చైనా భక్తబృందం నిజస్వరూపం మళ్లీ బయటపడింది.  భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ భారత దేశాన్నే వాస్తవంగా వ్యతిరేకిస్తున్న ‘గంగానదిలో పాములు’ గురించి సాధారణ పౌరులకి తెలిసి వచ్చింది. ముస్లింలను పేదవారిగా చూపుతూ, కొందరు ముస్లిం మతోన్మాదుల వేర్పాటుధోరణిని వాళ్లు ఎలా ప్రేరేపిస్తారో కూడా ఇప్పుడు బయటపడింది. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చడానికి ముహూర్తం కూడా పెట్టుకున్న ఇస్లాం మతోన్మాదుల చంకల కింద  చేరిపోతున్న భారతీయ మేధావుల జుగుప్సాకర చర్యలు ఇంకాస్త స్పష్టంగా బయటపడ్డాయి. స్త్రీల హక్కులు, మైనారిటీల హక్కులు, స్వలింగ సంపర్కుల హక్కులు, హిజ్రాల హక్కులు, వీటి రక్షణ అంటూ తిరిగే కిరాయి మూకలేవీ నిజంగా కోరుతున్నది  వీరి శ్రేయస్సు కాదని,వాళ్ల పేరు చెప్పి భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనే. ఈ వాస్తవాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖుడో, యోగి ఆదిత్యనాథ్‌ అనుచరుడో, హిమంత బిశ్వశర్మ నోటి నుంచో వచ్చినవి కావు. ఆస్ట్రేలియాకు చెందిన సామాజిక శాస్త్రవేత్త సాల్విటోర్‌ ‌బాబోన్స్ ‌చెప్పినవి. భారత్‌లో  ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యం మీద, హిందూ మతోన్మాదం గురించి చెప్పేవి, ముస్లిం బాధల గురించి ఏకరువు పెట్టే మాటలూ ఏవీ వాస్తవాలు కావు అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. అవన్నీ ఇక్కడి మేధావులు, అమ్ముడుపోయిన విద్యాధికుల అభూతకల్పనలేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.

భారత్‌ ‌విశ్వగురు పాత్రను పోషించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. మన దేశం రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచశక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని శక్తులకు ఇది ఇష్టం లేదు. ఈశాన్య భారతం మీద కన్నేసిన మిషనరీలకి, భారత్‌ను మరొకసారి చీల్చాలన్న ముస్లిం మతోన్మాద శక్తులకి అది జీర్ణించుకోలేని విషయం. తినేది ఇక్కడి తిండి, తాగేది ఇక్కడి నీరు. అయినా పాకిస్తాన్‌, ‌చైనాలను ఆరాధించే వాళ్లు అసలే సహించలేని విషయం. అందుకే కేవలం దుష్ప్రచా రాలు చేయడానికి మేధావులను పెంచుతున్నారు. వాళ్లు అంతర్జాతీయ పత్రికలకి, భారతీయ పత్రికలకి తప్పుల తడకలు పంపుతారు. ఫలితం ప్రపంచ మీడియా అన్ని విషయాల్లోనూ భారత్‌కు తప్పుడు ర్యాంకింగ్‌ ఇస్తుంటుంది. భారత వ్యతిరేకతను చాటుకునేందుకు ఇస్లామిస్ట్ ‌శక్తులతో కూడా వారు కలిసిపోయారు. ఈ పరిస్థితికి కారణం స్వదేశాన్ని వ్యతిరేకించే భారతీయ మేధావి వర్గం ఇస్తున్న తప్పుడు సమాచారమే. ఇలాంటి శక్తుల మానసిక స్థితి ఎండగట్టారు ప్రొఫెసర్‌ ‌సాల్వటోర్‌ ‌బాబోన్స్.. ‌తన భారత పర్యటనలో ఆయన లేవనెత్తిన అంశాలు అందరినీ ఆకర్షించాయి.

‘ఇండియా అంటే ప్రపంచం దృష్టిలో పాములను ఆడించే దేశం.’ ప్రపంచం మీద వలసవాదం పెత్తనం చేసిన రోజుల నాటి భావన ఇది. నిజానికి ఇది నెహ్రూ కాలంలో ఏర్పడిన భావన. అది మరచి పోయి, దానిని జీవించి ఉండేటట్టు చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్‌ ‌పాత్ర కూడా ఎంతో ఉంది. కమ్యూనిస్టుల అండతో గతంలో చేసింది. ఇప్పటికీ ఆ దుష్ప్రచారం కొనసాగిస్తున్నది. సాక్షాత్తు ఆ పార్టీ యువరాజు రాహుల్‌ ఇలాంటి విషప్రచారానికి ముందుంటున్నారు. భారతదేశం సాంస్కృతికంగా, ఆధ్మాత్మికంగా అత్యన్నత స్థితిలో ఉంది. కానీ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం లేకపోవడంతో వచ్చిన సమస్య అది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత భారత్‌ ఎం‌తో మారిపోయింది. అదే సమయంలో భారత్‌ ‌మీద వ్యతిరేక భావనను పెంచి పోషిస్తూ వచ్చాయి కొన్ని శక్తులు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్రలు మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి.

దేశంలో ఉన్న ఏ ప్రజాస్వామ్యం వీళ్లకి భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చిందో, దాని ఆధారంగానే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మోదీని దొంగ, కాల్చి చంపాలి వంటి మాటలు అని స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్లు కూడా ఈ దేశంలో అసలు వాక్‌ ‌స్వాతంత్య్రం లేదని తేల్చేస్తున్నారు. ఇలాంటి అతి పెద్ద అబద్ధం భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందనడం. ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధి లోపించిందని.. ఇలాంటి రకరకాల గొంతుకలను మనం వింటూనే ఉన్నాం. ఇతర దేశాలతో పోలిస్తే మన ర్యాంకింగ్‌ ఎం‌తో దిగువన ఉందని నివేదికలు విడుదల చేస్తుంటారు. వీటిలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక ఆశ్చర్యకరమైన కఠోర వాస్తవాలు బటయ పడుతు న్నాయి. ఇందులో ఇంటి దొంగల్లాంటి ‘సోకాల్డ్’ ‌భారతీయ మేధావుల పాత్ర చాలా వరకూ ఉంది.

ప్రొఫెసర్‌ ‌సాల్వటోర్‌ ‌బాబోన్స్ అమెరికన్‌ ‌సామాజిక శాస్త్రవేత్త. సిడ్నీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేస్తుంటారు. అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. కొంత కాలంగా ఆయన భారత దేశానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంచలన విషయాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు. బాబోన్స్ ఇటీవల మన దేశంలో పర్యటించారు. ముంబైలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో, ఢిల్లీలో శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఇంకా అనేక మంది ప్రముఖులను కలుసుకున్నారు.

భారత్‌కు అపఖ్యాతి తెచ్చే కుట్ర!

అంతర్జాతీయంగా భారత దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు జరుగుతున్న కుట్రను ప్రొఫెసర్‌ ‌సాల్వటోర్‌ ‌బాబోన్స్ ‌బయట పెట్టారు. మనదేశంలోని కొందరు మేధావులు భారత వ్యతిరేకులుగా పని చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. వీరు ప్రధాని మోదీ మీద ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని, వీరి ప్రభావంతోనే విదేశీ సంస్థలు భారత్‌కు పేలవమైన ర్యాంకింగ్‌లు ఇస్తున్నాయని అరోపించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌ ‌సందర్భంగా సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాజ్‌దీప్‌ ‌సర్దేశాయ్‌తో బాబోన్స్ ‌చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అవేంటో చూద్దాం..

అంతర్జాతీయ సంస్థలు భారత దేశానికి ఇస్తున్న ర్యాంకింగ్‌లలో చాలా పక్షపాతం కనిపిస్తోంది. ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసే సంస్థలు భారతదేశానికి వ్యతిరేకం. అవన్నీ పక్షపాతంతో కూడుకున్నవి. భారత్‌, ‌విదేశాల్లోని కొందరు మేధావులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, విద్యార్థుల ద్వారా ఈ సర్వేలు చేస్తుంటారు. ఇందులో పాల్గొంటున్న వారి భారత వ్యతిరేకత సర్వేల్లో ప్రతిబింబిస్తుంది.

భారతీయ మేధావులను ‘భారత వ్యతిరేకులు, మోదీ వ్యతిరేకులు’గా భావిస్తున్నారా? అని అడిగినప్పుడు.. ‘రెండూ కొంత ఉన్నాయన్నారు బాబోన్స్. ‌సాన్స్ ‌ఫ్రాంటియర్స్ ‌రిపోర్ట్ ‌ప్రకారం పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం తక్కువ ర్యాంకును పొందడం ఆశ్చర్యం కలిగించిందన్నారాయన.. భారత్‌ ‌కన్నా హాంకాంగ్‌ ఎలా అగ్రస్థానంలో ఉంటుందని ప్రశ్చించారు. అక్కడ ‘ఆపిల్‌ ‌డైలీ’ మూసివేయడం, ప్రచురణకర్త అపహరణ, ప్రింటింగ్‌ ‌ప్రెస్‌ల కూల్చివేత అంశాలను ప్రస్తావించారు. భారతదేశంలో హాంకాంగ్‌ ‌జర్నలిస్టుల కంటే ఎక్కువ అణచివేతకు గురవుతున్నారా? అని భారతీయ జర్నలిస్టులును ప్రశ్నించారు.

భారత రాజకీయాల్లో ఉద్దేశపూర్వకంగా ముస్లింలకు తక్కువ ప్రాతినిథ్యం కల్పించారనే ఆరోపణలను తిరస్కరించారు బాబోన్స్. ‌ముస్లింలలో విద్య, ఆదాయం తక్కువగా ఉండటమే ప్రాతినిథ్యం లభించకపోవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మైనారిటీల గురించి మాట్లాడేటప్పుడు, ఇస్లాం గురించి మాత్రమే మాట్లాడటం సరికాదన్నారు.

అంతేకాదు, భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య విజయగాథగా అభివర్ణించారు సాల్వటోర్‌ ‌బాబోన్స్.. ‌కొన్ని దశాబ్దాలుగా ప్రజాస్వామ్య ఎన్నికలలో స్థిరమైన రికార్డును కలిగి ఉన్నందునే తాను భారత్‌ ‌పట్ల ఆసక్తితో ఉన్నానన్నారు. సంపన్న దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కావడంలో ఆశ్చర్యం లేదు, చక్కటి సంస్థాగత ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్న ఏకైక పేద దేశం భారత్‌ అని ప్రశంసించారు.

పాశ్చాత్యుల హిందూ వ్యతిరేకత

పాశ్చాత్య దేశాలు అంతర్లీనంగా భారత్‌ ‌పట్ల వ్యతిరేకతను చాటుకోవడాన్ని కూడా బాబోన్స్ ‌విశ్లేషించారు. వారి పాఠ్య పుస్తకాలలో వలసవాదం, హిందూ వ్యతిరేకత ఉంటాయన్నారు. యూఎస్‌ ‌మీడియా, హాలీవుడ్‌ ‌చైనా నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నాయని ఆరోపించారు. చైనా ప్రతిష్ట పూర్తిగా డబ్బు కారణంగా ఉందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం, చైనా నిరంకుశత్వం మధ్య తేడాలను అర్థం చేసుకోవాలన్నారు. పశ్చిమ దేశాలు భారతదేశాన్ని ఎందుకు ద్వేషిస్తున్నాయి? ద్వేషం అనేది బలమైన పదం. న్యాయంగా చెప్పాలంటే, చాలా మంది అమెరికన్లు, యూరోపియన్లు, ఆస్ట్రేలియన్లు భారతదేశాన్ని ప్రేమిస్తారు. వారిలో ఎక్కువ మందికి భారతదేశం గురించి ఏమీ తెలియదు.

ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యాను ఖండించడానికి భారత్‌ ‌నిరాకరించడాన్ని సమర్థించారు సాల్వటోర్‌ ‌బాబోన్స్. ‘‌భారతదేశం రష్యాకు ఎందుకు దగ్గరగా ఉంది? భద్రతా మండలిలో రష్యా వీటో అధికారం భారత్‌కు అవసరం’ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఫాసిస్టు దుష్ట దేశంగా చూపించే ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు.

తాను భారత్‌కు అండగా ఉన్నందుకు ఎవరైనా ‘భక్త్’ అన్నా పట్టించుకోబోనని విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు బాబోన్స్. ‘‌ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్యానికి నేను భక్తుడిగా ఉండాలనుకుంటున్నాను’ అని న్యూఢిల్లీలో శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చెప్పడం గమనార్హం.

భారత్‌ ‌వ్యతిరేకులు కలిసిపోయారు!

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి అర్ధ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో హిందూ వ్యతిరేకత పెద్దగా లేదు. కానీ ఇటీవల లీసెస్టర్‌, ‌టొరంటో, న్యూజెర్సీలో జరిగిన హిందూ వ్యతిరేక కార్యక్రమాల్లో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఇస్లామిస్టులు, హిందూ వ్యతిరేకులు, తీవ్రవాదంతో ముడిపడిన గ్రూపులు కలిసిపోయాయి. ఈ అపవిత్ర కూటమి వెనక పాకిస్తాన్‌, ‌చైనా హస్తం ఉందని భారతీయులు భావిస్తారు. అయితే హిందూ వ్యతిరేకతను చాటుకోవడానికి పాశ్చాత్యులు భారత్‌ను ద్వేషించే ఇస్లామిక్‌ ‌శక్తుల మద్దతు కోరుతున్నారు.

పాశ్చాత్య దేశాల్లో చాలా వరకూ సెమెటిక్‌ ‌మైనారిటీలను వ్యతిరేకిస్తారు. ఇప్పుడు వీరి స్వరం మారింది. సెమెటిక్‌ ‌వ్యతిరేకత నుంచి జియోనిస్ట్, ఇ‌జ్రాయెల్‌ ‌వ్యతిరేక భాషకు మారారు. నేడు ప్రపంచమంతా ఇంగ్లిష్‌ ‌మాట్లాడే యూనివర్సిటీ క్యాంపస్‌లలో జియోనిస్ట్ ‌వ్యతిరేక, ఇజ్రాయెల్‌ ‌వ్యతిరేక నిరసనలను చూడవచ్చు. మహిళల హక్కులు, స్వలింగ సంపర్కుల వివాహం వంటి సమస్యలపై తీవ్రంగా విభేదించే వ్యక్తులు పక్క పక్కనే పనిచేస్తారు. అరబ్‌ ‌ప్రపంచంలో, ఇరాన్‌లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత కోసం కొత్త రాజకీయ మిత్రులను కనుగొన్నారు. పాశ్చాత్య హిందూ వ్యతిరేక మేధావుల ఉద్దేశాలు చాలా భిన్నంగా ఉంటాయి. ‘2021లో డిస్‌మ్యాంటిల్‌ ‌గ్లోబల్‌ ‌హిందూత్వ’ సదస్సును డజన్ల కొద్దీ విశ్వవిద్యాలయ పరిశోధనా సంస్థలు కో-స్పాన్సర్‌ ‌చేశాయి. ఇది ఏ విధంగానూ సాధారణ విద్యా సదస్సు కాదు. కరపత్రాల్లో తాము హిందుత్వకు తప్ప హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు. అమెరికాలో హిందువులు గట్టిగా నిరసన తెలియజేయడంతో కొందరు స్పాన్సర్స్ ‌తప్పుకున్నారు. చివరకు నామమాత్రంగానే సదస్సు ముగిసింది.

ప్రపంచవ్యాప్తంగా పేరుప్రతిష్టలు ఉన్న విద్యా సంస్థ హార్వార్డ్. ఇది హిందూ వ్యతిరేక ప్రచారానికి కేంద్ర బిందువు కావడం అతి పెద్ద విషాదం. బీజేపీని వ్యతిరేకించవచ్చు. మోదీ విధానాలు నచ్చలేదని చెప్పే హక్కు అలాంటి వారికి రాజ్యాంగమే ఇచ్చింది. అయినా మోదీని అడ్డం పెట్టుకుని దేశ విచ్ఛిత్తికి కుట్రలు పన్నితే దేశ పౌరులు అప్రమత్తం కావాలి. ఈ దేశం మరొకసారి విడిపోయే ఎలాంటి చిన్న కుట్ర, మాటనైనా ప్రతి భారతీయుడు తీవ్రంగా, తీక్షణంగా తప్పు పట్టాలి. ఆ భావాలు ఉన్నవాళ్లని చట్టబద్ధమైన మార్గంలో అణచివేయాలి. దేశానికి హిందూత్వ ప్రాణం. ప్రజాస్వామ్యం ఊపిరి. ఈ రెండింటి మీదే ఈ దాడి అంతా.

About Author

By editor

Twitter
YOUTUBE