– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

2020, 2021 సంవత్సరాలు యావత్‌ ప్రపంచానికి చేదు అనుభవాలను మిగిల్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ భూమండలంలోని అన్ని దేశాలు అతలాకుతల మయ్యాయి. పేద, పెద్ద, చిన్న… అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా తాండవానికి అల్లకల్లోలమయ్యాయి. శక్తిమంతమైన దేశాలు సైతం కరోనా ధాటికి చిగురుటాకుల్లా వణికిపోయాయి. పెద్దయెత్తున ప్రాణ, ధన నష్టం సంభవించింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకులాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి క్రమంగా ప్రపంచం కోలుకుంటోంది. ప్రజల సాధారణ జీవితం మళ్లీ మొదలైంది. ప్రపంచం భయం భయంగా సాగుతోంది. లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వాలు, ప్రజలు బయటపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, కర్మాగారాల్లో ఇప్పుడిప్పుడే సందడి మొదలైంది. క్రమంగా ప్రపంచం కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో తాజాగా వెలుగు చూస్తున్న కరోనా కొత్త వేరియంట్లు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఒమిక్రాన్‌’ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఇది. కొవిడ్‌ రెండో తీవ్రతకు కారణమైన డెల్టా కంటే ఇది ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తుంది. రోజుల వ్యవధిలోనే ఇది దాదాపు 40 దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ తీవ్రత ఎంత, దానిని టీకా ఎదుర్కోగలదా తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఉదాసీనతను విడనాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

దీనికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తు న్నాయి. ఒమిక్రాన్‌.. గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదని, దీని ప్రభావం పెద్దగా ఉండదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇదే మాటను నొక్కి చెబుతోంది. దీని ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని స్పష్టం చేస్తోంది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వీలైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండటం, ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో సంచరించకపోవడం, రాత్రివేళల్లో కర్ఫ్యూ, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ‘ఒమిక్రాన్‌’ తల వంచవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే జనవరిలో దీని ప్రభావం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేసేందుకు, జరిమానా విధించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇంతకుముందు కూడా పోలీసు శాఖే ఈ బాధ్యతను చేపట్టింది. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ సమయం నుంచి మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాలలో సంచరించిన వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 51 కింద 13 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున జరిమానా విధించారు. సుమారు రూ.131 కోట్లు వసూలు చేశారు. మరోపక్క ఒమిక్రాన్‌ను నివారించేందుకు బూస్టర్‌ డోస్‌ వేసే విషయమై ప్రభుత్వ వర్గాలు అంతర్గతంగా ఆలోచన చేస్తున్నాయి.

ఒమిక్రాన్‌ ప్రభావం గురించి అధ్యయనం జరుగుతోందని, అయితే దాని గురించి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్‌ శ్రీనాధ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొన్ని దేశాల్లో కేసులు నమోదైనప్పటికీ వాటి ప్రభావం తక్కువే. అవి అన్ని స్వల్ప లక్షణాలతో కూడుకున్నవే. వాటి తీవ్రత గురించి నిర్ధారణ కావాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు. అయితే ఒమిక్రాన్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం లేకపోలేదు. స్థూలంగా చూస్తే కరోనా మూడోదశ ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువేనని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాన్పూర్‌ ఐఐటీ ఆచార్యుడు మణీంద్ర అగర్వాల్‌ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న వారికి వ్యాధి సోకకపోవచ్చని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్‌ డెల్టాను మించి పోతుందని చెప్పలేమని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ కొలిన్స్‌ పేర్కొన్నారు.

కరోనా గురించి తక్కువగా అంచనా వేయరాదని, అదే సమయంలో నిర్లక్ష్యమూ పనికిరాదని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌) డాక్టర్‌ జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని, జనవరి నాటికి కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేయించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేనేలేదని, అది సమస్యకు పరిష్కారం కాదని ఆయన స్పష్టంచేశారు. నిర్ధారణ పరీక్షలు పెంచడం, బాధితులకు సరైన చికిత్స అందించడం.. అన్నింటికన్నా ప్రధానమన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, ఇతర కారణాలతో ముప్పున్న వారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వైద్య వర్గాల నుంచి వ్యక్తమవు తోంది. ఒమిక్రాన్‌ను పక్కనపెడితే.. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ మన దగ్గర ప్రభావం చూపుతోంది. అంతమాత్రాన అందరికీ బూస్టర్‌ బోస్‌ తప్పనిసరి కాదు. ముఖ్యంగా ఆరు పదులు దాటిన వారికి, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ప్రాధాన్య క్రమంలో బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు తదితర ఆరోగ్య సిబ్బందికి సైతం బూస్టర్‌ డోస్‌ ఇవ్వడం తప్పనిసరి. 40 సంవత్సరాలు దాటిన వారికి, ముప్పు ఎక్కువగా ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌ అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం (ఇన్సాకాగ్‌) సిఫార్సు చేసింది. గత నెల 29న తన బులిటెన్‌లో ఇన్సాకాగ్‌ చేసిన ఈ సిఫార్సు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా, బ్రిటన్‌ మాత్రమే ఇప్పటివరకు బూస్టర్‌ డోసుకు అనుమతించాయి.

నిపుణుల సూచన మేరకే… మంత్రి

ఒమిక్రాన్‌పై ప్రభుత్వం సమగ్రంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తాజాగా పార్లమెంటులో స్పష్టం చేశారు. పెద్దలకు బూస్టర్‌ డోస్‌, చిన్నారులకు కరోనా టీకా అందించే విషయమై నిపుణుల సలహా మేరకే ముందుకు వెళతామని ఆయన తెలిపారు. దేశ ప్రజానీకంలో 85 శాతం మందికి తొలి డోసు, 50 శాతం మందికి రెండో డోసు ఇచ్చామని ఆయన తెలిపారు. 12-17 ఏళ్ల వయసు గల పిల్లల కోసం కొవిడ్‌ టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడిరచారు. చిన్నారుల టీకాలకు సంబంధించి జాతీయ టీకా నిపుణుల కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని ఆమె చెప్పారు. విదేశీ టీకాలపై నిర్ణయం తీసుకునే అధికారం నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19 (నెగ్‌ వాక్‌), నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌ టాగి) లకు అప్పగించినట్లు మంత్రి వెల్లడిరచారు. బాలల కోసం దేశీయంగా తయారు చేస్తున్న టీకాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. సరిహద్దులను మూసేయడం, విమానాలను నిలిపేయడం తదితర చర్యలు పాటించడం వల్ల వ్యాప్తిని కొంతవరకు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మాస్కుల ధారణ, భౌతిక దూరం, టీకాలు, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ఐసీయూ పడకలను సిద్ధం చేయడం ద్వారా ముప్పును నివారించవచ్చు. డెల్టా నియంత్రణకు పాటించిన పద్ధతులు, నియంత్రణలు యథాతథంగా పాటించడం ద్వారా ఒమిక్రాన్‌ను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ టకెషి కాసాయ్‌ వెల్లడిరచారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సభ్యదేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకూ తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలనే మన్ముందూ మరింత కఠినంగా, పకడ్బందీగా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అందు బాటులో ఉన్న వివిధ రకాల కొవిడ్‌ టీకాలు ఒమిక్రాన్‌ నియంత్రణలో కొంతవరకు పని చేయగలవు. కరోనా నివారణకు వివిధ సంస్థలు తయారు చేసిన టీకాలను బూస్టర్‌ డోస్‌గా వాడవచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు డోసులు పొంది, తరవాత మూడో డోసు పొందిన వారిలో బలమైన రోగనిరోధక వ్యవస్థ తయారైంది. ఈ విషయాన్ని ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’ వెల్లడిరచింది. ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ టీకా మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై దేశీయ పరిశోధన సంస్థలు అప్రమత్త మయ్యాయి. దీనిని నివారించేందుకు పరీక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ), ఐఐసీటీ వంటి సంస్థలు పరీక్షలు చేపట్టాయి. మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షించడం ద్వారా కొవిడ్‌తో పాటు ఇతర మహమ్మారులను, అంటువ్యాధులను గుర్తించడానికి, వ్యాప్తిని నివారించడానికి వీలవుతుంది. గతంలో పోలియో నిర్మూలనకు ఇదే పద్ధతిని పాటించారు. కరోనా రెండో దశలోనూ ఇదే పద్ధతిని అనుసరిం చారు. వ్యాధి తగ్గుముఖం పట్టడం, నిధుల సమస్య కారణంగా తరవాత పరిశోధనలు నిలిపివేశారు. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో ఈ పరీక్షలు చేపట్టనున్నట్లు హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి వెల్లడిరచారు. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటివరకూ కరోనా నియంత్రణలో భారత్‌ మెరుగ్గా వ్యవహరించింది. ఆ అనుభవంతో మూడోదశనూ సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఈ దిశగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram