జూలై 1 జగన్నాథ రథయాత్ర

‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే’.. (దివ్య రథంపై ఊరేగుతున్న విష్ణువును దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు) అని ఆర్యోక్తి. ప్రపంచ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరీ రథయాత్రకు గల వైభవం మరెక్కడ కనిపించదు. ఈ దృశ్యాన్ని వీక్షించడాన్ని భక్తులు పూర్వజన్మ సుకృతంగా, నేత్రోత్సవంగా భావిస్తారు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు…’ అన్నారు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలేశుని కీర్తిస్తూ. అది పూరీనాథుడికీ అన్వయిస్తుంది. శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవుడిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు ‘అర్హర్త’గా అర్చిస్తారు. శంకర భగవత్పాదులు, భగవద్రామానుజులు తదితర మహనీయులు స్వామిని సేవించి, మఠాలు స్థాపించారు. సిక్కు గురువు గురునానక్‌ ఈ ‌క్షేత్రాన్ని సందర్శించారు. ‘గీత గోవిందం’ ప్రభవించిన పుణ్యస్థలి..

పురుషోత్తమపురిగా పేరొందిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, నీలాచలం, నీలాద్రి, శంఖక్షేత్రం అనే పేర్లూ ఉన్నాయి. ‘పూరీ’ అనే పదానికి ‘పూరించేది’ అర్థం అని చెబుతారు. సోదరి సుభద్ర సమేతంగా బలభద్ర జగన్నాథ మూర్తులు అధిష్ఠించే పీఠాన్ని ‘రత్నపీఠం/శ్రీపీఠం’ అంటారు. జగన్నాథుడిని దారుబ్రహ్మ అంటారు. పెద్దకళ్లు కలిగి, చెవులు,పెదవులు, చేతులు, కాళ్లు లేకుండా చెట్టు కాండానికి పసుపు, కుంకుమ అలంకరించినట్లుండే రూపం. కలపతో రూపొందే మూర్తి కనుక ‘ప్రకృతి దేవుడు’ అనీ వ్యవహరిస్తారు.

పూరీ రథయాత్రకు సంబంధించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బలరామకృష్ణులు తమ మేనమామ కంసవధకు బయలుదేరిన ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ రథయాత్ర నిర్వహిస్తారని ఒక కథనం కాగా, ద్వారకకు వెళ్లాలన్న సోదరి సుభద్ర కోరికను తీర్చేందుకు అన్నదమ్ములు ఇలా పయన మయ్యారని మరో కథ ప్రచారంలో ఉంది. పైగా ఆమె వారికి అపురూప సోదరి. అందుకే కాబోలు, ముందు పెద్దన్న రథం ‘తాళధ్వజం’ నడుస్తుంటే దాని వెనుక సోదరి రథం పద్మధ్వజం’, దానిని చిన్నన్న జగన్నాథ తేరు సు‘భద్రం’గా అనుసరిస్తుంది. మరో కథనం ప్రకారం, జగన్నాథ ఆలయం నిర్మాత, ఇంద్ర ద్యుమ్న మహారాజు భార్య గుడించాదేవి ప్రధానా లయానికి కొంతదూరంలో మందిరం నిర్మించారు. బలభద్ర, సుభద్ర, జగన్నాథులు వార్షిక రథయాత్ర సందర్భంగా ఆ మందిరంలో ఆతిథ్యం తీసుకోవా లన్నది ఆమె అభిమతంగా చెబుతారు. నాటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది. మొత్తం మీద లోకపాలకుడే పాలితలు సముఖానికి వస్తున్నాడు.

ఇతర క్షేత్రాలలో ఊరేగింపుసేవలో ఏటా ఒకే రథాన్ని ఉపయోగించడం, దేవదేవేరులను అందు లోనే ఆశీనులను చేయడం సాధారణం. కానీ పూరీలో అందుకు భిన్నంగా ఏటికేడాది విడివిడిగా కొత్త రథాలు చేయిస్తారు. పూరీ సంస్థానాధీశుడి ఆనతి ప్రకారం బలరామ,సుభద్ర, జగన్నాథ రథాల తయారీ పక్రియ వైశాఖ బహుళ విదియ నాడు మొదలై ఆషాఢ శుక్ల పాడ్యమి నాటికి పూర్తవుతుంది. తయారీకి ఎంపిక చేసిన వృక్షాలను 1072 ముక్కలుగా చేసి వాటిని రథాల తయారీకి అనువుగా వాటిని తిరిగి 2188 ఖండాలుగా చేసి బలరామ రథం తయారీకి 763 భాగాలు, సుభద్ర రథానికి 593, జగన్నాథరథం నిర్మాణానికి 832 వృక్ష కాండలను వినియోగిస్తారు.

మూడు విగ్రహాలను రథాలపై ఆశీనులను చేసే వేడుకను ‘పహాండీ’ అంటారు. ఈ విగ్రహాలను సవరతెగ రాజు విశ్వావసు వారసులు మాత్రమే రథాలపైకి చేరుస్తారు. విశ్వావసు రాజు ఇంద్య్రుమ్న మహారాజుకు ముందే జగన్నాథుడిని నీలమాధవ స్వామి రూపంలో అర్చించాడని ఐతిహ్యం.

రథయాత్ర ఆరంభానికి ముందు పూరీ సంస్థానా ధీశులు బంగారు చీపురుతో స్వామి ముంగిట శుభ్ర పరచడం (చెరా పహారా) ‘కోటికి పడగెత్తిన ధనవం తుడు నీ గుడి ముంగిట సామాన్యుడు’ అన్న కవివాక్కు నిజమనిపిస్తుంది. ఈ పక్రియ అనంతరం జగన్నాథ రథం మీద ఉండే ప్రధాన పండాల అనుమతి మేరకు కస్తూరి హారతి ఇచ్చి ‘జై జగన్నాథా…’ అంటూ పెద్ద పెట్టున నినదిస్తూ రథం తాళ్లు లాగుతారు.రథం కదిలే సమయంలో శంఖారావం, ఘంటారావం చేస్తారు. తేరు పురోగమించడమే తప్ప తిరోగమనం ఉండదు. ఆ విశిష్టతనే మహకవి శ్రీశ్రీ ‘వస్తున్నాయ్‌ ‌వస్తున్నాయ్‌ ‌జగన్నాథ చక్రాలొస్తున్నాయ్‌’ అని ఉపమానంగా కవిత అల్లి ఉంటారని విశ్లేషకులు అంటారు. ప్రధాన ఆలయం వద్ద ప్రారంభమయ్యే రథయాత్ర మూడు మైళ్ల దూరంలోని ‘గుడించా’ ఆలయానికి చేరు కుంటుంది. వారం రోజుల పాటు అక్కడే విడిది చేసిన తరువాత రథయాత్ర దశమి నాడు ప్రధాన ఆలయానికి తిరుగు ప్రయాణమవుతుంది. ఆ మరునాడు స్వామి వారిని బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీక్షేత్రం విశిష్టతలు

మానవళి వరప్రసాదంగా ఆధ్యాత్మిక వేత్తలు అభివర్ణించే ఈ క్షేత్రం మహిమలకు, రహస్యాలకు నిలయంగా చెబుతారు. ఆలయ శిఖరంపై ‘పతిత పావన’ పతాకాన్ని ప్రతి నిత్యం మారుస్తారు. ఎర్రని గుర్తుతో గల ఈ పతాకం గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంటుంది. గోపురంపై నీలచక్రాన్ని (సుదర్శనం) ఎటునుంచి చూచినా అది మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. గోపురంపై పక్షి సంచారం కనిపించదు. సూర్యోదయాస్తమాల సమయంలో ఆలయం గోపురం నీడ కనిపించకపోవడం మరో విశేషం. పగటివేళ సముద్రంపై నుంచి భూమికి, సాయంత్రాలు భూమి నుంచి సముద్రానికి గాలి వీచడం సహజం కాగా, జగన్నాథ క్షేత్రంలో వాతా వరణం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్నా ఆలయం లోపలికి సాగరఘోష వినిపించదు.

మూలవిరాట్‌ ఆలయంలో ఉంటే ఉత్సవ మూర్తులు తిరువీధులకు వెళ్లడం ఇతర క్షేత్రాల సంప్రదాయం కాగా, మూలమూర్తులనే ఊరే గించడం ఈ క్షేత్రంలో అసాధారణాంశం. ఇతర క్షేత్రాలలో తిరువీధులకు వెళ్లిన దేవదేవేరులు వెంటనే ఆలయానికి చేరుకుంటే, సోదరి, సోదరద్వయం రోజుల తరబడి ఆలయం వెలుపల ‘గుడించా’ అతిథి గృహం’లో సేదదీరడం మరో ప్రత్యేకత.

స్వామికి వివిధ రకాల ఆభరణాలతో నిత్యోత్సవం నిర్వహించినా, ఏటా నాలుగు సందర్భాలలో మాత్రమే నిండుగా ఆభరణాలు అలంకరిస్తారు. రథయాత్ర (ఆషాఢ శుక్ల విదియ), విజయదశమి, కార్తిక పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున నగలు అలంకరిస్తారు. దానిని ‘సునావేష’ అంటారు.

ప్రసాదం విశిష్టత

శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యా దులు ముగించుకుని, బదరీనాథ్‌లో అల్పాహారం, పూరీలో భోజనం చేసి ద్వారకలో విశ్రమిస్తారని ప్రతీతి. పూరీనాథుడు అలంకారాల కంటే భోజన ప్రియుడు. ఆయనకు వివిధ భోగాల పేరుతో రోజుకు 64 రకాల పిండి ప్రసాదాలు తయారుచేస్తారు. అందుకు మట్టి కుండలు (మృణ్మయపాత్ర) వాడ తారు. ఒకసారి ఉపయోగించిన మృణ్మయ పాత్రను మరోసారి వాడరు. ఒకదానిపై ఒకటిగా ఏడింటిని అమర్చి కట్టెల పొయ్యిపైనే ప్రసాదాలు తయారు చేస్తారు. స్వామి వారికి నివేదనకు ముందు సీదాసాదాగా ఉంటే ప్రసాదం, ఆరగింపు తరువాత సువాసన భరితంగా ఉండడం విశేషం. లక్ష్మీదేవి స్వయంగా వంటకాలను పర్యవేక్షిస్తారని భక్తుల విశ్వాసం. ఒకేసారి లక్షమందికి వంట సిద్ధం చేయగల వంటశాల ఇది. ఆంగ్లేయులు దీనిని ‘వరల్డస్ ‌బిగ్గెస్ట్ ‌హోటల్‌’‌గా అభివర్ణించారు.

స్వామికి నివేదించే అన్న ప్రసాదాన్ని ‘ఒబడా’ అంటారు. దీనితో పాటు‘శుష్క’ ప్రసాదాన్ని చేస్తారు. దైవదర్శనానికి వచ్చే వారు అక్కడ స్వీకరించేది ‘అన్న ప్రసాదం’కాగా, ఇళ్ల వద్ద ఉన్న వారికి తీసుకువెళ్లేది శుష్క ప్రసాదం. దీనిని వితరణ చేసే ప్రదేశాన్ని ‘ఆనంద్‌ ‌బజార్‌’ అం‌టారు. పండాలు (అర్చకులు) స్వామి వారికి నివేదించిన ప్రసాద పాత్రలను అక్కడ ఉంచగానే భక్తులు తమకు కావలసిన దానిని స్వయంగా స్వీకరిస్తారు. అన్నం, పప్పు పదార్థాల పక్కనే విశాలమైన మూతిగల పాత్రలో మజ్జిగ ఉంటుంది. మహా ప్రసాద స్వీకరణలో అంటూ సొంటూ, ‘ఎంగిలి’ ప్రసక్తే ఉండదు. ‘సర్వం జగన్నాథం’ మాట అలానే పుట్టిందంటారు. కాగా, ఇదే పదబంధానికి, జగన్నాథుడు సర్వవ్యాపి నారాయణుడని, సృష్టి సర్వం ఆయనే అని, అందుకే సర్వం జగన్నాథం అనీ వ్యాఖ్యానం చెబుతారు.

ఆశ్రిత పక్షపాతి

ఈ క్షేత్రంలో మడి, శుచి లాంటి నియమ రహితంగా అర్చనాదులు సాగుతుండగా, శ్రీరంగాది దివ్యక్షేత్రాల మాదిరిగానే ఆళ్వార్ల సహితంగా, దివ్యప్రబంధ అనుసంధానంతో అర్చనోత్సవాలు నిర్వహించాలని భగవద్రామానుజులు భావించారట. అయితే, ఆ ప్రతిపాదన నచ్చని స్థానిక అర్చకులు (పండాలు) స్వామి వారికి తమ అసమ్మతిని నివే దిస్తూ, ‘అనాదిగా వస్తున్న పూజా విధానాన్నే కొనసా గించాలి. లేని పక్షంలో ప్రాణత్యాగమే శరణ్యం’ అని మొరపెట్టుకున్నారట. జగన్నాథుని సేవించి, ఆత్మాను సంధానం తరువాత విశ్రమించిన రామానుజులకు స్వామి స్వప్న సాక్షాత్కారం చేసి, అర్చకుల మనో గతాన్ని వివరించారట.

‘పతితులైన వారిని, ఆచార భ్రష్టులను సయితం ఉద్ధరించబూని అవతరించిన పుణ్యక్షేత్రం పూరీ. ఇక్కడి పండాలు (పూజారులు) తమ సంప్రదాయ బద్ధమైన పూజాది కాలు నిర్వర్తిస్తు న్నారు. శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో అర్చనాది సేవా విధానం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ప్రస్తుత విధా నాన్నే కొనసాగ•నివ్వు’ అని ఆదేశించారట. అంతేకాదు. రామానుజులను ఇంకా పూరీలోనే ఉండనిస్తే తన సంకల్పాన్ని నెర వేర్చక మానుకోడన్న భావనతో స్వామి యోగ మాయతో ఆయనను శ్రీకూర్మ క్షేత్రానికి తరలించాడని కథనం.

‘జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే’

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram