తెలంగాణ ప్రజలే కాక, దేశ ప్రజలందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉపఎన్నికల ఫలితం వెలువడింది. ఊహించినట్టుగానే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అఖండ విజయం సాధించారు. ఆయనకు 24,068 ఓట్ల భారీ మెజార్టీని ప్రజలు ఇచ్చారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వందల కోట్లు ఖర్చుపెట్టినా అధికార టీఆర్‌ఎస్‌కు చివరకు ఓటమి తప్పలేదు.

ఈటలకు 1,06,213 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌కు 82,348 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌ ‌నుంచే స్పష్టమైన మెజారిటీ కనబరిచిన ఈటల రాజేందర్‌ ‌చివరి వరకు అదే ఊపును కొనసాగించారు. రెండు రౌండ్‌లలో మాత్రం టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్‌ ‌పరువు కోల్పోయింది.

ఈ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం, వందల కోట్ల ధనం, పదవుల పందేరం, అధికారబలం, బలగం.. ఇవేవీ ప్రజాతీర్పును మార్చలేకపోయాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

———————–

తెలంగాణ రాష్ట్ర సమితి. వాస్తవానికి అదో ఉద్యమ పార్టీ. కానీ, ఇప్పుడు దేశంలోనే దశాబ్దాల పాలనలోనూ ఆరితేరిన రాజకీయ పార్టీలనూ ప్రభావితం చేసే స్థాయిలో, ఆలోచించే స్థాయిలో కేవలం రెండు దశాబ్దాల్లోనే విప్లవాత్మక మార్పులకు కేంద్రబిందువుగా మారిన ఫక్తు రాజకీయ పార్టీ. హామీలు, భరోసాలు, పథకాల ప్రకటనలకు.. అలాగే తాను ఇచ్చిన మాటలకు, సవాళ్లకు, ఆచరణకు అసలు పొంతన ఉండని రాజకీయ నాయకులకు బ్రాండ్‌గా కేసీఆర్‌ను చెప్పుకుంటారనేది బహిరంగ రహస్యమే. అంతేకాదు, ప్రజల నాడిని పసిగట్టే నాయకుడిగా, సందర్భాన్ని బట్టి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహకర్తగా కూడా కేసీఆర్‌కు పేరుంది. కేసీఆర్‌ను ఎవరెన్ని మాటలన్నా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెంతగా తిట్టిపోసినా.. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం టీఆర్‌ఎస్సే ఆధిక్యంలో ఉండటం అనేది ఓ కనికట్టుగా కూడా తెలంగాణలో చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానికి హుజురాబాద్‌ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రసమితిని నిలువెల్లా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. ప్రభుత్వమంతా ఒక్కటయినా, పార్టీ మొత్తం ఒకే నియోజకవర్గంలో తిష్ట వేసినా, మంత్రుల నుంచి మొదలుకొని ప్రజాప్రతి నిధులందరూ హుజురాబాద్‌లోనే మకాం వేసినా.. గ్రామం, వార్డు కాదు.. ఓటరు స్థాయిలో టీఆర్‌ఎస్‌ ‌ముఖ్యనేతలు బుజ్జగించినా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడింది తెలంగాణ రాష్ట్రసమితి. తెలంగాణ సంస్కృతికి, ఆకాంక్షలకు, లక్ష్యాలకు, తానే ప్రతినిధిని అని భావించే టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి పతనం మొదలయ్యింది. ఇది ఇప్పటి విశ్లేషణ కాదు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు ఖరారైన నాటినుంచే సాగుతున్న రాజకీయ విశ్లేషణ. అందుకే కేసీఆర్‌ ‌మందీమార్బలాన్ని మొత్తం దింపినా, అధికార వ్యవస్థను అవకాశం ఉన్నంతవరకు వినియోగించు కున్నా, తనవైన తెలివైన వ్యూహాలన్నింటినీ రంగరించినా ఫలితం దక్కలేదు. పోలింగ్‌ ‌రోజు.. స్థానికులు బయటి వ్యక్తులందరినీ బయటకు తరిమి తరిమి కొట్టిన దృశ్యాలు మీడియాలో కనిపించాయి. ఈ పరిణామాలే పోలింగ్‌ ‌సరళిని అంచనా వేసేందుకు కూడా దోహదపడ్డాయి. అంతేకాదు, గతంలో కంటే పెరిగిన పోలింగ్‌ ‌శాతం కూడా టీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక ఓటుగా మారిన వైనం ఫలితాల్లో సాక్షాత్కరించింది.

ఓటుకు నోటు హక్కయ్యిందెవరి వల్ల?

అంతేకాదు, ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఓటు వేసేందుకు డబ్బులు డిమాండ్‌ ‌చేయడం తమ హక్కు అన్న పరిస్థితులు హుజురాబాద్‌లో నెలకొన్నాయి. ఓటుకు 6వేల చొప్పున పంపిణీ చేశారని కొందరు, వాటిలోనూ స్థానిక నేతలు కొంత డబ్బును కాజేశారని ఇంకొందరు, తమకైతే అసలు డబ్బులే ఇవ్వలేదని, తాము ఓటర్లం కాదా? అని ప్రశ్నించిన మరికొందరు.. ఇలా ఓటర్లు బాహాటంగా మీడియా ముందే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కడం కొత్త సంప్రదాయానికి వేదికగా నిలిచింది. ఈ పరిణామం ఇంతటితోనే ఆగలేదు. డబ్బులు అందని వాళ్లు స్థానిక ప్రజా ప్రతినిధులను ఘెరావ్‌ ‌చేయడం, బాహాటంగా నిలదీయడం, రోడ్డెక్కి ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యవాదులను ముక్కున వేలేసుకునేలా చేసింది. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ ‌నేతల ఇళ్లముందు ఓటర్లు నిరసనలకు దిగారు. ఇక, చాలా గ్రామాల్లో పోలింగ్‌ ‌రోజు కూడా ఏదో ఒక పార్టీ వాళ్లు ఇంటికొచ్చి డబ్బులిచ్చిన తర్వాతే ఓటు వేసేందుకు కదలడం కూడా విస్తృత చర్చను లేవనెత్తింది. ఓటర్లకు కవర్లు ఇచ్చిన వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. మీడియాలోనూ ఈ తతంగంపై వార్తలు ప్రసారమయ్యాయి.

అసలు హుజురాబాద్‌ ఉపఎన్నిక కేసీఆర్‌ ‌కోరి తెచ్చుకున్నదన్నది విశ్లేషకుల మాట. ఆది నుంచీ టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ ‌వెన్నంటి ఉంటూ వచ్చిన ఈటల రాజేందర్‌ను మంత్రి పదవినుంచి బర్తరఫ్‌ ‌చేయడం, తనంతట తానుగా రాజీనామా చేసే పరిస్థితి కల్పించడం, భూకబ్జా కేసులు పెట్టించడం వంటి కారణాలతో కేసీఆర్‌ ‌తప్పటడుగు వేశారని చెబుతున్నారు. అయితే, మొదటినుంచీ పార్టీకి, కేసీఆర్‌కు అండదండగా ఉంటూ వస్తున్న ఈటల.. తనకు జరిగిన పరాభవాన్ని సీరియస్‌గా తీసుకొని కేసీఆరో, తానో అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. అందుకే కేసీఆర్‌ ‌కూడా హుజురాబాద్‌ను ‘ఇజ్జత్‌కే సవాల్‌’‌గా తీసుకున్నారు. ప్రభుత్వ ఖజానా గురించి ఆలోచించలేదు. అధికార యంత్రాంగం పరిమితుల గురించి పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులందరినీ ఒకే ఒక్క నియోజకవర్గం కోసం భాగస్వాములను చేశారు. అందుకే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అయినప్పటికీ.. పోటీ మాత్రం కేసీఆర్‌, ఈటల మధ్యే జరిగిందన్న స్థాయిలో ప్రచార పర్వం సాగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా ఈ వాదననే ప్రతిబింబించాయి. దాదాపు ఐదు నెలలపాటు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, ప్రజాప్రతినిధులందరూ హుజురాబాద్‌ ‌వేదికగా కార్యకలాపాలు సాగించారు. ట్రబుల్‌షూటర్‌గా పేరున్న, పార్టీలో ఉన్నప్పుడు ఈటలకు అత్యంత సాన్నిహిత్యంగా ఉండే హరీష్‌రావుకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. దళితబంధు పథకాన్ని హుటాహుటిన ప్రకటించి ఒక్క హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికే రెండువేల కోట్ల రూపాయలు కేటాయించారు. అంతేకాదు, ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ఫైలుకు దుమ్ము దులిపారు. పింఛన్‌ ‌వయసును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని.. అప్పటికప్పుడు దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఇవన్నీ చేస్తున్నా ఈటల రాజేందర్‌కే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిసి.. నియోజకవర్గంలో మొదటినుంచీ అండగా ఉంటూ వస్తున్న ఈటల రాజేందర్‌ అనుచరులందరినీ నయానో, భయానో టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకొని ఈటలను ఒంటరిని చేయడంలో సఫలీకృతమయ్యారు. కానీ, ఓటర్ల నాడిని మాత్రం మార్చలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ హుజురాబాద్‌ ఎన్నికల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని అంచనా వేస్తున్నారు. ఇలా.. ఎన్నికలను అత్యంత ఖరీదైనవిగా మార్చిన రాజకీయపార్టీగా టీఆర్‌ఎస్‌ ‌పేరును దక్కించుకుంది. అదీ కేవలం ఉప ఎన్నిక, ఒకే నియోజకవర్గం కోసం ఇంతగా ఖర్చుచేయడమన్నది దేశంలోనే మొదటి సారి అంటున్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. మారి పోయాయనేకంటే కేసీఆర్‌ ‌మార్చేశారన్నది సబబు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ గెలుపుకోసం 25 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశారన్న వాదనలు న్నాయి. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించడం కోసం వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని, ఇటీవల నాగార్జున సాగర్‌ ‌నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికలోనూ కాంగ్రెస్‌ ‌తరఫున పోటీ చేసిన కె.జానారెడ్డిని ఓడించడానికి కూడా వంద కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న పట్టుదలతో వందల కోట్లు ఖర్చు చేశారని సొంతపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇకపోతే, హుజురాబాద్‌ ఉపఎన్నికలో మొత్తం 86.33 శాతం పోలింగ్‌ ‌నమోదు అయింది. మొత్తం 2,36,837 ఓట్లు ఉండగా 2,05,053 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018తో పోలిస్తే ఈసారి పోలింగ్‌ ‌శాతం 2.5 వరకు పెరిగింది.

టీఆర్‌ఎస్‌ ఆశయం – 20 యేళ్ల పయనం

అసలు టీఆర్‌ఎస్‌ ఆశయాలేంటి? ఆవిర్భావం నాటి బాసలేంటి? ప్రజలకు ఇచ్చిన భరోసా ఏంటి? ప్రకటించిన హామీలేంటి? అనే వాటితో పాటు.. కేసీఆర్‌ ‌తప్పిన మాటలెన్ని? బుట్టదాఖలు చేసిన హామీలెన్ని? అవకాశవాదంగా మార్చుకున్న పథకాలేంటి? వెసులుబాటు ఉన్నా అమలు చేయని పనులేంటి? అనేవి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి ఓ వాహకంగా ఉపయోగపడ్డ ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌కి పేరుంది. తమకు కావాల్సింది అధికారం, వ్యామోహం, రాజకీయం కాదని.. కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం, నిరుద్యోగ యువత భవిష్యత్తు, పంటపొలాలకు సాగునీరు, రాష్ట్రానికి సంపూర్ణమైన నిధుల కేటాయింపే అసలైన లక్ష్యమని కేసీఆర్‌ అనేకసార్లు ప్రకటించు కున్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమమని కరాఖండిగా చెప్పారు. తెలంగాణకు కాపలా కుక్క మాదిరిగానే ఉంటానని పదే పదే చెప్పుకున్నారు. అణగారిన వర్గాలకు చెందిన దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని బాస ఇచ్చారు. అనేక సార్లు తన ప్రసంగాలతో ప్రజలను భావోద్వేగాలకు గురిచేశారు. కానీ, అధికారం రాగానే ఆ మాటలు, బాసలు, హామీలన్నీ పటాపంచలై పోయాయి. తనదైన వ్యూహాలు తెరమీదకు వచ్చాయి. తనదైన అధికార కార్యాచరణ అమలయింది. ఇప్పటికీ అమలవుతూ వస్తోంది.

రాజకీయ లబ్ధి కోసమే పథకాలు

ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడల్లా పథకాలు ప్రకటించి ఓసారి, పథకాల అమలు ప్రారంభించి మరోసారి, సెంటిమెంట్‌ను రగుల్చుతూ ఇంకోసారి కేసీఆర్‌ ‌లబ్ధి పొందాలనుకుంటారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏవైనా ఉపఎన్నికలు వచ్చినప్పుడో, సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడో, ప్రభుత్వం చిక్కుల్లో పడిందన్న సందర్భం ఎదురైనప్పుడో అప్పటికప్పుడు పథకాల గురించి మాట్లాడటం, అమలు చేయడం, ఓ సరైన కార్యాచరణ లేకుండా అప్పటికప్పుడు కొంతమంది లబ్ధిదారులను మాత్రం ఎంపికచేసి సాయం చేయడం, మిగతా వర్గాల్లో ఆశను రేకెత్తించి ఎన్నికల్లో గట్టెక్కాలని చూడటం టీఆర్‌ఎస్‌కే చెల్లుతాయి.

తాజాగా దళితబంధు పథకం కూడా ఆ కోవలోనికే చేరింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికలు రాగానే.. దళితబంధు పథకాన్ని తెరమీదకు తెచ్చారు కేసీఆర్‌. అతితక్కువ మందికి, అది కూడా టీఆర్‌ఎస్‌ ‌వర్గాల అనుయాయు లకు మాత్రమే సాయం అందించారన్న ఆరోపణలున్నాయి. అందులోనూ సవాలక్ష ఆంక్షలు పెట్టి దళితులను తప్పుదారి పట్టించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక, షరామామూలుగానే ఎన్నికల కమిషన్‌ ‌దళితబంధు పథకాన్ని పోలింగ్‌ ‌సమయం వరకూ ఆపేసింది. దానిని కూడా తమకు అనుకూలంగా మలచుకున్న కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు.. ఉపఎన్నిక ఫలితం వచ్చిన మరుక్షణం నుంచే దళితబంధు అమలు చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని వర్తింప జేస్తామని ప్రకటనలు చేశారు. కానీ, ఇది కూడా జీహెచ్‌ఎం‌సీ వరద బాధితుల సాయం మాదిరిగానే అటకెక్కుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఒంటెత్తు పోకడలు..

తన ఒంటెత్తు పోకడలతో ఆది నుంచీ తనకు అండగా ఉన్న, బలమైన, కీలకమైన నేతలను కూడా కేసీఆర్‌ ‌పక్కా వ్యూహం ప్రకారం దూరం చేశారన్న ప్రచారం ఉంది. చీమ చిటుక్కుమన్నా కేసీఆర్‌కు తెలియాల్సిందేనని, అడుగు వేయాలన్నా కేసీఆర్‌ ఆదేశాలు లేనిదే కుదరదన్న స్థాయిలో నియంతృత్వం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. ఎవరైనా తిరగబడితే ఇక వారికి పార్టీలో భవిష్యత్తు లేనట్లే. విబేధాల కారణంగా పార్టీలో నెంబర్‌ 2 ‌స్థాయిలో ఉన్న ఆలె నరేంద్రను బహిష్కరించడంతో రియల్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పేరుతో ఆయన మరో పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి తన పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపి ఆ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల వరకు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమెపై కూడా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ బహిష్కరణ వేటు వేసింది. మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌ ‌కుమార్‌ ‌టీఆర్‌ఎస్‌ను వీడి తెలంగాణ విమోచన సమితి పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

పార్టీకి ప్రజల్లో ఇన్నాళ్లూ గట్టి పట్టు ఉండటం వల్లే ఎవరూ ఎదురు మాట్లాడలేకపోతున్నామని సాక్షాత్తూ మంత్రులే చెప్పుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. ఓ సమయంలో మీడియా ముందు నోరు జారినందుకు దివంగత నాయిని నర్సింహారెడ్డికి రెండోసారి తిరిగి హోంశాఖ అప్పగించలేదని, తన ఆదేశాలు ధిక్కరించాడన్న చిన్నపాటి కారణానికే మంత్రి, డిప్యూటీ సీఎం కూడా అయిన రాజయ్యను ఏకంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేశారని, ఇప్పుడు తాజాగా ఈటల రాజేందర్‌ను బలిపశువును చేయడానికి ప్రయత్నించారని విమర్శకులు వివరిస్తున్నారు. కానీ ఈటల విషయంలో కేసీఆర్‌ ‌వేసిన ఎత్తులు బెడిసికొట్టాయి.

ఇప్పుడు ప్లీనరీ ఎందుకు పెట్టారు?

వాస్తవానికి టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది ఏప్రిల్‌ 27‌వ తేదీ. 20యేళ్ల పండుగ చేసుకోవాలంటే ఆ తేదీన చేసుకోవాలి. లేదంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్‌ ‌రెండో తేదీన ప్లీనరీ నిర్వహించు కోవాలి. కానీ, ఎటూ కాకుండా.. అక్టోబర్‌ 25‌వ తేదీని ఎంచుకోవడం వెనుకే తెలియని కేసీఆర్‌ ‌వ్యూహం ఉంది. అక్టోబర్‌ 30‌వ తేదీన హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ‌తలపెట్టిన బహిరంగసభ ఎన్నికల కమిషన్‌ ‌కఠిన నిబంధనలతో అనివార్యంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, అప్పటికప్పుడు ప్లీనరీ పేరిట తెలంగాణ రాష్ట్రసమితి ముఖ్యనేతలను ఒక్కటి చేయడం, పార్టీ శ్రేణుల్లో జోష్‌ను పెంచేందుకే ప్లీనరీ అంటూ ప్రకటనలు చేసి.. హైదరాబాద్‌ను గులాబీమయంగా మార్చేశారు. ఒకరకంగా హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం పార్టీ శ్రేణులందరినీ సన్నద్ధం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

 కమ్ముకున్న అభద్రత

తొలుత ఉద్యమపార్టీ అని చెప్పుకున్న టీఆర్‌ఎస్‌.. ‌ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తర్వాత కేసీఆర్‌ ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేకుండా పోయారు. అందుకే అనేక సార్లు పార్టీ నేతల బహిష్కరణలు కొనసాగాయి. పలువురు చీలిక పార్టీలు పెట్టారు. ఇంకొందరేమో.. తమ కర్మ అనుకొని కేసీఆర్‌ ఎం‌తగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా పార్టీనే అంటిపెట్టుకొని ఉంటున్నారు. అయినా, టీఆర్‌ఎస్‌ అభద్రతాభావానికి గురవుతోంది. దాని పర్యవసానమే ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌. ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఓబీసీల ప్రతినిధి, సుదీర్ఘ కాలంగా కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న కీలక నేత అయిన ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తొలిగిం చిన తీరు, టీఆర్‌ఎస్‌లో ఉన్న అభద్రతాభావానికి పరాకాష్టగా నిలిచింది.

ఆది నుంచీ ఇదే భావనతో ఉన్న కేసీఆర్‌.. ‌తనదైన వ్యూహాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేశారు. వైసీపీని కూడా నామ రూపాల్లేకుండా చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీన పరిచేందుకు ‘ఆకర్ష్’ ‌వల విసిరారు. ఈ వలలో చిక్కి కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులందరూ విలవిల్లాడి పోయారు. కానీ, ఒక్క బీజేపీకి చెందిన వాళ్లను మాత్రం ఆపరేషన్‌ ఆకర్ష్ ఏమీ చేయలేకపోయింది. సిద్ధాంతాలు, నైతికతనే ప్రామాణికాలుగా పెట్టుకున్న ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌ ‌వేసిన వలకు చిక్కలేదు. ఇప్పుడు అదే కాషాయ పార్టీ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపిస్తోంది. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ‌గెలుపు కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తోంది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో జనం టీఆర్‌ఎస్‌ ‌పట్ల తీవ్రఅసంతృప్తితో ఉండటం అధికార పార్టీని అచేతనంగా మార్చబోతోంది. పార్టీ 20 ఏళ్ల వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఈ తీర్పు తెరాసకు ఇబ్బంది కలిగించే పరిణామమే.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram