– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌సహజంగా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠత అందరికీ ఉంటుంది. స్వదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గల కీలక, ప్రముఖ దేశాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి ఆసక్తి అందరిలో కాకపోయినా కొందరిలో అయినా ఉంటుంది. అందునా ఒకప్పుడు మన దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన బ్రిటన్‌ ఎన్నికలు అనగానే మరింత ఆసక్తి ఉంటుంది. కానీ ఈసారి ప్రధాని పదవికి అధికార కన్జర్వేటివ్‌ ‌పార్టీలో గట్టిపోటీ నెలకొంది. ఇంతకు ముందు బోరిస్‌ ‌జాన్సన్‌ ‌మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక, విదేశాంగ మంత్రులుగా పనిచేసిన రిషి సునాక్‌, ‌లిజ్‌ ‌ట్రస్‌ ‌బరిలోకి దిగడంతో ఆ ఉత్కంఠత, ఆసక్తి మరింత పెరిగింది. ఇందుకు కారణం లేకపోలేదు. రిషి సునాక్‌ ‌ప్రవాస భారతీయుడు. లిజ్‌ ‌ట్రస్‌ ‌మహిళ. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్‌లో ప్రధాని పదవికి భారత సంతతికి చెందిన నాయకుడు పోటీ పడుతుంటే సహజంగానే అందరి కళ్లూ అటువైపు చూస్తుంటాయి. అందునా సునాక్‌ ‌నేపథ్యం అందరికీ సుపరిచితం. ఆయన స్వయంగా భారత దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి అల్లుడు కావడంతో ఇటు భారత్‌లో, అటు బ్రిటన్‌లో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

సునాక్‌ ఆషామాషీ నాయకుడేం కాదు. ఇంతకుముందు బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వద్ద కీలకమైన ఆర్థికశాఖకు సారథిగా పనిచేసిన నాయకుడు. దీంతో సహజంగానే భారతీయులు ఆయనను విజేతగా చూడాలనుకున్నారు. ఆయన కూడా గట్టిపోటీనే ఇచ్చారు. ఇక లిజ్‌ ‌ట్రస్‌ ‌జాన్సన్‌ ‌వద్ద కీలకమైన విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ చరిత్ర గల బ్రిటన్‌లో ప్రధాని పదవి చేపట్టనున్న మూడో మహిళ (థాచర్‌, ‌థెరిసా మే తరవాత) కావడంతో మహిళా లోకం చూపు ఆమె వైపు మళ్లింది. దీంతో పోటీ రసకందాయంగా మారింది. బ్రిటన్‌, ‌భారత్‌ ‌మాత్రమే కాకుండా యావత్‌ ‌ప్రపంచం ఈ ఎన్నికను ఆసక్తిగా గమనించింది.

తొలుత రిషి సునాక్‌ ‌వైపే ఆధిక్యం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనే విజేతగా నిలవగలరన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ క్రమంగా లిజ్‌ ‌ట్రస్‌ ‌తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. అంతిమంగా ఆమె విజేతగా నిలిచారు. తన పరాజయంపై సునాక్‌ ‌స్పందన సైతం హుందాగా ఉంది. సునాక్‌ ఓటమి భారతీయులకు ఒకింత నిరాశ కలిగించిన మాట వాస్తవం. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అటు రిషి, ఇటు ట్రస్‌ ఇద్దరూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరచడం విశేషం. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు దిగకుండా, తాము గెలిస్తే దేశ ప్రగతికి ఏ విధంగా పాటుపడగలమో సోదాహరణంగా వివరించడం విశేషం. ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పలు దేశాల్లో అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు ఏకపక్షంగా ఎంపిక జరుగుతున్న సమయంలో బ్రిటన్‌లో అందుకు భిన్నంగా ప్రజాస్వామ్యయుతంగా పోటీ జరగడం అభినందనీయం. ప్రధాని పదవికి పార్టీలో అంతర్గతంగా పోటీ నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టం కట్టడం స్వాగతించదగ్గ అంశం.

సునాక్‌ ‌పరాజయంపై దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరిగింది. ఓటమికి గల కారణాలపై భిన్న కోణాల్లో విశ్లేషణ జరిగింది. రిషి బ్రిటన్‌లో ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ బ్రిటిషర్లు ఆయనను ప్రవాస భారతీయుడిగానే పరిగణించారు. ఒక వలసవాద దేశానికి చెందిన వ్యక్తి తమను పాలించడం ఏమిటన్న భావన అక్కడి ప్రజల్లో, పార్టీలో కలిగింది. ఆయనకున్న సంపద కూడా సునాక్‌కు శాపంగా పరిణమించింది. విలాసవంతమైన జీవనం, సూటు, బూటు స్థానికులకు ఒకింత అసూయ కలిగించిన మాట వాస్తవం. కరవు కారణంగా గుక్కెడు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రిషి యార్క్ ‌షైర్‌లోని తన కొత్తింట్లో దాదాపు నాలుగు లక్షల పౌండ్లతో ఈతకొలను నిర్మించుకోవడం వివాదాస్పదమైంది. నా స్నేహితులంతా ధనవంతులే, వారిలో ఒక్కరూ సామాన్యులు లేరన్న ఆయన వ్యాఖ్యలు చేటుతెచ్చాయి. ట్రస్‌ ‌ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడమూ సునాక్‌కు చేటు తెచ్చింది. ఆయన భార్య అక్షిత సంపద కూడా ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. వేలకోట్ల వ్యాపారం గల ఐటీ కంపెనీ అధినేత నారాయణ మూర్తి కూతురైన ఆమెకు బ్రిటన్‌ ‌రాణి కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం సునాక్‌ ‌విజయాలవ కాశాలపై ప్రభావం చూపింది. పన్నులు ఎగ్గొట్టడానికే ఆమె నాన్‌ ‌డొమిసైల్‌ ‌హోదాను అడ్డు పెట్టుకున్నారన్న ప్రచారం రిషికి ప్రతికూలంగా మారింది. పార్టీ గేట్‌ ‌కుంభకోణంలో చిక్కుకున్న బోరిస్‌ ‌జాన్సన్‌కు మద్దతుగా నిలవకుండా మంత్రి పదవికి సునాక్‌ ‌రాజీనామా చేయడాన్ని పార్టీలోని కొందరు సభ్యులు వ్యతిరేకించారు. తన రాజకీయ గురువైన బోరిస్‌ ‌కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని నమ్మకద్రోహంగా కొందరు పార్టీ సభ్యులు పరిగణించారు. సునాక్‌కు మద్దతుగా దాదాపు 50 మంది ఎంపీలు రాజీనామా చేశారు. కేవలం ప్రధాని పదవిపై కన్నేసిన సునాక్‌ ‌బోరిస్‌ను ఒంటరివాడిని చేసి దూరమయ్యారన్న వాదన ఉంది. పన్ను రాయితీల వల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న సునాక్‌ ‌వాదనను ప్రజలు అంగీకరించలేదు. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా తన గ్రీన్‌ ‌కార్డును ఆయన అట్టే పెట్టుకున్నారు. దీంతో ఆయన ఎప్పటికైనా అమెరికా వెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది. ఇది అవాస్తవమని స్వయంగా రిషి చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అంతమాత్రాన లిజ్‌ ‌ట్రస్‌ ‌పరిస్థితి అంతా బావున్నట్లు చెప్పలేం. ప్రధాని పదవి చేపట్టిన తరవాత ట్రస్‌ ‌పార్టీలోని ఒక వర్గం నాయకురాలుగా వ్యవహరించారు తప్ప పార్టీ నాయకురాలి పాత్ర పోషించలేకపోయారు. తన అనుచరులకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా కురచబుద్ధిని చాటుకున్నారు. గత సర్కారులో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన, తనకు గట్టిపోటీ ఇచ్చిన సునాక్‌కు కనీస గౌరవం ఇవ్వలేదు. ఆయనకు మంత్రివర్గంలో మొండిచేయి చూపారు. ఆయన అనుచరులు ఒక్కరికీ చోటు కల్పించలేదు. సునాక్‌ అనుచరులుగా పేరున్న న్యాయశాఖ మాజీ మంత్రి డొమినిక్‌ ‌రాబ్‌, ‌రవాణా శాఖ మాజీ మంత్రి గ్రాంట్‌ ‌షాప్‌, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి స్టీవ్‌ ‌బార్‌ ‌క్లేలను ట్రస్‌ ‌దూరం పెట్టారు. ఇంతకుముందు జాన్సన్‌ ‌వద్ద కీలకమైన హోంశాఖను నిర్వహించిన ప్రవాస భారతీయురాలు ప్రీతీ పటేల్‌ను దూరం పెట్టారు. పటేల్‌ ‌గుజారాత్‌కు చెందిన నాయకురాలు. ఆమె బదులు ప్రవాస భారతీయురాలు సుయోలా బ్రావెర్మర్‌కు ఆ శాఖను కట్టబెట్టారు. ఈమె జాన్సన్‌ ‌వద్ద అటార్నీ జనరల్‌గా పనిచేశారు. భారత సంతతికి చెందిన మరో నాయకుడు అలోక్‌ ‌శర్మ తన పదవిని కాపాడుకున్నారు. భారత్‌, ‌శ్రీలంక మూలాలున్న రణిల్‌ ‌జయవర్ధనె పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ఉపప్రధానిగా ధెరెస్‌ ‌కోపె, విదేశాంగ మంత్రిగా జేమ్స్ ‌క్లెవరీ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా కెమీ బడనోచ్‌ ‌నియమితులయ్యారు. రిషిని మాత్రమే కాదు, ఇంతకుముందు ప్రధాని జాన్సన్‌ ‌వద్ద పనిచేసిన వారినీ ట్రస్‌ ‌పూర్తిగా పక్కనపెట్టారు.

ఇక్కడ అందరూ గమనించాల్సిన, చర్చించాల్సిన అంశం ఒకటుంది. ఒక ప్రధానిగా మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకునే హక్కు, అధికారం ట్రస్‌కు ఉన్నాయి. ఇందులో విభేదించాల్సిన విషయం ఏమీ లేదు. కానీ అదే సమయంలో ట్రస్‌ ‌తాను యావత్తు పార్టీకి అధినేతనన్న విషయాన్ని విస్మరించ రాదు. ఒక ప్రధానిగా వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ ‌పార్టీని గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఆమెపై ఉంది. పార్టీ గెలిస్తేనే ఎవరికైనా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే లేనట్లే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒక్క ట్రస్‌, ఆమె మంత్రులే రేపటి ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపలేరు. రిషి సునాక్‌, ‌బోరిస్‌ ‌జాన్సన్‌తో పాటు వారి అనుచరులు పనిచేస్తేనే పార్టీ మరోసారి అధికారంలోకి రాగలదు. ఈ విషయాలు ట్రస్‌కు తెలియవని అనుకోలేం. తెలిసీ ఇలా చేశారంటే ఆమె ప్రజాస్వామ్య స్ఫూర్తికి నీళ్లు వదిలినట్లుగానే భావించాలి. అంతేకాక చేతులారా వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమిని కొనితెచ్చుకున్నట్లే కాగలదు.

కేవలం ప్రధాని పదవిని చేపటట్డంతోనే ఆమె లక్ష్యం నెరవేరలేదు. మున్ముందు పార్టీని విజయ పథంలో నడిపించాల్సి ఉంది. దేశీయంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాల్సి ఉంది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని అవలీలగా పాలించిన బ్రిటన్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రభావం చూపించే పరిస్థితిలో లేదు. పేరుకు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశమైనప్పటికీ ఇప్పుడు అది ఒక ఐరోపా దేశం మాత్రమే. కనీసం ఐరోపా అంతటా ప్రభావం చూపగల శక్తి కోల్పోయింది.

భారత్‌ ‌వ్యవహారాల్లో ట్రస్‌కు మంచి అవగాహన ఉంది. గత ఏడాది కుదిరిన భారత్‌, ‌బ్రిటన్‌ ‌మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంపై విదేశాంగ మంత్రిగా లిజ్‌ ‌ట్రస్‌ ‌సంతకం చేశారు. అంతకుముందు భారత్‌లో అనేకసార్లు పర్యటించారు. మార్గరెట్‌ ‌థాచర్‌ ‌మాదిరిగా దుస్తులను ధరించే ట్రస్‌ ఆమె మాదిరిగా సుదీర్ఘకాలం పాలించాలని, ఆమె లాగా ఉక్కు మహిళగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటున్నారు. అందుకనే 1980ల్లో థాచర్‌ ‌మాదిరిగా వ్యక్తిగత ఆదాయ పన్నును తగ్గిస్తానని, రాయితీలు ఇస్తానని ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఆమె పరిష్కరించాల్సి ఉంది. వీటిని అధిగమించి బ్రిటన్‌ను గొప్ప దేశంగా, అంతర్జాతీయ శక్తిగా నిలపడం 47 సంవత్సరాల లిజ్‌ ‌ట్రస్‌కు అనుకున్నంత తేలికేమీ కాదు.

By editor

Twitter
Instagram