అవినీతికి అండగా ‘అఘాడీ’

మహారాష్ట్ర అఘాడీ సర్కార్‌ ‌గాడి తప్పుతోందా? కొత్త మిత్రులను నమ్ముకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన శివసేన వారి పాపాలను మోస్తూ కలంకితమవుతోందా? ఇటీవల మనీలాండరింగ్‌ ‌కేసులో అరెస్టయిన మాజీ హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌, ‌తాజాగా నోటీసులు అందుకున్న ఉపముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌, ‌డ్రగ్స్ ‌కేసులో నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి నవాబ్‌ ‌మాలిక్‌ ‌కారణంగా ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే  ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పోలీసు అధికారి సచిన్‌ ‌వాజే వ్యవహారం శివసేనను ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నవంబర్‌ ఒకటో తేదీ అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఈ కేసు మలుపులు తిరుగుతూ వస్తోంది. ఉద్దవ్‌ ‌ఠాక్రే ముఖ్యమంత్రిగా ఏర్పడిన మహారాష్ట్ర అఘాడీ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌మీద తీవ్ర అభియోగాలే వచ్చాయి. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ ‌పరమ్‌బీర్‌ ‌సింగ్‌ ఆరోపించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చివరకు అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసును ఈడీ విచారణ చేపట్టినప్పటి నుంచీ అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అం‌బానీ ఇంటి ముందు స్కార్పియో వాహనంలో పేలుడు పదార్థాలను ఉంచిన కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచీ తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా విషయాలు బయట పడ్డాయి. అప్పటికే అంబానీని బెదిరించడం, అందులో ముంబై క్రైమ్‌ ఇం‌టెలిజెన్స్ అధికారి సచిన్‌వాజే పాత్ర బయటపడటం సంచలనం సృష్టించాయి. అంబానీ ఇంటిముందు నిలిపిన వాహనం థానేకు చెందిన మన్సుఖ్‌ ‌హిరేన్‌ అనే వ్యక్తి పేరుతో నమోదై ఉండటంతో ఆయన్ని సచిన్‌ ‌వాజే వేధించి చిత్రహింసలు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సచిన్‌ ‌వాజే పాత్రపై అనుమానాలు వచ్చాయి. ఆయన వసూళ్ల వ్యవహారం బయటకు రావడం కలకలం రేపింది. అసలు సూత్రధారి వాజేనే అని అందరికీ అర్థమైంది. శివసేన పార్టీతో ఆయనకు ఉన్న సంబంధాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఎన్‌ఐఏ ‌చేపట్టిన విచారణలో ముఖేష్‌ అం‌బానీని బెదిరించి డబ్బు రాబట్టాలని వాజే ఈ కుట్రంతా పన్నినట్లు వెల్లడించింది.

వసూల్‌ ‌రాజా అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌

‌మన్సుఖ్‌ ‌హిరేన్‌ అనుమానాస్పద మరణం తరువాత ముంబై పోలీసు కమిషనర్‌ ‌పరమబీర్‌ ‌సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఈ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత పరమబీర్‌ ‌చేసిన ఆరోపణలు మరింత సంచలనం రేపాయి. ఇదంతా మార్చి నెలలో జరిగింది. మాజీ పోలీసు అధికారి సచిన్‌ ‌వాజేను రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వసూళ్ల కోసం వాడుకున్నారని పరమబీర్‌ ‌సింగ్‌ ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు అనిల్‌ ‌పురమాయించా రంటూ తెలిపారు. అంతేకాదు ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్‌ అవినీతి కార్యకలాపాల గురించి తాను ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరమ్‌బీర్‌ ‌పేర్కొన్నారు. అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్‌ ‌వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. డబ్బులు ఎలా వసూలు చేయాలో చెప్పారని పేర్కొన్నారు.

బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.2 నుంచి 3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారని పరమ్‌బీర్‌ ‌సింగ్‌ ‌చెప్పారు.

అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌మీద వచ్చిన అభియోగాలు చాలా తీవ్రమైనవి కావడంతో ఏప్రిల్‌ ‌మాసంలో హోంమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అనిల్‌ ‌మీద వచ్చిన ఆరోపణల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌శాఖ ఆయన మీద మనీలాండరింగ్‌ ‌నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ‌కింద కేసు నమోదు చేసింది. ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో జులై నెలలో అనిల్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే బహిరంగ మార్కెట్‌లో జప్తుచేసిన ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్‌ ‌పరబ్‌, ‌మాజీ హోం మంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌లను 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్‌వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ ‌సింగ్‌ ‌జారీచేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే చెప్పారు. దేశ్‌ముఖ్‌ ‌మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ ‌పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలుచేసిన చార్జ్ ‌షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్‌బీర్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్‌, ‌రవాణా మంత్రి పరబ్‌ ‌తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌ ‌స్పెషలిస్టుగా పేరున్న సచిన్‌ ‌వాజే గతంలో శివసేన కార్యకర్తగా పనిచేశారు. గతంలో పలు కేసుల వివాదాల్లో సస్పెండయ్యారు. ఉద్దవ్‌ ‌ఠాక్రే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన్ని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్‌ ‌టీవీ అధినేత అర్నబ్‌ ‌గోస్వామిని అరెస్టు చేసిన బృందానికి నాయకత్వం వహించారు.

అజిత్‌ ‌పవార్‌ ‌బినామీ ఆస్తుల చిట్టా

అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వ్యవహారం ఇలా ఉంటే తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ ‌పవార్‌కు ఇన్‌కం ట్యాక్స్ ‌డిపార్ట్‌మెంట్‌ అ‌క్రమాస్తుల కేసులో నోటీసులు ఇచ్చింది. ఆయనకు సంబంధించి పలు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్ల పైగా బినామీ ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించి అటాచ్‌ ‌చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ అజిత్‌తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించినవిగా చెబుతున్నారు. ఈ ఆస్తులను తన అక్రమార్జనతో బినామీ పేర్ల మీద కొనలేదని 90 రోజుల్లోగా అజిత్‌ ‌పవార్‌ ‌నిరూపించుకోవాల్సి ఉంది. ఏదో ఒకటి తేలే వరకు ఈ ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లుగానే ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఈ కేసులో ఐటీశాఖ విచారణ పూర్తయ్యేదాకా అజిత్‌ ‌పవార్‌ ‌తన ఆస్తులను విక్రయించడానికి వీల్లేదు.

గత జూలైలోనే పవార్‌కు చెందిన కొన్ని ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. మహారాష్ట్ర స్టేట్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌బ్యాంకు స్కామ్‌తో దీనికి లింక్‌ ఉన్నట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. షుగర్‌ ‌ఫ్యాక్టరీని అజిత్‌ ‌పవార్‌తో బాటు ఆయన భార్య సునేత్ర అజిత్‌పవార్‌ ‌కూడా నిర్వహిస్తునట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆస్తులు గురు కమోడిటీ సర్వీసెస్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌పేరిట ఉండగా వీటిని జరందేశ్వర్‌ ‌షుగర్‌ ‌మిల్స్ ‌కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఈ మిల్స్‌కి చెందిన మెజారిటీ షేర్లు అజిత్‌ ‌పవార్‌కి సంబంధించిన స్పార్క్‌లింగ్‌ ‌సాయిల్‌ ‌కంపెనీలో ఉన్నట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ముంబై పోలీసు శాఖలోని ఆర్ధిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీ లాండరింగ్‌ ‌నిరోధక చట్టం కింద ఈడీ దీన్ని దర్యాప్తు చేసింది. అసలు గురు కమోడిటీ సర్వీసెస్‌ అన్నది డమ్మీ కంపెనీ అని ఈ సంస్థ పేర్కొంది. దీనిపై ఇంకా విచారిస్తామని అధికారులు తెలిపారు.

కాగా అజిత్‌ ‌పవార్‌ ‌మీద గతంలోనే అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వ హయాం (1999-2014)లో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో చేపట్టిన ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల్లో రూ.70వేల కోట్ల మేర జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఉన్న 9 కేసులపై దర్యాప్తును సరైన ఆధారాలు లేని కారణంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు, అయితే అవసరమని భావిస్తే కోర్టు గానీ, ప్రభుత్వం కానీ ఈ కేసులను తిరిగి తెరవచ్చునని అంటున్నారు.

నవాబ్‌ ‌మాలిక్‌ ‌నోటి దురుసు

తాజాగా బాలివుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ ‌కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నటుడు షారూక్‌ ‌ఖాన్‌ ‌తనయుడు ఆర్యన్‌ఖాన్‌ ‌క్రూయిజ్‌లో పట్టుబడటం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసులో అసలు నిందితులను రక్షిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని బలిచేసే కుట్రకు తెరలేచింది. ముఖ్యంగా ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్‌ ‌మాలిక్‌ ‌నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో జోనల్‌ ‌డైరెక్టర్‌ ‌సమీర్‌ ‌వాంఖెడేను లక్ష్యంగా చేసుకొని సంచలన ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సమీర్‌ ‌వాంఖడే డబ్బు గుంజేందుకే షారూక్‌ ‌తనయునిపై కేసు నమోదు చేశారని, బెయిల్‌ ఇచ్చేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారని ఆరోపించారు నవాబ్‌ ‌మాలిక్‌. ‌క్రూజ్‌ ‌నౌకలో ఎన్సీబీ దాడులు నకిలీవని, అక్కడ డ్రగ్స్ ఏమీ దొరకలేదని వ్యాఖ్యానించారు. షారుక్‌ని అన్యాయంగా టార్గెట్‌ ‌చేశారని విమర్శించారు.

అంతేకాదు సమీర్‌ ‌మతం మీద, వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యుల మీద ప్రెస్‌ ‌మీట్లు పెట్టి, ట్విట్టర్‌ ‌వేదికగా వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు నవాబ్‌ ‌మాలిక్‌. ‌తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలను సమీర్‌ ‌వాంఖడే ఖండించారు. నవాబ్‌ ‌మాలిక్‌ ‌తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సమీర్‌ ‌వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ ‌బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. హైకోర్టు నవాబ్‌ ‌మాలిక్‌కు చురకలు అంటించింది. ఏమైనా చెప్పదలచుకుంటే కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఆయన్ని ఆదేశించింది.

అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌, అజిత్‌ ‌పవార్‌, ‌నవాబ్‌ ‌మాలిక్‌.. ఈ ‌ముగ్గురూ మహారాష్ట్ర అఘాడీ సర్కార్‌ ‌భాగస్వామ్య పక్షం ఎన్‌సీపీకి చెందినవారే. వీరి నిర్వాకం కారణంగా ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే చిక్కుల్లో పడ్డారు. అనిల్‌, అజిత్‌ల మీద తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే సచిన్‌ ‌వాజే వ్యవహారంతో ఉద్దవ్‌, ‌శివసేనలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌మీద ఆరోపణలు రాగానే వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేయలేదు ఉద్దవ్‌ ‌ఠాక్రే. మాజీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌పరమ్‌బీర్‌సింగ్‌ ‌చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసినప్పుడు నిలుపుదలను కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఉద్దవ్‌ ‌ప్రభుత్వ పరువుపోయింది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ అవినీతిపరులను రక్షించేందుకు పడుతున్న తంటాలు మహారాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలందరికీ అర్థమైపోయాయి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram