– పోతుబరి వెంకట రమణ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘అయ్యో! బంగారూ! జీవి తంలో ఏం అనుభవించావని? నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండని నీకు ఇన్ని కష్టాలా? ఆడి చేతులు పడిపోనూ! పువ్వులాంటి నిన్ను కొట్టడానికి ఆడికి చేతులు ఎలా వచ్చాయి?

– ‘పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ‘చేతిలో చెయ్యేసి నీ చేతిని అందుకున్నాడే! మరి ఇదేనా పువ్వుల్లో పెట్టి చూసుకోవటం అంటే?

వాడు మనిషా? పిశాచా? నిలువెల్లా విషం. మనసెల్లా అనుమానం. అలాంటివాళ్ళు ‘వాళ్లు సుఖపడరు, ఎదుటి వాళ్ళను సుఖపడనివ్వరు.’ పువ్వును పుట్టించిన చోటే ముళ్లనూ పుట్టించాడు వాటికి రక్షణగా ఆ భగవంతుడు.

కానీ ఇదేటి? పువ్వుని కాపాడాల్సిన ముళ్లే ఇపుడు పువ్వుని గుచ్చిగుచ్చి చంపుతుంటే…. ఇంక దానికి రక్షణ ఎవరు?

సృష్టికర్త ముచ్చట పడి- మల్లెలు మందారాలు, సంపెంగలు, సన్నజాజులు, గులాబీలు, కనకాంబ రాలు, బంతులు, చేమంతులనుఒకచోట రాశిగా పోసి ముద్దచేసి నిన్ను సృష్టించాడేమో మరి! ఎలా ఉండేదానివి? అందానికి ప్రతిరూపంలా మెరిసిపోయే దానివి కదూ! నీ చెంపలపై తారాడుతున్న ఆ నీలిముంగురులు నీ చుబుకంలోని మృదుత్వాన్ని గ్రోలి ఆనందంతో ఎలా ఎగిరిపడుతున్నాయో చూడు!

ఆ అలవిమాలిన అందమే నీతో ఆడుకొందేమో?

అదిసరే గానీ ‘సంపెంగ రేకుకు మసిపూసినట్లు నీ కళ్లక్రింద ఆ నల్లని చారలేంటి? నీ మనసులోని చీకటి కళ్లక్రింద దాక్కుందా?

జీవితం గురించి ఎన్ని కలలు కన్నావు?అన్నీ కళ్లముందే ‘ఇసుక లోని పాదముద్రల్లా’ మాయమైపోయాయి.

ఒక చిన్న పొరపాటు.. ఒక చిన్న తొందర పాటు..నీ కలలన్నిటినీ ఛిద్రం చేసేసి నిన్నో ‘శిథి•ల స్వప్నం’లా ఇలా నిలబెట్టింది. నువ్వే కాదు… నీలాగ ఎందరో… వధ్యశిలపై…. ఏ విద్యాలయం కూడా.. ‘ఇలా చేస్తే ఇలా జరుగుతుంది’ అని పాఠాలు చెప్పలేదు కదా! అవును! జీవితపాఠాలు నేర్పేది జీవితమే!

అందరూ అంటుంటారు ‘కాలం మారింది’అని. కానీ కాదు..మారింది కాలం కాదు… మనుషులే.. ఒకప్పుడు ఇళ్లు ఇరుకుగా ఉన్నా మనసులు విశా లంగా ఉండేవి. ఇప్పుడు ఇళ్లు విశాలమై మనసులు ఇరుకు అయిపోయాయి.

సాటి మనిషికి సాయం చేయడం నాటి లక్షణం. తోటి మనిషిని కూల దోయటం నేటి లక్షణం. ఒక ప్పుడు ధనవంతుల, అధికారుల ఇళ్లలోను, కార్యాల యాల లోగిళ్లలోనూ మోగే ఫోన్‌ ‌గణగణలు నేడు కూలివాని చెమట జేబులోనూ వినిపిస్తున్నాయి.

ఇళ్లల్లో, కార్యాలయాల్లో, బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో .. ‘ఇందుగలదందు లేదని సందేహం’ లేక అన్నిచోట్లా ముంచెత్తుతున్నాయి సెల్‌ఫోన్‌లు. సెల్లులో ఊసులే తప్ప పక్కవాడి ఊసే అక్కరలేదు. తెరచాటు వ్యవహారాలు తెరమీద కొచ్చేసాయి. ఇవి ‘టచ్‌ఫోన్‌లా ‘కాదు కాదు ‘టచ్‌ ‌మీ నాట్‌ ‌ఫోన్‌లు’. భౌతికంగా దూరాల్ని దగ్గర చేస్తున్నా… మానసికంగా దగ్గరలను దూరం చేస్తున్నాయి.

లేకపోతే ఉదయం అంత జరుగుతున్నా ఒక్కరంటే ఒక్కరన్నా స్పందించారా? అందరి చేతుల్లోనూ ఫోన్‌లు ఉన్నాయి కానీ ద్రవించే మనసులే లేవు.

విరిసీ విరియని పువ్వువి. అనాఘ్రాత పుష్పానివి… ఏ దుష్ట ఘడియలో మనోహర్‌ ‌చేతిలో నలిగిపోయావో గానీ… అప్పటినుండే నీకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి.

అతడు.. ఆ మనోహర్‌. ‌నీ మనస్సును దోచాడనీ, అతనితో జీవితం ఆనందానికి సంకేతం అని అనుకున్నావు.పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నావు. అలా ప్రేమవాహినిలో పూలతేరులా సాగిపోతున్న నీ సంసార నౌకని ఓ సుడిగుండం మింగేసింది.

ఆ సుడిగుండం పేరు సాగర్‌. ఈ ‌సాగర్‌ ఎవరో ముందు నీకు తెలీదు .

కానీ అతడు నీ క్లాస్‌మేటే. నిన్ను అమితంగా ఆరాధించే ఓ మౌన ప్రేమికుడు. మీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఫైనల్‌ ‌పరీక్షలు అయిన తరువాత నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తల్లి దండ్రులతో మాట్లాడి నిన్ను సంప్రదాయకంగా చేపట్టాలనుకొన్నాడు.

కానీ, తానొకటి తలిస్తే దైవం ఇంకోకటి తలిచింది. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే కేంపస్‌ ‌సెలక్షన్‌ ‌వచ్చి నువ్వు బెంగుళూరు వెళ్ళిపోయావు. సాగర్‌ ఇం‌కో కంపెనీకి సెలక్ట్ అయి హైదరాబాద్‌ ‌చేరుకున్నాడు. ఉద్యోగంలో కుదురుకున్నాక తన మనసు బయట పెట్టాలనుకున్నాడు.కానీ ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్లుగా అయింది.

విధివ్రాత వేరుగా ఉంది మరి. నువ్వేమో నీ తోటి ఉద్యోగి మనోహర్‌ ‌వలపు సంకెళ్లలో చిక్కిపోయావు. అక్కడే నీ ప్రమేయం లేకుండానే నీ జీవితం మలుపు తిరిగిపోయింది. పిచ్చితల్లీ! నీకు తెలీకుండానే నీ చుట్టూ చాలా కథ నడిచింది .

హైదరాబాదులో కాన్ఫరెన్స్‌లో మనోహర్‌ ‌సాగర్‌లు ఒరికొకరు పరిచయమయ్యారు. పర్సనల్‌ ‌విషయాలు తడుముకున్నారు. మనోహరే నీ భర్త అని సాగర్‌కి తెలీదు. కాలేజీ విషయాలు చెపుతూ సాగర్‌ ‌తనో అమ్మాయిని ఎంత ఆరాధించేవాడో పూస గుచ్చినట్లు చెప్పాడు. తను ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడో? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందని తెలిసి ఎంత హతాశుడయ్యాడో కూడా వివరించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడెంత అదృష్టవంతుడో అని అసూయ పడ్డాడు కూడా. ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే..

అప్పటి నుండి నీ మనోహరుడు రూపం మార్చుకొని ‘మనోగరళుడు’ అయ్యాడు. ‘భార్యా రూపవతీ శత్రుః’..అరిటాకు ముళ్లమీద పడిందో? ముళ్లే అరిటాకు మీద పడ్డాయో గానీ నీ బ్రతుకుపై బీటలు మొదలయ్యాయి. అభిమానాన్ని అనుమానం కమ్మే(ప్పే)సింది. ప్రేమ స్థానంలో ద్వేషం చోటు చేసుకుంది. విధి నాటకంలో ఇంకో అధ్యాయానికి తెరలేచింది. సాగర్‌ ‌కంపెనీ మారి బెంగళూరు వచ్చాడు. ఏదో షాపింగ్‌ ‌మాల్‌ ‌లో తలవని తలం పుగా నిన్ను కలిసాడు. ఐస్కీమ్‌ ‌కోసం వెళ్ళివస్తున్న మనోహర్‌ ‌దృష్టిలో పడ్డారు మీరిద్దరూ. అంతే. ఆ దృశ్యం మనోహర్‌ ‌మనసులో విషబీజానికి నీరు పోసింది.

ఆ తరువాత మరోసారి ఐనాక్స్ ‌థియేటర్‌కు మీరు సినిమాకు వెళ్లడం, అదే సినిమాకు సాగర్‌ ‌రావటం యాదృచ్ఛికమే కావచ్చు గానీ అది అనుమానం మొలకెత్తడానికి దోహదపడింది. అటుపై నీ పుట్టిరోజు పార్టీకి సాగర్‌ ‌రావటంతో అనుమాన వృక్షం ‘ఇంతింతై వటుడింతై…’ అన్నట్లుగా పెరిగి రెండడుగులతో మనోహర్‌ ‌మనసంతా ఆక్ర మించుకొని ‘మూడో అడుగు నీ నెత్తిపై పెట్టి నిన్ను అధఃపాతాళానికి తొక్కేయడానికి కాచుకొని ఉంది.

అయ్యో తల్లీ! నువ్వెంత ఒంటరివైపోయావు పాపం? ఆ దురదృష్ట ఘడియ ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉందా? వయసువేడిలో వలపు ఊబిలో పడి మనోహర్‌ ‌చేతిలో నలిగిపోయావు. తరువాత ఎలాగో నీ మనోహర్‌తో పెళ్ళి పేరుతో గట్టెక్కావు.

కానీ ఇపుడు ఆ గట్టు కూడా నీకు ‘నిలకడ’ ఇవ్వలేకపోయిందా?

నీ పుట్టింటి వారికి ‘పరువు’, మెట్టింటి వారికి ‘ప్రతి్ఠ••’ ముఖ్యం. వారికి మీకన్నా అవే ప్రధానం. ‘నువ్వే నా ప్రాణం’ అన్నట్లున్న నీ మనోహరుడు కాస్త ఇప్పుడు అనుమాన గరళకంఠుడయ్యాడు.ఇక నీకు దిక్కెవరు? ఎవరితో చెప్పుకుంటావు నీ బాధలు? ఎవరున్నారు నిన్ను ఓదార్చి అక్కున చేర్చుకోడానికి? అన్ని సమస్యలకూ పరిష్కారాలు మన చేతిలో ఉండవు.

చాలా సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది ‘తనదైన శైలి’లో. ‘ధర్మేచ ,అర్థేచ కామేచ.. నాతి చరామి’ అని నీ చేయందుకున్న మనోహర్‌ ‌సాహ చర్యంలో మూడు సంవత్సరాలు మూడు క్షణాలుగా గడిచిపోయాయి. అంతేకాదు మూడో మనిషిగా ఓ బుజ్జిపాపాయిని కానుకగా అందుకున్నారు కూడా.

కానీ మీ సంసారాన్ని చూసి ఆ విధికే కన్ను కుట్టిందేమో! సాగర్‌ ‌రూపంలో వచ్చిపడిందో ఉపద్రవం.

నాడు నీ మనోహరుని మాటలు నమ్మి బంగారం లాంటి నీ ఉద్యోగాన్ని వదులుకున్నావు.అపుడు ఎంత మంచి మాటలాడాడని!!

‘మన బాబుని చూసుకోడానికి మనకి ఎవరున్నారు? ఈ చిన్నారి పుట్టిన తరువాత అయినా మన తల్లిదండ్రులు మనకి దగ్గర అవుతారను కున్నాము. కానీ వారికి వాళ్లకు పరువు ప్రతిష్ఠలే ముఖ్యమైపోయాయి.

ఏం చేస్తాము? నువ్వు ఉద్యోగం చేసినన్నాళ్ళు నీ జీతాన్ని నేను ముట్టుకోలేదు కదా! ఆ మొత్తం మన బాబు భవిష్యత్తుకి భరోసాగా ఉంటుంది. ఇంక  నా జీతమే మన కుటుంబానికి ఎక్కువ. అందుచేత నువ్వు మన ‘బాబు’ని చూసుకో. నేను మీ ఇద్దరినీ చూసుకుంటాను.’ అని అన్నపుడు నీకు కూడా కాదని చెప్పడానికి కారణం కనిపించలేదు.

ఆ ఉద్యోగమే ఉంటే ఇపుడు నీ పరిస్థితి ఇంకోలా ఉండేది. అయినా అన్నీ మన చేతుల్లో ఉంటే ఇంక దైవం ఎందుకు? అందుకే కొందరికి పరీక్ష పెట్టి అందరికీ పరోక్షంగా హెచ్చరిస్తూ ఉంటాడేమో?

ఆరోజు నీ ముద్దులపట్టి పుట్టినరోజు వేడుక. ‘ఫంక్షన్‌ ‌హాలు రంగురంగుల విద్యుద్దీపాలతో ముచ్చటగొలుపుతూ ఉంది.

నీలం,తెలుపు, గులాబీ రంగుల బెలూన్లు గుత్తులు గుత్తులుగా వేలాడు తున్నాయి.అన్నట్లు జీవితం, బెలూను రెండూ ఒకటే కదా! ఎప్పుడు పుటుక్కు మంటాయో ఎవరికి తెలుసు? ఆహూతులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. అందులో సాగర్‌ ‌కూడా ఉన్నాడు.

అందరినీ పలకరిస్తూ, పరిచయం చేసుకొంటూ, మధ్యమధ్య కూల్‌ ‌డ్రింకులతో పాటు జోక్స్ ‘‌పంచ్‌’‌లు పంచుతూ..ఎంత ఆహ్లాదం నింపాడని?

ఇంతలో ఏమైందో గానీ ఒక్కసారిగా నీ ముద్దులబాబు ఏడవటం మొదలు పెట్టాడు. మనోహర్‌ ‌గానీ, నువ్వుగానీ ఎంత లాలించినా ఏడుపు ఆపలేదు. అదేం చిత్రమోగానీ సాగర్‌ ‌చేతిలోకి తీసుకోగానే ఏడుపు ఆపేసి కిలకిలా నవ్వడం మొదలు పెట్టాడు. ఆ దృశ్యం అందరికీ ఆనందాన్ని పంచినా మనోహర్‌లో మాత్రం విషాన్ని పెంచింది. ‘బ్లాస్ట్ ‌ఫర్నేష్‌’‌లా అతడి మనసు కుతకుత రగిలిపోయింది.

ఈరోజు ఉదయం,మనోహర్‌కి ఆఫీస్‌కి బాక్స్ ‌సర్దుతున్న సమయంలో బాబు ఏడుపు లంకించు కున్నాడు. ‘మనో! కాస్త బాబుని చూడు. ఈ బాక్స్ ‌సర్దేసి వస్తాను’ అన్నావు. అంతే… నువ్వు కలలో కూడా ఊహించని సమాధానం. ‘ఉన్నాడుగా నీ ముద్దుల ప్రియుడు సాగర్‌! ‌పిలు వచ్చి ఎత్తుకుం టాడు’. ‘ఆ మాటతో కాళ్ళక్రింద భూమి ఒక్కసారి కంపించినట్లయ్యింది నీకు. ‘మనో! ఏం మాట్లాడు తున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?’ కోపంతో పెదాలు వణుకుతుండగా త్రాచుపాములా బుసలు కొడుతూ మీదకు వెళ్ళావు. ‘అబ్బో! ఉన్న మాటంటే రోషం పొడుచుకొచ్చిందే!’ వెటకారంగా అన్నాడు. ‘ఇంకొక్క తప్పుడు మాట మాటాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు.’ ఒకవైపు కోపం, ఇంకోవైపు దుఃఖం ముప్పిరిగొంటున్నాయి నీకు. ‘తప్పుడుపని చేసినపుడు లేనిది ఆ మాటంటే తప్పా? పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పకు’ రెట్టించాడు మనోహర్‌. ‘‌మనో ప్లీజ్‌! ‌దయచేసి అలా మాట్లాడకు. అసలు ఆ సాగర్‌ ఎవరో నాకు తెలీనే తెలీదు. మా కాలేజీమేట్‌ అని నువ్వే నాకు పరిచయం చేశావు. కాలేజీకి తల వంచు కొని వెళ్లి తలవంచుకొని రావడమే తప్ప తలదించు కునే పని నేనేం చేయలేదు’ కోపం కాస్త ఏడుపులోకి మారగా మనో గుండెలమీద వాలిపోయావు. ‘చాల్లే! నీ కల్లబొల్లి కబుర్లకు, నంగనాచి ఏడుపులకు లొంగి పోతానను కొంటున్నావేమో? నో! నెవ్వర్‌! ‌మర్యాదగా నా జీవితం నుండి తప్పుకో’ రెండుచేతులతోనూ విదిలించుకొని నిన్ను దూరంగా నెట్టేశాడు. ‘రేయ్‌! ‌నేను చేసిన తప్పేంట్రా? మాటిమాటికి తప్పు.. తప్పు… అని తప్పుడు కూతలు కూస్తు న్నావు?’ అంటూ ఆడపులిలా లంఘించి కాలర్‌ ‌పట్టుకున్నావు. అంతే! అన్నెం పున్నెం ఎరుగని నిన్ను నిస్సహాయురా లుని చేసి వీధిలోకి గెంటి.. అయ్యో.. నా నోటితో ఎలా చెప్పను? పురుషాహంకారంతో బెల్ట్ ‌తీసి గొడ్డుని బాదినట్టు విచక్షణారహితంగా కొడుతూ ‘చదువు నేర్చిన వింత పశువు’లా ప్రవర్తిస్తుంటే..

అయినా ఇదేం విచిత్రం?

ఒక అబలపై అభాండాలు మోపి నడిరోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా హింసిస్తుంటే చుట్టూ చేరిన జనం అదేదో సినిమాలా చూస్తూ కొందరు. సెల్‌ఫోన్స్‌లో వీడియో తీస్తూ కొందరు.. ఛ.. ఛ… వీళ్లేం మనుషులు? వీరికన్నా కాకులు నయం. ఒక కాకికి ఏమన్నా జరిగితే గుంపులు గుంపులుగా వచ్చి వాలతాయి….

ఒకప్పుడు ఇలాటి తగాదాలేమున్నా వీధిలో పడితే నలుగురు పెద్దలూ కల• •జేసుకొని ఇరుపక్షాలవారినీ శాంతింపజేసి రాజీ కూర్చేవారు

ఇప్పుడిదేమిటి? వీడియోలు తీసి గ్రూపుల్లో పెట్టే శ్రద్ధలో కనీసం ఒక శాతమైనా నివారణలో చూపరు.

సమాజానికి దిక్సూచిగా నాడు గాంధీ ఇచ్చిన మూడు కోతులు… సత్యం చెప్పలేక ‘నోరుమూసుకొని’ మొదటిది, అసత్యం వినలేక ‘చెవులు మూసుకొని ’రెండోది, హింస చూడలేక ‘కళ్లుమూసుకొని’ మూడోది విలపిస్తున్నాయి.

అదృష్టమో? దురదృష్టమో? గానీ సరిగ్గా అదే సమయానికి అటుగా సబ్‌ ఇనస్పెక్టర్‌ ‌రావటంతో అక్కడ ఏమీ జరగనట్లు ఎవరికివారు చల్లగా జారుకున్నారు.

ఇంత జరిగినా ఏమీ పట్టనట్లు మనోహర్‌ ఆఫీస్‌కి వెళ్లిపోయాడు. నడిసంద్రంలో తుఫానుకి చిక్కుకున్న నావలా ఒంటరిగా మిగిలిపోయావు.

కొద్దిపాటి పాలను తీసుకొని, బాబుని ఎత్తుకొని బయటపడ్డావు. మనసు విరిగిపోయాక ఇంక ఆ ఇంటితో పని ఏముంది?

ఏవి తల్లీ నిరుడు విరిసిన సుమసమూహాలు? చేయిసాచీ చేసుకున్న బాసలన్నీ ఏవి? ఏవీ? ఏవితల్లీ! మనసు మురిసిన జ్ఞాపకాల తడులు ఏవీ? బ్రతుకుబాటలో కలసి నడిచిన ఏడు అడుగుల జాడలేవీ? మనసు నిండిన అనుమానభూతం బుసలుకొట్టి దొర్లుతుంటే కాలమొక్కటి ముందు ముందున బదులు తీర్చక ఊరుకోనునా? కలలు కరిగీ, మనసు విరిగీ బ్రతుకే ఒక మోయలేని భారమై శిథి•లనీడల జాడయై…

అయ్యో! నీచరిత్ర తలచుకొంటుంటే కన్నీళ్లు కాలువలు కట్టాలి. కానీ నాకు నీళ్లకూ కన్నీళ్లకూ తేడా తెలీదు. నిన్ను చూస్తుంటే గుండె చెరువు అయిపోతుంది.

 ‘అయ్యో తల్లీ! ఏం చేస్తున్నావు? వద్దు… వద్దు… నాదగ్గరకు రావద్దు. అసలే మొన్న వర్షాలతో నిండుగా ఉన్నాను.కర్పూరం ఆరబోసినట్లున్న ఈ వెన్నెలలో నా గట్టు మీద కూచొని చల్లని సమీరాలతో సేద తీరుతున్నావనుకున్నాను. నీ మనసులో ఇంత కఠిన నిర్ణయం ఉందని ఊహించలేకపోయాను. వద్దు వద్దు.అదిగో పాదాలు తడిసిపోతున్నాయి. చీర కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. ఆగు.. ఒక్క క్షణం ఆలోచించు. అయినా నీకేం తక్కువ? చదువుంది. తెలివితేటలున్నాయి. మళ్ళీ ఉద్యోగంలో చేరు. నీ బాబుని వాడి బాబుకన్నా ఎత్తున నిలబెట్టు. అదుగో…

నడుంలోతుకి వచ్చేశావు. జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి గానీ అర్ధాంతర•ంగా ముగించకూడదు. అదుగో గుండెల వరకు వచ్చేశావు… చేతిలోని బాబు…

ఒక్క క్షణం… ఒకే ఒక్క క్షణం ఆగింది. చాలు ఆ ఒక్క క్షణం చాలు. నిర్ణయాలు మారిపోడానికి.

వెళ్లు.. వెనక్కి వెళ్లు. నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మనోహర్‌ ‌నీ మీద వేసిన నింద నిజంగా మారి విహరిస్తుంది. అది ఒట్టి అపవాదే అని నిరూపించు. నువ్వు తలెత్తుకొని అతను తలదించు కోనేలా నీ బాబుని పెంచు. ఆత్మ గౌరవానికి ఎత్తిన జెండాలా నిలబడు. ఆశే శ్వాసగా సాగిపో…..

వెనుదిరిగిన ఆకృతిని చూస్తూ… చెరువు చెమర్చింది ఆనందబాష్పాలతో.

About Author

By editor

Twitter
Instagram