– డా।। గోపరాజు నారాయణరావు

నెగళ్లు మండుతున్నాయి. వాటి కేసి చూస్తు న్నాడు లింగేటి మూగయ్య. నిశ్శబ్దంగా ఉందంతా. ఓ నెగడుకు కొంచెం దూరంలో కూర్చుని చలి కాచుకుంటున్నాడు ఒక్కడే. నిద్ర ముంచుకొస్తోంది. అయినా కూర్చునే ఉన్నాడు. శనోరం గ్రామం నుంచి వచ్చిన గంగపూజారి సోమినాయుడు, కిముడు కంటందొర వాళ్ల గుడిసెలోకి వచ్చి పడుకోమన్నారు. గట్టిగా చెబితే గడచిన రాత్రి పడుకున్నాడు. వాళ్లు గొంగళ్ల కింద పడుకుంటారు. తను గోనె గుడ్డ కప్పుకుంటాడు. చిన్నతనంగా ఉంది తనకి. అప్పుడే ఓ నెగడులో ఏదో కట్టె చిన్నగా పేలింది. ఒక్కసారిగా వందల నెరుసులు వ్యాపించాయి అక్కడంతా. కొన్ని తళుక్కున మెరిసి వెంటనే మాయమవుతున్నాయి. కొన్ని లిప్తలకాలం తళుక్కుముంటున్నాయి. వాటిలోదే ఓ పెద్ద నెరుసు ఆకాశంలోకి లేచింది. గిరికీలు కొడుతూ లోయ మీదకు వెళుతోంది. దానినే ఆందోళనగా వెంటాడాయి మూగయ్య రెండు కళ్లు.

ఆ నెరుసు పోయి ఎండుటాకుల మీద పడితే అవి మండుతాయి. అడవే అంటుకుంటది. చాలా సేపు ఆ నెరుసు వెళ్లిన వైపే చూశాడు. నెమ్మదిగా లేచి లోయవైపు అడుగులు వేశాడు. చీకటి లోయ.

కానీ ఎంత చిన్న మంటయినా కనిపిస్తుంది. అందుకే కొంతసేపు అలాగే చూశాడు. నెరుసు మాయమైంది కానీ, లింగయ్య గుండెలోని ఒక జ్ఞాపకం మాత్రం కార్చిచ్చులా వెలిగింది. అప్పుడు అతడికి పాతికేళ్లు. వాళ్ల ఊరు వీరముష్టిపాలానికి క్రోసు దూరం (రెండు మైళ్లు) లోనే ఆ ఉదయం అడవిలో కార్చిచ్చు కనిపించింది. సాయంత్రం వీరముష్టిపాలెంలో టముకు మోగింది. మంటలు ఆర్పడానికి అంతా రావాలి, ఆడామగా. అడవి అంటుకుంటే ఆర్పే బాధ్యత అడవి బిడ్డల మీదే పెట్టేవారు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. టముకు వేసినా రాకపోతే చావగొట్టి తీసుకుపోయేవారు. తీసుకెళ్లే బాధ్యత మునసబు మీద పెట్టేవారు. ఆడవాళ్లంతా దగ్గరలోనే ఒక ఏరో, జలపాతమో చూసుకుని కుండలతో నీళ్లు తెచ్చి అందిస్తూ ఉంటే మగవారంతా ప్రాణాలకి తెగించి మంటలు ఆర్పాలి. అడవి అంటుకుంటే ఎలా ఉంటుందో మూగయ్య చూడడం అదే మొదటిసారి, అదే చివరిసారి. మని షెత్తు మంటల దగ్గరకి వెళ్లి పోరాడారంతా. వేడి.. వేడి.. వేడికి కందిపోయిన ముఖాలు ఆ కాంతిలో ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఎండి పోయింది కాబోలు ఆ మహావృక్షం. దాని చిటారు కొమ్మకి కూడా వెళ్లిపోయింది అగ్ని. ఒక జ్వాల ఆకాశంలో మండుతోంది. కాలుతున్న దాని కొమ్మలు ఒక్కొక్కటి రాలి ఎక్కడెక్కడో పడుతున్నాయి. అక్కడకల్లా పరుగెత్తి విస్తరించకుండా ఆర్పుతున్నారు కొందరు. కనుచూపు మేర జ్వాలే. పచ్చదనం మీద కన్నెర్ర చేసినట్టే. ఎటు గాలి వీస్తే అటు చాచుకుంటూ ఉంటాయి మంటలు. అదేమిటో పచ్చని చెట్లు కూడా కాలిపోతూ ఉంటాయి. ఇక ఎప్పుడో కూలిన చెట్లు, ఎండుటాకులు జ్వాలలని ఆహ్వానిస్తున్నట్టే ఉంటుంది. కుడిదిక్కుకు పోతున్నదనుకుంటే, హఠాత్తుగా దిశ మార్చేసుకుని దక్షిణానికి పాకుతుంది జ్వాల. ఎంత వేగమో అందులో. కొన్ని వందల మందిని పోగు చేశారు. అన్ని దిశలలోను కాపు వేశారు. కుండలతో నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఈ మంటలకి భయంతో ఆ చీకట్లోనే ఎగిరే పక్షుల అరుపులు ఒకవైపు. జంతువుల అరుపులు మరొకవైపు. తన తల్లి, తండ్రితో, అన్న య్యతో పాటు వచ్చాడు మూగయ్య. తల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత పడింది. ఎవరెవరో ఆడవాళ్లు నీళ్లు అందిస్తు న్నారు. కార్చిచ్చు వెలుగు, కాగడాల వెలుగులో ఆర్పేపని జరుగుతోంది. అటువైపు.. ఇటువైపు.. కాదు ఎగువన.. వెళ్లండి.. ఆర్పండి.. అంటూ పోలీసులు, ఫారెస్టు అధికారులు కొండవాళ్లని కొట్టినంత పని చేస్తూ పురమాయిస్తున్నారు. మండుతున్న అంత పెద్ద చెట్టు హఠాత్తుగా లోయకి అడ్డంగా పడిపోయింది.

అయినా, మరుక్షణంలో తేరుకుని కొండవాళ్లని పరుగులెత్తించే పని మొదలు పెట్టారు. ‘ఓలమ్మో జుట్టు కాలిపోయింది’ ఎవరో మహిళ ఆర్తనాదం. నిప్పురవ్వలు తల మీద, ముఖం మీద, భుజాల మీద నిరంతరం కురుస్తూనే ఉన్నాయి. వాటి తప్పించు కోవడం సాధ్యం కావడం లేదు. ఏదో మూల నుంచి ఓ ఆర్తనాదం వినిపిస్తూనే ఉంది. తెల్లవారుతున్నట్టు తూర్పు కొండలలో సూర్యుడు బయటకు వచ్చాడు. అదొక కాంతుల వింత సమ్మేళనం. అటు సూర్యోదయం, ఇటు కార్చిచ్చు వెలుగు. ఇప్పుడు దారులు కనిపించి ఆర్పే పని వేగవంతమయింది. మధ్యాహ్నానికి మంటలు ఆరాయి.

గ్రామాల మునసబులు, పెద్దలు ముఖాముఖాలు చూసుకున్నారు. పోలీసుల దగ్గరకీ, ఫారెస్టు అధికారుల దగ్గరకి వెళ్లి నిలబడ్డారు. ‘‘బాగా చేశారా, ఎల్లండి! రాత్రి కూడా ఒన్నం లేదు. తొందరగెల్లి వండుకు తిని పడుకోండి !’’ మెచ్చుకోలుగా అన్నాడు ఓ పోలీసు. అంతా ఉస్సూరంటూ బయలుదేరారు,

గాయాలు చూసుకుంటూ. ‘‘అమ్మా! అడవితల్లి! నువ్వు మా కోసమైనా పచ్చగానే ఉండు తల్లి!’’ ఎవరో కొండ మహిళ చేతులెత్తి అడవికి దండం పెడుతోంది. మంటలార్పే పనికి కూలి ఇవ్వరు. ఒళ్లు కాలినా దిక్కుండదు. పసర్లు, ఆకులు వేసి కట్లు కట్టుకోవడమే. ఆ దృశ్యం గుర్తు కొచ్చిన తరువాత మూగయ్యకి మంటల మధ్య నిలబడినట్టే అనిపించింది. కానీ, అక్కడంతా దారుణంగా ఉంది చలి.

——————

చేతిలో ఉన్న కట్టెని దగ్గరగా ఉన్న ఆ నెగడులో పడేలా విసిరి హఠాత్తుగా మొదలుపెట్టాడు రామన్న కథ. తురతురమంటూ ఆకాశంలోకి లేచిన నిప్పు రవ్వలని మురిపెంగా చూస్తూనే. ‘బండపల్లిలో పెద్ద తమ్మనదొ, భూపతిపాలెంలో చిన్న తమ్మనదొర, కుట్రవాడలో సర్దార్‌ ‌పులికంట సాంబయ్య. బోడలూ రులో అంబులెడి, లాగరాయిలో ద్వారబంధాల చంద్రయ్య, ఇక్కడ భూపతిపాలెం తమ్మనదొరతో పాటే లాగరాయి దగ్గర ద్వారబంధాల చంద్రయ్య పితూరీ లేవదీశాడు.’’ చంద్రయ్య పేరు వినడమే కానీ అతడి కతేమిటో అక్కడున్న చాలా మందికి తెలియదు. అందుకే ఊపిరి బిగపట్టి మరీ వింటు న్నారు. వాళ్లంతా ఒకరి తర్వాత ఒకళ్లు పోలీసోళ్ల మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఈ గొడవలన్నీ చూశాక మామూలు పోలీసులు కాదు, ఏకంగా సైన్యాన్ని రప్పించడానికి ప్రయత్నాలు మొదలైనాయి. అంతలో కృష్ణా , విశాఖ జిల్లాల నుంచి పోలీసుల బలగాలు తేవాలని నిర్ణయించారు. చాలా దూరం నుంచి పోలీసులొచ్చారు. అడివంతా చూపించడానికి పిఠాపురం సంస్థానం నుంచి ఐదొందల మందిని దింపారు. అష్టకష్టాలు పడి, ప్రజలను హింసించి మొత్తానికి పితూరీదార్ల ఆచూకీ పట్టుకున్నారు. వరసగా దొరికిపోయారు పితూరీదార్లు. ఒకడు దొర కడం, నాలుగు పేర్లు చెప్పడం… ఇలాగై పోయింది.

ముందు చంద్రయ్య అనుచరులు దొరికి పోయారు. ఒక నెలకే సాంబయ్యని పట్టుకున్నారు. ద్వారబంధాల చంద్రయ్య దుచ్చెర్తి ముఠాలో ఒక భూస్వామి. పేరున్నోడు. అప్పడు దుచ్చెర్తి ముఠాదారు చెక్కా వెంకం దొర. ఆయన చంద్రయ్యకి ఆసరాగా ఉండేవాడు.

కానీ అది రహస్యం. చంద్రయ్య లాగరాయి నుంచి తిరుగుబాటు చేశాడు. రంప దగ్గరే యాళ్లగూరి జగ్గయ్య అనే గొప్ప వేటగాడిని తన తిరుగుబాటులో కలుపుకున్నాడు చంద్రయ్య. ఈ పితూరీ గట్టెక్కితే మూడు గ్రామాలు ఈనాంగా ఇస్తానని జగ్గయ్యకు హామీ ఇచ్చాడు చంద్రయ్య. తర్వాత జంపా పండయ్య అనే బందిపోటుని కూడా తన బలంగంలో చేర్చు కున్నాడాయన. అంతే, తెల్లోళ్లకి సాకు దొరికింది. పండయ్య నీ మనిషి కాబట్టి నువ్వు కూడా బంది పోటువే అన్నారు. చంద్రయ్య లేని సమయం చూసి అతడి ఇంటిని పోలీసులు సోదా చేశారు. చంద్రయ్యకి చాలా కోపం వచ్చింది. రెండు వందల మందిని తీసుకుని వెళ్లి అడ్డతీగల పోలీటేషన్‌కే నిప్పు పెట్టాడు. తరువాత చిన్న తమ్మనదొరతో చంద్రయ్యకి మాట కలిసింది. ఆ ఇద్దరి బలగాలు కలసిపోయాయి.

కొండోళ్ల తిరుగుబాటుకి శాపం కదా! ఒకసారి చంద్రయ్య రేకపల్లి వెళ్లాడు. తిరిగొస్తంటే చని పోయాడు. చచ్చిపోలేదు. చంపేశారు. ఎవరో కాదు, బందిపోటు పండయ్యే. చంద్రయ్య చనిపోయినా వేటగాడు జగ్గయ్య మాత్రం తిరుగుబాటు ఆపలేదు. పైగా చంద్రయ్యకు మరణం లేదనీ, ఆయన త్వరలోనే మన్యానికి తిరిగి వస్తాడని ప్రచారం చేశాడు. ఐదొందల మంది దండుతో వెళ్లి పాడేరు పోలీట్టేషను కొట్టాడు. ఇంక పోలీసులు తోడేళ్లలా వేటాడడం మొదలుపెట్టారు. జడ్డంగి పారిపోతే, అక్కడ ఓ తెల్లోడు కాల్చి చంపాడు.’’ అంతా చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు రామన్న.

——————

నిరుడు వచ్చినప్పుడు బాస్టియన్‌ ‌బాధితుల గురించి విని, వాళ్ల దుస్థితి గురించి రాసుకున్నారు డాక్టర్‌ ‌మూర్తి. అప్పుడు చింతపల్లి పరిసరాలలో అవన్నీ జరిగాయి. కొంచెం దూరం. ఇప్పుడు ఆయన బస చేసిన లంబసింగి అతిథి గృహానికి దగ్గరగానే బాధితులు ఉన్నారు. అందుకే రోడ్డు సంగతులు ఒక్కొక్కటీ వింటున్న డాక్టర్‌ ‌మూర్తికి మనసు నిలవ లేదు. ఒక్కసారి అక్కడికి వెళ్లి అవసరమైతే ఏమైనా మందులు ఇవ్వాలని అనిపించింది. గెస్ట్‌హౌస్‌ ‌నుంచి బయలుదేరి ఇద్దరు సహాయకులతో రోడ్డు పని జరుగుతున్న లంబసింగి, చిట్రాళ్ల గొప్పు మధ్య ఉన్న ఆ ప్రదేశం దగ్గరకు వచ్చారు డాక్టర్‌ ‌మూర్తి. కొద్ది దూరంలో ఉండగానే పాట వినిపించింది –

‘‘ఒడ్డు ఒడ్డు కొండల కాడు…’’ ఎవరిదో బలమైన గళం.

‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు…’’ అనేక గొంతులు అన్నాయి ముక్తకంఠంతో.

‘‘లోపలి లంకల నట్టనడుము.’’ మొదటి గొంతు.

‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు …’’ ఆ గొంతులే- ఒకేసారి లేస్తున్నాయి, ఒకేసారి ఆగిపోతున్నాయి.

దగ్గరకు పోయే కొద్దీ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అది ‘ఆవూ పులీ’ కథ. పాటగా పాడుతున్నారు.

‘‘పాలుపట్టి వత్తునయ్యా…..!’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు ….’’ ‘‘ననిలబడి ఆగ్గిబాసలు….’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు ….’’

‘‘నీటిని నిలబడి నీటి బాసలు’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు …’’

‘‘ఇందే ఉండవో వాయుమొకం’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు….’’

‘‘తల్లిలేని బాలవు కొడక’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు …..’’

‘‘గంగ వొడ్డున గడ్డే మేయు తల్లిలేని బాలవు కొడకా..’’ – ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు ……..’’

‘‘కొండకింద కొనలే మేయు తల్లిలేని బాలవు కొడకా….’’ ‘‘జంబయ్‌ ‌జో జోదులంగరు …….’’

పల్లంగా ఉంది, ఆ ప్రాంతం. అరఫర్లాంగు దూరం. దాని మీద రోడ్డు నిర్మిస్తున్నారు. తెల్ల బట్టల్లో ఉన్న డాక్టర్‌ ఎవరో తెలియక వింతగా చూస్తున్నారు గిరిజనులు. వాళ్లకి తెలియకుండానే పాటలో వేగం తగ్గింది. పనిలో కూడా వేగం తగ్గింది.

సంతానం పిళ్లై మొదట గమనించాడు డాక్టర్‌ ‌మూర్తిని. గబగబా ఎదురు వెళ్లి ‘‘వణక్కం!’’ అంటూ రెండు చేతులూ కట్టుకుని నిలబడ్డాడు. ‘‘బాస్టియన్‌ ‌దొరగారు ఎక్కడ?’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘‘దొరవారు నర్సీపట్నం పూసినారు.. రేపటికల్లా వస్తరు..’’ అన్నాడు అతి వినయంతో, తమిళ యాసతో. ‘‘నేను వీళ్లకి వైద్య పరీక్షలు చేయాలి. కొద్దిసేపు పంపుతారా? ’’ అన్నారు మూర్తి. ‘‘ఇల్లే సారు! బాస్టియన్‌ ‌దొర లేకుండా ఇక్కడికి ఎవరు వచ్చినా ఆయనకి రొంబ కోపం వచ్చి పూడుస్తుంది!’’ అన్నాడు పిళ్లై • భయం నటిస్తూ. అయినా ఒక అడుగు ముందుకు వేశారు డాక్టర్‌ ‌మూర్తి. ‘‘సారు సారు… మా ఉద్యోగాలు ఊడి పూడుస్తాయి…!’’ అన్నాడు పిళ్లై దాదాపు అడ్డం పడుతూ. ‘‘సరే, బాస్టియతోనే మాట్లాడతాను…’’ అనేసి విసవిసా వెనక్కి వెళ్లి పోయారు డాక్టర్‌ ‌మూర్తి. దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న కిష్టయ్యకి అప్పుడు గాని హైరానా తగ్గలేదు. అప్పుడే అక్కడికి వచ్చాడు మూగయ్య. ‘‘బాబూ కిష్టయ్య! నా గొంగడి ఇచ్చివా..! ’’ దాదాపు ఏడుస్తూ అన్నాడు. ‘‘అబ్బబ్బ..!’’ అంటూ సాచి లెంపకాయ కొట్టాడు కిష్టయ్య. ‘‘నేను ఇచ్చినప్పుడు తీస్కో. లేకపోతే అన్నీ మూస్కుని పని చేస్కో. పదే పదే ఇసిగించావంటే చంపి పాతరేసేస్తాను ముసిలి నాకొడకా!’’ అంటూ పెద్ద పెద్ద అంగలతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూగయ్య బాధను దిగమింగుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లిపోయాడు.

——————-

గెస్ట్‌హౌస్‌కి తిరిగి వచ్చేశారు డాక్టర్‌ ‌మూర్తి. ఆ వనవాసులని ఎవరూ కలుసుకోకుండా బాస్టియన్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన ఊహించ లేదు. అందుకే ఇంకొక చోటికి వెళ్లే పని పెట్టు కోకుండా చిట్రాళ్ల గొప్పుకే వెళ్లారు. నూట ముప్పయ్‌ ‌మంది వరకు ఉన్నారు కాబట్టి, కొంత సమయం కూడా పడుతుంది. మనసంతా చికాకుగా ఉంది. పోనీ బాస్టియన్‌ ‌పాత బాధితులను కలుసుకున్నా ప్రయోజనం ఉండేదని అనిపిస్తోంది. ఎందుకో పరదేశి ఉదంతం గుర్తుకు వచ్చింది డాక్టర్‌ ‌మూర్తికి. ఎదురుగా కనిపిస్తోంది డైరీ. అప్రయత్నంగా చేతిలోకి తీసుకున్నారు. పేజీ తరువాత పేజీ చదువుకుంటూ వెళ్లారు.

గూడెం, 23-2-1921

డియర్‌ ‌మన్యం డైరీ

గూడెం కొత్తవీధి సంతకి వచ్చి కలమని కబురు చేస్తే వచ్చాడతడు. దాదాపు సంవత్సరం తరువాత మళ్లీ నిన్ననే చూశాను.

క్రితంసారి చింతపల్లిలో కలిశాడు. చేతికర్ర ఉన్నా, అతడి ఊరివాడే మరో కుర్రాడు నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువచ్చాడు. ఊరి పేరు పల్ట. పేరు పరదేశి. ఎడం మోకాలు వాపు కొంచెం తగ్గినట్టే ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు ఇంత లావున వాచి ఉంది. ఒళ్లంతా దెబ్బలే. గెడ్డం కింద, ఎడం జబ్బ మీద మానుతున్న గాయాలు. మోకాలు మాత్రం కందగడ్డలా ఉంది. ఆ గాయాలన్నీ బాస్టియన్‌ ‌కార ణంగా అయినవే. ఏమైందని అడిగాను. ఎలుగుబంటి తరుముకొస్తే పడిపోయానని చెప్పాడు. ఆ గాయాలు అందుకు సంబంధించినవి కావని తెలుస్తూనే ఉంది. నిజం చెప్పవయ్యా ఫర్వాలేదు. నేను డాక్టర్ని కదా అని రెండుసార్లు అనునయంగా మాట్లాడేసరికి బావురుమన్నాడు పాపం.. పరదేశి.- రోడ్డు పనికి వెళ్లకుండా తప్పించుకున్నందుకు బాస్టియన్‌, ఓవర్సీ యర్‌ ‌సంతానం, బంట్రోతు కిష్టయ్య కలిసి చేసిన దాడి ఫలితమే ఆ గాయాలు. అడవి జంతువులకు మించిన క్రూరత్వం ఆ గాయాల్లో కనిపిస్తోంది. రోడ్డు పనినుంచి తప్పించుకుంటూ చాలాకాలం గడిపినా, ఒకసారి హఠాత్తుగా కొండసంతలో దొరికిపోయాడట పరదేశి. ఇలాంటి వాళ్ల కోసమే మాటు వేశారట అక్కడ ఆ ముగ్గురు. కొండ సంతలో పరదేశి మీద జరిగిన దాడి గురించి, అతడిని తీసుకొచ్చిన ఆ కుర్రాడే వర్ణించి చెప్పాడు.‘ఒరేయ్‌ ‌పరదేశి ఆగరా! బాస్టియన్‌ ‌దొర పిలుస్తున్నాడు ఇట్రా’ అంటూనే జుట్టు పట్టుకుని లాక్కుపోయాడట ద్వారం కిష్టయ్య. కొండసంత గ్రామంలో సంత రోజు వచ్చిన పోలీ సులు, అధికారులు కూర్చోవడానికి కట్టిన చిన్న పాక దగ్గరకి తీసుకువెళ్లాడు. అప్పుడే గుర్రం ఎక్కికూర్చు న్నాడు బాస్టియన్‌. ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. తీసికెళ్లి అతడి ముందు నిలబెట్టారు పరదేశిని. అక్కడ నుంచి మొదలైంది హింస. గుర్రం మీద నుంచే బూటుకాలితో బలం కొద్దీ తన్నాడు బాస్టియన్‌. ‌కళ్లు బైర్లు కమ్మాయి పరదేశికి. అంతలోనే మరో బూటు కాలితో పిరుదుల మీద తన్నాడు సంతానం పిళ్లై. ఆ దగ్గరగా ఉన్న దుకాణాల దగ్గరనుంచి కొండ వాళ్లంతా పారిపోతున్నారు ఈ ఉదంతంతో. అవే బూతులు, అటు ఏడు తరాల ఆడవాళ్ల, ఇటు ఏడు తరాల ఆడవాళ్ల మానాలని భంగపరుస్తున్నాడు బాస్టి యన్‌. ‘ఎక్కడికి పారిపోతావ్‌ ‌రా! నీయమ్మా… రోడ్డు పనికి రాకుండా తప్పించుకుంటావురా! ఇప్పుడు తప్పించుకో… నా కొడకా!’ బాస్టియన్‌ ‌గుర్రాన్ని కొట్టే కమ్చీతో కొడుతూనే ఉన్నాడు. ఈ సంతానం పిళ్లై బూటు చుట్టూ ఉన్న రేకు ఊడిపోయి దాని మేకులు మాత్రం కొద్దికొద్దిగా బయటకి వచ్చి ఉన్నాయి. అతడు తన్నుతుంటే శరీరం చీలుకుపోతోంది.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram