నిన్న శ్రీలంక, ఇవాళ బంగ్లాదేశ్‌. ‌జిత్తులమారి చైనా దక్షిణాసియాలో పాగా వేసేందుకు ‘భారత్‌ ‌బూచి’ని చూపి ఈ ప్రాంత దేశాలక• స్నేహహస్తం అందిస్తోంది. విషాదం ఏమిటంటే, డ్రాగన్‌ ‌కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నామనే వాస్తవం నిండా మునిగితే కానీ ఈ దేశాలకు అర్థం కావడం లేదు. చైనా దగ్గర తీసుకున్న రుణాలు తడిసి మోపెడై శ్రీలంక ఏ విధంగా దివాళా తీసిందో ప్రపంచమంతా గమనించింది. పాకిస్తాన్‌, ‌నేపాల్‌ ఇప్పటికే విలవిల్లాడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌. అసలే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లా కూడా చైనా వలలో చిక్కుకుంది. శ్రీలంకలో హంబన్‌తోట, పాకిస్తాన్‌లో గ్వాదర్‌ ఓడరేవుల తరహాలోనే బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ ‌రేవు మీద చైనా కన్నేసింది. రక్షణ పరంగా ఈ పరిణామాలు భారత్‌కు ఇబ్బంది కలిగిస్తున్నా, అంతకన్నా ఎక్కువ నష్టం పొరుగు దేశాలే ఎదుర్కొంటున్నాయి.

ఆగస్ట్ 7‌వ తేదీన చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ‌యి బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ ‌హసీనాను కలుసుకోవడంతో పాటు విదేశాంగ మంత్రి ఎ.కె. అబ్దుల్‌ ‌మొమెన్‌,  ఆర్థిక మంత్రి ఎహెచ్‌ఎం ‌ముస్తఫా కమల్‌, ‌వ్యవసాయ మంత్రి డాక్టర్‌ అబ్దుర్‌ ‌రజాక్‌లతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా చైనా-బంగ్లా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా సహకారం ఈ ఒప్పందాలలోని కీలక అంశం.  బంగ్లాదేశ్‌తో మెరుగైన వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకుంటామని, పెట్టుబడులులతో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తామని చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ‌యి చెప్పారు. అలాగే 7 లక్షల మంది రొహింగ్యాలను వారి స్వదేశం మయన్మార్‌ ‌పంపడంలో చైనా సహకారాన్ని కోరింది బంగ్లాదేశ్‌. ‌దేశానికి బెడదగా తయారైన రొహింగ్యాలను వదల్చుకోవాలను కుంటూనే, చైనాను అంటకాగడమే ఇక్కడ గమనార్హం.

బంగ్లాదేశ్‌లో 500కు పైగా చైనీస్‌ ‌కంపెనీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఓడరేవులు, నదుల్లో సొరంగాలు, రహదారుల నిర్మాణంలో ఇప్పటికే చైనా నిపుణులు భాగస్వాములయ్యారు. పద్మానదిపై 3.6 బిలియన్‌ ‌డాలర్ల వ్యయంతో భారీ వంతెన నిర్మించింది. చైనాకు  బంగ్లాదేశ్‌ ‌ముడి పదార్థాలను ఎక్కువగా ఎగుమతి చేస్తుంటుంది. ఈ దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యేది వస్త్రాలే. చైనాకు ఎగుమతి చేసే 98% వస్తువులకు సుంక రహిత (డ్యూటీ ఫ్రీ) ఒప్పందం ఉంది. ఇప్పుడు దీన్ని 99 శాతానికి పెంచేసింది చైనా. అంతర్జాతీయ వేదికపై చైనా తమ దేశం తరఫున నిలబడతారని హామీ ఇచ్చిందటున్నారు ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి షహరియార్‌ ఆలం. తాము భారత్‌, అమెరికాలతో పాటు చైనాతో కూడా సమానంగా దౌత్య, వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నామని తెలివిగా చెప్పారాయన..

కొన్ని దేశాలు చైనాను తప్పుగా అర్థం చేసు కుంటాయని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యా నించారు ఆలం. చైనా- తైవాన్‌ ‌మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ‘వన్‌ ‌చైనా’ విధానానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించింది బంగ్లాదేశ్‌. ‌చైనా వత్తిడితో బంగ్లాదేశ్‌ ‌ప్రధాని హసీనా ఢాకాలోని తైవాన్‌ ‌వాణిజ్య ప్రతినిధి కార్యాలయాన్ని మూసి వేయించింది.

లంక, పాక్‌, ‌నేపాల్‌ ‌మాదిరే….

మౌలిక సదుపాయాల అభివృద్ది పేరిట దక్షిణాసియాలోని శ్రీలంక, పాకిస్తాన్‌, ‌నేపాల్‌ను మచ్చిక చేసుకుంది చైనా. బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్డు ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని ఇందుకోసం వాటికి భారీ రుణాలను ఇచ్చింది. ఇప్పటికే శ్రీలంకలో హంబన్‌తోట, పాకిస్తాన్‌లో గ్వాదర్‌ ఓడరేవులను తెలివిగా తన స్వాధీనంలోకి తీసుకున్న చైనా ఇప్పడు బంగ్లాలోని చిట్టగాంగ్‌లో కూడా పాగా వేస్తోంది. భారత్‌ను దిగ్బంధించేందుకే తమను చైనా దువ్వుతోందని ఈ దేశాలకు తెలుసు. కానీ ఆర్థిక వ్యవస్థల బలహీనత కారణంగా నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నాయి.

చైనా దగ్గర భారీ వడ్డీకి తీసుకున్న అప్పులు భారంగా మారడం వల్లే శ్రీలంక దివాలా తీసిందని అందరికీ తెలుసు. శ్రీలంక ఆర్థిక, రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శ్రీలంకను ఆర్థికంగా దెబ్బ తీయడంతో డ్రాగన్‌ ‌ప్రధాన పాత్ర పోషించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చైనా నుంచి తీసుకున్న  రుణాలను సకాలంలో తీర్చుకోలేక పోయింది. దేశంలో విదేశీ మారక నిల్వలు తరిగి పోవ డంతో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారత్‌ ‌కొంత మేర సాయం అందించింది. అయినప్పటికీ భారత్‌ ‌ప్రయోజనాలకు విరుద్ధంగా ఇటీవల హంబన్‌తోటకు చైనా యుద్ధనౌక వచ్చినా అభ్యంతరం తెలపలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది.

పాకిస్తాన్‌ ‌కూడా తీసుకున్న అప్పులు తీర్చలేని దుస్థితితో చైనాకు ఎప్పుడో లొంగిపోయింది. బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ‘చైనా పాకిస్తాన్‌ ఎకనమిక్‌ ‌కారిడార్‌- ‌సీపీఈసీ’ వ్యయం తడిసిమోపెడై పాకిస్తాన్‌ ‌విలవిలలాడు తోంది. ఆరంభంలో పాకిస్తాన్‌ ఈ ‌ప్రాజెక్టును జాక్‌పాట్‌గా భావించింది. కానీ ఈ అప్పులు తీర్చలేకపోడంతో నెమ్మదిగా పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను చైనా ఆక్రమిస్తోంది.  సీపీఈసీని అడ్డం పెట్టుకొని  గ్వాదర్‌ ‌రేవులో పాగా వేసింది. తాజాగా పాకిస్తాన్‌ ‌సైన్యం కోసం రహస్య క్షిపణి స్థావరాన్ని నిర్మించే పనిలో నిమగ్నమైంది చైనా. సింధ్‌లోని నవాబ్‌షా, బలూచిస్తాన్‌లోని ఖజ్దర్‌ ‌పరిసర ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి శత్రువు భారత్‌ను దెబ్బ తీయాలనే లక్ష్యంతో చైనాతో చేతులు కలిపిన పాకిస్తాన్‌ ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తోంది. పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో అక్కడి ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

భారత్‌తో అనాదిగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలున్న నేపాల్‌ ‌సైతం చైనా వలలో చిక్కుకుంది. రుణాలు తీసుకునేప్పుడు ఆనందంగానే ఉన్నా తీర్చేటప్పుడు బాధ కలుగుతుంది. నేపాల్‌కు మూడు వైపులా భారత్‌ ఉం‌టే ఉత్తరంలో హిమాలయాలకు ఆవల చైనా ఉంటుంది. స్వతహాగా ఆ దేశం భారత్‌ ‌మీద ఆధారపడక తప్పదు. అయితే నేపాల్‌ ‌కమ్యూనిస్టు నాయకులు చైనా మాయలో పడి తమ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు. భారత్‌లోని లద్ధాఖ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లలో చాలా భూభాగాల్లో తిష్టేసిన చైనా ఇప్పుడు నేపాల్‌ ‌విషయంలోనే అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. నేపాల్‌లోని గూరా, హుమ్లా జిల్లాల్లోకి చైనా చొరబడింది. అక్కడ రోడ్లను కూడా నిర్మించే ప్రయత్నం చేస్తోంది. గూరాలోని చుమనుబరి రూరల్‌ ‌మున్సిపాలిటీ-1లోని రుయిలా సరిహద్దులో కంచెను ఏర్పాటు చేసింది. డ్రాగన్‌ ‌దుష్ట చేష్టల కారణంగా సరిహద్దులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పశువులు గడ్డి మేయకుండా చైనా సైనికులు అడ్డుకుంటున్నారని స్థానిక•లు వాపోతున్నారు. నేపాల్‌ ‌సార్వభౌమత్వానికి చైనా సవాలు విసురుతున్నా, అక్కడి పాలకులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయలేని దుస్థితి. భూటాన్‌లోని డోక్లాంలో పాగా వేందుకు ప్రయత్నించి భారత్‌ ‌ప్రతిఘటనతో భంగపడ్డ చైనా, ఇప్పుడు తన దురాక్రమణను నేపాల్‌లో అమలు చేస్తోంది. అయితే తాము నేపాల్‌ ‌సరిహద్దులను ఆక్రమించలేదని, ఆ భూభాగాలు టిబెట్‌ ‌పరిధిలోనివంటూ చైనా బుకాయిస్తోంది.

ఏ విధంగా చూసినా శ్రీలంకను దివాళా తీయించిన చైనా వక్ర దృష్టి ఇప్పుడు బంగ్లాదేశ్‌పై కూడా పడిందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ దేశాన్ని కూడా అప్పుల ఊబిలోకి తోసేసే  ప్రయత్నాలు మొదలు పెట్టింది. బంగ్లాదేశ్‌లోని ముఖ్యమైన ఓడరేవు చిట్టగాంగ్‌పై తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం ఇందుకు సంబంధించినదే. చిట్టగాంగ్‌ను స్మార్ట్ ‌సిటీగా మార్చాలని, అక్కడ మెట్రో ట్రైన్స్ ‌నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చాలా కంపెనీలు ప్రతిపా దించాయి. లాభాల్లో వాటా ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడుల పేరుతో బంగ్లాదేశ్‌ను డ్రాగన్‌ ‌పూర్తిగా తన అధీనం లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి చైనా విదేశాంగమంత్రి ఢాకాలో పర్యటన, కీలక ఒప్పందాలపై సంతకాలు దీని ఫలితమే. బంగా ళాఖాతంలోని ఈ కీలక రేవులో చైనా కార్యకలాపాలు భారత్‌కు ముప్పుగా మారబోతున్నాయి..

ఆర్థిక సంక్షోభంలో బంగ్లా

అప్పులు తీర్చలేక శ్రీలంక దివాళా తీస్తే, పాకిస్తాన్‌ ‌దివాలా అంచుకు చేరింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బంగ్లాదేశ్‌ ఒకటని ఆర్థికవేత్తలు కితాబిస్తుంటారు. ఆ దేశం 416 బిలియన్‌ ‌డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 33వ స్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, సేవారంగాలపై ఆధారపడి ఉంది. జీడీపీలో 56శాతం ఉన్న బంగ్లా సేవారంగం కరోనా కారణంగా బాగా దెబ్బతింది. దీంతో 11లక్షల మంది నిరుద్యోగులయ్యారు.  మరో వైపు బంగ్లాదేశ్‌ ఎగుమతుల్లో 84శాతం వాటా ఉన్న రెడీమేడ్‌ ‌దుస్తుల డిమాండ్‌ ‌లాక్‌డౌన్ల కారణంగా దెబ్బతింది. విదేశాల్లో నివసించే బంగ్లాదేశ్‌ ‌వాసులు స్వదేశానికి పంపించే మొత్తాలు కూడా గణనీయంగా తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడం కూడా బంగ్లాదేశ్‌కు శాపంగా మారింది.

ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ ‌బెయిల్‌ఔట్‌ ‌ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్దకు వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్‌ ‌డాలర్లు ఇవ్వాలని కోరింది. వివిధ సంస్థల నుంచి 2.5 బిలియన్‌ ‌డాలర్ల రుణం కోసం యత్నిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ ‌పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో లభించే రుణాలను అవసరాలకు వాడుకోవడానికి ఓ మార్గంగా పరిగణిస్తున్నట్టు సమర్థించుకొంది. కానీ, వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఒక్క 2019లోనే 11.11 బిలియన్‌ ‌డాలర్ల రుణాలు దేశీయంగా ఎగవేసినట్లు ఆ దేశ సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌వెల్లడిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ‌వద్ద ఉన్న రిజర్వులు కొన్ని నెలల విదేశీ చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీ రిజర్వులు పుంజుకోకపోతే ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.

బంగ్లాదేశ్‌ ‌ప్రజలు కూడా ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. తొమ్మిది నెలలుగా 6శాతం పైనే నమోదవుతోంది. గత నెలలో 7.48 శాతానికి చేరింది. మధ్యతరగతి, పేద ప్రజలకు పూట గడడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో యుద్ధం పేరుతో మళ్లీ ఇంధన ధరల భారం మోపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 51.2 శాతం పెరుగుదలతో ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 108రూపాయలకు చేరింది. డీజిల్‌, ‌కిరోసిన్‌, ‌గ్యాస్‌ ‌ధరలు కూడా భారీగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్‌లో కూడా ఆందోళనలు భారీగా జరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆందోళనలతో  రాజధాని ఢాకా దద్దరిల్లిపోయింది. పెట్రోల్‌ ‌బంక్‌లను ధ్వంసం చేశారు.

ఈ పరిస్థితుల మధ్యే బంగ్లాదేశ్‌, ‌చైనాతో నాలుగు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై బంగ్లాదేశ్‌ ‌ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక దివాళాకు చైనా కారణమన్నది ప్రపంచమంతా అంగీకస్తోంది. ఇప్పటికే సంక్షోభం దిశగా పయనిస్తున్న బంగ్లాదేశ్‌ ఈ ‌సమయంలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరమేంటని బంగ్లాదేశ్‌లోని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram