రాజధాని అమరావతి రైతులు తలపెట్టిన అమరావతి – తిరుమల మహా పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాని రైతులే రాళ్లేస్తారని, ఘర్షణలు జరుగుతాయని ప్రభుత్వం చెప్పడం విడ్డూరం. పోలీసులు ఉన్నది దేనికి? ప్రజలను, శాంతిభద్రతలు పరిరక్షించడానికి కాదా? ఈ ప్రశ్న ఇప్పుడే కాదు రెండేళ్ల నుంచి రాష్ట్రంలోని ప్రజలందరిని వేధిస్తోంది. రాళ్లేసే సంగతి తెలిసిన ప్రభుత్వానికి రాళ్లేసే వారిని గుర్తించి ఈ విషయాన్ని నిరూపించి వారిని అదుపులోకి తీసుకోవచ్చు కదా! అది మాత్రం చేయరు. పోలీసులు అధికారపార్టీ చెప్పినట్లు వినడం మామూలైపోయినా, వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా పెరిగిపోయింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసు వ్యవస్థను తన కార్యకర్తల్లా ఉపయోగించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు చేస్తున్న కవ్వింపు చర్యలు తాము చేపట్టిన అమరావతి -తిరుమల మహా పాదయాత్రను భగ్నం చేయవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్రకు వాడవాడలా మద్దతు పలికేవారిని కూడా ర్యాలీలో పాల్గొనేవారి సంఖ్యతో కలిపేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు, ప్రభుత్వం హెచ్చరి స్తోంది. ఇది తమ భావప్రకటనా స్వేచ్ఛను హరించి నట్లుగానే రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇలాగే ఆలోచిస్తే రాజకీయపార్టీలు చేపట్టిన పాదయాత్రలు ఎవరూ చేసేవారు కాదు. అధికారం లభించేది కాదు. ఈ విషయాన్ని అధికారపార్టీ గుర్తించింది కాబోలు ప్రజల వ్యతిరేకత సంఘటిత మవుతోందని భావించి భయపడుతుందా అనేది కూడా సందేహం కలుగుతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తే, నివురుకప్పిన నిప్పులా ఉన్న ప్రజాగ్రహం దావానలంగా మారి ప్రభుత్వాన్ని కబళించకమానదని అందరూ హెచ్చరిస్తున్నారు.

విభజిత ఆంధప్రదేశ్‌కు ఏడేళ్లయినా ఇంత వరకు రాజధాని లేదు. రాజధాని ఏదంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి దాపురించింది. ఇప్పుడు రైతులు జరుపుతున్న మహాపాదయాత్ర కూడా ఈ రాజధాని వల్ల వచ్చిందే. 2013లో కేంద్ర ప్రభుత్వం రాజధానిని ప్రకటించక, దానిని నిర్మించకుండా తెలంగాణను ఆంధప్రదేశ్‌ ‌నుంచి విడదీసింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉం‌టుందని చెబుతూ, హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం ఏపీకి రాదని చెప్పారు. ఈ దుర్మార్గమే నేటి పరిస్థితికి కారణం. నాటి కేంద్ర ప్రభుత్వమే ఏపీకి మరో రాజధానిని నిర్మించి అప్పుడు తెలంగాణను విడదీస్తే ఈ అనిశ్చితి ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయాక 10 సంవత్స రాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి రాజధాని నిర్మించేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో తాత్కాలిక రాజధాని కార్యక్రమాలు ప్రారంభించారు. ఏపీకి రాజధాని గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యన ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల నుంచి భూముల సేకరణకు ప్రయత్నించారు. పలు విడతలుగా జరిగిన చర్చల్లో ఈ ప్రాంతంలోని 29 గ్రామల్లో 34 వేల ఎకరాలను ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. అమరావతి భూమి పూజకు స్వయంగా ప్రధానమంత్రి హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ, రాజధానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని వాగ్దానం చేసారు. ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసేందుకు అన్ని విధాలుగా సహకరించారు. రూ. 2,500 కోట్ల నిధులు కేటాయించారు. మరో రూ.5 వేల కోట్ల వరకు రుణం లభించే ఏర్పాట్లుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాండ్లను అమ్మి కొంత నిధులు సేకరించింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా నిధులు అందించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి అమరావతి రాజధానిని సంపూర్ణంగా బలపర్చుతున్నామని 30 వేల ఎకరాల భూమి అవసరం అని కూడా చెప్పారు. ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. రూ.43 వేల కోట్ల విలువైన భవన నిర్మాణ పనులకు కాంట్రాక్టులు ఇచ్చారు. 16వేల ఎన్‌జీవోలు, 144 ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల భవనాలు, జడ్జిల భవనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఉన్నతాధికారుల భవనాలు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక హైకోర్టు పూర్తయింది. వీటిలో కొన్ని 90శాతం, కొన్ని 60 శాతం, కొన్ని 30 శాతం పూర్తయ్యాయి. రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ ‌వ్యవస్థ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

మాట మార్చిన వైకాపా

ఈ నేపథ్యంలో 2019లో అధికారం లభించిన వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఏక రాజధాని వద్దని, మూడు రాజధానులుండాలని ప్రకటించింది. అమరావతితో పాటు విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు ఉండాలని చెప్పింది. రాజధాని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న సీఆర్‌డీఏను రద్దుచేసింది. మంత్రులైతే అమరావతి ముంపు ప్రాంతమని ప్రకటించారు. ఇది స్మశానంతో సమానమని మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగంగా మాట్లాడారు. ప్రభుత్వం అంతటితో ఆగక శాసనసభలో తీర్మానం చేసింది. దానిని శాసనమండలికి పంపారు. వారు దానిని సెలెక్ట్ ‌కమిటీకి పంపారు. అయినా ప్రభుత్వం దానిని మరలా గవర్నరుకు పంపి ఆమోదింప చేసుకుంది. అయితే అమరావతి రైతులు దీనిని సవాలు చేస్తూ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడది న్యాయస్ధానంలో ఉంది. ఏకవ్యక్తి స్వామ్యంతో నడిచే ప్రాంతీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల గురించి తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచించటానికి ఇదో ఉదాహరణగా జాతీయ పార్టీ అయిన భాజపా ఏనాడో చెప్పింది.

700 రోజులగా శాంతియుత ఉద్యమం

అమరావతే రాజధానిగా ఉండాలని రాజధాని రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమం దాదాపు 700 రోజుకు దగ్గరపడింది. రాజధానికి స్థలాలిచ్చిన రైతులు కుటుంబాలతో సహా టెంటులో కూర్చుని రోజుల తరబడి ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి తమ బాధను చెప్పుకునేందుకు తిరుమలకు వెళ్లాలని అమరావతి రైతుల ఉద్యమ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని న్యాయస్థానం ఇచ్చింది. 157 మంది మాత్రమే ర్యాలీలో ఉండేలా, పార్టీల రహితంగా, బహిరంగసభలు నిర్వహించరాదని, డీజే సెట్టింగ్‌లు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయరాదని.. న్యాయస్థానం చేసిన నిబంధనలు పాటిస్తామని రైతులు అంగీకరిం చారు. ఈ మేరకు దీపావళి ముందు రోజుల్లో ర్యాలీని ప్రారంభించారు. సహజంగానే ర్యాలీకి అన్ని పార్టీల మద్దతు లభించింది. ర్యాలీ ప్రారంభ సమయంలో వైకాపా మినహా అన్ని పార్టీలు వచ్చి మద్దతు ప్రకటించాయి. పాదయాత్ర చేరిన అన్ని గ్రామాల్లోని ప్రజలు జేజే ధ్వనులతో రైతులను ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల కాళ్లు కడిగి, పూలుజల్లి తమ మద్దతును ప్రకటిస్తున్నారు. గుంటూరులో పూజారులు, ముల్లాలు, క్రిస్టియన్‌ ఆచార్యులు వచ్చి ప్రార్థనలు చేసి, హారతులిచ్చి యాత్ర విజయవంతం కావాలని దీవిస్తున్నారు.

ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటున్నారా?

ఈ యాత్ర ప్రారంభానికి ముందు నుంచే పోలీసులు, ప్రభుత్వ పెద్దలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ర్యాలీలో ఉన్నవారు రాళ్లదాడి చేస్తారని, శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఆరోపిస్తున్నారు. ర్యాలీ ప్రారంభమైన నాలుగు రోజులకే ప్రభుత్వానికి ఉద్యమ వేడి తగిలినట్లు కనిపిస్తోంది. ర్యాలీని ఎలాగైనా ఆపేయాలని నిర్ణయించుకున్నది. ర్యాలీలో రైతులు అత్యంత సహనంగా, అమరావతి జై అంటూ నినాదాలు మాత్రమే చేస్తూ ఉత్సాహంగా నడుస్తు న్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా వారే తాడు పట్టుకుని వరుసల్లో నడుస్తున్నారు. పోలీసులు ర్యాలీని ఫొటోలు తీస్తున్నారు. డ్రోన్‌లను ఉపయోగించి వీడియోలు తీస్తున్నారు. ర్యాలీ ప్రకాశం జిల్లాలో ప్రవేశించగానే చీరాల డీఎస్పీ వచ్చి 2,500 మంది పాల్గొన్నారని, పార్టీలు కూడా పాల్గొన్నాయని, ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉందని పేర్కొంటూ తమకు సంజాయిషీ ఇవ్వాలని అమరావతి రైతు జేఏసీకి నోటీసులు ఇచ్చారు. పాదయాత్రలు చేసేవారిని ఆదరించడం భారతీయ సంస్కృతి. ర్యాలీకి ఆహ్వానం పలికే రాజకీయ పార్టీల కార్యకర్తలు జెండాలు తీసుకుని వస్తున్నారు. పూజారులు, ముస్లిం, క్రైస్తవ మతాచార్యులు తమ ఆచార సంప్రదాయ దస్తులు ధరించి వస్తున్నారు. వీరు సంఘ వ్యతిరేకశక్తులు కాదు కదా? ఆహ్వానించిన భాజపా, తెదేపా, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ ‌రాజకీయపార్టీలు నిషేధిత పార్టీలా? అసలు ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కాని పోలీసులే ర్యాలీలో పాల్గొన్న రైతులను నిషేధిత వ్యక్తులుగా పరిగణించడం సరికాదు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములివ్వడమే రైతులు చేసిన పాపమా? అలా చేసి నందుకే వారు నేడు ఈ ప్రభుత్వం దృష్టిలో దోషులయ్యారా? అని రాష్టప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

పాదయాత్రలు ఆంధప్రదేశ్‌లో కొత్తేం కాదు. అలాగని అది నిషేధమూ కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర చేసేవారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒకసారి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. రాష్ట్రం మొత్తం పర్యటించారు. అధికారంలోకి వచ్చారు. తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేశారు. అలాగే వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి మరణించాక కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేశారు. తర్వాత ఆయన సోదరి కూడా ఓదార్పు యాత్ర చేసింది. 2014 తర్వాత మరల చంద్రబాబు పాలనలో జగన్‌ ‌ప్రజా సంకల్ప యాత్ర చేశారు. 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రైతులు తమ సమస్య పరిష్కారానికి ప్రజల మద్దతు కోరుతూ అమరావతి నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేస్తున్నారు. దానిలో తప్పేంటి? అమరావతి రైతుల సమస్య పరిష్కరిస్తే వారు పాదయాత్రే చేపట్టేవారు కాదు కదా! 34 వేల ఎకరాలిచ్చి నోరుమూసుకొని కూర్చోవాలా? ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలెందుకు చేస్తారు? తప్పంతా ప్రభుత్వం వైపు ఉంచుకుని, దానిని ఎదుటివారిపై నెట్టి, దానిని సమర్ధించుకునేందుకు మరిన్ని తప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. 700 రోజులుగా ప్రభుత్వం తమ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, రెచ్చగొడు తున్నా రెచ్చిపోకుండా, బూతులు తిడుతున్నా తట్టుకుని, కనీస సదుపాయాలు, సహకారం ఇవ్వకున్నా శాంతి యుతంగా తాము కట్టుబడిన అంశం కోసం పోరాడుతూ నిలబడ్డామనే చారిత్రక సత్యాన్ని అమరావతి రైతులు ప్రపంచానికి చాటారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు మీరు పాదయాత్ర చేస్తే రాని ముప్పు ఇప్పుడెందుకు వస్తుంది. మీరు క్షలాది మందితో పాదయాత్ర చేసినప్పుడు లోపించని శాంతిభద్రతలు పరిమితంగా రైతులు చేస్తున్న ర్యాలీలో ఎందుకు లోపిస్తాయి? అమరావతి రైతుల ఉద్యమం శాంతియుతంగా జరుగుతుందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అమరావతి వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. తమ సమస్యలు మాత్రమే రైతులు దేవునికి చెప్పుకునేందుకు వెళ్తున్నారు. మీది సక్రమమైన వాదన అయినప్పుడు ర్యాలీకి భయపడాల్సిన పనిలేదు.

  • తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram