ఇస్లామాబాద్‌ అధికార పీఠాన్ని ఎవరు అధిష్టించినా వారి పాత్ర నామమాత్రమే. రోజువారీ వ్యవహారాల్లో తప్ప కీలకమైన విధాన నిర్ణయాల్లో వారి ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు. తెరవెనక నుంచి వారిని సైన్యం, గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) ‌నడిపిస్తుంటాయి. వీటిని కాదని ఏ పాలకుడూ ముందుకు వెళ్లే సాహసం చేయలేడు. అలా చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర పుటల్లోకి చేరిపోయారు. ఏడున్నర దశాబ్దాల పాకిస్తాన్‌ ‌చరిత్ర చెబుతున్న చేదు నిజం ఇది.

ఇక రెండో విషయం. పాక్‌ ‌పాలకులపై తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా తక్కువేమీ కాదు. ఆయా సంస్థలు తరచూ ఏదోఒక విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటాయి. వీరి డిమాండ్లను కాదని ముందుకు వెళ్లడం పాలకుడికి కష్టమే. లేదంటే వారి మనుగడే ముప్పులో పడుతుంది. అందువల్ల ప్రతి పాలకుడూ భయం భయంగానే ముందుకు సాగవలసి ఉంటుంది. ఇమ్రాన్‌ఖాన్‌ ‌వంటి పూర్తి స్థాయి మెజార్టీలేని ప్రభుత్వ అధినేతకు ఈ పరిస్థితి మరింత కష్టమే. వారి డిమాండ్లను కిమ్మనకుండా అంగీకరించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. లేదంటే ఆయన రాజకీయ భవితవ్యమే ప్రమాదంలో పడుతుంది.

ఇప్పుడు ఇస్లామాబాద్‌లో జరిగిందిదే. తెహ్రీక్‌- ఇ- ‌లబ్బాయక్‌ ‌పాకిస్తాన్‌ (‌టీఎల్పీ) అనే తీవ్రవాద సంస్థ ఇమ్రాన్‌ ‌సర్కారును గొంతెమ్మ కోరికలు కోరింది. లేదంటే ఆందోళనా బాట పడతామని హెచ్చరించింది. పరోక్షంగా అల్లకల్లోలం సృష్టిస్తామని హెచ్చరించింది. మొదట్లో తటపటాయించిన ఇమ్రాన్‌ ‌సర్కారు చివరికి చేసేదేమీ లేక దిగివచ్చింది. వారి డిమాండ్లకు సరేననక తప్పలేదు. ఈ పరిస్థితి వల్ల దేశానికి మున్ముందు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. పొరుగున ఉన్న కశ్మీర్‌కూ ప్రమాదకరమనే హెచ్చరికలు అంతర్జాతీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కసారి వాస్తవాల్లోకి వెళితే పరిస్థితి తీవ్రత తెలిసివస్తుంది. ఇమ్రాన్‌ ‌సర్కారు ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకుందో అర్థమవు తుంది. తీవ్రవాద సంస్థలకు మొదటి నుంచీ పాకిస్తాన్‌ ‌పుట్టిల్లు. పాలకులే వాటిని పెంచి పోషిస్తుంటారు. మాజీ సైనిక పాలకుడు, భారత్‌పై కార్గిల్‌ ‌యుద్ధానికి కాలుదువ్విన.. పర్వేజ్‌ ‌ముషారఫ్‌ ఈ ‌విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అందువల్ల పాక్‌లో తీవ్రవాద సంస్థలకు ఆడింది ఆట.. పాడింది పాటగా చెల్లుబాటు అవుతుంది. వాటికి ప్రత్యేక కార్యాచరణ అంటూ ఏమీ ఉండదు. దైవదూషణ, ఇస్లాం, షరియత్‌ ‌చట్టాల పేరుతో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేయడం, ర్యాలీలు, ధర్ణాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం, సర్కారుపై ఒత్తిడి తీసుకురావడం.. దాదాపు ప్రతి తీవ్రవాద సంస్థ అజెండాగా ఉంటుంది. ఇక భారత్‌ ‌వ్యతిరేకత, కశ్మీర్‌ ‌వంటి అంశాలు షరామామూలే. అలాంటి సంస్థల్లో తెహ్రీక్‌-ఇ- ‌లబ్బాయక్‌ ‌పాకిస్తాన్‌ (‌టీఎల్పీ) ఒకటి. ఐరోపా దేశమైన ఫ్రాన్స్‌లో దైవాన్ని దూషించేలా కార్టూన్లు ప్రచురితమయ్యాయని, అందువల్ల ఆ దేశ రాయబారిని పాకిస్తాన్‌ ‌నుంచి బహిష్కరించాలని ఈ సంస్థ డిమాండ్‌చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో పెద్దయెత్తున నిరసనలకు పిలుపిచ్చింది. చాలారోజుల పాటు ఆందోళనలు సాగాయి. ఫలితంగా భారీయెత్తున దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ ‌సర్కారు ఈ సంస్థపై నిషేధం విధించింది. తాజాగా ఆందోళనల విరమణకు ఒప్పందం కుదరడంతో ఇమ్రాన్‌ ‌సర్కారు టీఎల్పీపై నిషేధాన్ని తొలగించింది. ఈ నిర్ణయం పాక్‌కు ముప్పు తెచ్చి పెడుతుందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సర్కారు భవితవ్యానికి, పరోక్షంగా ఇమ్రాన్‌ ‌రాజకీయ జీవితానికి ప్రమాదకరమని విశ్లేషిస్తున్నాయి. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుంది. ఇప్పటికే మధ్య ఆసియా దేశమైన అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ‌సర్కారు కొలువుతీరింది. దీని ప్రభావం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ సమాజానికి తెలిసివస్తోంది. అక్కడి తాలిబన్‌ ‌ప్రోత్సాహంతో అరాచకాలు చెలరేగు తున్నాయి. మన దేశంలోని కశ్మీర్‌లోనూ వారు చిచ్చు పెడుతున్నారు. ఫలితంగానే ఇటీవల ఈ సరిహద్దు రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలా పాలు పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో టీఎల్పీపైన నిషేధం తొలగించడం ప్రమాదకర పరిణామమన్న ఆందోళ నలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

టీఎల్పీది.. మొదటినుంచీ ఆందోళనా పథమే. ఏదో ఒక పేరుతో హింసను ప్రేరేపించడం, ప్రోత్స హించడం దాని పని. దీని ఆవిర్భావమే ఒక ప్రత్యేకం. తెహ్రీక్‌- ఇ- ‌లబ్బాయక్‌ (‌టీఎల్పీ) అంటే మహమ్మద్‌ ‌ప్రవక్త అనుచరుల ఉద్యమమని అర్థం. దీనిని ‘బర్వేలి’ అని పిలుస్తుంటారు. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను అత్యంత కఠినంగా అమలయ్యేలా చూడటమే తమ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు చెబుతుంటారు. దేశ ప్రజల్లో ‘బరేలి’ ఉద్యమానికి మంచి మద్దతే ఉంది. సూఫీ సాంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే దీని లక్ష్యం. దైవదూషణ చట్టాల్లో సంస్కరణలకు ప్రయత్నించిన పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌గవర్నర్‌ ‌సల్మాన్‌ ‌తసీర్‌ను ముంతాజ్‌ ‌ఖాద్రి అనే పోలీసు 2011లో దారుణంగా హతమార్చాడు. దేశ రాజకీయాల్లో పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌పాత్ర కీలకం. భారత్‌ ‌సరిహద్దుల్లో ఈ ప్రావిన్స్ ‌విస్తరించి ఉంటుంది. తసీర్‌ ‌హత్య కేసులో నిందితుడైన ఖాద్రిని విడుదల చేయాలని కోరుతూ 2015లో లాహోర్‌ ‌మసీదుకు చెందిన మత బోధకుడు ఖాదిమ్‌ ‌హుస్సేన్‌ ‌రిజ్వి ఉద్యమాన్ని ప్రారంభించాడు. అనంతరం ఖాద్రికి ఉరిశిక్ష విధించి అమలు చేసింది ప్రభుత్వం. అతని అంతిమ యాత్రలో టీఎల్పీ రాజకీయ పార్టీగా అవతరించింది. ఇస్లాం అతివాదులు ఈ పార్టీలో పెద్దయెత్తున చేరారు. అయితే అంతగా ప్రజాదరణ లభించలేదు. 2018 ఎన్నికల్లో సింధ్‌ ‌ప్రావిన్స్‌లో కేవలం రెండంటే రెండే సీట్లను ఈ పార్టీ గెలుచుకుంది. గత ఏడాది నవంబర్‌లో ఖాదిమ్‌ అనారోగ్య కారణంగా మరణించడంతో ఆయన కుమారుడు సాద్‌ ‌రిజ్వీ టీఎల్పీ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు. ఇదీ స్థూలంగా టీఎల్పీ చరిత్ర.

టీఎల్పీ ప్రస్థానం అంతా హింసాత్మకమే. శాంతియుత ఆందోళన అంటే ఏమిటో దానికి తెలియనే తెలియదు. రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడం, పోలీసులను కిడ్నాప్‌ ‌చేయడం, మత విద్వేషాలను ప్రేరేపించడం, హింసామార్గంలో తన డిమాండ్లను సాధించుకోవడం దీని విధానం. మత మౌఢ్యంతో రెచ్చిపోవడం, అమాయక యువతను ఇస్లాం పేరుతో ఆకర్షించి వారిని పెడదారి పట్టించడం టీఎల్పీ విధానంగా మారిపోయింది. గతంలో తమపై విధించిన నిషేధాన్ని తొలగించాలని టీఎల్పీ గత కొంతకాలంగా పోరాడుతోంది. ఇందుకు హింసను మార్గంగా ఎంచుకుని ఇమ్రాన్‌ ‌సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో సర్కారు దిగి వచ్చి దానిపై నిషేధాన్ని తొలగించింది. 1997 నాటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద టీఎల్పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఎత్తివేస్తున్నట్లు తాజాగా ఈ నెల మొదటివారంలో ఇమ్రాన్‌ ‌సర్కారు ప్రకటించింది. దీంతో ఉగ్రవాదుల ఒత్తిళ్లకు తలొగ్గారని, ఇమ్రాన్‌ ‌వారికి మోకరిల్లారన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా టీఎల్పీ హింసను రాజేస్తోంది. ప్రధాన నగరాలను ముట్టడిస్తోంది. రోడ్లను దిగ్బంధిస్తోంది. ర్యాలీలు, ధర్ణాల పేరుతో అరాచకానికి పాల్పడు తోంది. అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది.

గతంలో మహ్మద్‌ ‌ప్రవక్తను అవమానించేలా ఫ్రాన్స్‌కు చెందిన పత్రిక చార్లీ హెబ్దో ఆయన కేరికేచర్లు ప్రచురించింది. దీంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 2015లో ఇస్లాం అతివాదులు చార్లీ హెబ్దో కార్యాలయంపై దాడిచేశారు. 12 మందిని కిరాతకంగా కాల్చిచంపారు. నిందితులకు శిక్ష ఖరారయ్యే దశలో గత ఏడాది ఆ పత్రిక పాత కేరికేచర్లను మళ్లీ ప్రచురిస్తామని ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌లో నిరసనలు జరుగుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని టీఎల్పీ రెచ్చిపోయింది. నిరసనలు కొనసాగిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధం విధించింది. దాని అధిపతి సాద్‌ ‌రిజ్వీని అరెస్టు చేసింది. దీంతో టీఎల్పీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కీలకమైన రాజధాని ఇస్లామాబాద్‌, ‌సైనిక కేంద్రమైన రావల్పిండి నగరాలను దిగ్బంధించారు. తమ అధినేతను విడుదల చేయాలని, తమపై గల ఉగ్రవాద ముద్ర తొలగించాలని, తద్వారా ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని కోరుతూ ఆందోళనా బాట పట్టింది. కీలకమైన లాహోర్‌ ‌నగరం నుంచి ఇస్లామాబాద్‌కు లాంగ్‌ ‌మార్చ్ ‌నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఈ సందర్భంగా టీఎల్పీ నిర్వహించిన ఆందోళనలో 21 మంది మరణించారు. వారిలో 10 మంది పోలీసులే కావడం గమనార్హం. దీంతో ఇమ్రాన్‌ ‌సర్కార్‌ ‌భయపడింది. ఇది తన రాజకీయ భవితవ్యానికి ఎక్కడ ముప్పు తెస్తుందోనన్న ఆలోచనలో ఇమ్రాన్‌ ‌పడిపోయారు. చివరికి మతపెద్దలను రంగంలోకి దించి రాజీ కుదుర్చుకున్నారు. దీంతో టీఎల్పీ శాంతించింది.

అయితే ఇమ్రాన్‌ ‌పూర్తిగా రాజీపడ్డారని, ఉగ్రవాదులకు లొంగిపోయారని, ఒక్క మాటలో చెప్పాలంటే టీఎల్పీ ముందు మోకరిల్లారన్న విమర్శలు బలంగా వినపడుతున్నాయి. సర్కారు తీరును పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (పీపీపీ) ఖండించింది. ప్రచార మాధ్యమాలు సైతం ప్రభుత్వ తీరు సముచితం కాదని వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఇమ్రాన్‌ ‌సర్కారు ఇంటా బయటా అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక పరిస్థితి దివాలా అంచున ఉండటం, ధరల పెరుగుదల, ఐఎస్‌ఐ ‌కొత్త అధిపతి నియామకం, అమెరికా గతంలో మాదిరిగా సహకరించకపోవడం, అఫ్ఘాన్‌ ‌వ్యవహారంలో సర్కారు తీరు తదితర అంశాల్లో ఇమ్రాన్‌ ‌ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీఎల్పీపై నిషేధం ఎత్తివేయడం ద్వారా మతవాదుల మద్దతు పొందవచ్చని ఇమ్రాన్‌ అం‌చనా వేస్తున్నారు. కానీ మున్ముందు తన రాజకీయ భవితవ్యానికే ముప్పన్న వాస్తవాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. పాకిస్తాన్‌ను పక్కనపెడితే ఈ పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరమే. ఇప్పటికే పొరుగున ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో భారత వ్యతిరేక తాలిబన్‌ ‌సర్కారు పీఠం వేసుకుని కూర్చొంది. దీంతో అక్కడి ఉగ్రవాదులకు పండగ చేసుకున్నట్లయింది. భారత వ్యతిరేకతే దాని లక్ష్యం. కశ్మీర్‌ ‌పేరుతో దేశంలో చిచ్చురేపడం దాని ఉద్దేశం. దీనికితోడు పాక్‌లో (టీఎల్పీ)పై నిషేధం తొలగించడం ప్రమాదకర పరిణామం. ఈ నేపథ్యంలో భారత నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram