హుజురాబాద్‌ ఉపఎన్నికలు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు గట్టి ఝలక్‌ ఇచ్చింది. ఉద్యమ కాలం నుంచీ, పార్టీ ఆవిర్భావం నుంచీ ఏనాడూ లేనంత అసహనానికి గురిచేసింది. ఆయన మాటతీరులో తేడానే దీనికి ఆనవాలుగా నిలిచింది. ఆయన వ్యాఖ్యల తీరే దీనికి నిదర్శనంగా కనిపించింది. ఎప్పుడు ఏం చేస్తారో, ఏ సమయంలో ఏం మాట్లాడతారో, అసలు ఏ సందర్భంలో మీడియా సమావేశం నిర్వహిస్తారో, మీడియా సమావేశం పెట్టినా ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారో అన్నది ఎవరికీ అంతుబట్టదు. ఎప్పుడైనా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీడియాకు దూరంగా ఉండేందుకు, బహిరంగంగా మాట్లాడేందుకు కేసీఆర్‌ ‌సాహసించరు. కొంతకాలం వేచిచూసి.. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని, తన మాటలు ప్రజలు వింటారన్న విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాతే మీడియా ముందుకు వస్తారు. కానీ, అనూహ్యంగా హుజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్‌ ఈనెల 7వ తేదీన ప్రెస్‌మీట్‌ ‌పెట్టారు. అదీ ఒక్కసారి కాదు.. మరుసటిరోజు కూడా మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు. ఇకపై రోజూ వస్తూనే ఉంటానని కూడా సంచలన ప్రకటన చేశారు.

కేసీఆర్‌ ‌మాటల్లో ఆవేదన, ఆక్రోశం, బాధ కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆయన తీవ్ర అసహనంగా ఉన్నట్లు కనిపించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉద్యమ కాలంలో మినహా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో భావోద్వేగానికి గురైన దృశ్యం కనిపించలేదు. మాటతీరులో ఈ స్థాయిలో మార్పు, ఆక్రోశం, కోపం, ఈ స్థాయిలో సవాళ్లు గోచరించలేదు. ఎప్పటిలాగే ఈ పరాభవాన్ని బయటకు కనిపించనీయకుండా మౌనంగా ఉంటారేమో అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, ఉన్నపళంగా మీడియా ముందుకొచ్చి రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచారు.

వాస్తవానికి హుజురాబాద్‌లో జరిగిన ఉపఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. హుజురాబాద్‌ ఉపఎన్నిక జరిగిన రోజే.. ఆంధప్రదేశ్‌ ‌లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరిగింది. కానీ, ఏపీలోనూ హుజురాబాద్‌ ఎన్నిక గురించే విస్తృతంగా చర్చ జరిగింది. పోలింగ్‌ ‌రోజు పర్సెంటేజీ గురించి, పోలింగ్‌ ‌జరుగుతున్న తీరు గురించి తెలుసుకునేందుకు ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, యువత ఆసక్తి చూపించారు. హజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలను రౌండ్‌ ‌రౌండ్‌కూ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక, బెట్టింగ్‌ ‌రాయుళ్లయితే ఏపీలోనే ఎక్కువగా బెట్టింగ్‌లు కట్టారు. అది కూడా ఎవరు గెలుస్తారన్న విషయం మీద కాదు.. ఈటల రాజేందర్‌కు ఎంత మెజారిటీ వస్తుందన్న పాయింట్‌పై బెట్టింగ్‌లు నడిచాయి.

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌.. ‌హుజురాబాద్‌ ఉపఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే ఇప్పటివరకు ఏ ఉపఎన్నికకూ ఏ పార్టీ కూడా ఇవ్వనంత ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చింది. కేసీఆర్‌ ఇప్పటివరకు ఏ ఎన్నికలకూ ఇవ్వనంత స్థాయిలో హుజురాబాద్‌కు వరాల జల్లు ప్రకటించారు. అటకెక్కించిన ప్రతిపాదనలు, పథకాలను కూడా బూజు దులిపి ఆచరణలోకి తెచ్చారు. ప్రధానంగా దళితబంధు పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. హుటాహుటిన జీవో జారీచేసి కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి దళితబంధు కింద ఆర్థిక సాయం  చేశారు. ఒక్కో కుటుంబానికి గతంలో కనీవినీ ఎరుగని రీతిలో పది లక్షలరూపాయలు ప్రయోజనం చేకూరుస్తామని ప్రకటించారు. అయితే, వేళ్లమీద లెక్కబెట్టగలిగేంత మందికే ఇప్పించారు. వాటికి కూడా సవాలక్ష నిబంధనలు, షరతులు, ఆంక్షలు విధించారు. కొత్త రేషన్‌ ‌కార్డులు, పింఛన్‌ ‌సదుపాయం కల్పించే వయసును 60 యేళ్లనుంచి 57 యేళ్లకు తగ్గించడం వంటి పెండింగ్‌ ‌హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. అయితే, అవి కూడా తాత్కాలికమే అన్న భావన తెలంగాణ జనంలో కలిగింది. ఉపఎన్నికల సమయంలో తప్ప ఆ తర్వాత వీటి పురోగతి కనిపించడం లేదు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నగదు వరద పారించిందన్న విమర్శలున్నాయి. ఈ వాదనను బలపరిచే వీడియోలు కూడా బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అయితే, ఈ స్థాయిలో ప్రయత్నాలు చేసినా, రాష్ట్రంలోని మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ హుజురాబాద్‌లో మోహరించి.. ప్రచార పర్వం సాగించినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించకపోవడం ఆ పార్టీలో, ముఖ్యంగా కేసీఆర్‌లో అసహనానికి కారణమైందంటు న్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ఇన్నాళ్లు వ్యవహరించిన తన సహజశైలికి భిన్నంగా మాట్లాడారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ చేయని రీతిలో విమర్శలు చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని వ్యక్తిగతంగా దూషించడం గమనిస్తే.. ఆయనలో అసహనం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుందంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, బీజేపీ గతంలో కంటే బలపడిందన్న సంకేతాలు వెలువడుతున్న కారణంగా పరిస్థితి తన చేజారి పోకూడదన్న కారణంగానే కేసీఆర్‌ ‌విమర్శల జడివాన కురిపించారని అంటున్నారు. ముఖ్యంగా రైతుల్లో ఆదరణ పెంచుకునే లక్ష్యంతో పదే పదే రైతు జపం చేసిన కేసీఆర్‌.. ‌తెలంగాణలో పండిన వరి పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న నినాదాన్ని అందుకున్నారు. అలాగే, పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను కేంద్రమే తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు.

వాస్తవానికి కేంద్రం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ.10 (లీటర్‌కు) ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించిన తర్వాత రాష్ట్రాలు కూడా వ్యాట్‌ ‌తగ్గించుకోవాలని, ఫలితంగా పెట్రోల్‌ ‌ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని విజ్ఞప్తి చేసింది. కేంద్రం వినతి మేరకు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాట్‌ ‌తగ్గించారు. కానీ, తెలంగాణలో ఇప్పటివరకూ తగ్గించలేదు. దానిపై ఇప్పటికే బీజేపీ కార్యాచరణ రూపొందించింది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇంధన ధరలపై వ్యాట్‌ ‌తగ్గించాలని నిత్యం డిమాండ్లు చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటినుంచి జనం దృష్టిని మళ్లించే లక్ష్యంతో కేసీఆర్‌ ‌తనదైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని చెబుతున్నారు. ఫలితంగా ‘ఒక్కదెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా ఇటు.. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓటమి నుంచి స్థానికులను ఆ వాతావరణం మరిచిపోయేలా ఉండటంతో పాటు బీజేపీని ఆత్మరక్షణలో పడేయడం కేసీఆర్‌ ‌లక్ష్యంగా తెలుస్తోంది. మరోవైపు దళితబంధు నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించవచ్చన్న వ్యూహం ఉండొచ్చంటున్నారు.

కేంద్రంపై నేరుగా విమర్శలు గుప్పించిన కేసీఆర్‌.. ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన్ను త్వరలోనే జైలుకు పంపస్తామని బండి సంజయ్‌ ‌పలుమార్లు వ్యాఖ్యానించారు. దానికి కేసీఆర్‌ ‌గట్టి కౌంటరిచ్చారు. తనను జైలుకు పంపి బతికి బట్టకడతావా? అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.  చాలావరకు వ్యక్తిగత విమర్శలు కొనసాగాయి. మరుసటిరోజు ఉదయం బండి సంజయ్‌ ‌కేసీఆర్‌కు కౌంటరిచ్చారు. కేంద్రం వరిధాన్యం కొనలేదని ఎక్కడా, ఎవరితోనూ చెప్పలేదని బాయిల్డ్ ‌రైస్‌ ‌మాత్రమే కొనబోమని పేర్కొన్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. అలాగే, కేసీఆర్‌ ‌విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. కానీ, అనూహ్యంగా అదేరోజు మధ్యాహ్నం మళ్లీ మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్‌.. ‌మరోసారి బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ఇలాగే ఇస్తూనే ఉంటానని ప్రకటించారు.

దళితబంధు ఊసే లేదు!

గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేళ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది, ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను అధికారులకు కాకుండా.. టీఆర్‌ఎస్‌ ‌నేతలకు అప్పగించింది. నగదు సాయం ప్రభుత్వమే చేసినా, లబ్ధిదారుల ఎంపిక, డబ్బుల పంపిణీ మాత్రం టీఆర్‌ఎస్‌ ‌నేతలు చేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్‌ ఈ ‌పథకాన్ని ప్రకటించింది. అయితే, నోటిఫికేషన్‌ ‌విడుదలయ్యాక.. షరామామూలుగానే ఎన్నికల కమిషన్‌ ‌వరదసాయం పంపిణీని నిలిపి వేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మిగిలిన బాధితులందరికీ వరదసాయం పంపిణీ చేస్తామని కేసీఆర్‌, ‌కేటీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. కానీ ఫలితాల తర్వాత ఆ పథకం బుట్టదాఖలయింది. మరోవైపు.. జీహెచ్‌ఎం‌సీ మాత్రం మెజారిటీ బాధితులకు ఆ సాయం డబ్బులు అందించామని లెక్క చూపించింది. ఇక, టీఆర్‌ఎస్‌ ‌నాయకులైతే క్షేత్రస్థాయిలో ఎంతగా చెలరేగిపోవాలో అంతగా చెలరేగిపోయారన్న ఆరోపణలు భారీగా వచ్చాయి. మంత్రులను చాలా ప్రాంతాల్లో జనం అడ్డుకున్నారు. తమకు వరదసాయం అందలేదని మొరపెట్టుకున్నారు. కానీ, వాళ్ల వేదన అరణ్యరోదనే అయింది.

ఇప్పుడు హుజురాబాద్‌లో దళితబంధు పరిస్థితి కూడా అలాగే  తయారయింది. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు కూడా ఎన్నికల తంతు ముగియగానే.. దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కేసీఆర్‌ ‌పదే పదే ప్రకటించారు. కానీ, ఎన్నికలు ముగిసి ఆయన చెప్పిన నవంబర్‌ 4‌వ తేదీ గడిచిపోయినా దళితబంధు తిరిగి మొదలైన సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. కేసీఆర్‌ ‌మీడియా ముందుకు వచ్చి ఆ అంశాన్ని తెరమరుగుచేసే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram