రాష్ట్రంలో ఒకవైపు ధరలు, నిరుద్యోగం పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే మరోవైపు అధికార వైకాపా, తెదేపాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. అధికారం దక్కితే ఇక రాష్ట్రం మొత్తం తమకే సొంతమైనట్లు పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పేరుకే ఉంది. ధనస్వామ్యం అమలవుతోంది. అధికారాన్ని ధన సంపాదనకు ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. అధికారం రుచిమరిగిన ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్న అరాచకాలు, అక్రమాలకు అంతులేకుండా పోయింది. తాను అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చేసిన దాడులు, అధికారం కోల్పోయాక తామే ఎదుర్కొంటున్న వైనం ఇప్పుడు రాష్ట్రంలో కళ్లముందు కనిపిస్తోంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి ఆ సందర్భంలో తిరుమలకు వచ్చిన అప్పటి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్‌షాపై దాడులకు పురమాయించిన చంద్రబాబు ఇప్పుడు అదేరకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన వైఫల్యాలను పరిష్కరించుకోలేక, ఆరోపణ చేసిన వారిపై దాడులకు దిగి వైకాపా ప్రభుత్వం కూడా అరాచకాలకు దిగింది. రెండు పార్టీలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధికై తిట్ల పంచాగం, పరస్పర దాడులకు దిగి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి.

వైకాపా, తెదేపాల మధ్య జరుగుతున్న పరస్పర దాడుల ఉదంతం నాయకుల బూతులతో ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గుర్తుండిపోయే పాలనను అందిస్తామన్న వైకాపా ప్రభుత్వం దేశంలో రక్తాక్షరాలతో లిఖించేలా పాలిస్తోంది. దేశాన్ని దోచుకుతిన్న విదేశీ ముష్కర పాలకులను మించిపోయింది. అధికారంలోకి వచ్చిందే తడవుగా వనరులను ఆక్రమించుకుంది. వైకాపా నేతలు పేదలకు పప్పుబెల్లాల్లా కొంత విదిల్చి మిగతా మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై గుండాలతో దాడులు చేయిస్తున్నారు. అయినా లొంగకుంటే పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టించి లాకప్‌లలో నెడుతున్నారు. ఈ క్రమంలో ప్రశ్నించిన వారిపై అధికారపార్టీ మంత్రులే స్వయంగా బూతు పంచాంగంతో విరుచుకుపడ్డారు. దీంతో ప్రతిపక్షం కూడా తిట్లు దండకం ప్రారంభిం చింది. రెండు పార్టీల నేతలు మీరు ఒకటి అంటే.. మేము పది అనగలమని తిట్టుకున్నారు. ఇప్పుడు దాడుల దశకు వచ్చేశారు. సమస్యలను ప్రస్తావిం చడం, ప్రశ్నించడం, విమర్శించడం ప్రతిపక్షాలు, జర్నలిస్టుల పని. అంతేకాని ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా భజన చేయాలా? విమర్శిస్తే బూతులు తిట్టి, భౌతిక దాడులకు దిగుతారా? ఇలాగైతే ప్రతిపక్ష పార్టీలకు రక్షణ ఎలా ఉంటుంది? అవి ఎలా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవు?
ఇంత వివాదానికి కారణమైన అసలు సమస్య మాదకద్రవ్యాల గురించే వచ్చింది. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అవి విజయవాడ చిరునామాతో వచ్చాయి. విదేశాలకు కూడా డ్రగ్స్‌ ఎగుమతి అవుతున్నాయి. నరసాపురం నుంచి ఆస్ట్రేలియాకు మాదక ద్రవ్యాలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో గంజాయి పంట ఒక పరిశ్రమగా సాగుతోంది. విశాఖ మన్యం, ఆంధ్ర`ఒడిశా సరిహద్దుల్లో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయిని పండిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులే చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 25 వేల ఎకరాల్లో గంజాయిని పండిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎకరా పంటకు రూ.5 లక్షలు ఖర్చుచేస్తే రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందట. సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 250 కిలోలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు వెయ్యి కిలోల పొడి గంజాయి దిగుబడి వస్తుంది అంటున్నారు. ఈ ప్రాంతంలోని గిరిజనులకు డబ్బు ఎరచూపి కొందరు ఇక్కడ గంజాయిని పండిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తు న్నాయి. ఇక్కడ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా రవాణా అవుతోంది. ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో గంజాయిని పట్టుకుంటే ఇది ఆంధ్ర నుంచే వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణాలో పట్టుబడ్డ గంజాయి ఏపీనుంచే వచ్చిందని నల్గొండ ఎస్పీ రంగనాధ్‌ ప్రకటించారు. అయితే దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు సరికదా విజయసాయిరెడ్డి నల్గొండ పోలీసులనే తప్పుపట్టారు. రాజకీయాలు అంటగట్టారు. ప్రభుత్వం సరిగా స్పందిస్తే ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించవు. కాని అది ప్రభుత్వంలో లోపించింది. విమర్శలను తట్టు కోవడం లేదు. పరస్పర తిట్ల దండకంలో గంజాయి, మాదకద్రవ్యాల రవాణా అంశాన్ని పక్కదారి పట్టించారు. గంజాయి, మాదకద్రవ్యాల విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగి దేశం అంతా తెలిశాక ఒత్తిడి పెరిగిపోయి ఇప్పుడు విశాఖమన్యం ప్రాంతంలో గంజాయి పంటపొలాలపై పోలీసులు దాడులకు దిగారు.

మాకు బీపీ రాదా?

తమను విమర్శిస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని అందువల్లే వారు దాడులకు దిగారని, ఏదైనా చేస్తారని, స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తోంది. ముఖ్యమంత్రి తనో రాజ్యాంగ పదవిలో ఉన్నానని, తాను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ఆలోచించరాదని ఆయనకు గుర్తు చేయాల్సి రావడం శోచనీయం. అయితే, దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యమంత్రి తన చర్యలతో బీపీ తెప్పించలేదా? ఇసుకకు తాత్కాలికంగా కొరతను సృష్టించి ఆరు నెలలపాటు ఆపేశారు. నిర్మాణరంగంపై ఆధారపడిన 20 లక్షల పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయి అల్లాడిపోయారు. కార్మికులు, వారి కుటుంబాలకు బీపీ రాలేదా? గతంలో సగటున రూ.3 వేలకు దొరికే ట్రాక్టర్‌ ఇసుక ఇపుడు రూ.7 వేలకు ఎగబాకింది. అసలు బ్లాక్‌లో తప్ప సరైన ఇసుక లభించడం లేదు. సిమెంట్‌ బస్తా ధర రూ.300 నుంచి రూ.450కి పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికం. కంకరు, ఇతర భవన నిర్మాణసామాగ్రి మొత్తం రెట్టింపు ధర అయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో బస్తా ధర రూ.380 మాత్రమే. మరి ఇళ్లను నిర్మించు కోవాలనుకునే ప్రజలకు బీపీ రాలేదా?

మందుబాబులకు బీపీ రాలేదా?

రాష్ట్రంలో మందుబాబులకు బీపీ పెరిగిపోతూనే ఉంది. గత రెండున్నరేళ్ల నుంచి ఎక్కడాలేని లిక్కర్‌ బ్రాండ్లు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లేని బ్రాండ్లను ప్రత్యేకంగా తెచ్చారు. ఈ లిక్కర్‌ను వైకాపా మాఫియా తయారుచేసి ప్రభుత్వ సంస్థల ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అని ధరలు 3-4 రెట్లు పెంచి సొంత వ్యాపారాలు చేస్తున్నారు. మద్య నిషేధం అమలుచేస్తామని దానిని అటకెక్కించ డమే కాక మద్యం ధరలు రెట్టింపు చేసి తమ భర్తల జేబులు లూటీ చేయడంపై మహిళలకు బీపీ రావడం లేదా?

రైతులకు బీపీ రాలేదా?

తాము పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ధాన్యానికి మద్దతు ధర రాక, ధాన్యం కొనేవారు లేక రైతులు గతేడాది తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ధర 21 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా నేటికీ ఇంకా బకాయి ఉంది. ప్రభుత్వంపై రైతులతో సహా భాజపా చేసిన ఒత్తిడి ఫలితంగా 3 నెలల తర్వాత చెల్లింపులు జరిగాయి. వ్యవసాయ సహకార పథకాలు నిలిపివేస్తే రైతులకు బీపీ రాలేదా? రాయలసీమలో ఉద్యానపంటలకు ప్రోత్సాహకాలు నిలిపివేశారు. రెండేళ్లుగా యంత్ర పరికరాలు ఇచ్చే పథకం నిలిచిపోయింది. సూక్ష్మపోషకాలపై సబ్సిడీ ఎత్తివేత, వ్యవసాయభూముల్లో పంపుసెట్లు సమకూర్చే జలకళ పథకం అమలులో జాప్యం. ఇక ఆర్‌బికెల్లో ఎరువులు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్న మాటల్లో వాస్తవం లేదు. కాంప్లెక్స్‌ ఎరువులు, డీఏపీ, యూరియా, పొటాష్‌లను ఎక్కువ ధరలకు అమ్ము తున్నారు. రాష్ట్రంలోని 32 లక్షల మంది కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు, ఇ-పంట రుణాలు, రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు. వారికి రైతు భరోసా వర్తింపజేయలేదు. భూ యజమాని సంతకం తప్పనిసరంటూ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. కౌలు రైతులు ఎరువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత హక్కు కోసం ప్రభుత్వం చేస్తున్న భూముల రీ సర్వే అంటేనే ప్రజలకు వణుకు, బీపీ మొదలైంది. వారి భూములు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో ఈ పథకం అంటేనే యజమానులు ‘మా భూ హక్కులు పదిలమేనా?’ అని భయ పడుతున్నారు.

హిందువులకు రాదా బీపీ?

రాష్ట్రంలో 140కి పైగా హిందువుల ఆలయాలను పథకం ప్రకారం ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైకాపా ఎమ్మెల్యేలు ఆవులను కోసుకు తింటామన్నారు. హిందువులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్‌ విగ్రహాన్ని ప్రొద్దు టూరులో ఏర్పాటు చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే శంకుస్ధాపన చేసారు. తితిదే ఆస్తులను తాకట్టుపెట్టి అప్పు తీసుకుందామని ప్రయత్నించారు. నేర చరితులను సభ్యులుగా నియమించి తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ప్రజలు పన్నులుగా చెల్లించిన ఆదాయాన్ని క్రైస్తవ ఫాదర్లు, ముస్లిం ఆచార్యులకు జీతాలుగా ఇస్తున్నారు. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తే భాజపా ఉద్యమాలు చేయాల్సివచ్చింది. ఇన్ని చేస్తూ కూడా పలు సందర్భాల్లో హిందువులను అవమానాలకు గురిచేస్తున్నారు. మరి హిందువులకు రాదా బీపీ?

అమరావతి రైతులకు బీపీ రాలేదా?

రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. వేల కోట్లతో నిర్మాణాలు ప్రారంభమైనా నిధులు లేవంటూ విశాఖ, కర్నూలుల్లో కూడా ఏర్పాటుచేస్తామని చెప్పి 3 రాజధానులను ప్రకటించారు. 600 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోలేదు. పైగా ఇది ముంపు ప్రాంతమన్నారు. స్మశానంలా ఉందన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులను జుట్టుపట్టుకుని ఈడ్చుకు వెళ్లి జైళ్లలో పడేశారు. మరి ఆ రైతులకు రాలేదా బీపీ?

ట్రూ అప్‌ ఛార్జీలతో బీపీ!

ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో యూనిట్‌కు రూ.1.23 పైసల ఛార్జీలు పెంచి విద్యుత్‌ వినియోగదారులపై మరింత ఆర్థికభారం మోపారు. ప్రతి మీటరుకు కనీసం రూ.200 నుంచి రూ.700 వరకు అదనపు భారం పడిరది. దాదాపు 8 నెలల పాటు ఈ ఛార్జీలు చెల్లించాలి. ఇప్పుడు వాడే కరెంటుకు కూడా వచ్చే ఏడాదిలో ట్రూ అప్‌ ఛార్జీలు పెంచుతారు. ఇలా బిల్లు చెల్లించేటప్పుడు విద్యుత్‌ వినియోగదారులకు బీపీ రావడం లేదా? అలాగే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో వస్తువులు కొనేటప్పుడు బీపీ వస్తూనే ఉంది.

తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

By editor

Twitter
Instagram