– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఎవరికి వారే ఆ కుర్చీ తమదంటే తమదని ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి దూకేశారు. వరుస కార్యక్రమాలు చేపడుతూ జనంలోకి వెళ్లేందుకు, ఓటర్ల ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ముఖ్యనేతలు, అధినేతలు అందరూ కొంతకాలంగా మునుగోడునే లక్ష్యంగా చేసుకున్నారు.

ఉపఎన్నిక ఖాయమని నిర్ధారణ కాగానే కాంగ్రెస్‌ ‌పార్టీ తొలుత మునుగోడులో బహిరంగసభ నిర్వహించింది. పీసీసీ చీఫ్‌ ‌సహా రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు దాదాపుగా ఈ సభలో పాల్గొన్నారు. అయితే,  కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ ‌పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌ ‌కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ఆ సభలోనే అద్దంకి దయాకర్‌ ‌మాటలు జారారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత క్షమాపణల పర్వం నడిచింది. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. అయినా వెంకట్‌రెడ్డి తగ్గలేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అంతేకాదు, ఇటీవల ప్రియాంక గాంధీతో ఢిల్లీలో జరిగిన ముఖ్య సమావేశానికి కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాలేదు. పైగా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలంటూ ఏకంగా సోనియాగాంధీకే లేఖ రాశారు. ఈ పరిణామంతో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి.

పోటాపోటీగా బహిరంగ సభలు

ఆగస్ట్ 20‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మునుగోడులో బహిరంగసభ నిర్వహించారు. ఆ సభలోనే మునుగోడు ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థిని ప్రకటిస్తారని మొదటినుంచీ ప్రచారం జరిగింది. అయితే, ఆ ఆలోచనను విరమించు కున్నారు. ఎందుకంటే అక్కడినుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు కేసీఆర్‌ ‌బహిరంగ సభకు ముందే లీకులు ఇచ్చారు. అయితే, ఆ ప్రచారంతో మునుగోడు టీఆర్‌ఎస్‌లో లుకలుకలు మొదల య్యాయి. తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమయింది. స్వయంగా మంత్రి జగదీశ్‌రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించాల్సిన పరిస్థితి తలెత్తింది. కూసుకుంట్లకు టికెట్‌ ఇస్తే సహకరించబోమని కొన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు తీర్మానాలు కూడా చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే కేసీఆర్‌.. ‌బహిరంగ సభలో అభ్యర్థిని ప్రకటించలేదు. కేవలం బీజేపీపై విమర్శలకే పరిమితమయ్యారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆగస్ట్ 21‌న బహిరంగ సభకు ప్రణాళిక వేసుకోవడంతో ఆ సభకు చెక్‌ ‌పెట్టాలన్న వ్యూహంతో కేసీఆర్‌ ఒకరోజు ముందుగానే బహిరంగసభ నిర్వహించారు. ఆ సభ విజయవంతమైతే, మరుసటిరోజు బీజేపీ సభ పేలవంగా మారుతుందని భావించారు. కానీ, కేసీఆర్‌ ‌సభకన్నా బీజేపీ సభకే జనం ఎక్కువగా వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మునుగోడులో ఇన్నాళ్లు ఒకలా.. అమిత్‌ ‌షా సభ తర్వాత ఇంకోలా పరిస్థితి మారిపోయింది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు రావాల్సిందిగా డప్పు చాటింపు వేయించారు. ఆ రోజు ఉపాధి హామీ పనులకు వస్తేనే వందరోజులు పని కల్పిస్తామని, లేదంటే కార్డు కొట్టేస్తామని ప్రకటింపజేశారు. అంటే, ఉపాధిహామీ పథకం పనులకు వెళ్తే.. అమిత్‌ ‌షా సభకు జనం తక్కువగా వెళ్తారన్న భావనతోనే ఇలా చాటింపు వేయించారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కానీ, సభ సమయానికి చూస్తే.. జనం భారీగా తరలివచ్చారు. ఫలితంగా బీజేపీలో జోష్‌ ‌పెరిగింది. దీంతో, టీఆర్‌ఎస్‌.. ఆలోచనలో పడింది. బీసీ కార్డుపైనే ఫోకస్‌ ‌పెట్టినట్లు తెలుస్తోంది. అమిత్‌ ‌షా సభతో ఎన్నికల షెడ్యూల్‌ ‌రాకముందే మునుగోడు ఉపఎన్నిక సమరం ఉత్కంఠ రేపుతోంది. ఈ సభలోనే అమిత్‌ ‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌పై అమిత్‌ ‌షా నిప్పులు..

అవినీతిమయమైన కేసీఆర్‌ ‌సర్కారును గద్దె దింపడమే తమ లక్ష్యమని మునుగోడు బహిరంగ సభలో అమిత్‌ ‌షా స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపుతో టీఆర్‌ఎస్‌ ‌పతనం ప్రారంభమవుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పుకు నాంది కానుందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలేదన్నారు. సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక మజ్లిస్‌ ‌నేతలకు భయపడి మాట తప్పారని అమిత్‌ ‌షా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా మని ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్న కేసీఆర్‌ ‌హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. పేదలకు డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఆ ఇళ్లు నిర్మించకపోగా ప్రధాని మోదీ కేటాయించిన నిధులతో కనీసం టాయిలెట్‌లను కూడా నిర్మించలేక పోయారని అమిత్‌ ‌షా ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ఎస్సీలకు దళితబంధు పథకం తెచ్చి రూ.10 లక్షల చొప్పున పంచారని గుర్తు చేస్తూ.. మునుగోడులో ఎంత మందికి దళితబంధు ఇచ్చారని అమిత్‌ ‌షా ప్రశ్నించారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, గిరిజనులకు ఎకరా భూమి హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ ‌బీమాను తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారారని ఆయన అన్నారు. తప్పు చేశారు కాబట్టే కేసీఆర్‌కు సీబీఐ, ఈడీలంటే భయం పట్టుకుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితబంధుతో పాటు ఇతర పథకాలు గుర్తుకు వస్తాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ‌దుయ్యబట్టారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తిరుగులేని తీర్పు ఇచ్చిన విధంగానే మునుగోడులో కూడా ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

భారీగా జనసమీకరణ

సీఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభకు జనసమీకరణ కోసం వారంరోజుల ముందే మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. మంత్రితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వారం రోజులు ప్రతి ఊరు తిరిగారు. ఇందుకు నిధులను కూడా హైకమాండ్‌ ‌సమకూర్చింది. అయినా కేసీఆర్‌ ‌సభకు ఆశించినంతగా జనం రాలేదు. రాజగోపాల్‌ ‌రెడ్డి ఒక్కరే కేసీఆర్‌ ‌సభకు దీటుగా అమిత్‌ ‌షా సభకు జనసమీకరణ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ముందురోజు కేసీఆర్‌ ‌సభకు వెళ్లిన వాహనాలు, జనాలనే రాజగోపాల్‌ ‌రెడ్డి అమిత్‌ ‌షా సభకు తరలించి గులాబీ పార్టీకి షాకిచ్చారని అంటున్నారు.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో ఉన్న మెజార్టీ కాంగ్రెస్‌ ‌సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కమలం గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలను బీజేపీలో చేర్చుకునేలా రాజగోపాల్‌ ‌రెడ్డి ఆపరేషన్‌ ‌చేపట్టనున్నారని తెలుస్తోంది. ఆయన జనంలోకి వెళుతుండగా.. అధికార పార్టీలో మాత్రం గందరగోళం నెలకొంది. మునుగోడు సభలో అభ్యర్థిని కేసీఆర్‌ ‌ప్రకటించకపోవడంతో ఆ పార్టీ నుంచి పోటీలో ఎవరు ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌, అమిత్‌ ‌షా సభలకు సంబంధించి ప్రభుత్వం ఇంటలిజెన్స్ ‌నుంచి సమాచారం తెప్పించుకుందని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక విషయంలో సీరియస్‌గా పనిచేయక పోతే మొదటికే మోసం వస్తుందని, హుజురాబాద్‌ ‌కన్నా ఘోరంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుం దనే ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర అసమ్మతి ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే తీరని నష్టం జరగడం ఖాయమని పీకే బృందం కూడా కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో మునుగోడు ఉపఎన్నిక కోసం త్వరలోనే ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌కీలక సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో పాటు మునుగోడు నియోజక వర్గంలోని పార్టీ ప్రతినిధులు, టికెట్‌ ఆశిస్తున్న నేతలను ఈ సమావేశానికి పిలవ నున్నారని చెబుతున్నారు. మునుగోడు అభ్యర్థి విషయంలోనూ కేసీఆర్‌ ‌నిర్ణయం మారిపోయిందని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిని ఢీకొట్టడం కూసుకుంట్ల ప్రభాకర్‌ ‌రెడ్డితో సాధ్యం కాదనే నిర్ణయా నికి వచ్చారని అంటున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ ‌తరహాలోనే బీసీ నేతను బరిలోకి దింపాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని తెలుస్తోంది.

About Author

By editor

Twitter
Instagram