ఈ ‌హెచ్చరికనైనా గమనిస్తారా?

సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ మార్గశిర శుద్ధ విదియ – 06 డిసెంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారతదేశాన్ని నిరంతరం సంక్షోభంలో ఉంచే ప్రయత్నాలు కొత్తకాదు. సరికొత్త ప్రయత్నం మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. దేశ విభజన నాటి అనుభవాలను పాతిపెట్టడానికీ అదే సమయంలో విభజన వాతావరణాన్ని బలపరచడానికీ అది జరుగుతున్నది. ఈ వాస్తవం ఏ కాస్త జాతీయ స్పృహ ఉన్నా అర్ధమవుతుంది. ఉదారవాదం, సెక్యులరిజం ఈ ప్రయత్నాలకు ఆయుధాలు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇలాంటి నీచ కుట్రకు ఊపిరి. ప్రజాస్వామ్యానికి చెబుతున్న వికృత భాష్యాలే  నేపథ్యం. హిందువులకు ఇటీవలి కాలంలో దక్కుతున్న చిరువిజయాలు హిందూ వ్యతిరేకులలోని దుగ్ధను ఇంకాస్త రెట్టిస్తున్నాయి. నిజానికి వాళ్లంతా భారత వ్యతిరేకులు. చైనా భక్తులు. పాక్‌ ‌పట్ల అనురక్తులు. బీజేపీ విజయయాత్ర, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు వంటి వాటిని బూచిగా చూపి హిందూ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పార్లమెంటు నిర్ణయాలను త్రివర్ణ పతాకం సాక్షిగా రోడ్ల మీద తేల్చుకుంటామంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకూ దిక్కు లేదు. హిందూయిజం, హిందూత్వ వేర్వేరంటాడు, తల పుచ్చిన ఓ అజ్ఞాని. హిందువుల  రక్షణ కోసం మాట్లాడినవారిలో ఐసిస్‌, ‌బొకొ హరామ్‌ ఉ‌గ్రవాదులు కనిపిస్తున్నారంటాడు ఇంకో ఉన్మాద గురవింద. గాంధీ, పటేల్‌, ‌నెహ్రూ వలెనే జిన్నా కూడా స్వాతంత్య్ర సమరయోధుడే అంటాడు మరొక నిత్య పదవీ రోగ పీడితుడు. రోజురోజుకీ ముదిరిపోతున్న అర్బన్‌ ‌నక్సల్స్, ‌మేధావుల మానసిక రుగ్మత ఇంకొకటి. రైతుల ముసుగులో దేశ ఐక్యతకు బాహాటంగానే సవాళ్లు విసురుతున్న వేర్పాటువాదుల సంగతి సరేసరి. ఇలాంటి సమయంలోనే రావలసిన హెచ్చరికే వచ్చింది. చేయవలసిన వారే చేశారు కూడా.

ఇది 1947 నాటి భారత్‌ ‌కాదు, 2021 నాటి భారత్‌ అని గుర్తు పెట్టుకోండంటూ నవంబర్‌ 26‌న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌హెచ్చరించడం నేటి అవసరం. కృష్ణానందసాగర్‌ ‌గ్రంథం ‘విభజన్‌ ‌కాలీన్‌ ‌భారత్‌ ‌కె సాక్షి’ని నవంబర్‌ 26‌న డాక్టర్‌ ‌భాగవత్‌ ‌నొయిడాలో ఆవిష్కరించారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు ఈ దేశం ఎంతటి ప్రమాదపుటంచులకు వచ్చిందో హెచ్చరించేవే. ఆవేదనతో, బాధతో ఆయన ఈ హెచ్చరిక చేయవలసి వచ్చింది. ఈ దేశ విపక్షాల మాటలు, అవి వెనక ఉండి నడిపించే ‘ప్రజా ఉద్యమాలు’ అన్నీ దేశ విభజనకు ఆతృత పడుతున్న సంగతినే చెబుతున్నాయి. తరువాత రోజు గ్వాలియర్‌లో జరిగిన సంఘ శిక్షణ కార్యక్రమంలో కూడా ఆయన ఇంతే ఆవేదనతో, దాదాపు అవే మాటలను పునరుద్ఘాటించారు. భారత్‌ ‌విభజన గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడుతున్న వారే లక్ష్యంగా భాగవత్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. ఇందులో దాపరికం లేదు. ఇంత విచ్ఛిన్నకర ధోరణుల నడుమ కూడా హిందువులమన్న స్పృహ రాకపోవడం, లేకపోవడం ఏమిటని ప్రశ్నించడం కూడా ఆ మాటల వెనుక ఉద్దేశం కావచ్చు.

   ‘హిందువులు లేకపోతే హిందుస్తాన్‌ ‌లేదు. భారత్‌ ‌లేకుండా హిందువులు లేరు. హిందూస్తాన్‌ అం‌టే హిందూదేశమే. హిందూదేశం మూలం హిందూత్వ. హిందువులు హిందువులుగా మిగలాలంటే భారత్‌ను అఖండంగా నిలిపి ఉంచాలి. హిందువులూ భారత్‌ ‌వేర్వేరు కాదు. భారత్‌ ‌నుంచి హిందువులను వేరు చేయడం అసాధ్యం. భారత్‌ ‌భారత్‌గా మిగలాలంటే హిందువు హిందువుగా మిగలాలి. హిందువు హిందువుగా మిగిలి ఉండాలంటే భారత్‌ను అఖండంగా ఉంచాలి’ అన్నారు మోహన్‌జీ భాగవత్‌. ‌భారతదేశం తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. అదే హిందుత్వ సారాంశం అన్నారాయన. మనం హిందువులమని విశ్వసిస్తున్న వారి సంఖ్య తగ్గింది. లేదా హిందుత్వ అనే భావనను కల్పించే ఆరోగ్యకరమైన ఉద్వేగం తగ్గిపోయింది. హిందువులు ఇక్కడ బతకాలంటే భారత్‌ అఖండ భారత్‌ ‌కావాలి. భారత్‌ ‌ముక్కలయ్యి పాకిస్తాన్‌ ఏర్పడిందంటే అందుకు కారణం- మనం హిందువులమన్న భావనను మనం మరచిపోయామని ఆయన చెబుతుంటే ఒకింత దు:ఖం, ఒకంత అలజడి కలగడం సహజం.

మరో విభజన వైపునకు భారతీయ సమాజాన్ని నెట్టుకు వెడుతున్న ద్రోహులను ఏమనాలి? చరిత్ర తెలియని అజ్ఞానునా? లేకపోతే తమ పబ్బం గడిచిపోతే ఎంత రక్తపాతం జరిగినా మనకేమిటనుకునే నీచులనా? విభజన నాటి దు:ఖాన్ని విస్మరించలేమని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌చెప్పడం ఎందుకో ముందు పరిశీలించాలి. 1947 నాటి మన విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక ఘటనగా పేర్గాంచింది. భారత జాతీయ కాంగ్రెస్‌ అనే కుహనా సెక్యులర్‌ ‌భూతం హిందూ సమాజానికి పొడిచిన వెన్నుపోటు అది. అసలు 1946, 1947 నాటి రక్తపాతాన్ని ఈ జాతి మరచిపోవడం ఎలా? ఎంత విషాదమంటే ముస్లిం మతోన్మాదుల చేతులలో ఆనాడు భయానకమైన స్వజాతి నిర్మూలనను చూసి కూడా, వాళ్లనే వెనకేసుకొస్తున్న వృశ్చిక సంతానం ఇవాళ భారత భూమి మీద తయారయింది.ఆ మతాన్ని భుజాన మోసినందుకు పాదుషాల చేతుల్లో ప్రత్యక్ష నరకం చూసిన మత గురువుల చరిత్ర తెలిసి కూడా ఆ వర్గం దేనికి పాకులాడుతోంది?

దేశ విభజన నాటి గాయం మానాలంటే దేశ విభజన తప్పిదాన్ని సరిచేసుకున్నప్పుడే సాధ్యమని డాక్టర్‌ ‌భాగవత్‌ అనడం కీలెరిగి వాత పెట్టడమే. అఖండ భారతమే విభజన మిగిల్చిన బాధను నివారించగలగుతుందని కూడా ఆయన అన్నారు. భారత్‌ను విభజించడానికి నాడు కుట్ర జరిగింది. అదే కుట్ర నేటికీ కొనసాగుతోంది అన్న ఆయన ఆరోపణ అక్షరసత్యం. హిందువు హిందువుగా బతకాలంటే అది భారతదేశంలోనే సాధ్యం. ఇలాంటి స్పృహ ఇప్పుడు హిందువులం అనుకుంటున్న వారందరికీ కావాలి. ముమ్మాటికీ ఇది 1947 నాటి భారత్‌ ‌కాదు. కానివ్వకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram