అంతర్జాతీయంగా భారత్‌ను, నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమాక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు కొన్ని శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా భారత ప్రభుత్వాన్ని, మోదీ ప్రతిష్టను మసకబర్చేందుకు అవి అదే పనిగా ప్రయత్నిస్తున్నాయి. సమస్యను గోరంతలు కొండంతలుగా చేయడం, భూతద్దంలో చూడటం వాటికి అలవాటుగా మారింది. మోదీ అధికారం చేపట్టిన 2014 నుంచి గత ఎనిమిదేళ్లలో అంతర్జాతీయంగా భారత్‌ ‌సాధించిన విజయాలను చూసి ఓర్వలేని శక్తులు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నాయి. దేశంలోని కొన్ని విపక్షాలు వాటికి ఊతమిచ్చే విధంగా మాట్లాడటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అంతర్గతంగా, విధానాల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఒకే మాట వినిపించాల్సిన, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన కొన్ని విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూసే పరిణతి లోపించడం విచారకరం. భారతీయ జనతా పార్టీ మాజీ నాయకులు నుపూర్‌శర్మ, నవీన్‌కుమార్‌ ‌జిందాల్‌ ‌చేసిన వ్యాఖ్యల నుంచి చలిమంటలు కాచుకునే పరిస్థితికి విపక్షాలు దిగజారడం బాధాకరం.

ఒక్కసారి వారి వ్యాఖ్యలను, మాటలను విశ్లేషించి చూస్తే వాస్తవం ఏమిటో బోధపడుతుంది. మహమ్మద్‌ ‌ప్రవక్తపై ఒక టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్‌కుమార్‌ ‌జిందాల్‌ ‌చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. వీటిపై ప్రభుత్వం, పార్టీ వెనువెంటనే స్పందించాయి. నుపూర్‌ ‌శర్మపై పార్టీ సస్పెన్షన్‌ ‌వేటు వేసింది. నవీన్‌ ‌కుమార్‌ ‌జిందాల్‌ను కూడా పార్టీ నుంచి బహిష్క రించింది. దేశహితాన్ని కోరే, బాధ్యతాయుతమైన పార్టీగా తమకు అన్ని మతాలపై సంపూర్ణ గౌరవం ఉందని, ఎవరినీ, ఏ మతాన్ని తక్కువ చేసి తమ పార్టీ చూడదని కమలం పార్టీ స్పష్టం చేసింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా, మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతలపై తక్షణమే చర్యలు తీసుకున్నట్లు బీజేపీ క్రమశిక్షణ సంఘం పేర్కొంది. వ్యక్తిగతంగా జిందాల్‌ ‌కూడా వివరణ ఇచ్చారు. జ్ఞాన్‌వాపి మసీదు సహా వివిధ అంశాల్లో హిందూమతాన్ని కించపరుస్తున్న వారి మాటేమిటని మాత్రమే తాను ప్రశ్నించానని, అంతకు మించి ఎవరినీ తక్కువ చేసి చూపే ఉద్దేశం లేదని జిందాల్‌ ‌పేర్కొన్నారు. హిందూమత విశ్వాసాల గురించి అవహేళనగా మాట్లాడటాన్ని తాను సహించ లేక స్పందించానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉన్నట్లయితే వాటిని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని జిందాల్‌ ‌స్పష్టంగా పేర్కొన్నారు. విషయం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు దాని గురించి రాద్ధాంతం చేయడాన్ని ఏమను కోవాలి?

వీరి ప్రకటన పట్ల ముస్లిం దేశాల స్పందనను కాసేపు పక్కనబెడితే దేశంలోని విపక్షాలు స్పందించిన తీరు విస్తుగొల్పింది. లౌకిక పార్టీలుగా జబ్బలు చరుచుకునే కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, ఇతర ఊరూపేరూ లేని కొన్ని పార్టీలు ఒక్కసారిగా విపరీతంగా మాట్లాడటం మొదలుపెట్టాయి. మత ప్రాతిపదికన ప్రజల్లో చీలిక తీసుకువచ్చి దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్ని స్తోందని షరామామూలుగా పదునైన పడికట్టు పదాలతో హస్తం పార్టీ ధ్వజమెత్తింది. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ ‌సూర్జేవాలా ఈ మేరకు పత్రికా సమావేశల్లో, ప్రకటనల్లో అదేపనిగా ఊదర గొట్టారు. ఇక వామపక్షాల గురించి, హైదరాబాద్‌ ‌కేంద్రంగా పనిచేసే మజ్లిస్‌, ‌కేరళకు చెందిన ఐయూఎంఎల్‌ (ఇం‌డియన్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌ముస్లిం లీగ్‌) ‌వంటి మతవాద పార్టీల గురించి చెప్పనక్కర లేదు. ఇక్కడే విపక్షాల గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పార్టీ నేతల వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్టీ, ప్రభుత్వం వేర్వేరన్న విషయాన్ని అవి ఉద్దేశపూర్వకంగానే విస్మరించి మాట్లాడాయి. మరోపక్క నుపూర్‌ ‌శర్మ వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. జిందాల్‌ ‌పైనా కేసు నమోదు చేశారు. శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.

నుపూర్‌శర్మ, జిందాల్‌ ‌వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం స్పందించింది. ఆయా దేశాలు భారత రాయబారులను పిలిచి తమ నిరసన వ్యక్తంచేశాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న దిద్దుబాటు చర్యలపై అవి సంతృప్తిని కూడా వ్యక్తం చేశాయి. పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న భారత రాయబారుల వాదనలోని సహేతుకతను అవి అర్థం చేసుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం భారతీయ నాగరిక వారసత్వమని, తమ దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని మన రాయబారులు వారికి సోదాహరణంగా వివరించారు. పాకిస్తాన్‌ ‌విషయాన్ని పక్కనపెడితే ఇస్లామిక్‌ ‌దేశాలతో భారత్‌కు మొదటి నుంచీ బలమైన సంబంధాలు ఉన్నాయని, వాటిని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి వలలో పడవద్దని సూచించారు. సంబంధాల బలోపేతానికి మరింత కలసికట్టుగా పనిచేయాలన్న భారత రాయబారుల సూచనతో ఆయా దేశాలు ఏకీభవించడం గమనార్హం. పాకిస్తాన్‌, ‌టర్కీ వంటి కొన్ని మత ఛాందసవాద దేశాలు మినహా మిగిలిన ముస్లిం దేశాలు భారత్‌ ‌వైఖరిని అర్థం చేసుకున్నాయి. విషయాన్ని మరింత సాగదీయకుండా విజ్ఞతను ప్రదర్శించాయి.

57 దేశాలకు ప్రాతినిథ్యం వహించే ఇస్లామిక్‌ ‌దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌ (ఓఐసీ) నిరసన వ్యక్తంచేసింది. పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహబజ్‌ ‌షరీఫ్‌ ఎప్పటిలాగానే తన వక్రబుద్ధిని చాటుకున్నారు. దీనికి భారత్‌ ‌కూడా దీటుగానే బదులిచ్చింది. తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాలరాస్తున్న పాక్‌ ‌మరో దేశంలోని మైనార్టీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించిన తీరులా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ ‌బాగ్చీ పేర్కొన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ అది భారత అంతర్గత వ్యవహారమని, తాము జోక్యం చేసుకోలేమని విస్పష్టంగా వ్యాఖ్యానించింది. లౌకిక దేశంగా భారత్‌ ‌నిబద్ధత, చిత్తశుద్ధి తిరుగులేనిదని, అక్కడి ప్రభుత్వం అన్ని మతాలనూ ఆదరిస్తోందని, ఈ విషయం ఆచరణలో అనేకసార్లు రుజువైందని పేర్కొంది. పార్టీ నేతల వ్యాఖ్యలకు, ప్రభుత్వానికి మధ్య గల సన్నటి విభజన రేఖను అర్థం చేసుకోవా లని, రెండింటిని ముడిపెట్టి చూడరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ ‌ప్రధాని షేక్‌ ‌హసీనా, విదేశాంగ మంత్రి హసన్‌ ‌మహమ్మద్‌ ‌స్పష్టంగా వ్యాఖ్యానించారు. అయినప్పటికి కొన్ని ఛాందసవాద శక్తులు రాజధాని నగరం ఢాకాలో నిరసన ప్రదర్శ నలు నిర్వహించారు. డచ్‌ ‌చట్టసభ సభ్యుడు గీర్డ్ ‌వైల్డర్‌ ‌నుపూర్‌ ‌శర్మ, జిందాల్‌ను సమర్థించారు. ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. వారి వ్యాఖ్యలతో విభేదించవచ్చు, నిరసనలు వ్యక్తం చేయవచ్చు, కానీ వారిని చంపుతామని బెదిరించడం వంటి ప్రకటనలు చేయడం అనాగరికమని పేర్కొన్నారు. సినీ నటి కంగనా రనౌత్‌ ‌కూడా శర్మకు మద్దతుగా నిలిచారు. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఆమెకుందన్నారు. ఆమె వ్యాఖ్యలతో విభేదించే వారు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని, అంతే తప్ప హతమారుస్తామంటూ ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. ఇది అఫ్ఘానిస్తాన్‌ ‌కాదు. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవా లన్నారు. నవీన్‌జిందాల్‌కు కూడా చంపుతామంటూ బెదిరింపులు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ దైవదూషణ చట్టం తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. మరోపక్క నుపూర్‌శర్మ, జిందాల్‌లకు మద్దతుగా నేపాల్‌లోని కొన్ని హిందూ సంస్థలు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాయి.

మైనార్టీల హక్కులను పరిరక్షించడంలో, వారి విశ్వాసాలను గౌరవించడంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా భారత్‌ ‌ముందున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. భారత్‌ ‌లౌకికవాద దేశం. ముస్లిం దేశాలు తమవి మతపర మైన దేశాలే అని బహిరంగంగా ప్రకటించు కుంటాయి. అనేక పాశ్చాత్య దేశాలు బహిరంగంగా ప్రకటించనప్పటికీ వాటి అధికార మతమేదో అందరికీ తెలిసిందే. ఒక్క భారత్‌ ‌మాత్రమే తమది లౌకికవాద దేశమని ప్రకటించడంతో పాటు మనసా వాచా కర్మణా దానికి అనుగుణంగా వ్యవహరిస్తోంది. ఎవరెన్ని చెప్పినా ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. ఒకటి రెండు చిన్నపాటి సంఘటనలను ఉదాహరణలుగా చూపి యావత్‌ ‌దేశం పరిస్థితి ఇలానే ఉందని భావించడం పూర్తిగా పొరపాటు. భారత్‌లో మైనార్టీల హక్కులకు, వారి విశ్వాసాలకు రాజ్యాంగం పూచీ వహిస్తోంది. వారి హక్కులకు భంగం కలిగితే స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదన్న సంగతి తెలియనిది కాదు. ఇతర దేశాల్లో మైనార్టీల దుస్థితి గురించి చెప్పుకోవాలంటే చేంతాడంత కథ ఉంటుంది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో హిందువుల బాధల గురించి చెప్పనక్కర్లేదు. ఇక అఫ్ఘాన్‌ ‌గురించి సరేసరి. మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింలు, చైనాలోని టిబెట్‌లో ఉయ్‌ ‌ఘర్‌ ‌ముస్లింలు, శ్రీలంకలోని తమిళుల కడగండ్లు, దుస్థితి గురించి ఎంతైనా చెప్పవచ్చు. తెల్లవారి లేచింది మొదలు మానవహక్కుల గురించి ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పే పెద్దన్న అమెరికాలో నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న వివక్ష, దాడుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆక్రమిత కశ్మీరులో ప్రజల హక్కులను పాక్‌ ‌కాలరాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్ ‌పట్ల, అక్కడి ప్రజల పట్ల ఇస్లామాబాద్‌ ‌ప్రదర్శిస్తున్న అణచివేత వైఖరి అంతర్జాతీయ సమాజానికి తెలియనిది కాదు. శ్రీలంకలో తమిళుల వివక్షపై భారత్‌ ఏనాడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. అంతేకాక అక్కడ ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు సైన్యాన్ని పంపిన విషయాన్ని మరచిపోలేం. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ ద్వీప దేశానికి తన వంతుగా మానవీయ కోణంలో సాయం అందిం చడం తాజా పరిణామం. ఈ నేపథ్యంలో భారత్‌లో మైనార్టీలకు ఏదో జరుగుతుందని భావించడం అమాయకత్వం, అవగాహనా రాహిత్యం అవుతుంది తప్ప మరొకటి కాదు. సర్వేజనః సుఖినోభవంతు అన్న ఆర్యోక్తిని పాటిస్తున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారత్‌ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వసుధైక కుటుంబం అన్న భావనను భారత్‌ ‌త్రికరణ శుద్ధిగా పాటిస్తోంది. ఈ విషయం తెలిసీతెలియనట్లు నటించే వారి గురించి ఏం చేయలేం. అయితే వారు చేసే దుష్ప్రచారం గురించి ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజా ఘటనపై అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ముస్లిం సమాజం వాస్తవాలను గ్రహించడం స్వాగతించదగ్గ అంశం.

  • గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌ సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram