)కు, భారీ కర్మాగారాలకు, సామాన్యులకు కూడా మేలు జరుగుతుంది. కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. వస్తువులు, మనుషుల రవాణాలను వేగవంతం చేస్తుంది. భారీయెత్తున ఆదాలకు దారితీసి ఆర్థిక సామర్థ్యాలను పెంచుతుంది.

ప్రస్తుతం వస్తువుల ధరల్లో సరకు రవాణా, నిల్వ వ్యయాలు 13 నుంచి 14 శాతం వరకు ఉన్నాయి. పళ్లు, కూరగాయలు లాంటి ఉత్పత్తులను అవి కుళ్లిపోకముందే వినియోగదారులకు చేర్చాలి. అందుకని వాటిని చిన్న రైతులు చాలా తక్కువ ధరకు అమ్మేస్తారు. చాలా సందర్భాల్లో వారికి మిగిలేది అత్యంత స్వల్పం లేదా నష్టాలే. అయితే మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటే ఈ వస్తువులను తక్కువ సమయంలో ఎక్కువ దూరం తీసుకువెళ్లి వారికి, కొత్త మార్కెట్లకు సరఫరా చేయవచ్చు. అంటే పొలం నుంచి పళ్లెం దాకా వ్యవసాయ ఉత్పత్తులను చేర్చడంలో కీలకమైన మార్పులకు అవకాశం ఉంది. ఈ మార్పులు రైతుకు మరింత ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా ఇటు వినియోగదారుడికి కూడా తక్కువ ధరలో ఆహారాన్ని అందిస్తాయి. వినియోగదారుడి కోణం నుంచి చూసినా లాజిస్టిక్స్ ‌వ్యయాలు అధికంగా ఉంటున్నాయి. వారు కొనే వస్తువుల ధరల్లో లాజిస్టిక్స్ ‌ఖర్చులు గణనీయంగా ఉంటాయి.

జాతీయ రహదారులతో పాటు అత్యంత నాణ్యమైన గ్రామీణ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌ ‌వేలు, కంటైనర్ల నిర్వహణలో మెరుగుదల, వేగవంతమైన, సురక్షిత మైన రైల్వేలు, ప్రత్యేక రవాణా కారిడార్లు ఇవన్నీ లాజిస్టిక్స్ ‌సదుపాయాల్లో భాగమే. ఈ మౌలిక సదుపాయాలుంటేనే అభివృద్ధి చెందిన దేశాలతో సరిసమానంగా ముడిపదార్ధాలు ఉత్పత్తిదారులకు, అక్కడి నుంచి వినియోగదారులకు నేరుగా చేరే అత్యంత ఉన్నత స్థాయి సేవలను అందిస్తాయి.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం

పైన తెలిపిన సదుపాయాలు కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. రాష్ట్రంలో అంతర్గత రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు ఘోరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీటిని పునర్నిర్మించలేదు సరికదా మరమ్మతులు కూడా చేయడం లేదు. పాత బిల్లులు ఇవ్వకపోగా వేధించడం, పనిచేస్తే కొత్త బిల్లులు ఇస్తారో లేదో అన్న అనుమానాల నేపథ్యంలో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ధాన్యం, కూరగాయలు, ఆక్వా ఉత్పత్తుల సేకరణకు గ్రామీణ రహదారులే శరణ్యం. కాని నేడు రాష్ట్రంలో వాటి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేదు. రైతులు వాహన యజమానులు చెప్పిన అధిక ఛార్జీలకే ఉత్పత్తులు చేరవేయాల్సి వస్తోంది. పోనీ సరకును నిల్వచేద్దా మన్నా అవసరమైన గిడ్డంగి సదుపాయాలు లేవు. రైల్వే ద్వారా పంపుదామన్నా అన్ని ప్రాంతాలకు రైల్వే అందుబాటులో లేదు.

కొత్త రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఏది?

కేంద్రం నూతన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదరణ కని పించడం లేదు. 11 నూతన రైల్వే లైన్లు నిర్మిం చాల్సి ఉండగా వాటికి అవసరమైన భూసేకరణ, నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైంది. వీటిలో నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్‌, ‌కడప-బెంగళూరు మధ్య కొత్త లైన్ల నిర్మాణం, గుంటూరు-గుంతకల్‌, ‌గుంటూరు-నంద్యాల డబ్లింగ్‌ ‌పనులు, కాజీపేట-విజయవాడ మధ్య ట్రిప్లింగ్‌ ‌పనులు, గుత్తి, రేణిగుంట వద్ద బైపాస్‌ ‌నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. వీటిని రాష్ట్ర, కేంద్ర వాటా నిధులతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం పనులకు 4,494 హెక్టార్ల భూమిని సేకరించాలి. ఇందులో ప్రయివేటు భూమి 2,814 హెక్టార్లు, ప్రభుత్వ భూమి 1,438 హెక్టార్లు, అటవీ భూమి 242 హెక్టార్లు కావాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటివరకు 2,023 హెక్టార్లు మాత్రమే సేకరించగా, ఇంకా 2,472 హెక్టార్లు సేకరించాలి. మొత్తం భూసేకరణలో ప్రయివేటు భూమితోనే ఎక్కువ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో 2814 హెక్టార్లకు గాను 1161 హెక్టార్లు మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 1653 హెక్టార్లు సేకరిం చాలి. భూమి యజమానులకు చెల్లించాల్సిన పరిహారం, వారికి కల్పించాల్సిన పునరావాసం వంటి అంశాల కారణంగానే సేకరణలో జాప్యం జరుగు తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఇదే తరహా జాప్యం కనిపిస్తోంది. 1438 హెక్టార్లకు గాను 743 హెక్టార్లు సేకరించగా, ఇంకా 695 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అటవీ భూమికి సంబంధించి 242 హెక్టార్లకుగాను 118 హెక్టార్లు సేకరించగా, 124 హెక్టార్లను ఇంకా సేకరించాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇక ఏడు పథకాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సిన రాష్ట్ర వాటా నిధులు ఇంకా విడుదల కాలేదని తెలుస్తోంది. నడికుడి-కాళహస్తి లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయిం చగా, ఇంకా రూ.1306 కోట్లు ఇవ్వాలి. విజయవాడ -నిడదవోలు డబ్లింగ్‌ ‌పనులకు రూ.289 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.1798 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్‌ ‌పనులకు కేవలం రూ.2.7 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.367 కోట్లు ఇవ్వాలి. భద్రాచలం రోడ్‌-‌కొవ్వూరు లేన్‌కు రూ.361 కోట్లు, తుముకూరు-రాయదుర్గం పనులకు రూ.260 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది కూడా పనులు ముందుకు సాగకపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఈ మార్గాలను అభివృద్ధి చేస్తే, రాయలసీమ నుంచి ఖని వనరులు తక్కువ ధరకు దేశం నలుమూలలకూ చేరవేయవచ్చు. కాని ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.

కేంద్రం ఉరుకులు!

ఒక పక్క రాష్ట్రం రవాణా వ్యవస్థను తీవ్ర నిరాశకు గురిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంతో ప్రోత్సాహం ఇస్తోంది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు తీస్తోంది. కేంద్ర రోడ్లు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ఆంధప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రహదారుల అభివృద్ధికి రూ. 5 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులు అమలుచేస్తున్నారు. ఇందులో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్లు, బైపాస్‌ ‌రహదారులున్నాయి. 2024 నాటికి ఏపీలో ఈ హైవే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏపీ, తెలంగాణను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్‌ ‌కేబుల్‌ ‌కమ్‌ ‌సస్పెన్షన్‌ ‌బ్రిడ్జి నిర్మించనున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద రూ. 1082.56 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కేవలం 30 నెలల్లో నిర్మాణం పూర్తిచేయనున్నారు. ఏపీ, తెలంగాణను కలిపే ఐకానిక్‌ ‌కేబుల్‌ ‌బ్రిడ్జి నమూనా ఫొటోలను కూడా నితిన్‌ ‌గడ్కరీ సోషల్‌ ‌మీడియాలో పంచు కున్నారు. పోర్టులతో రహదారులను అనుసంధానించే సాగరమాల పథకం ద్వారా లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించారు. ఇన్ని రకాలుగా కేంద్రం సహకారం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆసక్తి చూపక, మౌలిక సదుపాయాల కల్పనలకు ముందుకు రాక లాజిస్టిక్స్ ‌రంగాన్ని వెనుకంజ వేసేలా చేస్తోంది. ఫలితంగా ఉత్పత్తి దారులు, రైతులు, నిరుద్యోగులు, వినియోగదారులు నష్టపోతున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram