ఆగస్ట్ 31 ‌వినాయక చవితి

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

అర్చన, వ్రతం, క్రతువు, యజ్ఞయాగాదులు.. పక్రియ ఏదైనా తొలిపూజ వేలుపు గణనాథుడే. ముక్కోటి దేవతలలో ఆయనకే దక్కిన అరుదైన గౌరవం. బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాలు ఆయన గాథలను విపులంగా చెప్పాయి. వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు. కొన్నేళ్లుగా గణపతి విగ్రహాల తయారీలో రసాయనాల వాడకం ఎక్కువ కావడంతో పర్యావరణానికి ముప్పువాటిల్ల సాగింది. ముఖ్యంగా విగ్రహాల నిమజ్జన సందర్భాలలో సరస్సులు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అలాంటి విగ్రహాల తయారీని మానుకోవాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు హితవు చెబుతూ ఉద్యమిస్తున్నాయి. మట్టితో చేసిన విగ్రహాల ఉచిత పంపిణీ చేపడుతూ కొంత మేర సత్ఫలితాలు రాబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ ‌వినాయకుడి విగ్రహాన్ని ఈ ఏడాది మట్టితోనే రూపొందిస్తున్నారు.

దక్షిణాయనం దేవతా ప్రీతికరమైనది. చాలా పండుగలు వచ్చే కాలమిదే. ఆ పరంపరంలో వచ్చే మొదటి పండుగ వినాయకచవితి. ఆయనకు జరిగే అర్చన నుంచి నైవేద్యం వరకు అన్నీ ప్రకృతి సంబంధిత వస్తువులు, పదార్థాలే. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య రహస్యాలు దీనికి నేపథ్యంగా భావించవచ్చు.

వినాయక ఉత్పత్తి గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటన్నిటి నేపథ్యం లోకకల్యాణమే. గణపతి విష్ణు రూపాంతరమని, శివపార్వతుల తనయుడిగా జన్మించడం వల్ల శివ, విష్ణు తత్త్వాల సంగమమని చెబుతారు. పైగా ద్వయరూపాల సమ్మేళనం కనుక అత్యంత శక్తిమంతమైన రూపంగా అభివర్ణిస్తారు. విశ్వనిర్వహణ సజావుగా సాగేందుకు త్రిమూర్త్యాది దేవతలు గణపతిని పూజిస్తారని శివపురాణం, అష్టదిక్కులకు వ్యాపించిన శిష్ట జన రక్షకుడని ముద్గల పురాణం పేర్కొంటున్నాయి. వినాయకచవితిని పంచాయతన విధానంలో జరుపుకుంటారు (విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, వినాయకుని పూజా సంప్ర దాయాలను పంచయతనపూజా విధానమంటారు).

పర్యావరణ హితైషి

ఇతర దేవతా వ్రతాలకు సంబంధించి భక్తులు తమతమ శక్తిని బట్టి స్వర్ణ, రజత, కాంస్య లోహాలతో చేసిన దేవతా ప్రతిమలను ఉపయోగించవచ్చని చెబుతారు. వినాయకుని విషయంలోనూ ఆ నియమాలు, వెసులుబాటు ఉన్నా, మృత్తికా విగ్రహా ర్చనకే ప్రథమ ప్రాధాన్యం. పతంజలి యోగ శాస్త్రపరంగా, పృథ్వీ తత్త్వం గల మూలాధారచక్రానికి గణనాథుడే అధిష్ఠాన దైవం. మట్టి వినాయకుడిని పూజించాలనడంలోని రహస్యమిదేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. మట్టితో చేసిన ప్రతిమను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని గణేశ పురాణం చెబుతోంది. మృత్తిక (మట్టి) సృష్టి, స్థితి, లయాలకు ప్రతీక. వినాయకుని ప్రతిమ తయారీకి అదే శ్రేష్ఠం. సువర్ణమూర్తిని పూజిస్తే సంకల్పసిద్ధి, వెండి విగ్రహార్చనతో ఆయుష్షు, రాగి విగ్రహంతో పూజిస్తే ఐశ్యర్యం, మట్టి విగ్రహంతో అర్చిస్తే మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. ఇతర లోహాలతో రూపొందే ప్రతిమలు ప్రకృతిలో సంపూర్ణంగా విలీనం కావు.

వినాయకోత్పత్తి కథనం ప్రకారం, ఆయన పుట్టు కకు ప్రకృతిసిద్ధ పదార్ధమే మూలం. జగన్మాత పార్వతి మంగళస్నానం సందర్భంగా నలుగుపిండితో  తయారుచేసిన బొమ్మకు ప్రాణం పోసి, వాకిలి వద్ద కావలి ఉంచడం, ఆమె మందిరంలోకి తన ప్రవేశాన్ని అడ్డగించడంతో ఆగ్రహించిన శివుడు, బాలుడి తలను తుంచి, పార్వతీ విలాపంతో గజాసురుడి తలను అతికించి పునర్జీవింపచేయడం లోక ప్రసిద్ధమైన కథ.

వినాయక ప్రతిమల తయారీ పక్రియ ఒకప్పుడు ముచ్చటగా ఉండేది. పండుగ ఉదయాన్నే చెరువుకు వెళ్లి బంకమట్టిని తెచ్చి ఒక కొయ్య ఫలకంపై గల ఆయన నమూనాపై అచ్చు పోసేవారు. అలా తయా రైన ప్రతిమకు కళ్ల స్థానంలో గురివింద గింజలు అమర్చేవారు. పూజ అనంతరం విగ్రహాలను చెట్లు, మొక్కల పాదులలో ఉంచితే, వర్షాలకు కరిగిపోయేవి. పరిస్థితులు, భక్తుల అభిరుచులు మారాయి. రక రకాల రంగులు, పరిమాణాలతో విగ్రహాలు రూపు దిద్దుకుంటున్నాయి. ప్రకృతితో మమేకమై చెట్టును, పుట్టనూ, నేలను ఆరాధించడమే ఈ పండుగలోని పరమార్థమనే అర్థం మారుతోంది. ఒకనాటి మృత్తికా విగ్రహాల బదులు ప్లాస్లర్‌ ఆఫ్‌ ‌పారిస్‌తో రంగుల్లో కొలువు తీరుతున్నాయి. ఈ తీరు జీవకోటికి ప్రమాద కరంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని నివా రించేందుకు ప్రభుత్వాలు, పర్యావరణ ప్రియులు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. దీనిపై అవ గాహన తరగతులు నిర్వహిస్తున్నాయి. రసాయనాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని గుర్తించి అనేక స్వచ్ఛంద సంస్థలు గణపతి ప్రతిమల తయారీలో పర్యావరణ హితానికి దోహదపడేలా చర్యలు తీసు కుంటున్నాయి. ఆ ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలి తాలనిస్తున్నాయి. తులసి తదితర విత్తనాలతో విగ్ర హాలు రూపొందిస్తున్నాయి. పూజానంతరం వాటిని జల నిమజ్జనం చేయడం కంటే నేలలో నాటి, నీరు పోయడం వల్ల విగ్రహాలు కరిగి విత్తనాలు మొల కెత్తుతాయి. అలాగే గోమయంతోనూ కాగితపు గుజ్జు, గడ్డి, ఆకులు, విత్తనాలు, పండ్లు.. ఇలా నేలలో కలిసి పోయే వస్తువులతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూజానంతరం వీటిని జల నిమజ్జనం కంటే తోటలు, ఉద్యానవనాలలో పెడితే వర్షాలకు ఎరువుగా మారి మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తాయి.

నిమజ్జన నేపథ్యం

గణనాథుడు జలరూపుడు. అందుకే నవరాత్రోత్స వాల తర్వాత ఆయన ప్రతిమలను జలాల్లో నిమజ్జనం చేస్తారు. పూర్వాచారం ప్రకారం, వినాయక విగ్రహాల తయారీకి మట్టిని సేకరించిన నీటి వనరులలోనే పూజా నంతరం విగ్రహాలను నిమజ్జనం చేయాలి. అలా మట్టితో తయారు చేయడం వెనుకా ఒక సామాజిక నేపథ్యం ఉంది. గ్రామస్థులు వర్షాకాలంలో ఊరి చెరువుల్లో పూడిక తీస్తారు. అలా సేకరించిన మట్టితో విగ్రహాలు చేసేవారు. జననంతో పాటే మరణం. జీవి ఉన్నంతకాలం సుఖసంతోషాలతో గడిపినా, పంచభూతాలలో కలిసిపోవడం అనివార్యం అనే వేదాంతాన్ని దీనికి మూలంగా చెబుతారు. పూడిక తీయడంతో నీరు చేరిన వనరులలోనే ఈ ప్రతిమలను నిమజ్జనం చేసేవారు. నిమజ్జనం సంద ర్భంగా వదిలిన ఓషధ గుణాలు గల పత్రి కారణంగా కొత్తగా చేరిన నీటిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. ఇతర జలవనరులు సంగతి ఎలా ఉన్నా ఆ కాలంలో చెరువులే తాగునీటికి ప్రధాన వనరులుగా ఉండేవి. ఇలాంటి ఔషధి పత్రితో ఆ నీరు శుద్ధి అయ్యే అవకాశం ఉంది.

వ్యక్తిత్వ వికాస నిపుణుడు

గజాననుడిని ప్రణవనాద స్వరూపుడిగా, శబ్ద బ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకుడిగా గణేశ పురాణం, సమస్తలోకానికి ఆధారశక్తిగా గణేశ గీత చెబుతున్నాయి. దేవతల నుంచి మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయ తీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని వేదవాక్కు. అందుకు ఎన్నో పురాణగాథలు ఉదాహరణలు.

శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్త్వివికాస నిపుణుడు వినాయకుడు. తన లోని బలం, బలహీనతను ఎరిగి ప్రవర్తించాలన్నది ఆయన చర్య చాటి చెబుతోంది. గణాధిపత్యం కోసం అన్నదమ్ములు వినాయకుడు, కుమారస్వామి పోటీపడి నప్పుడు ‘ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుంది’ అని తండ్రి మహాశివుడు నిబంధన విధించాడు. దానికి మరుగుజ్జు, స్థూలకాయుడైన గణేశుడు మొదట కలత చెందాడు. శక్తిమంతుడు, లఘు దేహంతో వేగంగా ప్రయాణించగల తమ్ముడిని అధిగమించ లేనని భావించాడు. అంతలోనే ఆత్మస్థైర్యంతో తనకు తాను నచ్చచెప్పుకున్నాడు. బుద్ధిబలాన్ని ప్రయో గించాడు. కన్నవారే కనిపించే దైవాలనీ, ప్రకృతి పురుషులైన తల్లిదండ్రులకు ప్రదక్షిణతో సర్వ పుణ్యనదీస్నాన సమానమని గ్రహించి ఆచరించాడు. తమ్ముడు షణ్ముఖుడు వెళ్లిన ప్రతి నదిలో అప్పటికే అన్న స్నానమాడుతూ కనిపించాడు. సూక్ష్మబుద్ధి, వినయంతో విజయాలు సొంతం చేసుకున్నాడు. గణాధిపతిగా నియమితుడై సర్వసమర్థుడిగా మన్ననలు అందుకున్నారు. అలా… గెలచి తీరాలన్న సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను అధిగమించడం పెద్ద సమస్య కాబోదని వినాయకుడు లోకానికి చాటి చెప్పాడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణం లోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.

పత్రి పూజా విశిష్టత

వినాయకుడి ‘సర్వాణ్యంగాని పూజయామి’ అంటూ ఇరవై ఒక్క (ఏక వింశతి) రకాల ఆకులతో ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ అర్చిస్తారు. మాచీ పత్రం (దవనం), బృహతీపత్రం (ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), కశ్యపాయ పత్రం (తులసీ), చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (సీతాఫలం, కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఓషధీ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం చెబుతున్నాయి. మనం పూజ చేసే ఆకుల పరిమళాలతో (సువాసన) శ్వాస కోశవ్యాధులు నయ మవుతాయి.  ఔషధ గుణాలున్న ఈ పత్రాలతో స్వామిని 9 రోజులపాటు ఉదయం, సాయంత్రం పూజిస్తారు. ఇలా పూజల పేరుతో ఏడాదికి ఒకసారైనా వివిధ ఆకులను తాకే అవకాశం కలుగు తుందనే కాబోలు పూర్వికులు ఇలాంటి సంప్రదా యాలను ప్రవేశపెట్టి ఉంటారు. ఔషధం గుణం గల ఈ పత్రి సేకరణకు ఈ మాసమే అనుకూలమైనదని చెబుతారు. పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా, సూర్యరశ్మి తక్కువగా ఉండే కాలంలో ఈ పండుగ వస్తుంది. అలాంటి వాతావరణంలో సూక్ష్మక్రిములు విస్తారమై మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

నగరాలు, పట్టణాలలో విక్రయిస్తున్న పత్రిలో నిర్దేశిత 21 రకాల పత్రులు ఉన్నాయా అంటే ఔను అనలేం. అందులో సగం కూడా అనుమానం. కొన్ని దశాబ్దాల క్రితం యువకులు, బాలలు ఉదయాన్నే గ్రామశివార్లు, తోటలకు వెళ్లి పత్రి సేకరించేవారు. పెద్దలు వెంట ఉండి సాధ్యమైనంత వరకు అన్ని రకాల పత్రిని సేకరించే వారంటే వర్తమాన తరానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇప్పుడు యాభయ్‌, అరవయ్యో పడిలోని వారికి అవన్నీ తీపి జ్ఞాపకాలు.

నైవేద్యాలు

రుతువులను బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలంటారు. ఈ వర్షరుతువులో ఆకలితో పాటు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కనుక ఆహారంలో ఉప్పు, కారం, తీపి తగ్గించి తీసుకోవాలి. నూనె పదార్ధాల కంటే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్లు వంటి పదార్థాలు అందుకు ఉదాహరణ. మానవ గణానికి గణపతి ఇచ్చిన సందేశం ఇదే. అటు శాస్త్రం, ఇటు ఆరోగ్యం అన్నట్లు గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేశారు. నూనెలేని మోదకాలు (ఉండ్రాళ్లు), కుడుములను నివేదించడం సంప్రదాయం. ఆరోగ్య పరంగా పరిశీలిస్తే… ఆవిరిపై ఉడికించిన మోదకాలు ఎన్నో పోషక విలువలు కలిగి జీర్ణమై శరీరానికి పుష్టిని కలిగిస్తాయని, సులువుగా జీర్ణమవుతాయని నిపుణులు చెబుతారు. వర్షరుతువులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆవిరి మీద ఉడికించిన పదార్థాలను తినాలనే అంశం బోధపడుతోంది. నువ్వులు శ్వాస సమస్యలను నివారిస్తాయని, అధికామ్లం, అజీర్తిని తొలగించి, నేత్రవ్యాధులను నివారిస్తాయని, బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాతపిత్త రోగాలను నివారిస్తుందని, ఆ కోణంలోనే నువ్వులు, బెల్లంతో తయారుచేసిన చిమ్మిలిని నైవేద్యంగా వినియోగిస్తారని చెబుతారు..

భాద్రపదమాసంలో లభించే రకరకాల పండ్లు, కొత్త పంటలు, మొక్కజొన్న, వెలక్కాయ, ఓనగాయ, కొత్త పప్పుధాన్యాలను మొదటగా గణపతికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ఇహమూ, పరమూ అన్నట్లు ఆరోగ్యం, ఆయుర్వృద్ధి కావాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పెద్దలు చెబుతారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram